అలనాటి నెచ్చెలి.
ఆ ఏరాడ కొండ.
ఆ నును లేత గాలులు.
ఆ నీలి నీలి అముద్ర తరంగాల సంగీతం.
ఆ కొండల ఆవల అంతటా పరుచుకున్న సముద్రం. ఆ పైన ఇంద్రనీలపు ఆకాశం.
ఆ ఆకాశం కింద పచ్చిక బయలు.
ఆ పచ్చిక మీద ఆమె... తను...
వెచ్చని కౌగిళ్ళు...నులి వెచ్చని చుంబనాలు...
అంతటా గాలుల గుసగుసలు.
అంతటా నిశ్శబ్దం!
నిశ్శబ్దం.
నిశ్శబ్దం.
వినిపించే చప్పుళ్ళు రెండే రెండు.
ఒకటి....తన గుండె చప్పుడు.
రెండోది ఆమె గుండె చప్పుడు.
ఈ రెండు చప్పుళ్ళ ముందూ అన్ని చప్పుళ్ళూ... కెరటాల హోరులో కలిసి పోయాయి.
అదొక జ్ఞాపకం. అదొక అనుభవం. అదొక స్మృతి. అది మళ్ళీ మళ్ళీ రాని.... వచ్చే అవకాశం లేని మధురానుభవం.
ఆమె అతనికి నెచ్చెలి. ఆ తరువాత భార్య. కొన్నాళ్ళకి తల్లి__ముద్దుల రమణికి తల్లి__మరికొన్నాళ్ళకి__భౌతిక అవశేషంగా మిగిలిన అందాలప్రతిమ!
"ఏడవకు నాన్నా!" అంటూ రమణి రాజారామ్ కళ్ళు తుడిచింది.
మరుక్షణంలో రాజారామ్ మామూలు మనిషయ్యాడు.
"నీకు మంచి అమ్మని తెస్తాలే అమ్మా!"
"అచ్చం రాజేశ్వరి ఆంటీలా ఉంటేనే నాకిష్టం!"
'నీ పెర్మిషన్ తీసుకుని-నీకు నచ్చాకే నా పెళ్ళి. ఓకే?'
"ఓకే!"
"ఇంకేమిటి విశేషాలు?"
"డేడీ__నువ్వివాళ రాత్రి ఇంట్లో ఉండవా?"
"లేదమ్మా. అర్జంట్ పని ఉంది!"
"సరే! కాని నువ్వెంత రాత్రప్పుడు వచ్చినా నన్ను నిద్రలేపి ముద్దు పెట్టుకోవాలి!"
"అలాగే! కాని నేనొచ్చేప్పటికి చాలా రాత్రయి పోతుందమ్మా"
"అయినా సరే__"
"ఓకే. డన్!
ఆ మాట విన్నాక రమణి సంతృప్తిగా తలాడించింది.
తల్లిలేని పిల్ల ఎంత ప్రేమగా పెంచినా తల్లిలేని లోటు తీరేది కాదు. ఆమెని చూస్తుంటే రాజారామ్ మనస్సు విలవిల్లాడిపోయింది.
'ఇకనుంచీ రమణితో ఎంచక్కా కనీసం రోజుకో గంటైనా కాలక్షేపం చెయ్యాలి. తల్లిలేని లోటు తీర్చాలి' అని రాజారామ్ మనస్సులో నిర్ణయించుకున్నాడు.
ముందు తన సమస్యలు ఒక కొలిక్కి రావాలి. రాజకీయాల సుడిగుండంలో పడ్డ తన జీవితానికో దారీ తెన్నూకాన రావాలి. అంతవరకూ రమణి ఆలనా పాలనా....వెయిట్ చెయ్యాల్సిందే.....విషాదంగా ఊపిరిపీల్చుకున్నాడు రాజారామ్.
4
సరిగ్గా ఆరున్నర అయ్యేసరికి రాజారామ్ ఇంటిముందు కాంటెస్సా కారాగింది. మేడమీది బాల్కనీలో నిలబడ్డ రాజారామ్ అది తనకోసమే వచ్చిందని గ్రహించాడు చకచకా మెట్లు దిగి కార్లో కూర్చున్నాడు.
మాసాబ్ టాంక్ దగ్గర__నేరుగా పోవాల్సిన కారు__ఎడమవేపుకి తిరిగేసరికి రాజారామ్__" ఇటెందుకు?" అన్నాడు.
"మెహిదీపట్నంలో మేడమ్ ను కూడా పికప్ చేసుకుని రమ్మన్నాడు సాబ్!" అన్నాడు డ్రయివర్.
ఎవరా మేడమ్...అని అడుగుదామని మానేసాడు ఎవరైతేనేం?
మరి కాసేపట్లో...కారాగింది. రెండుసార్లు హారన్ మోగింది.
మూడి నిమిషంకాకముందే రాజేశ్వరి కారు పక్కనే నిలబడి__కిటికీలోంచి రాజారామ్ ని చూసి__నవ్వింది.
"డిన్నర్ పార్టీకి నన్నుకూడా రమ్మని ఆహ్వానించారు చైర్మన్!" అంది.
"వెరీనైస్. కమాన్ ఇన్!" అంటూ డోర్ తెరిచాడు రాజారామ్.
అతని పక్కనే కూర్చుంది రాజేశ్వరి.
కారు మళ్ళీ మాసాబ్ టాంక్ మీరుగా బంజారాహిల్స్ వేపు పరుగులు తీసింది.
రాజేశ్వరికి అంగుళం దూరంలో రాజారామ్. ఊహల్లో అతి చేరువగా రాజేశ్వరి.
ఎవరి ఊహల్లో వారు...
దగ్గర కావాలని ఆశిస్తూనే దూరంగా...
అంగుళం దూరంగా...
"రేపు మీరు ఆఫీసుకి వచ్చేప్పుడు రమణిని కూడా తీసుకురండి."
"తప్పకుండా బట్....సారీ ఫర్ ద ట్రబుల్!"
"నా టెటాల్. ఇట్స్ ఎ ప్లెజర్!"
మళ్ళీ కాసేపు మౌనం.
"చైర్మన్ గారి దగ్గర మా నాన్నగారు ముప్పయ్యేళ్ళు చేశారు. గుమస్తాగా, మేనేజర్ గా రకరకాల పన్లు చేశారు. ఆయనతో కలిసి నేను అప్పుడప్పుడు చైర్మన్ గారింటికి వెళ్తుండేదాన్ని" అంది రాజేశ్వరి.
ఆ మాటలు వింటూ ఉండిపోయాడు రాజారామ్.
"విరించిగారు చైర్మన్ గారి మేనకోడల్ని పెళ్ళి చేసుకోవడం, మా నాన్నగారు ఉద్యోగం మానెయ్యడం ఒక్కసారే జరిగాయి."
"ఏమన్నా గొడవపడ్డారా?"
'అబ్బే అదేం లేదు. మా నాన్నగారు జబ్బు పడ్డారు.' అంటూ నవ్వింది రాజేశ్వరి.
అంతలో కారు ఓ పెద్ద గేటుముందు ఆగింది. హారన్ చప్పుడుతో గేట్లు తెరుచుకున్నాయి. అటూ ఇటూ పచ్చని పచ్చిక, రకరకాల పూలమొక్కలు, ఫర్లాంగు దూరంలో తెల్లని మేడ కనిపించాయి రాజారామ్ కు. తాను మొదటిసారిగా ఇక్కడికి వస్తున్నాడు.
