Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 13


    "అమ్మగారు చెప్పారు!" అంటున్న గాయత్రిని చూచి విరగబడి నవ్వింది ఆమని.


                                      5


    "హద్దుమీరి ఇలాంటి పనులు చేస్తే నాకు చాల కోపం వస్తుంది ఆమనీ!" అన్న గద్దింపు విని సోదరీమణులు ఇద్దరూ వెనుతిరిగి చూశారు.

    రూపెత్తిన కోపంలా నిలబడి వుంది రాణి సుమిత్ర.

    ఆమని మాటల ప్రవాహం ఆగిపోయి కిమిన్నాస్తి అయిపోయింది.

    "చెరువు దగ్గరకు వెళ్ళావట?"

    "అవును మమ్మీ! చూచి వద్దామని వెళ్ళాను"

    "అలాంటివి మనకు తగవు అని చెప్పానా?"

    "చెప్పావు. కాని ఊరికే చూద్దామని వెళ్ళాను."

    "చూచిన తరువాత ఆటలో చెయ్యి కలపాలని అనిపించిందా?"

    మౌనంగా తలదించుకుని నిలబడింది ఆమని.

    "మాటాడవేం?" అని గద్దించింది సుమిత్ర.

    "అవును. ఆడాను" అంది ఆమని హీన స్వరంతో!

    "పదిమందితో కలిసి పోవడం తప్పుకాదు. వారి మంచిని కోరడం మన కర్తవ్యం! కాని ఈ ఇంటిలోంచి ఆటలో పాల్గొనేందుకు వెళ్ళిన మొదటి అమ్మాయివి నువ్వే. ఒకసారి చూడాలనుకుంటే నాతో చెప్పి వెళ్ళాల్సింది.

    మొదటిసారి విన్నప్పుడు అందరితోపాటు శ్రోతగానే విన్నాను. నీ గురించి నాకేమీ తెలియదని నలుగురు అనుకోవటం ఎంత తలవొంపు?

    "ఇంకెప్పుడు ఇలా చేయకు" అంది సుమిత్ర!

    ఆమని మరేమీ మాట్లాడలేదు. ఆమె వెళ్ళిపోయింది గుంభనంగా!

    "నేను చెప్తే ఎందుకు వింటావు? అమ్మ పెట్టే చివాట్లు నాలుగు పెట్టింది కదా! ఇహ సంతోషపడు" అని ఎత్తి పొడిచింది గాయత్రి.

    "మరేం పర్లేదు! తిట్టింది అమ్మే కదా!" అంది ఆమని!

    ఆమెకు ఎలా చెప్పాలో గాయత్రికి అర్ధం కాలేదు. ఇంకా చిన్నతనం పోలేదులే! నెమ్మదిగా అన్నీ తెలుస్తాయి అనుకుంది.

    "నేను నీకో మంచి శుభవార్త తెచ్చాను. వింటావా అక్కా!"

    "ఇలాంటి వార్తలేనా? అదేవిటో చెప్పు"

    "చెప్తాను కాని నువ్వు కూడ నన్ను తిట్టకూడదు" బుంగమూతి పెట్టి అడిగింది.

    "నా చిట్టి తల్లివి కదూ! తిట్టనులే చెప్పు"

    "నేను బావగారిని చూచాను అక్కా!"

    "బావగారా! ఆయనెవరు?" ఆశ్చర్యపడింది గాయత్రి!

    "అదే! కరణం గారి యింటిలో మీరు చెప్పుకోలేదా? చంచలరావు గారి అబ్బాయి వాల్మీకి ఆయన్ని నేను కలుసుకున్నాను" అంది ఆమని!

    గాయత్రి కళ్ళు విశాలం అయినాయి.

    కొద్దిక్షణాలు మాట్లాడలేక మౌనంగా వుండిపోయింది.

    "వారిని కలిశావా? ఓసి గడుగ్గాయి! అదెలా జరిగింది."

    "చెరువు దగ్గర ఉజ్జీల పండుగలో ఇద్దరమూ పాల్గొన్నాం. ఆయన గెలిచాడు. నేను మళ్ళీ పందెం కాశాను. మెడలో చెయిన్ విసిరేశా?"

    అంత పని చేశావూ? ఆయనే గెలిచి చేయి పట్టుకున్నారా?"

