భార్గవరామ్ తండ్రి పరిచర్యలో అశ్రద్ధ చేయడంలేదు. పళ్ళు, మందులు స్వయంగా తెస్తున్నాడు తేగలవాళ్ళు వేరే ఉన్నప్పటికీ. తండ్రిగారి పరిస్థితి ఎప్పటికప్పుడు డాక్టరుగారిని అడిగి తెలుసుకొంటున్నాడు. మేనమామ హితబోధ చెవికెక్కించుకొని కర్తవ్యం నిర్వహిస్తున్నానన్న తృప్తివున్నా, మమకారపాశంతో, ప్రాపంచిక వాసనలలో బంధింపబడుతున్నానేమో అన్న శంక కూడా కలతపెడుతున్నదతడిని.
తత్వచింతనపట్ల మనసు పరుగులెట్టడం ఒక వరంగానే భావిస్తాడు మనిషి. ఇహలోక తాపత్రయాలు వదులుకొనడం గొప్పసంగతిగానే ఎంచుతాడు తాత్వికుడు. చిల్లికానిలేని బికారి అయినా, అనాకారి అయినా, అతడివద్ద పరతత్వమున్నదని తెలిస్తే మహారాజుదగ్గర నుండి మామూలు మనిషి వరకూ భర్తి గౌరవాలతో ప్రణమిల్లుతారు.
ఆ వరం, ఆ గొప్పతనం చేజారవిడుచుకొంటున్నానేమో అన్న అనుమాన భయాలతో అశాంతి సుడిగుండంలో వెళ్ళిపడ్డాడు భార్గవరామ్. వెళ్ళిపోడానికి దారి లేక పోలేదు. కాని, లోకం తనని కృతజ్ఞుడిగా కర్తవ్యదూరుడిగా ఎంచుతుంది! ఈ అపప్రథే అతడి కాలికి బంధమైందని చెప్పక తప్పదు!
తన ప్రవర్తన తల్లిని ఎంతయినా సంతోషపరుస్తుందనుకొన్న భార్గవరామ్ ఊహ ఒకనాడు తలక్రిందులై కూర్చొంది!
కన్నబిడ్డల బాహ్య ప్రవర్తననేకాక ఆంతర్యాన్ని కూడా చూడగల సూక్ష్మదృష్టి ఉంటుందేమో మాతృమూర్తికి?
"హాయిగా నీ పుస్తకాలలో తలదూర్చి కూర్చొనే వాడివి, ఎక్కడో ఏకాంతవిహారం సలిపేవాడివి బాబూ, నీకిక్కడ ముక్కుపట్టినట్లుగాలేదూ? ఈ రోగిష్టి తండ్రితో సతమతమౌడం, ఈ మందులు తేవడం చిరాకుగా లేదూ?" అన్నది కృష్ణవేణి, ఒకనాడు.
అమ్మమాట అబద్ధంకాదు, తను అబద్ధం ఆడి ఎరుగడు. ఆ అవసరం రాదసలు. అమ్మను నొప్పించే నిజం దాచినా పాపంలేదు. అందుకే అన్నాడు : ఏం లేదు, అమ్మా ఎందుకలా అనిపించింది?
"రామా, నాలుక ఆడక్కర్లేదు. పెదవులు కదలక్కర్లేదు. నువ్వు అబద్ధమాడినా నీ ముఖంలో భావాలు చదువగల నేర్పు, అమ్మను - నాకు ఉంది!"
ఉస్సురుమన్నాడు భార్గవరామ్.
కొడుకు ఎంతమాత్రం నొచ్చుకోకుండా నెమ్మదిగా చెప్పింది కృష్ణవేణి. "ఈ నరకంలో తప్పనిసరిగా ఉండి పోవలసిన అవసరమేముంది నీకు? చేతిక్రింద నౌకర్లు ఉన్నారు. చెప్పినపని ఏదైనా క్షణాలలో చేసుకువస్తారు. అప్పుడప్పుడూ మీ మామయ్య వస్తూనే ఉంటాడు; చూస్తుంటాడు నీ మనసు ఎక్కడబాగుంటే అక్కడ ఉండు! గోవిందస్వామిని ఒకసారి వచ్చి వెళ్ళమని చెప్పు!" ఒకరు మనసులేని సేవచేస్తున్నారని తెలిసినప్పుడు స్వీకరించడానికి కష్టంగానే ఉంటుంది అభిమానవంతులకు. అందులో కన్నకొడుకైతే మరీని?
