"లేదు!"
"మరెవరితోనయినా?"
"లేదు" అని దేవదాసు జవాబిచ్చాడు.
దీని తరువాత చున్నీలాల్ కు అకస్మాత్తుగా రెండో విషయం గుర్తుకు వచ్చింది. "ఓహో, నీకింకా పెళ్ళి కాలేదు గదూ?" అన్నాడు.
అదే సమయంలో దేవదాసు ముఖం మలుపుకొని నిద్రపోయాడు. కొద్దిసేపటిలో దేవదాసు నిద్రపోయినట్లు చున్నీలాల్ గమనించాడు. ఇదే విధంగా నిద్రిస్తూ, నిద్రిస్తూ మరో రెండు రోజులు గడిచిపోయాయి. మూడోరోజు ఉదయానికి దేవదాసు ఆరోగ్యవంతుడై లేచి కూర్చున్నాడు. అతడి ముఖం చూస్తుంటే అతణ్ణి ఆవరించిన ఆ దట్టమయిన నీడ చాలా వరకు తొలగిపోయినట్లుగా కన్పిస్తూ వుంది. " ఈరోజు నీ ఆరోగ్యం ఎట్లా వుంది?" అని చున్నీలాల్ అడిగాడు.
"పూర్వంకన్నా బాగున్నట్లు కన్పిస్తూ వుంది.సరే చున్నీబాబూ, రాత్రిపూట నీవు యెక్కడికి వెళుతున్నావు?" అన్నాడు. ఈ రోజు చున్నీలాల్ సిగ్గుపడి "అవును, నేను వెళుతున్నాను. కాని దేనిదేముందిలే! సరే ఈ రోజు కాలేజీకి వెళతావు గదూ?" అన్నాడు.
"లేదు, చదువు మానేశాను."
"ఛీ! ఇలా కూడా చేయవచ్చు. రెండు మాసాల తరువాత నీ పరీక్ష జరుగుతుంది. నీవు చదువులో అంత వెనకబడిన వాడివేమీ కాదు. ఈ సంవత్సరం పరీక్షకు కూర్చోరాదూ?"
"లేదు, చదువు మానేశాను."
"చున్నీలాల్ మౌనం వహించాడు. ఎక్కడికి వెళుతున్నావో చెప్పరాదూ? నీ వెంట నేను కూడా వస్తాను" అని దేవదాసు మళ్ళీ అడిగాడు.
చున్నీలాల్, దేవదాసు ముఖంవైపు చూసి "అది తెలిసికొని నీవు ఏం చేస్తావు? నేను అంత మంచి చోటుకేమీ వెళ్ళడంలేదు" అన్నాడు.
"మంచిది కానివ్వు, చెడ్డది కానివ్వు. దానితో సంబంధం ఏమిటి?" అని మనసులో అనుకున్నాడు. "చున్నీబాబూ, నన్ను వెంట తీసికొని వెళతావా, లేదా?" అన్నాడు పైకి.
"తీసుకువెళతాను. కాని నీవు రావద్దు."
"కాదు, నేను వస్తాను. ఒకవేళ నచ్చకపోతే నేను మళ్ళీ రాను. కానీ నీవు ఏ సుఖం ఆశతో నిత్యం నిరీక్షిస్తూ వుంటావో....ఏమయినా కానివ్వు, చున్నీలాల్ నేను ఖచ్చితంగా వస్తాను."
చున్నీలాల్ ముఖం మలుపుకొని కొంచెం నవ్వి__నా స్థితి! అని మనసులో అనుకొని "సరే పద" అన్నాడు పైకి.
సాయంకాలానికి కొంచెం ముందుగా ధర్మదాసు అవసరమయిన వస్తువులు, సామాను తీసికొని వచ్చాడు. దేవదాసును చూసి ఏడుస్తూ "దేవదాస్! ఇప్పటికి నాలుగు రోజుల నుంచి మీ అమ్మ ఎంతగానో ఏడుస్తున్నది" అన్నాడు.
"ఎందుకు ఏడుస్తున్నది?"
"ఎవరితోనూ చెప్పా పెట్టకుండా అకస్మాత్తుగా వచ్చేశావు" అని ఒక ఉత్తరం బయటికి తీసి చేతికిచ్చి "అమ్మగారి ఉత్తరం" అన్నాడు.
చున్నీలాల్ సంగతి తెలుసుకొనడానికి ఉత్కంఠతో చూస్తున్నాడు. దేవదాసు ఉత్తరం చదివి అక్కడ పెట్టేశాడు. తల్లి ఇంటికి రమ్మని ఎంతో బ్రతిమలాడుతూ వ్రాసింది. ఇంట్లో ఆమె ఒక్కతే దేవదాసు మానసిక స్థితిని, దుఃఖాన్ని కొంచెం కొంచెం వూహించుకోగలిగినది. ధర్మదాసు చేత చాటుగా కావలసినంత ధనం కూడా పంపించింది. ధర్మదాసు అదంతా దేవదాసు చేతికిచ్చి "దేవదాస్! ఇంటికి పోదాం పద" అన్నాడు.
