Previous Page Next Page 
కౌసల్య పేజి 13

 

                                        8
    విడిది లో నుంచి బయలుదేరి ఊరేగి, పెళ్లికి వెళ్ళాలి పెళ్లి కొడుకు. ముహూర్తం ఇంక రెండు గంటలు మాత్రమే ఉంది. "తెమలండి , తెమలండి." అని ఒకరి నొకరు హెచ్చరించు కుంటూ మగపెళ్లి వారందరూ హడావిడి గా ఉన్నారు. బయట పల్లకీ సిద్దంగా ఉంది. మేళం వాళ్లు కూడా నిలబడి ఉన్నారు. ముందు వసారా లో మాత్రం సన్నాయి మేళం సాగుతున్నది. వాళ్ళను కళ్యాణి వాయించ,మనీ, కాంభోజి వాయించమనీ ఉండి ఉండి ఆదేశిస్తున్నాడు ముకుందం. చాకింటి బట్టలూ, మడత కండువాలూ వేసుకుని మగవాళ్ళంతా కుర్చీలలో తయారుగా కూర్చున్నారు. ఊరేగింపు కి ఏ చీర కట్టుకోవాలో, దానికి తగిన రవికె ఏది తోడుక్కోవాలో నిర్ణయించు కోలేక కొట్టు మిట్టాడిపోతున్నారు లోపల ఆడవాళ్ళు. మంచి బట్టలు వేసుకొని కొబ్బరి ఆకు బూరాలు ఊదుకుంటూ , ఒకళ్ళ నొకళ్ళు తరుముకుంటూ ఆడుకుంటున్నారు పిల్లలందరూ.

                
    గంధం, అత్తరు బ=వాసనలతో కలిసి స్తంభాలకు కట్టిన పచ్చి కొబ్బరి ఆకుల వాసనా, పందిరి మీద వేసిన కొత్త తాటాకుల వాసనా కొత్త గుబాళింపు ను ఆ పరిసరం అంతా పరుస్తున్నాయి. పురుషుల విసుగూ, పడతుల విదిలింపూ , పసివాళ్ళ కేకలూ ఏడుపులూ , పనివాళ్ళ అరుపులతో ఒకళ్ళ మాట ఇంకొకళ్ళ కు వినిపించనంత హడావిడిగా ఉంది విడిది అంతా.
    "పల్లకి లో వెయ్యడానికి చలవ మడత కావాలి." అని పల్లకీ బోయీలు అడిగి పది నిమిషాలు అయింది. వెంకట్రామయ్య ఈ పది నిమిషాల నుంచి పనిమనిషి ఎవరేనా కనిపిస్తాడేమో అని చూస్తూ ఉన్నాడు. ఎవళ్ళ మట్టుకు వాళ్ళే హడావిడిగా అటూ ఇటూ తిరగడమే తప్ప, పిసరంత పని కానీ, సాయం కానీ చేస్తున్నట్లు అనిపించలేదు వెంకట్రామయ్య కు. "వీరి గాడూ, సత్తేయ్యా లేని లోటు పూర్తిగా తెలుస్తున్నది. వాళ్ళకూ ఇప్పుడే వచ్చింది ముహూర్తం. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి సుందరమ్మ, సత్తేయ్యా కొత్త దంపతులు అన్నవరం నుంచి వచ్చి ఉంటారు.' -- ఇలా అనుకుంటూ వెంకట్రామయ్య తనే వెళ్ళాడు లోపలికి విశాలాక్షి ని కేక వేద్దామని.
    ఎన్ని గదులు తిరిగినా విశాలాక్షి కనిపించలేదు వెంకట్రామయ్యకు. "జానకిని తీసుకుని పెళ్ళివారింటి కెళ్ళింది పెళ్ళి కూతుర్ని చూడటానికి" అన్నారెవరో. వెంకట్రామయ్య వెళ్ళి ఆనందం పక్క కుర్చీలో కూర్చున్నాడు.
    మనిషి అయితే అక్కడ ఉన్నాడు కానీ ఆనందం మనస్సు మాత్రం ఏ దివ్య లోకాలలోనో ప్రయాణం చేస్తున్నది. 'ఇంకో గంటలో తను గృహస్థుకాబోతున్నాడు. జీవితంలో ఇంకో కొత్త ఘట్టం ప్రారంభం అవుతున్నది. కొత్తదే కాదు; చాలా ముఖ్యమైంది కూడాను. తన చదువు, సంస్కారమూ ఉపయోగించి దాంపత్య జీవితాన్ని ఆదర్శ వంతంగా నడుపుకోవాలి. అసలు మానవజీవితం లోని వివిధ రంగాల్లో సాధించే విజయాలన్నీ ఈ ఒక్క రంగం లోని విజయం మీదే ఆధారపడి ఉంటాయి. ఇల్లు నరకం అయితే ఇలా తలమే నరకం అవుతుంది అన్నాడు వెనకటికో ఇంగ్లీషు రచయిత ఎవరో!
    'తన జీవిత భాగస్వామిని కాబోతున్న ఈ అమ్మాయి వివరాలేమీ తనకు తెలియవు, ఒక్క పేరు తప్ప. అన్నపూర్ణ! పేరు కొంచెం పాతగా ఉన్నా ఇప్పటి కాలానికి తగినట్టు పూర్ణ ని మార్చుకోవచ్చు. ఏం చదువు కుందో! అభిరుచు లేమిటో! అలవాట్లు ఎటువంటివో! తనకూ ఆమెకూ సమానమైన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయో, లేవో! ఏ అర్హతలు లేకపోయినా సరే. సంస్కారం మంచిదయితే చాలు. జీవితం ఎన్ని ఒడుదుడుకుల్లోకి వెళ్ళినా చివరకు మాత్రం సరైన బాటలోకే వస్తుంది అంటూ ఉంటాడు బాబయ్య. పోనీ ఆ సంస్కారమైన ఎలాంటిదో అన్నపూర్ణది?' ఇలా సాగుతున్న ఆనందం ఆలోచనలను విశాలాక్షి కేక భంగ పరిచింది.
    విశాలాక్షిని చూస్తూనే వెంకట్రామయ్య 'అమ్మాయీ, ఎక్కడి కెళ్ళావు? పల్లకీ వాళ్ళు చలవ మడత కావాలంటున్నారు, చూడు ' అన్నాడు. విశాలాక్షి ఆ మాట లేవీ విననట్టే మొహం పక్కకు పెట్టి "తమ్ముడూ , ఇలా ఓ మాటురా" అని ఆనందాన్ని కేకవేసి దూరంగా తీసుకు వెళ్ళింది.
    "మీ అత్తవారు చాలా బీదవాళ్ళు తెలుసా?" అంది.
    ఆనందరావు కు నవ్వు వచ్చింది. "అయితే?" అన్నాడు.
    "అదేమిటిరా . అంత తేలికగా తీసేస్తావు? మన అంతస్తు కూ , వాళ్ళ అంతస్తు కూ అసలేమీ పోలికే లేదు."
    "ఉహూ" అన్నాడు ముభావంగా ఆనందం.
    "పైగా పిల్ల ఏమంత రూపసి కాదు."
    "అందంలో ఏముంది లే విద్యా సంస్కారాలుండాలి గాని."
    "అవీ పూజ్యమే!"
    "ఆ!"
    'అమ్మాయి అయిదో క్లాసు మాత్రమే చదివిందిట!"
    "నిజంగా?"
    "ఒక లోటు ఉండచ్చు. రెండు లోట్లు ఉండచ్చు. కాని అన్నీ ఈ రకంగానే ఉన్న సంబంధం ఎక్కడ దొరికిందో బాబయ్య కి?"
    "తొందర పడకు. బాబయ్య వింటే నొచ్చుకుంటాడు."
    "అలా అని ఊరుకుంటే ఎలా?"
    "లేకపోతె ఏం చేద్దామని? తీరా ముహూర్తానికి బయలుదేరుతూ ఇలాంటి వంకలు పెడితే , మనకూ పరువు తక్కువ, బాబయ్య కూ తలవంపులు."
    "అందుకని?"
    "అందుకని ఎవరితోటి అనద్దు. మాట్లాడక ఊరుకో. ఏది ఎలా జరగాలని ఉంటె అలా జరుగుతుంది. ' అంటూ ఆనందం పందిట్లో కి వచ్చేశాడు.
    పెళ్ళికి ముందు ఎదురు సన్నాహం వేళ పానకాలు తాగుతుండగా ఓ సిల్కు చొక్కా తొడుక్కున్న పచ్చటి అయన "మొత్తం మీద మా ఊరు సంబంధం తప్పలేదు మీ అబ్బాయికి" అన్నాడు నవ్వుతూ వెంకట్రామయ్య తో.
    "మాధవరావు గారూ, ఇంతకీ ఎవరికి ఎవరు ఘటనో చెప్పలేము. మీకేం కోపం రాలేదు కదా?"
    "ఎంత మాట! భలేవారే! మా జ్యోతి ఒకటీ, అన్నపూర్ణ ఒకటీ నా నాకు?"
    ఆనందానికి ఈ సంభాషణలో తలా తోకా తెలియలేదు. మంగళ స్నానాలయి పెళ్ళి పీటల మీద కూర్చున్నాడన్న మాటే కాని ఆనందం మనస్సు పరిపరి విధాల పోతున్నది. 'ఈ మాధవరావు గారూ, జ్యోతీ ఎవరు? వీళ్ళకూ, తన పెళ్ళికి ఏమిటి సంబంధం?'
    పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. వాళ్ళ మంత్రాలు ఆగినప్పుడల్లా మంగళ వాద్యాలు వాయిస్తున్నారు. తెర అడ్డుకట్టి అవతల వైపున కొబ్బరి బొండంతో పెళ్ళి కూతురిని తీసుకుని వచ్చి పసుపు బట్టతో కూర్చో బెట్టారు. ముహూర్తం సమీపించింది. జీలకర్రా, బెల్లమూ నెత్తి మీద పెట్టి ప్రమాణాలు చేయించారు పురోహితులు ఆనందం చేతా, అన్నపూర్ణ చేతాను. ప్రమాణం చేస్తున్నప్పుడు ఆనందం నోరు తడబడింది. తన శిరస్సు మీద ఒక స్త్రీ హస్త స్పర్శ సోకడంతో ,మున్నెన్నడూ అనుభవించని బాధో, సుఖమో తెలియని ఒక విచిత్రానుభూతిని పొందాడు.
    మంగళ సూత్రం కట్టే సమయంలో చూశాడు అన్నపూర్ణ ముఖాన్ని. అక్కయ్య చెప్పింది నిజమే. ముఖంలో సౌందర్య రేఖ కాని, విజ్ఞానపు వెలుగు కాని ఏమీ లేదు. ఏ రకమైన ఆకర్షణా లేదు ఆమెలో. అయినా వివాహం చేసుకుంటున్నాడు. చేస్తుకుంటున్నాడేమిటి? చేసేసుకున్నాడు. ఆమె నెత్తి మీద చెయ్యి వేసి ప్రమాణం చేసినప్పుడే అయిపొయింది వివాహం. మంగళ సూత్రం కట్టడం అనేది ఊరికే లౌకికమైన తంతు మాత్రమే. యాంత్రికంగా తన విధి తాను నిర్వర్తించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS