"యాభై ఏళ్ళు దాటటం ఏంటి నీ బొంద? నేను నా కోసం అమ్మాయిని వెతుక్కుంటున్నానని అనుకుంటున్నావా లేకపోతే మా నాన్నకోసం వెతుకుతున్నానని అనుకుంటున్నావా?..."
"నీ కోసమే అనుకో - కానీ నువ్వు సొంతంగా బుర్ర ఉపయోగించి ప్లాన్ వెయ్యడం, ఆ ప్లాన్ ని ధైర్యంగా అమలు చేయడం, నీకు అమ్మాయి దొరకడం, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించడం, మీరిద్దరూ పెళ్ళి చేసుకోవడం ఇదంతా జరిగేటప్పటికి నీకు యాభై ఏళ్ళు దాటవా అని అలా అన్నాను..." నవ్వుతూ అన్నాడు కన్నారావు.
మంచంమీద నుండి కన్నారావు దగ్గరికి కుంటుకుంటూ వచ్చి "నిన్నూ" అంటూ చేయెత్తి "అబ్బా" అని బాధగా అంటూ ఆగిపోయాడు చిట్టబ్బాయి.
"ఒళ్ళంతా కుమ్మేసింది. ఒకటే నొప్పి! అయినా వెంటపడి డార్లింగంటూ కూసింది నువ్వైతే నన్నిలా పచ్చడి చేసేసిందేం?" విసుక్కుంటూ అన్నాడు చిట్టబ్బాయి.
"అంటే ఈ ప్లానుకి సూత్రధారివి నువ్వు కదా?... నీ కోసం కదా నేనలా డార్లింగని పిలిచాను. ఈ నాటకంలో ప్రధాన పాత్రధారివి నువ్వు గనక నిన్ను బాగా ఉతికింది" అన్నాడు కన్నారావు.
"అసలు ఆ ప్లానుకి ప్రధాన సూత్రధారి ఆ ప్రేమానందంగాడు. ఆ అమ్మాయికి ఆ విషయం చెప్పి వాడి అడ్రసు ఇవ్వాల్సింది... అమ్మా అబ్బా నాయనా" అంటూ బాధగా మూలిగాడు చిట్టబ్బాయి.
కన్నారావు చిట్టబ్బాయి వంక జాలిగా చూశాడు.
"ఏరా? బాగా నొప్పిగా ఉందా?"
అవునన్నట్టు జాలిగా తల ఊపాడు చిట్టబ్బాయి.
"ఉండు. మెడికల్ షాపుకెళ్ళి మాత్రలేమైనా తెస్తాను..."
కన్నారావు చెప్పులేస్కుని బయటపడ్డాడు.
మెడికల్ షాపులో మాత్రలు కొనుక్కుని రోడ్డుమీదికి వచ్చి నాలుగడుగులు వేశాడు కన్నారావు.
"హలో! ఏవండీ..."
ఎవరిదో ఆడ గొంతు, వెనకనుండి వినిపించింది.
కన్నారావుకు ఆ గొంతు వినిపించిందిగానీ తనని పిలిచే అమ్మాయిలు ఎవరుంటార్లే అనుకుని వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు అడుగులు వేశాడు.
"మిమ్మల్నేనండి" అంది ఆ గొంతు.
కన్నారావుకి అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు.
ఆ అమ్మాయి చిరునవ్వుతూ అతన్ని చూస్తూంది.
'సందేహం లేదు! ఆ అమ్మాయి నన్నే పిలుస్తుంది' అనుకున్నాడు. 'ఎందుకు పిలుస్తుంది?'
ఆ అమ్మాయి వంక అయోమయంగా చూశాడు.
"నన్ను గుర్తుపట్టలేదా?" నవ్వుతూ అడిగింది ఆ అమ్మాయి.
కన్నారావు పరీక్షగా ఆ అమ్మాయి మొహం వంక చూశాడు.
ఆ అమ్మాయిని ఎక్కడో, ఎప్పుడో చూసినట్టు ఉంది.
ఎక్కడా? ఎప్పుడూ?
గుర్తురాక కన్నారావు బుర్ర గోక్కున్నాడు.
"గుర్తు రాలేదా?' నవ్వుతూ అడిగింది ఆ అమ్మాయి.
ఆమె రువ్విన నవ్వుకి కన్నారావు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.
"సారీ అండి. క్షమించండి. మరేమోనండీ మిమ్మల్ని చూసినట్టే ఉంది గానీండి గుర్తురావడం లేదండీ" అన్నాడు ఇబ్బందిగా నవ్వుతూ.
"అవున్లెండి గుర్తురావడం కష్టమే! ఒకళ్లా ఇద్దరా? ఎంతమంది అమ్మాయిల వెనకాల మీరు రుమాళ్ళు వేశారో!!"
ఆ మాట వింటూనే కన్నారావు కెవ్వుమని అరిచాడు.
అవును! ఆ అమ్మాయే!! ఆ రోజు తను ఆ అమ్మాయి వెనకాలే రుమాలు వేశాడు!!!...
"ఆ... ఆ... గుర్తొచ్చారండీ" అన్నాడు.
"నిజంగానే? అంతమంది అమ్మాయిల్లో నేనెలా గుర్తుంటానబ్బా?!" అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నవ్వుని ఆపుకుంటూ.
