
9
గట్టు లంకలకు మనుష్యులను పురమాయించి, ఆకుమడి దున్నడానికి రెండు అరవలు కట్టించి వెంకట్రామయ్య ఊళ్ళో కి బయలుదేరబోతుంటే "ఉండండి , బాబయ్యా. డొంకి ణీతో రెండు పుల్ల మామిడి కాయలు కోసిస్తాను. పప్పులో ఏయిద్దురు గాని" అన్నాడు వీరిగాడు.
తనకు పప్పూ, మామిడి కాయా ఇష్టం అని వాడికి తెలుసు. తన కేమిటి? ఇంట్లో విశాలాక్షి కీ, ముకుందానికి, ఆనందాని కి -- అందరికీ కూడా వెల్లుల్లి పాయ పోపు వేసిన పప్పూ మామిడి కాయా అంటే మహా ఇష్టం. ఇంక అందులో నంచుకోవడానికి కొత్తగా వేసిన మెంతి బద్దలూ, చల్లలో వేసిన మిరపకాయలూ , వడియాలు ఉంటె వేరే చెప్పక్కరలేదు. తినే అన్నం అంతా దానితోనే తింటారు.
ఇలా అందరి అభిరుచులూ , అలవాట్లూ తెలిసిన వీరిగాడు రెండు రోజులకో మాటు మాగాయ చెట్టు కాయలు కోసి తెస్తు ఉండటమూ, పసందు గా విశాలాక్షి వండటమూ ప్రతి ఏడూ ఆరోజుల్లో జరిగే కార్యక్రమమే.
మనిషికి ఉన్న జిహ్వ చాపల్యానికి నవ్వుకుంటూ వెంకట్రామయ్య "సరే, కొయ్యి" అన్నాడు. గుత్తులుగా రెండు కోసి, సోన నేలకు రాసేసి "నడవండి" అన్నాడు వీరిగాడు .
"నువ్వెందుకు? నే పట్టుకు వెళతాలే. ఇలా ఇయ్యి. సత్తెయ్య కూడా లేడు కదా? పనివాళ్ళని చూసుకో. ఆకూ మడిలో చాలు బాగా కలవాలని చెప్పు."
"అలా బోదెగట్టు దాకా తెస్తాను. తర్వాత పట్టు కేళుదురు గాని."
ముందు వెంకట్రామయ్య , వెనకాల వీరిగాడు నడుస్తున్నారు.
"ఊ! పెళ్ళి బాగా జరిగిందన్నమాట అన్నవరం కొండ మీద."
"సిత్తం. మీరన్నట్టు టిక్కెట్టు కొంటేనే కాని, కొండ మీద పెళ్ళి ఈల్లెదన్నారు."
"నే చెప్పానుగా?"
"టిక్కెట్లూ, భోజనాలు, చీరలూ, జామార్లూ అన్ని కర్చులూ పోగా మీరిచ్చిన దానిలో ఇంకా తొమ్మిది రూపాయలు మిగిలాయండి."
"అది పెట్టి నువ్వో జామారు కొనుక్కో."
"నేనా? ముసిలోడికి నాకేముంటే ఎళ్ళిపోదండీ? మీరిచ్చిన పాత పంచేలె ఇంకా రెండు సందువా పెట్టెలో ఉన్నాయండి."
తృప్తి వల్ల మనిషికి వచ్చే సౌఖ్యం ఇంతటి దన్నమాట! వెంకట్రామయ్య కు లోకం వింతగా తోచింది. లేనివాళ్ళూ, ఉన్న వాళ్ళూ అంటూ పెద్ద హంగామా చేసి, అరుపులూ, నినాదాలు నిరసన ప్రదర్శనలూ చేస్తారు కాని, నిజం ఆలోచిస్తే ఒకళ్ళు తక్కువ తిన్నది లేదు; ఇంకొకళ్ళు ఎక్కువ తిన్నది లేదు. ఒకడు గంజి తాగితే ఇంకొకడు పరమాన్నం భుజిస్తాడు. గంజి కి, పరమాన్నానికి ఉన్న ఖరీదులు బేరీజు వేస్తె ఏమో కాని, నిజానికి ఆ రెండూ ఇచ్చే ఆనందం లో తేడా ఏమీ లేదు. గంజి తాగినప్పుడు బీదవాడు పొందిన ఆనందానికీ, పరమాన్నం భుజించి నప్పుడు భాగ్యవంతుడు పొందిన ఆనందానికీ తేడా ఏమిటి?
ఇంతలో వాళ్ళు బోదె గట్టు దగ్గరికి వచ్చారు. వీరిగాడు ఆగి "బాబయ్యా " అన్నాడు. వెంకట్రామయ్య ప్రశ్నార్ధకంగా వాడి కేసి చూశాడు.
"ఆనందం బాబుగారి భార్యని మనుగుడుపులకి తీసుకు రాలేదేం?" అన్నాడు వీరిగాడు.
దానితో వెంకట్రామయ్య కు జరిగినదంతా జ్ఞాపకం వచ్చి ఒక్కమారు మనస్సంతా వికలం అయింది. "అదలా జరిగిందిలే!" అని ముక్తసరిగా జవాబు చెప్పి మామిడి గుత్తులు చేత్తో అందుకుని ఊరి వైపు నడక సాగించాడు వెంకట్రామయ్య ఆలోచనల బరువుతో.
పెళ్ళి అయి పెద్దాపురం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు "పెళ్ళి కూతురిని మనుగుడుపులకి తీసుకు వచ్చే ఆనవాయితీ మాకు లేదు" అంది విశాలాక్షి పెళ్ళి వారితో. "అదేమిటమ్మా?" అంటూ తను కలగ జేసుకో బోయాడు. వెంటనే ఆనందం "నువ్వు ఊరుకో బాబయ్యా" అన్నాడు తన వైపు అదోలా చూస్తూ.
'ఆనవాయితీ లేదంటా రేమిటి వీళ్లు?' అంటూ తనలో తను మధనపడుతూ ఉంటె విశాలాక్షి తేల్చేసింది -- " ప్రస్తుతానికి పెళ్ళి కూతురిని మా ఊరు తీసుకెళ్ళే ప్రసక్తి లేదు. తర్వాత ఎప్పుడో చూద్దాం" అని.
తనకే కాదు. రామదాసుకు కూడా ఆ మాటల్లో ఏదో అపశ్రుతి వినిపించింది. 'అంటే....." అంటూ పాపం రామదాసు నీళ్ళు నమిలాడు. "మేము తర్వాత కబురు చేస్తాం లెండి" అన్నాడు ముకుందం. "అదే....మరేం లేదు...వచ్చే మాసం శూన్యమాసం ...అందుకని...." రామదాసు మాటలు పూర్తీ చెయ్యకుండానే "మేము కబురు చేస్తామని చెప్పాం కదండీ?' అంది విశాలాక్షి విసుగుగా. "అదేమిటమ్మా పెద్ద వాళ్ళతోటి అలా మాట్లాతావు?" అన్నాడు తను. తనకేసి రుసరుసా చూస్తూ "నీ బండి రెడీగా ఉంది. నువ్వెళ్ళి ముందు బండి ఎక్కు" అన్నాడు ఆనందం. ఇంకెవరినీ ఒక్క ముక్కయినా మాట్లాడనియ్యకుండా విశాలాక్షి , ఆనందం, ముకుందం కలిసి సంగతి అక్కడి తోటి ఆపుచేసి బళ్ళు ఎక్కి "పోనీయండోయ్ " అన్నారు. ఏమీ మాట్లాడటానికి తోచక రామదాసు ఊరు పొలిమేర దాకా బళ్ల వెనక నడిచి వచ్చి "మరి ఇంక ఉంటా నండి" అన్నాడు. బళ్ళు దూరమయి పోతుండగా దూరాన నిలబడ్డ రామదాసు పంచె చెంగు తో కళ్ళు ఒత్తుకోవడం తనకు కనిపించింది. పాపం! ఆడపిల్ల నిచ్చుకున్నవాడు! పిల్ల కాపురం ఏమవుతుందో అని బెంగ. ఆ పరిస్థితిలో అతనికి మాట ధైర్యం అయినా ఇవ్వలేకపోయిన తన నిస్సహాయ స్థితికి తనమీద తనకే అసహ్యం వేసింది. దారిలో తనతో ఎవ్వరూ సరిగా మాట్లాడలేదు. ముభావంగా మూతులు ముడుచుకు కూర్చున్నారు. తను రెండు మూడు సార్లు పలకరించినా ముక్తసరిగా జవాబు చెప్పారు. ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు? తన మీద వీళ్ళ కేమైనా కోపం వచ్చిందా? అయితే సంగతి చెప్పవచ్చునే. పసికందులుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళను పెంచుతూ వచ్చాడే తను? తనతో వాళ్ళు అంత ముభావంగా ఉంటె తన మనస్సెంత తల్లడిల్లిపోతుందో ఊహించరేమిటి? చుట్టాలు ఒక్కొక్కరే వెళ్ళి పోసాగారు. పెద్దాపురం నుంచి పుల్లేటి కుర్రు వచ్చి అప్పటి కి అయిదారు రోజులయింది. చుట్టాలు వెళ్ళి పోవడంతో ఇంటిలో కూడా హడావుడి తగ్గింది. కాని తనపల్ల వాళ్ళ ప్రవర్తన మాత్రం అలాగే విపరీతంగా ఉంది.