"నేను రాను, నీవు తిరిగి వెళ్ళు."
రాత్రిపూట మిత్రులిద్దరూ మంచి దుస్తులు వేసుకొని, బాగా ముస్తాబై బయటికి బయలుదేరారు. దేవదాసు ప్రవృత్తి వీటన్నిటివైపు లేదు. కాని చున్నీలాల్ సాధారణ దుస్తులు ధరించి బయటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఒక బాడుగు బండి చిత్ పుర్ లోని ఒక రెండంతస్థుల భవనం ముందుకువచ్చి నిలబడింది. చున్నీలాల్ దేవదాసు చేయి పట్టుకొని లోపలికి తీసికొని వెళ్ళాడు. ఆ గృహం యజమానురాలి పేరు చంద్రముఖి. ఆమె వచ్చి అతిధులిద్దరికీ స్వాగతం చెప్పింది. ఆ సమయంలో దేవదాసు శరీరమంతా మండిపోయింది. ఆయన ఇటీవల అనేక రోజులనుంచి తన అజ్ఞానంతో నారీ దేహపు నీడను కూడా ద్వేషించనారంభించాడు. ఇదంతా స్వయంగా అతడికి కూడా తెలియదు. చంద్రముఖిని చూడగానే హృదయంలో ఘనీభవించిన ద్వేషం దావానలంలాగా ప్రజ్వరించింది. చున్నీలాల్ ముఖం వైపు చూసి కనుబొమలు విరుచుకొని "చున్నీలాల్! ఎటువంటి చెడు ప్రదేశానికి తీసుకొని వచ్చావు?" అతడి తీవ్రమయిన స్వరాన్నీ, దృష్టినీ చూసి చంద్రముఖి, చున్నీలాల్ ఇరువురూ నిశ్చేష్టులైపోయారు. మరుక్షణంలోనే చున్నీలాల్ తనను తాను స్థిమితపరచుకొని, దేవదాసు చేయి పట్టుకొని మృదువుగా "పదండి, లోపలికి వెళ్ళి కూర్చోండి" అన్నాడు.
దేవదాసు ఏమీ మాట్లాడలేదు. గదిలోకి వెళ్ళి ప్రక్కమీద విషణ్ణ వదనంతో కూర్చున్నాడు. దగ్గరే చంద్రముఖి కూడా మౌనంగా కూర్చుండి పోయింది. దాసీ పొగాకు నింపి వెండితో కప్పబడిన కొబ్బరికాయ తెచ్చింది. దేవదాసు దానిని స్పృశించను గూడా స్పృశించలేదు. చున్నీలాల్ గాంభీర్యంగా కూర్చుని వున్నాడు. ఏం చేయాలో నిశ్చయించుకోలేక దాసీ చివరకు ఆ కొబ్బరికాయ చంద్రముఖి చేతికిచ్చి వెళ్ళిపోయింది. ఒకటి రెండు దమ్ములు లాగిన తరువాత దేవదాసు ఆమె ముఖం వైపు చూశాడు. హఠాత్తుగా అమితమయిన ఏవగింపుతో "ఎంత అనాగరికురాలు! ఎంత సౌదర్యహీనురాలు" అన్నాడు.
ఇంతకు పూర్వం చంద్రముఖిని సంభాషణలో ఎవరూ ఓడించలేకపోయారు. ఆమెను నిశ్చేష్టురాలిని చేయడం చాలా కష్టమైన పనిగా వుండేది. దేవదాసు అంతరంగంలో ఘనీభవించిన సరళమైన, కఠినమైన ద్వేషపు పలుకు ఆమె హృదయంలో ములికిలాగా గుచ్చుకొన్నది. కాని కొంచెం సేపటి తరువాతనే ఆమె తనను నిగ్రహపరచుకొన్నది. అయితే చంద్రముఖి నోటినుండి పొగ మాత్రం బయటికి రాలేదు. అప్పుడు చున్నీలాల్ చేతికి హుక్కాను అందించి ఆమె మరోసారి దేవదాసు ముఖం వైపు చూసింది. మళ్ళీ నిశ్శబ్దంగా కూర్చున్నది. ముగ్గురూ నిర్వికారులవుతున్నారు. మధ్య మధ్య కేవలం హుక్కా గుడగుడల శబ్దం మాత్రం వినిపిస్తున్నది. అది కూడా భయంతో కంపిస్తూ వుంది. మిత్రబృదంలో తర్కం ప్రారంభమైనపుడు అకస్మాత్తుగా నిరర్ధకమైన కలహం రాగానే ఎలాగైతే ప్రతి ఒక్కరూ వ్యాకులంతోనూ, అలకతోనూ వున్న అంతఃకరణంతో "ఇదే!" అని చెపుతూ వుంటారో ఆ విధంగానే ముగ్గురు వ్యక్తులూ లోలోపల "ఇదే! ఇదెలా సంభవించింది?" అని చెప్పుకుంటూ వుంటారు.
ఏమయినా, ముగ్గురిలో ఎవరికీ కూడా ఆనందం లభించలేదు. చున్నీలాల్ హుక్కా అక్కడ పెట్టి క్రిందికి దిగివచ్చాడు. బహుశా అతడికి మరో పని దొరకలేదు. అంచేత గదిలో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులే వుండిపోయారు. దేవదాసు తన ముఖం పైకెత్తి నీవు నిన్ను దర్శించినందుకు రుసుం తీసుకుంటావా?" అని అడిగాడు.
చంద్రముఖి వెంటనే ఏమీ జవాబివ్వలేదు. ఇప్పుడు ఆమె వయసు ఇరువది ఆరు సంవత్సరాలు. ఈ పది సంవత్సరాలలో ఆమెకు ఎంతోమంది విభిన్న స్వభావాలు గల వ్యక్తులతో ఘనిష్ఠమైన పరిచయం ఏర్పడింది. కాని ఇటువంటి అద్భుతమైన వ్యక్తిని ఒక్కరోజు కూడా కలుసుకోవడం జరగలేదు. కొంచెం అటూ ఇటూ గడిపి ఆమె అన్నది_"మీ పాదధూళి ఎప్పుడైతే పడిందో_!"
దేవదాసు ఆ మాట పూర్తి కానివ్వలేదు. మధ్యలోనే "పాదధూళి సంగతి కాదు, డబ్బు తీసుకొంటున్నావా?" అన్నాడు.
"అది తీసుకొనకపోతే మా పని ఎలా గడుస్తుంది?"
"చాలు_ఇదే వినదలచుకున్నాను." అని చెప్పి ఆయన పాకెట్ లో నుంచి ఒక నోటు తీశాడు. చంద్రముఖి చేతికిచ్చి వెళ్ళడానికి సిద్దపడ్డాడు. ఒక్కసారి చూడను కూడా లేదు, ఎన్ని రూపాయలిచ్చాడు?"
"ఇంత త్వరగా వెళతావా?" అన్నది చంద్రముఖి వినయంగా.
దేవదాసు ఏమీ మాట్లాడలేదు వరండాలోకి వచ్చి మౌనంగా నిలబడిపోయాడు.
చంద్రముఖికి ఆ ధనం తిరిగి ఇచ్చివేద్దామనే కోరిక ఒకసారి కలిగింది. కాని ఏదో తీవ్రమైన సంకోచం కారణంగా తిరిగి ఇవ్వలేకపోయింది. బహుశా ఆమెకు కొంచెం భయం కూడా కలిగి వుంటుంది. ఇది తప్ప ఆమెకు అనేక నిందలనూ, కళంకాలనూ, అవమానాలనూ సహించే అభ్యాసం వుంది. అంచేత ఉలుకూ-పలుకూ లేకుండా, స్పందన లేకుండా గడప వద్దే నిలబడి వుంది. దేవదాసు మెట్ల మీదగా క్రిందికి దిగిపోయాడు.
మెట్ల దగ్గరే చున్నీలాల్ ను కలుసుకున్నాడు. "ఎక్కడికి వెళ్తున్నావు?" అని అతడు ఆశ్చర్యంగా అడిగాడు.
"వసతి భవనానికి."
"ఎందుకు?"
దేవదాసు ఇంకా రెండు మూడు మెట్లు దిగిపోయాడు.
"నేను కూడా వస్తున్నాను" అన్నాడు చున్నీలాల్.
దేవదాసు దగ్గరకు వచ్చి అతడి చేయి పట్టుకుని "అయితే పద! కొంచెం ఇక్కడే నిలబడి వుండు. నేను పైకి వెళ్ళి ఇప్పుడే తిరిగివస్తాను" అన్నాడు.
"లేదు, నేను వెళ్తున్నాను. నీవు తరువాత రావచ్చు" అని చెప్పి వెళ్ళిపోయాడు.
చున్నీలాల్ పైకి వెళ్ళి చూశాడు. అప్పుడు కూడా చంద్రముఖి అదే విధంగా గడపవద్ద నిలబడి వుంది.
అతణ్ణి చూసి "ఆయన వెళ్ళిపోయాడా?" అని అడిగింది.
"అవును!"
చంద్రముఖి చేతిలోని నోటు చూపించి "ఇది చూడు. దీన్ని తీసుకొని వెళ్ళు, బాగుంటుంది. నీ మిత్రునికి తిరిగి ఇచ్చేసెయ్ అన్నది.
"ఆయన తన ఇష్టంమీదే ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ నేను ఎందుకు తిరిగి తీసికొని వెళ్ళేది?" అన్నాడు చున్నీలాల్.