"ఎంతమంది అమ్మాయిలండీ? నేను మీ ఒక్కరి వెనకాలే రుమాలు వేశాను! నిజం."
"నమ్మమంటారు? మన్లోమాట. నేను వెళ్ళిపోయిన తరువాత ఏ అమ్మాయైనా మీ ట్రిక్కులో పడిందా?"
ఆ అమ్మాయి అలా అడిగేసరికి కన్నారావు కంగారు పడిపోయాడు.
"అబ్బెబ్బె, మీరు చాలా పొరపాటు పడ్తున్నారు. నేనలాంటివాడిని కానండీ. అసలు ఆరోజు మీ వెనకాల నేను రుమాలు వెయ్యడం కూడా నా కోసం కాదు. అసలు రుమాలు ట్రిక్కు ఎలా ప్లే చేయాలన్నది నా స్నేహితుడికి తెలియడం కోసం నేను వాడికలా డిమాన్ స్ట్రేట్ చేసి చూపించాను. అదీ కాకుండా వాడు 'నువ్వలా చెయ్యిచూద్దాం' అంటూ ఛాలెంజ్ చేసేసరికి పౌరుషం వచ్చి చేశాను. హిహి అంతేనండి."
ఆ అమ్మాయి దీర్ఘంగా నిట్టూర్చింది.
"ఓస్!- అంతేనా? నేనింకా మీకు నేను ఇంప్రెసివ్ గా కనిపించి నావెంట పడ్డారేమోనని అనుకున్నాను."
ఇలా అని రెండడుగులు ముందుకు వేసింది.
కన్నారావు మళ్ళీ కంగారు పడ్డాడు.
"అంటే అలా అని కాదు. నేను మా వాడికి డిమాన్ స్ట్రేట్ చేయడం కోసం ఆ రుమాలు మీ వెనకాల ఊరికే పడేసినా మీతో మాట్లాడిన తరువాత మీరు నాకు ఇంప్రెస్సివ్ గానే కనిపించారు." అన్నాడు ఆమె వెనకాల నడుస్తూ గబగబా.
ఆమె చటుక్కున వెనక్కి తిరిగి నవ్వింది.
కన్నారావు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.
"అందుకేనా బస్సు స్టాపుదాకా వచ్చి నన్ను బస్సెక్కిస్తానని అన్నవాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు?" అడిగింది ఆమె.
"అంటేనండీ.. మరేమోనండీ.... అసలండీ మా చిట్టబ్బాయ్ కోసం అదేనండి రుమాళ్ళు పనిగురించి... అంటే అమ్మాయిల వెనకాల వేయడం. ఆ పనిగురించే నేను వచ్చాను కదండీ... మరి నేనండీ... మీ వెనకాలండీ... అది కాదండీ... వాడు వంటరిగా" కన్నారావు తడబడుతూ, ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఏదో చెప్పబోతూ కన్విన్స్ చేయాలని తాపత్రయపడ్తున్నాడు.
"కన్నారావు అవస్త చూసి ఆ అమ్మాయి ఫక్కున నవ్వింది.
"సర్లె సర్లె... ఇక ఆపండి... నేను వస్తాను!..." అంది ఆమె నవ్వాపుకుంటూ.
"ఏవండీ మీ పేరు తెలుసుకోవచ్చా?" కన్నారావు ఆశగా అడిగాడు.
"తెలుసుకోకూడదు!" ఠకీమని సమాధానం చెప్పింది.
"ఏవండీ ప్లీజ్!... మరేమో నాపేరు కన్నారావు!... మరి మీ పేరు ఏవిటంట?... హిహి చెప్పరూ?" మస్కాకొడుతూ అడిగాడు కన్నారావు.
"చెప్పను..."
"మీరు ఎక్కడ ఉంటారు? ఈ కాలనీలోనేనా?"
"కాదు ఇక్కడ నా స్నేహితురాల్ని కలవడానికి వచ్చాను. నేను ఎక్కడ ఉండేదీ చెప్పను."
"పోనీలెండి చెప్పకపోతే ... మీరా గర్ల్స్ కాలేజీలోనే చదువుతున్నారుగా?... ఈరోజు సాయంత్రం నేను ఆ కాలేజీకి వచ్చి గేటుబయట కాపు వేసి మిమ్మల్ని ఫాలో అయ్యి అన్ని వివరాలూ కనుక్కుంటూ...."
ఆ అమ్మాయి మళ్ళీ కిలకిలా నవ్వింది.
"మీరు పప్పులో కాలేశారు!"
కన్నారావు వంగి కాళ్ళవంక చూస్కున్నాడు.
"నేనేం ఆ కాలేజీలో చదివే నా స్నేహితురాల్ని కలవడానికి వచ్చాను... ప్చ్... ఆరోజు అది కాలేజీకి రాలేదు".
కన్నారావు నీరుకారిపోయాడు.
"ఏవండీ... పోనీ మీరు ఎక్కడుంటారో చెప్పనక్కర్లేదుగానీ... మీ పేరు చెప్పండి చాలు... ప్లీజ్" బతిమాలాడు.
"నేను చెప్పను!"
"నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి!" పెద్ద హీరోలా అన్నాడు.
ఆ అమ్మాయి కన్నారావు కళ్ళలోకి సూటిగా చూసి అంది. "చెప్పను!"
"ఆ!!" నోరు తెరిచాడు కన్నారావు.