ఆత్మఘోష మధ్యే అనుకొన్నది కృష్ణవేణి. ఏదో ఆశతో, కొడుకు తన మాట లక్ష్యపెట్టకుండా ఇక్కడే ఉండిపోవాలని!
అమ్మ అన్నదే పదివేలు అనుకొన్నాడు ఆ కొడుకు! "నువ్వేమనుకోకుంటే అలాగే వెడతానమ్మా అమాయకంగా అంటూ మధ్యాహ్నం బండికి బయల్దేరాడు భార్గవరామ్.
జాలిగా, బాధగా నవ్వుకొంది కృష్ణవేణి.
మిట్ట మధ్యాహ్నం రెండుగంటలవేళ. స్టేషన్ లో రైలుదిగి రెండుమైళ్ళ దూరంలో ఉన్న వజ్రకోటకు నడిచి వెళ్ళాడు భార్గవరామ్. ఎండ దెబ్బకు ముఖమంతా కందిపోయి చెమటలుకారుతూ అలసటగా ఇంట్లో అడుగుపెట్టిన చిన్నయజమానిని చూచి నౌకర్లు విస్తుపోయారు. వరండాలోనే ఏవో చిన్నలెక్కలు చూచుకొంటున్న గోవిందస్వామి నొచ్చుకొంటూ, "బాబూ, మీరొచ్చేది తెలియదుకదా? స్టేషనుకు బండి పంపేవాడిని. బాబుగారికి ఎలా ఉంది?" అన్నాడు. బాగానే ఉంది ట్రీట్ మెంటు జరుగుతూంది..... రాఘవా, చన్నీళ్ళుతోడరా చల్లగా స్నానం చేస్తాను" అని చెప్పాడు భార్గవరామ్, పైకి దారితీస్తూ.
"బాబూ, తమరిని భోజనం?" వంట బ్రాహ్మడు సుబ్బయ్య అడిగాడు.
"కాలేదు"
అన్నం వున్నా చల్లబడిందని తిరిగి బియ్యం కడిగి పొయ్యిమీద వెయ్యడానికి వెళ్ళాడు సుబ్బయ్య. తను లేని సమయంలో మామూలుగా మూసి ఉండే భార్గవరామ్ గది తలుపులు తెరిచిఉన్నాయి. గబగబా గదిలో అడుగుపెట్టిన భార్గవరామ్ టక్కున ఆగిపోయాడు గడపలోనే, హృద్యమైన ఆ దృశ్యం చూచి, ఈ పూర్ణేందువదన, ఈ లావణ్య రాసి దేవతా?"
చదువుతూన్న పుస్తకం అలాగే గుండెలమీద ఆన్చుకొని కన్నులు మూసుకొంది దేవదాసి. మెల్లగా సుషుప్తిలో జారిపోయేముందు తన వలపుల చెలికానిని తలుచుకొందేమో ఆ తన్మయతను రెప్పలమీద అలాగే నిలిచిపోయింది. ఎడమ చెయ్యి గుండెలమీది పుస్తకంపై ఆన్చి, కుడిచెయ్యి పైకెత్తి శిరసుమీదుగా ఉంచింది. కొద్దిగా తొలగిన పైట క్రింద తెల్లగా, మృదువుగా అగుపడుతున్న పొట్ట ఆ ఎర్రంచు కుచ్చిళ్ళ క్రింద.... భార్గవరామ్ చూపు చాలాసేపు అక్కడే ఆగిపోయింది. పాంజేబులు కట్టిన అందమైన పాదాలు చీర కుచ్చిళ్ళు తొలగిపోయికుడిమోకాటి పిక్కవరకూ తెల్లగా అగుపడుతూంటే ఆ పురుష హృదయంపై సమ్మోహనాస్త్రమే అయింది.
అతడు స్త్రీ సౌందర్యాన్ని ఇంత దగ్గరగా ఇంత కుతూహలంతో చూడడం మాత్రం యిదే ప్రథమం. ఆ సమయంలో ఆమె తన మరదలన్న సంగతి స్మృతిలోలేదు. మూర్తీభవించిన సౌందర్యదేవతగా కన్పడింది.