    "ఉహు! నా పందెంలో గెలుపు ఓటమి తేలలేదు. ఒక యువకుడు ప్రమాదంలో పడిపోతే వాల్మీకి రక్షించాడు!"

    గాయత్రి అటూ ఇటూ చూచి చెల్లిని ఆసక్తిగా మురిపెంగా అడిగింది.

    "చాలాసేపు మాట్లాడావా?"

    "అవును మాటాడాను. దేవాలయం వరకూ కలిసే వచ్చావా?"

    సందేహంగా కొద్దిసేపు ఆగి మళ్ళీ ప్రశ్నించింది గాయత్రి!

    "నీకు నోరు ఊరుకోదు. నా గురించి కూడా మాటాడే ఉంటావు" అంది. అలా అనటంతో అక్క మనసు ఏమిటో అమనికి అర్ధమయిపోయింది.

    "ఓ మాట్లాడాను. మేము మాట్లాడుకున్న విషయం అదే!" అని బొంకింది.

    "అవసరమయినదంతా మాట్లాడే వుంటావు"

    "అవును. మీకు సంబంధాలు నిశ్చయం అవుతున్నాయని కూడా చెప్పాను."

    "ఓసి తుంటరీ! అలా ఎందుకు చెప్పావు. ఇంకా కాలేదు కదా! ఆయన ఏమనుకుంటారు. చులకనగా తీసుకోరా? అయినా మనలో మనం పెళ్ళి చేసుకోడానికి ఆయన అంత వ్యక్తిత్వం లేని వారేమీ కాదుకదా?" అంది గాయత్రి.

    ఆయన అవునన్నారా? కాదన్నారా? అనే విషయం తెలుసుకునేందుకు అని అలా మాటాడుతోంది అన్నమాట.

    "చులకనగా ఎందుకు తీసుకుంటారు? ఈ మాట వినగానే బావగారు ఎగిరి గంతేశారు! తనకీ యిష్టమేనన్నారు. త్వరగా పెళ్ళి చూపులు ఏర్పాటు చేయమన్నారు. పెళ్ళి చూపుల్లో నిన్ను పాటపాడమని అడుగుతారట!" అంటూ అక్కని ఉడికించడానికి వరుసగా అబద్ధాలు చెప్పడం ప్రారంభించింది.

    "ఇవన్నీ నిజమేనా కొంటె పిల్లా!" అనుమానంగా చూచింది గాయత్రి.

    ఆమని అక్క ముఖంలోకి చూచి విరగబడి నవ్వింది.

    "నాకు అర్ధమయిందిలే! ఆయనంటే నీకూ యిష్టమే!" అంది.

    చెల్లి చేతిలో ఓడిపోయినందుకు సిగ్గుపడింది గాయత్రి.

    "వెళ్ళు వెళ్ళి! మెడికల్ ఎంట్రన్స్ కి ఏదో చదవాలన్నావు కదా! అయినా ఈ అయిదు రోజులు ఇక్కడే ఉండమని అమ్మగారు అన్నారు. అంతేకాని చదువు సంధ్యలు వొదిలేసి గ్రామం మీద గణాచారం తిరగమన్నారా?"

    "నువ్వేమయినా చెప్పు వింటాను కాని అక్కా! ఈ అయిదురోజులు చదువుకోమని మాత్రం చెప్పకు! ఈ సందడి అంతా నాదే.

    మళ్ళీ హాస్టల్ కి పోయానంటే పుస్తకాలతో కుస్తీలు తప్పవు. ఇప్పుడు కూడ ఎందుకు?" అంది ఆమని!

    "వెడితే వెళ్ళావు. ముందుగా నాతో చెప్పి వెళ్ళు! అమ్మగారు అడిగితే ఏదో చెప్పి సమర్ధిస్తాను. కాని వారిని బాధ పెట్టకూడదు. పెద్ద వాళ్ళు మన మంచి కోరి చెప్తారు. చలాయించటం తేలికే."

    "అయితే మనం ఒక ఒప్పందానికి వచ్చేద్దాం అక్కా! నేను బయటకు వెళ్ళినపుడు మమ్మీకి ఏదో చెప్పి నువ్వు సమర్ధించాలి! బావగారితో విషయమంతా చెప్పి ఆయన అభిప్రాయమేమిటో నేను తెలుసుకుంటాను. సరేనా?" అని అడిగింది ఆమని.

