అరుపులు...
గందరగోళం...
ఊహించని ఉద్రిక్తత ఏర్పడింది అక్కడ.
ఆ దృశ్యం చూసి జనం గుంపులు కట్టారు.
తాగి అల్లరి చేసిన వ్యక్తి కోసం చుట్టూ చూసింది ధీరజ.
అతను ఏమయ్యాడో?
ఒక పధకం ప్రకారం చేసిన హత్య అది...
ధీరజకు అది రాజకీయ బలి అని అర్ధం అయింది.
ఎస్కార్ట్ పోలీసులు ఇన్ స్పెక్టర్ కు ఫోన్ చేసి జరిగింది చెప్పారు.
హత్యా వార్త క్షణాల మీద దావానలంలా నగరమంతా వ్యాపించింది.
ఓటర్ల మనసులో స్థబ్దత ....
నగరంలో ఉద్రిక్తత...
ఆ వార్తతోపాటు మరొక వార్త కూడా ప్రచారం అయింది.
'ఆ హత్య చేయించింది అనందరావే అనీ... హంతకుడు రవితేజ అనీ...'
ధీరజ ఆ వార్త విని ఆశ్చర్యపోయింది.
తమ కళ్ళకు ఎదురుగానే హత్య జరిగినా__ హంతకుడెవరో తమకు ఎవరకీ తెలియని నిజం ఇంకెవరో పనికొట్టుకుని ప్రచారం చేస్తున్నారు అంటే...
సంథింగ్ మిస్టరీ!
'యస్... అది ఏమిటో కూపీ లాగాలి" నిర్ణయించుకుంది ధీరజ.
నగర పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు.
ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా అవసరం అనుకున్న ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
శవం దగ్గర హత్యకు వుపయోగించిన రివాల్వర్ కూడా దొరికింది.
దానిమీద వున్న వేలిముద్రల ఆధారంగా హంతకుడు ఎవరో పట్టుకుంటామని ఎస్.పి పత్రికలవారికి తెలియచేసాడు.
హత్యాయుధాన్ని ఎవరూ కావాలని జారవిడుచుకోరు__
కానీ రివాల్వర్ దొరికింది.
అంటే_ ఎవరయితే హంతకుడు అని ప్రచారం చేస్తున్నారో అతని వేలిముద్రలు ఆ రివాల్వర్ పై వున్నా ఆశ్చర్యపోనవసరంలేదు అనుకుంది ధీరజ.
ఆమె ఆలోచనలే నిజమయినట్టు ఆ రివాల్వర్ పై వున్న వేలి ముద్రలు రవితేజవి అని తేలడంతో అతన్ని అరెస్ట్ చేయడం జరిగిపోయింది.
తన వేలిముద్రలు ఆ రివాల్వర్ పైకి ఎలా వచ్చాయో అర్దంకాని రవితేజ ద్రిగ్బాంతి చెందాడు.
చంపబడిన వ్యక్తి జయచంద్రకు అత్యంత ఆప్తుడు కావడంవల్ల ఆ హత్య చేయించింది ఆనందరావు అని ప్రజలందరికీ నమ్మకం కలిగింది.
లాయర్ సత్యమోహన్ కుతంత్రంతో తొలి అధ్యాయం విజయవంతంగా ముగిసింది.
ఫలితంగా__
అత్యంత భారీ మెజారిటితో జయచంద్ర ఎన్నికల్లో నెగ్గాడు.
ఊహించనంత తక్కువ ఓట్లు రావడమే కాకుండా __ చివరకు డిపాజిట్ కూడా దక్కని స్థితిలో ఓటమిపాలయ్యాడు ఆనందరావు.
ఎన్నికలలో ఓడిపోయాననే బాధకన్నా చేయని నేరానికి కన్న కొడుకు జైలుపాలు అయ్యాడనే బాధ అతనని కృంగదీస్తుంది.
తన రాజీకియ భవిష్యత్ తో పాటు కన్నకొడుకు భవిష్యత్ ను కూడా దెబ్బతీసిన జయచంద్రను ఏమీ చేయలేని నిస్సహాయత వెక్కిరిస్తుంటే తనలో తానే కుమిలిపోతున్నాడు ఆనందరావు.
* * * *
ఆ ఎడ్వర్ టైజ్ మెంట్ ఒక వైపు ఒకటికి నాలుగుసార్లు చూసిన ధీరజలో పట్టుదల పెరిగింది.
పేపర్ మడిచి టేబుల్ పై పడవేస్తూ తన దగ్గర కాష్ ఎంతవుందో చూసుకుంది.
"థాంక్ గాడ్__ సరిపోతుంది__ తనలో తనే అనుకున్నది ఆమె.
'రాయల ట్రెజర్ హంట్'
ఆ రోజు అన్ని దినపత్రికలలోనూ ఆ ప్రకటన ప్రముఖంగా వచ్చింది.
ఎక్కడో విదేశాలాలో హాబీగా వుండే ట్రెజర్ హంట్ ను ఒక పోటీలా నిర్వహిస్తున్నారు నగరానికి చెందిన పెద్దమనుష్యులు.
వాళ్ళు నగరంలో చూడ ముచ్చటగా వున్న ఇందిరా పార్క్ ను టార్గెట్ గా చేసుకున్నారు.
అసలు ఆ ట్రెజర్ హంట్ విశేషాలు ఏమిటంటే... ఉదయమే పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ఆ పార్క్ లో రహస్యంగా దాచి వుంచిన అమూల్యమైన పెన్నిధిని కనిపట్టవలసి వుంటుంది. అది కేవలం మేధాశక్తి పైనే ఆధారపడి వుంటుంది తప్ప భుజబలం వున్నంత మాత్రాన విజయాన్ని సాధించలేరు.
పోటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వెయ్యి రూపాయాలు డిపాజిట్ చేయవలసి వుంటుంది.
గెలిచిన వ్యక్తికి లక్ష రూపాయాలుగా ఇస్తారు.
పోటీలో పాల్గొన్నవారిలో ఎవరో ఒక్కరే విజేతలు వుంటారు కాబట్టి నిర్వాహకులకు మంచి లాభం.
అలానే గెలిచిన వ్యక్తి కూడా వెయ్యికు లక్ష రావడమంటే జాక్ పాట్ కొట్టినట్టే!
ముందు చిన్న క్లూ ఇస్తారు... ఆ క్లూ ఆధారంగా పార్క్ లో ముందుకు సాగవలసి వుంటుంది.
ఆ క్లూ ప్రాకారంగా ఆ చోటకు వెళ్ళి వెదకగా వేరొకచోట వెదకమని అక్కడ మెసేజ్ రూపంలోనో, గుర్తుల రూపంలోనో, ఏదో ఒక విధంగా మరి ఒక చోటకు డైవర్ట్ చేయబడతారు.
ఆ ఇండికేషన్ ప్రకారం సరిగా అర్ధం చేసుకుని వెళితే అక్కడ నుండి మరి చోటకు__ అలా పార్క్ మొత్తం సాయంత్రం వరకూ తిరుగూతునే వుంటారు.
అయితే, చాలా మంది ఆ గుర్తులను సరిగా ఫాలో కాలేక కానీ, అర్ధం చేసుకొనలేక కానీ, ఎక్కువ సమయాన్ని వృధా చేసుకుంటూ అలా తిరుగుతూనే వుంటారు.
అలా కాక, కరెక్ట్ గా కాచ్ చేయగలిగితే త్వరగా ఆ నిధి ఎక్కడ వుందో కనిపెట్టవచ్చు.