వెంకట్రామయ్య ఇంటికి వస్తూనే మామిడి కాయలు వంటింటి గుమ్మం లో పెట్టి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని హాల్లోకి వచ్చాడు. తన పడక కుర్చీ అక్కడ కనిపించలేదు. ఇప్పటికి నలభై , యాభై సంవత్సరాలయి ఆ కుర్చీని ఎవరూ కదపలేదు.
ఇల్లు కడిగించి నప్పుడు తప్ప, ఆ కుర్చీ ఎప్పుడూ అక్కడే ఉండేది. తన అన్నగారు ఎప్పుడూ ఆ కుర్చీలో వీధి గుమ్మానికి ఎదురుగా కూర్చునే వారు. ఆ తర్వాత ఈ ఏడెనిమిది ఏళ్ళ నుంచీ తను కూర్చుంటున్నాడు. ఇప్పుడా కుర్చీని కదపవలసిన అవసరం ఏం వచ్చింది? వెంకట్రామయ్య గట్టిగా అరిచాడు. "ఎవరర్రా కుర్చీని ఇక్కడ నుంచి తీశారు? ఎవరూ జవాబు చెప్పలేదు. అసలు ఇంట్లో మనుష్యులు ఉన్న అలికిడే లేదు. "మిమ్మల్నే ! ఎవరూ పలకరెం?' అన్నాడు మళ్ళీ.
"ఆ. ఏమిటి?" అంటూ చేతిలో పెన్ మూసివేస్తూ ముకుందం పడమటింట్లో నుంచి వచ్చాడు.
"ఈ కుర్చీ తీసిందేవరు?"
"నేనే" నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు ముకుందం. ఆ కంఠస్వరం వెంకట్రామయ్య కు వింతగా అనిపించింది.
"ఏం -- ఎందుకు తీశావు?"
"వ్రాసుకోడానికి బాగుంది. అందుకు పడమటింటి లో వేశాను" ఆ సమాధానం లోనే, అది ఇంతలో హాల్లోకి రాదు అనే భావం కూడా ద్యోతకం చేశాడు.
"సరే" అని దీర్ఘంగా శ్వాస వదిలి "నువ్వెళ్ళి రాసుకో. ఆనందం, ఓ కుర్చీ తెచ్చి హల్లో వెయ్యి" అన్నాడు వెంకట్రామయ్య. ముకుందం అక్కడ నుంచి కదలనూ లేదు; ఆనందం కుర్చీ పట్టుకొని రానూ లేదు. కొంచెం సేపు ఊరుకొని వెంకట్రామయ్య వీధి గదిలోకి వెళ్ళాడు. అక్కడ టేబిల్ మీద కాళ్ళు పెట్టుకుని కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు ఆనందం.
"ఇక్కడ ఉండే పలకవేమిరా?" అన్నాడు వెంకట్రామయ్య. ఆనందం తల తిప్పి శూన్యం గా అతనికేసి చూసి ఊరుకున్నాడు.
"పెళ్ళి రోజు నుంచీ చూస్తున్నాను. ఈ అయిదారు రోజుల నుంచీ మీ ప్రవర్తన వింతగా కనిపిస్తోంది. ఆ ముభావం ఏమిటి? ముక్తసరి ఏమిటి? మనసు విప్పి మాట్లాడక పోవడం ఏమిటి? ఏమిటిదంతా? నాకేం అర్ధం కావటం లేదు." గట్టిగా కేకలు వేయసాగాడు హాల్లోకి వస్తూ వెంకట్రామయ్య. పప్పు పొయ్యి మీద పడేసి మామిడి కాయలు ముక్కలు తరుగుతున్న విశాలాక్షి ఆ కేకలు విని హాల్లోకి వచ్చింది. తాతయ్య గారి కని కాఫీ వెచ్చ బెడుతున్న జానకి ఆ వేడి గ్లాసు తో అలాగే వచ్చేసింది.
"ఏమిటా కేకలు?' అంది విశాలాక్షి.
"అది! పైగా నావి కేకకు, అవునా?"
"అసలు ఏమి జరిగింది?"
"అదే నేనూ అడుగుదా మనుకుంటున్నా. ఏం జరిగిందని మీరందరూ ఇలా ముభావంగా ఉంటున్నారు నాతొ.
విశాలాక్షి మాట్లాడలేదు. తల వంచుకుని ఏదో ఆలోచిస్తున్నది. ముకుందం కాలు ఆడిస్తూ నిర్లక్ష్యంగా ఇంటి పై కప్పు కేసి చూస్తున్నాడు. వెంకట్రామయ్య కు ఒళ్ళు చిరచిర లాడిపోతున్నది.
"తాతయ్యా , కాఫీ తీసుకో" అంది జానకి. వెంకట్రామయ్య తీసుకోలేదు. ఒక్క క్షణం ఊరుకుని "ఒక్కళ్ళూ మాట్లాడ రేమిటి? ఏరా, ఆనందం?" అన్నాడు గట్టిగా.
"ఏమిటే?" అంటూ తాపీగా హాల్లోకి వచ్చాడు ఆనందం.
"అయిదారు రోజులాయి చూస్తున్నాను. మీ ప్రవర్తనేమీ నాకు అర్ధం కావటం లేదు. మీ ముగ్గురూ ఎందుకిలా మొహాలు మాడ్చుకుని కూచుంటూన్నారు?"
"మరోలా ఉండటం చేతకాక" అన్నాడు వెటకారంగా ముకుందం.
"ఏమిటా తలబిరుసు సమాధానం? ఎదిరిస్తున్నావు? అప్పుడే పెద్దవాడివి అయిపోయావనుకున్నా వేమిటి?"
"నువ్వుండగా వాడేందుకు పెద్ద వాడవుతాడు? ఒకవేళ అయినా, నువ్వు అవనిస్తావా?" అంది ఎత్తి పొదుపుగా విశాలాక్షి. తను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్న విశాలాక్షి ! తన ప్రాణానికి ప్రాణంగా మసులుతున్న అమ్మాయి దగ్గర నుంచి అటువంటి సమాధానం వస్తుందని కలలో కూడా అనుకోలేదేమో; మొదట్లో వెంకట్రామయ్య ఉలిక్కిపడ్డాడు. ఇంతలోనే సంబాళించుకొని "ఏమిటీ తల్లీ నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు?' అని మాత్రం అనగలిగాడు.
"అవును మరి , నీలాగ చేతలు చేసే తెలివి తేటలు లేకపోయాక , మేము చెయ్యగలిగింది అదొక్కటేగా?' విశాలాక్షి ఆనందం కేసి ముఖం తిప్పి, వెంకట్రామయ్య ను ఉద్దేశించి అంది.
"చేతలు చేసే తెలివి తేటలా? నేనిప్పుడెం చేశానని?"
ఎవరూ మాట్లాడలేదు.
"చెప్పండి. ఏమీ సంకొంచించవద్దు. మనస్సులో పెట్టుకుని బాధ పడటం కన్నా , మనలో మనం చర్చించుకుని మనస్సు తేలిక చేసుకోవడం మంచిది."
ఎవరూ సమాధానం చెప్పలేదు.
"నువ్వు చెప్పు, ముకుందం . నేను చేసిందేమిటి?" అన్నాడు వెంకట్రామయ్య.
"హు!' అంటూ నిట్టూర్పుతో కూడిన వెటకారపు చిరునవ్వు విసిరాడు ముకుందం.
వెంకట్రామయ్య కు ఒళ్ళు మండిపోయింది. "ఎందుకిలా నన్ను చిత్రహింస చేస్తారు? జరిగింది ఇది అని చెప్పకూడదు?" అంటూ గట్టిగా అరిచాడు.
"గట్టిగా కేకలు వెయ్యకు. ఆ తల్లీ తండ్రి లేని పిల్లలు వాళ్ళ బాబయ్య తో ఏదో ఘర్షణ పడుతున్నారు అనుకుంటుంది లోకం" అంది విశాలాక్షి.
"లోకం. హు!" అంటూ నీరసంగా నవ్వాడు వెంకట్రామయ్య.
'అవును. నీకు లోకం లెక్కలేదు. పైగా అన్నిటికీ తోడూ ప్రపంచం లో మా పరువు కూడా పొతే నీ కళ్ళు చల్లగా ఉంటాయు." అన్నాడు ముకుందం.
ముకుందం మాట పూర్తీ కాకుండానే, శరీరం అంతా వణుకుతూ ఉండగా పిడికిలి బిగించి "ముకుందం!" అని ఒక్క అరుపు అరిచాడు వెంకట్రామయ్య.
జానకి బావురుమంది. విశాలాక్షి ఆ కేకకు వణికి పోయింది. ఆనందం తెల్లబోయాడు. ముకుందం మాత్రం నిశ్చలంగా "ఏం?' కొడతావా?" అన్నాడు.
"పది పదిహేనేళ్ళ వయస్సు వాదివయితే అ పనే చేద్దును. ఇలా తెలివి తక్కువగా మాట్లాడి నందుకు." వెంకట్రామయ్య కంఠం ఇంకా వణుకుతూనే ఉంది.
