15వ. సర్గ
1. ప్రవాళాంకిత - సోపానముల
తప్తకాంచన వి | శాల వేదికల |
గగన చుంబిత - వర శిఖరాల
నలుదెసల నింపు - ధవళ కాంతుల |
వేయి స్తంభముల - దివ్య భవనము
వన మధ్యమున - ఠీవిగ నుండెను |
శోభిల్లు శింశుపా - తరుశాఖలపై
మారుతి కూర్చొని | కలయ జూచెను..... ||శ్రీ||
2. ఆదీప్యమాన - భవన ప్రాంతమున
తను కూర్చొనిన - తరువు క్రిందున |
కృంగి కృశించిన - సన్నగిల్లిన
శుక్లపక్షపు - చంద్రరేఖను |
ఉపవాసముల - వాడిపోయిన
నివురు గప్పిన - నిప్పుకణమును |
చిక్కిన వనితను - మారుతి గాంచెను
రాక్షస వనితల - క్రూర వలయమున .... ||శ్రీ||
3. మాసిన పీత వ | ననమును దాల్చిన
మన్నున బుట్టిన - పద్మమును |
పతి వియోగ శో | కాగ్ని వేగిన
అంగారక పీ | డిత రోహిణిని |
మాటి మాటికి - వేడి నిట్టూర్పుల
సెగలను గ్రక్కే - అగ్నిజ్వాలను |
చిక్కిన వనితను - మారుతి గాంచెను
రాక్షస వనితల - క్రూర వలయమున... ||శ్రీ||
4. నీలవేణి సం | చాలిత జఘనను |
సుప్రతిష్ఠను - సింహమధ్యమను |
కాంతులొలుకు ఏ | కాంత ప్రశాంతను
రతీదేవి వలె - వెలయు కాంతను |
పుణ్యము తరిగి | దివినుండి జారి
శోక జలధి పడి - మునిగిన తారను |
చిక్కిన వనితను - మారుతి గాంచెను
రాక్షస వనితల - క్రూర వలయమున... ||శ్రీ||
5. పతి చెంతలేని - సతి కేలనని
సీత సొమ్ముల ద | గిల్చె శాఖల |
మణీమయకాంచన - కర్ణవేష్టములు
మరకత మాణిక్య - చెంపసరాలు |
రత్నఖచితమౌ - హస్తభూషలు
నవరత్నాంకిత - మణిహారములు |
రాముడు దెలిపిన - గురుతులు గలిగిన
ఆభరణముల గు | ర్తించె మారుతి ..... ||శ్రీ||
6. - సీత నెత్తుకొని - గగన మార్గమున
లంకేశ్వరుడు - ఏగు సమయమున |
ఉత్తరీయమును - కొన్ని సొమ్ములను
ఋష్యమూకమున - జానకి విసరెను |
ప్రస్తుతమున్న - వసనము సొమ్ములు
వెనుకటి వాటితో - కలిసె పోలికలు |
రాముడు దెలిపిన - గురుతులు గలిగిన
ఆభరణముల గు | ర్తించె మారుతి ..... ||శ్రీ||
7. సర్వ సులక్షణ - లక్షిత జాత
సీతగాక మరి - ఎవరీ మాత ?
కౌసల్యా సు - ప్రజారాముని
సీత గాక మరి - ఎవరీ మాత ?
వనమున తపించు - మేఘశ్యాముని
సీతగాక మరి - ఎవరీ మాత ?
ఆహా కంటి క | ను గొంటి సీతనని
పొంగి పొంగి ఉ | ప్పోంగె మారుతి ..... ||శ్రీ||
__: 15 వ. స. సంపూర్ణము :__
16, 17 వ సర్గ
1. పూవులు నిండిన - పొలము లందున
| నాగేటి చాలున - జనన మందిన |
జనక మహారాజు - కూతురైన
దశరధ నరపాలు - కోడలైన |
సీతాలక్ష్మికి - కాదు నమానము
త్రైలోక్యరాజ్య - లక్ష్మి సహితము |
అంతటి మాతకా - కాని కాలమని
మారుతి వగచె - సీతను కనుగొని ..... ||శ్రీ||
2. - శత్రుతాప కరు | డు మహా శూరుడు
సౌమిత్రికి - పూజ్యురాలైన |
ఆశ్రితజన సం | రక్షకుడైన
శ్రీరఘురాముని - ప్రియసతియైన |
పతి సన్నిధియే - సుఖమని ఎంచి
పడునాల్గెండ్లు - వనమున కేగిన |
అంతటి మాతకా - కాని కాలమని
మారుతి వగచె - సీతను కనుగొని ..... ||శ్రీ||
3. బంగరు మేని - కాంతులు మెరయ
మందస్మిత ముఖ - పద్మము విరయ |
హంసతూలికా - తల్పమందున
రాముని గూడి సు | ఖింపగ తగిన |
పురుషోత్తముని - పావన చరితుని
శ్రీరఘురాముని - ప్రియసతియైన
అంతటి మాతకా - కాని కాలమని
మారుతి వగచె - సీతను కనుగొని ..... ||శ్రీ||
__: 16, 17 వ. స. సంపూర్ణము :__