    "అలాంటి కొంటె వేషాలు తమాషాకి కూడ వేయకు! అంతా పెద్దవాళ్ళు చూచుకుంటారు. మనకేం తెలుసు?" అంది గాయత్రి.

    "పొద్దూకులూ ఆయన్నే కలుస్తూ కూచోటానికి మాకేం పనిలేదంటావా?" అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది ఆమని.

    ఆమెకు ఒక విషయం స్పష్టంగా అర్ధమయింది.

    అక్కకు వాల్మీకి అంటే ఇష్టమే!

    వాల్మీకితో ముందుగా తనకి చనువు ఏర్పడింది. కాబట్టి దాన్ని వారు మరింత దగ్గర అయేందుకు ఉపయోగించాలి.

    ఎంతో మంచి అక్క! ఆమెకు తాను చేయగలిగిన సాయం అదే!

    మరునాడు సాయంత్రం ఉట్టి పండుగ!

    ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఇప్పటినించే ఎదురు చూడటం ప్రారంభించింది. కాలక్షేపానికి నగరం నించి స్నేహితుల దగ్గర తెచ్చుకున్న ఆంగ్లచిత్రాల వీడియో కాసెట్లు ప్లేయర్ లో దట్టించి చూడటం ప్రారంభించింది.

    మధ్య మధ్య అమ్మగారు వస్తారేమో అని వాకిలి వరకూ వచ్చి తొంగి చూచి వెళ్ళిపోతోంది. సమయం ఎంత అయిందో ఆమెకు తెలియదు.

    రాణి సుమిత్ర రోజువారీ కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతుంటాయి. ఆమె తొమ్మిది గంటలకల్లా నిద్రపోతారు. నాలుగు గంటలు కాగానే లేస్తారు ఈలోగా ఆమె లేవదు.

    నిద్ర లేపేందుకు ఎవరూ సాహసించరు.

    అది అక్కాచెల్లెళ్లు జోరుగా కబుర్లాడుకుంటూ కాలక్షేపం చేసే ఆటవిడుపు సమయం! ఎంతసేపయినా ఆమని గది వెలుపలకు రాకపోవడంతో గాయత్రి అనుమానించింది.

    తనే వెళ్ళి తలుపు ప్రక్కగా నిలబడింది.

    లోపల జాకీఛాన్ పెడుతున్న కరాటే అరుపులు దగ్గు స్వరంతో విన్పిస్తున్నాయి. తటస్థుగానే తలుపు తెరుచుకుని లోనికి వెళ్ళింది.

    ఆమని ఉలికిపడి చూసింది.

    "ఏం చేస్తున్నావింత సేపూ?" గాయత్రి పలకరించింది.

    "సినిమాలు చూస్తున్నా!"

    "ఇంగ్లీషు సినిమాలా? యాకే ధూ! ఆడపిల్లలు చూస్తారా?"

    "మరేం చూస్తారు? రుక్మిణీ కళ్యాణం, జోగులాంబ మహత్యాలు మాత్రమే చూస్తారనుకుంటున్నావా పిచ్చి అక్కా!"

    "నువ్వెప్పటికి అభివృద్ధిలోకి వస్తావే!"

    "నాకేమీ వద్దుకాని ఆ పాడుగోల కాస్సేపు ఆపు! ప్రతి అయిదు నిముషాలకి ఒకసారి కొట్టుకుంటా రెందుకు వాళ్ళు!"

    "ఫైటింగ్ పిక్చర్స్ అంటే అలా ఉంటాయన్న మాట! జాకీచాన్ పేరు ఎప్పుడయినా విన్నావా?"

    "భారతంలో మన అభిమన్యుడి కంటే గొప్పవాడా?"

    "స్పిత్ బర్గ్ పేరు ఎప్పుడయినా విన్నావుటే అక్కా! రైడర్స్ ఆన్ లాష్ట్ ఆర్క్ నువ్వెందుకు చూస్తావు పాపం!"

    "ఆ సినిమా అగ్గిరాముడు సినిమా కన్నా బాగుంటుందా?"

    "నిన్ను ఆ దేవుడు కూడా అభివృద్ధిలోకి తీసుకురాడు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS