లాంచనాలు చదివించే సమయంలో తన మామగారేమీ చదివించలేదు. కట్నం ఇవ్వలేక పొతే మానె, ముచ్చట్లయినా జరపలేడూ? మామగారి పద్దతి చూసిన కొద్ది ఆనందానికి ఒళ్ళు మండుతున్నది. ఎక్కడి కక్కడే జరుపుకొని వస్తున్నాడు. డబ్బు లేకపోతె లేకపోవచ్చు , అల్లుడి కేదైనా చదివించే సరదా అయినా లేదూ? ఇప్పుడాయన పెట్టకపోతే తనకు వచ్చే నష్టం ఏమీ లేదు. తను అయన పెట్టు పోతలకు ఆశించింది లేదు. పది మంది లో అయన గుణం కనిపించి పోయింది. అంతే . పొతే అటువంటి వాడి కూతురి ని చేసుకున్నందుకు తనకు పదిమంది లోనూ చిన్నతనం.
ఇంతలో మాధవరావూ వెండి చెంబు లూ, పట్టు తాపితాలూ తీసుకు వచ్చి ఆనందానికి చదివించాడు. అందరూ తెల్లబోయారు. అందరితో పాటు ఆనందానికి కూడా ఆశ్చర్యం వేసింది. తన మామగారు తనకేమీ ముట్ట జెప్పకుండా ఆ గౌరవ పరిచినా, ఈయన పాపం సమయానికి ఆదుకుని గౌరవం దక్కించారు. కాని ఈయన ఎందుకు చదివిస్తున్నాడు? ఏమిటి సంబంధం'? తన మీద ఈయనకు ఎందుకింత అభిమానం? ఆనందాని కేమీ అర్ధం కాలేదు.
మధ్యాహ్నం బోజనాల దగ్గర ఓ పద్దెనిమిదేళ్ళ అందమైన అమ్మాయి "బావగారు - బావగారు " అంటూ తనను వేళాకోళం చేస్తూ, అన్నపూర్ణ తరపున మాట్లాడటం మొదలు పెట్టింది. సాయంత్రం తనకు ఇష్టం లేకపోయినా, ఆ అమ్మాయే బలవంతం చేసి తనచేత సరిబేసులు, బంతు లాట ఆడించింది. ఆ అమ్మాయి ఎంత ఆకర్షణీయంగా ఉందొ, అంత చలాకీ గానూ ఉంది. 'అడుగడుగునా తనతో వాదిస్తూ, తనను వేళాకోళం చేస్తున్న ఈ అందమైన అమ్మాయి పెళ్ళి కూతురికి ఏమవుతుంది చెప్మా' అనుకున్నాడు ఆనందం.
సాయంత్రం మగపెళ్ళి వారు పుల్లేటి కుర్రు వెళ్ళిపోతారనగా , మధ్యాహ్నం మాధవరావు విడిది లోకి వచ్చాడు. పెళ్ళి బడలిక చేత అంతా నిద్రపోతున్నారు. మడత మంచం మీద తలగడా మాత్రం వేసుకుని వెంకట్రామయ్య కూడా విడిది లో ఓ వార పడుకున్నాడు. ఇంక ఎటొచ్చీ ఆలోచనల బరువుతో నిద్దర పట్టక మేలకువుగా ఉన్నది ఒక్క ఆనందం మాత్రమే. పొతే, పెరట్లో పిల్లలందరికీ తాటాకు బొమ్మలు కట్టి ఇస్తూ జానకి మెలకువగా ఉంది.
'అంతా నిద్దర పోయినట్లు న్నారు" అన్నాడు మాధవరావు.
"లేదు రండి, రండి" అన్నాడు ఆనందం.
"మీరు పడుకోలేదా? ఏం తోచటం లేదేమో. పోనీ అలా మా ఇంటికి వెళదాం ఓమారు రండి" అన్నాడు మాధవరావు.
"అలాగే" అని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని, పెరట్లో కి వెళ్ళి మొహం రుద్దుకుంటుంటే , "ఎక్కడికి మామయ్యా ప్రయాణం?' అంది జానకి.
"ఇక్కడికే , నువ్వూ వస్తావా?' అన్నాడు ఆనందం. "ఓ!" అంది జానకి. అయిదు నిమిషాల్లో తెమిలి మాధవరావు తో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇద్దరూ.
"ఏమిటండి ఈ హడావుడి అంతాను ఇంటి అల్లుడికి లాగా?" అన్నాడు ఆనందం, టేబిల్ మీద వెండి పళ్ళేలలో పెట్టిన బిస్కెట్లు, యాపిల్ బంగిన పల్లి మామిడి , అనాస పళ్ళ ముక్కలూ చూసి.
"అదే జరగవలసింది కొద్దిలో తప్పిపోయింది కాని" అన్నాడు మాధవరావు కళ్ళజోడు చేత పట్టుకుని తుడుచుకుంటూ. ఆనందరావు కు అర్ధం కాక తెల్లబోయి చూశాడు. కూర్చోవాలో నిలబడాలో నిర్ణయించు కోలేక తికమక పడుతూ అక్కడి సోఫా సెట్ల నూ, గోడకు ఉన్న సీనరీ లనూ చూస్తున్న జానకిని చూసి "కూర్చో అమ్మా. మా అమ్మాయిని కూడా పిలుస్తాను" అని బిగ్గరగా "తల్లీ, జ్యోతీ!" అన్నాడు మాధవరావు.
హాల్లోకి ప్రవేశించిన జ్యోతి ని చూసి "ఓహో ! పొద్దుట నుంచీ నన్ను ఆకర్షించిన ఈఅమ్మాయి ఈయన కూతురా!' అనుకున్నాడు ఆనందం. జ్యోతి ఆనందాన్ని చూసి ఓ చిరునవ్వు నవ్వి, జానకిని పలకరించింది. కొంచెం సేపయేసరికి జ్యోతి , జానకీ ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్న వాళ్ళ లాగ మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొంచెం సేపు ఊరుకుని మాధవరావు అన్నాడు. "అసలు మీ బాబయ్య చూసింది మా జ్యోతినే మొదట."
ఆ మాట ఆనందానికి ఆశ్చర్యం కలిగించింది. 'ఏమిటీ! మొదట జ్యోతిని చూసే, ఈ అన్నపూర్ణ ను నిర్ణయించాడా? ఏమిటి బాబయ్య ఇలా చేశాడు? ఏ రకంగా చూసినా జ్యోతే శతవిధాల అన్నపూర్ణ కంటే మిన్న. చదువు, సంస్కారం , అందం, డబ్బు అన్నీ ఉన్న ఈ సంబంధం కాదని, ఏమీలేని ఒక దరిద్రపు సంబంధం చూడడం లో బాబయ్య ఉద్దేశం ఏమిటి? బాబయ్య చేసిన పనికి ఏదో బలీయమైన కారణం వెనక ఉండి తీరుతుంది. ఏమై ఉంటుంది ఆ కారణం?"
ఇలా ఆలోచిస్తున్న ఆనందానికి మాధవరావు హెచ్చరిక వినిపించనే లేదు. "ఏమిటి మీరూ ఆలోచిస్తూ ఉండి పోయారు? ఫలహారం తీసుకోండి" అని తిరిగి హెచ్చరించాడు.
"ఆ-- ఆ" అంటూ తనలో కలిగిన ఈ సంచలనాన్ని రేగిన గాలి దుమారాన్నీ పైకి కనిపించ నీకుండా చిరునవ్వు వెనకాల దాచడానికి ప్రయత్నించాడు ఆనందం.
"మీరు తీసుకోకపోవడంతో మీ మేనకోడలు కూడా తీసుకోవటం లేదు చూడండి" అన్నాడు మాధవరావు.
ఆనందం అటు వైపు చూశాడు. జానకి పక్కన కూర్చున్న జ్యోతి కూడా సరిగా అదే సమయానికి ఆనందం కేసి చూసింది. ఆనందం హృదయం ఝల్లుమంది. బరువుగా కన్నులు దించేసుకుంది జ్యోతి. బలవంతం మీద ఒకటి రెండు ముక్కలు జానకి చేత తినిపించి "నేనే నెగ్గాను డాడీ. నువ్వు ఓడిపోయావు . జానకి చేత టిఫిన్ తినిపించాను." అంది జ్యోతి ఓరగా ఆనందం కేసి చూస్తూ.
"నో, నో, మేము ఆడవాళ్ళ కు తీసిపోతామేమిటి? పందెం. ఎవరెక్కువ తినిపిస్తారో! మిస్టర్ ఆనంద్! ఈ రెండు ముక్కలూ రుచి చూడండి" అన్నాడు మాధవరావు గంబీరంగా అభినయిస్తూ.
ఆనందానికి నవ్వు వచ్చింది. తన చేత టిఫిన్ తినిపించడానికి తండ్రీ కూతురూ ఏం నాటకం ఆడుతున్నారు?
"పోన్లెండి . ఓడితే ఓడాము. ఆడవాళ్ళు నెగ్గడం లోనే అందం ఉంది. " అన్నాడు ఆనందం కంటి చివర నుంచి జ్యోతి వేపు చూస్తూ.
"ఆడవాళ్ళు నెగ్గడమే! ఒక్కనాటికీ వీల్లేదు."
"ఏం?' అంది కోపాన్ని నటిస్తూ జ్యోతి.
"అసలు ఆడవాళ్ళ కు ఓడిపోవడమే జన్మ హక్కు. అలా నిత్యమూ ఓడిపోతున్నా, పట్టపగ్గాలు లేకుండా ఉన్నారు. ఇంక నెగ్గడం అంటూ వస్తే వేరే అడిగారా?"
ఆనందానికి మాధవరావు మాట తీరు చూస్తుంటే ఇంకా ఇంకా వినాలనిపించింది. కొత్తవాడనే శంకా సంకోచాలు లేకుండా, ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నట్లు ఆ మాట్లాడటమూ, మాటలో ఎంతో ఒంపూ , సోంపూ -- వీటన్నిటినీ మించిన ఆప్యాయతా అతన్ని ఆకర్షించాయి.
అప్పటిదాకా మౌనంగా ఊరుకున్న జానకి "ఓడిపోవడం ఆడవాళ్ళ జన్మ హక్కు కాదండి" అంది ఉన్నట్టుండి. అందరూ ఆశ్చర్యంగా ఆమె కేసి చూశారు.
"తను ఓడిపోయి అయినాసరే పురుషుడ్ని గెలిపిస్తుంది స్త్రీ. అతని విజయంలోనే ఆనందం చూడగలిగే ఔదార్యం ఆమెకుంది. మీరా ఔదార్యాన్ని బలహీనతగా జమకడితే ఎలా?"
పదిహేను సంవత్సరాలైనా పూరిగా నిండని తన మేనకోడలు జానకి హటాత్తుగా ఇంత విజ్ఞానాన్ని ప్రదర్శించడం ఆనందానికి ఆశ్చర్యమే కలిగించింది.
మాధవరావు నవ్వి "ఇంత బాగా మాట్లాడి నందుకు నీ కొంకో నాలుగు యాపిల్స్ ప్రేజెంటు" అన్నాడు.
'అమ్మ బాబోయ్! ఇప్పటికే కడుపు నిండి పోయింది. ఇంత ప్రమాదం వస్తుందంటే అసలు నోరు విప్పకేపోదును" అంది జానకి.
"నోరు విప్పావు కనకే రెండు ముక్కలు నోట్లో వేసుకో మంటున్నాము." అంది జ్యోతి.
"ఆ మాటే నేనూ అంటున్నాను" అంది జానకి.
"ఆ?" అంది జ్యోతి.
వెంటనే ఓయాపిల్ ముక్క జ్యోతి నోటిలో వేసింది జానకి.
ఆనందం చప్పట్లు కొట్టాడు. మంచి నీళ్ళు తాగుతున్న మాధవరావు కు పలక మారింది. జ్యోతికి ఉక్కిరిబిక్కిరి అయింది. జానకి ఏమీ ఎరగనట్టు ఇంకో పక్కకు చూస్తూ పెల్లుబికి వస్తున్న నవ్వును అతి కష్టం మీద అపుకోంది.
కొంతసేపు అయాక ఆనందం లేచాడు. జానకి కూడా బయలుదేరింది. "మా వాళ్ళంతా మాకోసం ఈపాటికి వెతుక్కుంటూ ఉంటారు. ఈ సాయంత్రమే మా ప్రయాణం . శలవు." ఆన్నాడు ఆనందం.
"ఆ. ఒక్క మాట. మీ ఎరికిన ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి మా జ్యోతికి" అన్నాడు మాధవరావు.
"మంచి అంటే?' ఆనందరావు జ్యోతి కేసి చూస్తూ అన్నాడు.
"అంటే.......అంటే మీలాంటి వాడు అన్నమాట!"
"నాలాంటి వాడా?"
"ఊ!"
"నాలాంటి వాడు వేరే ఇంకొకడు ఎలా ఉంటాడు? నాలాంటి వాడినే చేసుకోవాలంటే నన్నే చేసుకోమనండి...."
మాధవరావు పకపకా నవ్వేశాడు. ఆనందం ఆ నవ్వులో శ్రుతి కలిపాడు. జానకి ఉలిక్కి పడింది. జ్యోతి రివ్వున ఇంట్లోకి పారిపోయింది.
