9

"క్లాసు కు వస్తున్న లత అప్పుడే ప్రొఫెసరు గారి గదిలోకి పోతున్న గోపీని చూసింది. ఆమె గుండె దడదడ లాడింది. కుడి కన్ను అదిరింది. అక్కడున్న ఫ్యూన్ ను పిలిచి అతడెక్కడి కి వెడతాడో కనుక్కొని వెంటనే తనకు చెప్పమని వెయింటింగ్ రూమ్ కు వెను తిరిగింది.
లోపలికి వచ్చిన గోపీని చూసి ప్రొఫెసరు గారు ఎవరా అని తికమక పడ్డాడు. ఆఫీసర్ లా ఉన్న గోపీని పోల్చుకుని "ఓ రాజ గోపాల్! రా' అని కుర్చీ చూపించి , "బాగున్నావా" అన్నాడు సంతోషంతో. ఎన్నాళ్ళ కో తన శిష్యుడి ని చూసినందుకు , పెద్ద హోదా లో కనబడ్డందుకు ఉప్పొంగి పోయిందాతని మనసు.
"ఏదో మీ దయ వల్ల ఇలాగున్నాను." చిరునవ్వుతో సూటిగా విసిరాడు గోపీ.
ఆ మాట విని ప్రొఫెసర్ గారి ముఖం రంగులు మారింది. చివుక్కుమంది ఆతని హృదయం.
"నువ్వు వచ్చిన పనేమిటో చెప్పు."
గోపీ ఒక కాగితం అతని ముందు ఉంచి 'అతనితో కాస్త మాట్లాడాలి. అనుమతివ్వగలరా?' అన్నాడు.
"ఓ అలాగే. నిరభ్యంతరంగా ' అని కాలింగ్ బెల్ నోక్కాదాయన.
"వెళ్లొస్తాను సార్. థాంక్యూ వెరీ మచ్" అని బయట పడ్డాడు గోపీ.'
రెండు మూడు రోజుల నుండి ఆనంద్ తనతో మాట్లాడడం లేదు. కారణమేమిటా అని ఆలోచిస్తున్న రాజ్, 'మిస్టర్ రాజశేఖరం వాంటెడ్ బై మిస్టర్ రాజ గోపాల్! మీరు వెళ్ళవచ్చు" అన్న లెక్చరర్ అజ్ఞ విని గోపీని కలుసు కోవడానికి ఉత్సాహంగా బయటపడ్డాడు.
చిరునవ్వుతో ఎదురుగా నిలబడి ఉన్న గోపీని చూసి, ఏరా! వెధవా! ఆ మర్నాడే కనిపిస్తానని ఇప్పుడేట్రా వస్తావు?' అన్నాడు.
"ఏం చెయ్యనురా? పనులేక్కువగా ఉండి రాలేకపోయాను. అలా తోటలోకి వెళ్దాం పద. మాట్లాడాలి."
వారెక్కడి కి వెళ్ళింది తెలుసుకు వచ్చి చెప్పిన ప్యూన్ చేతిలో ఓ పావలా పడేసి "నువ్వెళ్ళు" అని వెయిటింగ్ రూమ్ లో ఉన్న అద్దం లో ఓసారి మొహం చూసుకుని తృప్తిగా బయటికి నడిచింది లత.
"ఏమిటిరా విశేషం? ఒకేసారి కాలేజీ కే వచ్చావు?"
"మొదట గది దగ్గరికే వద్దామనుకున్నాను. వీల్లేక పోయింది. అసలు జరిగిన కార్యక్రమం చెప్తాను విను. రాత్రే నీతో ఉదయం మాట్లాడాలని కార్యక్రమం వేసుకొని పడుకొన్నాను. ఈ మధ్య మనం ఏం చెయ్యాలను కొన్నా కార్యక్రమం వేసుకోవాలిలే. ఉదయం పది గంటల అవుతుండగా కాలేజీ కి పోతూ పోతూ మా మరదలు శారద , "బావా! రాత్రి మీ రాజాతో మాట్లాడాలన్నావు కదా! ఇంకా లేవలేదెం 'అంది. అది విని త్వరత్వరగా పనులు ముగించుకుని వచ్చేప్పటికి ఆలస్యమయింది. సాయంకాలం ఎలాగూ తీరిక ఉండదు. ప్రతిరోజూ ఇలా గయితే బాగుండదని సరాసరి ఇక్కడికే వచ్చి మొదట మా గురువుల ఆశీర్వాదం పొందాను. తర్వాత వారి అనుమతితో తమ దర్శన మయింది."
"ఘనకార్యం చేశావు గానీ నీకు మేనరికం ఉందన్న విషయం ఎప్పుడూ చెప్పలేదేం?"
"ఉండటానికి ఉంది కానీ దాన్ని తప్పించడానికే నీ సహాయం కావలసి వచ్చింది."
'అంతగా నేను చేసే సహాయ మేముంది. ఆ అమ్మాయంటే నీకిష్టం లేదా?"
"లేకేం? బోలెడంత ఇష్టముంది. అసలు చిన్నప్పటి నుండీ ఆ అమ్మాయిని నా భార్యే అన్నారంతా. కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఇప్పుడా అమ్మాయి మరొక అబ్బాయిని ప్రేమించింది. ఎలాగైనా ఈ గండం తప్పించమని నన్ను వేడుకొంది. నిన్ను నేను ప్రార్ధిస్తున్నాను. మా ఇద్దరినీ నీట ముంచినా పాల ముంచినా నీదే భారం."
ఇందులో నే చెయ్యగలిగిన సహాయ మేమిటో నాకర్ధం కాలేదు."
"ఆ మాటన్నావూ! వెధవా, ఏమీ తెలియనట్లు అడుగుతావెంరా! మా యిద్దరికీ పెళ్లి చెయ్యాలని గట్టిగా పట్టు పట్టాడు మా మామయ్య. ఆ పట్టు సడలించాలి."
"స్వంత వారైనా మీ మాటే విననప్పుడు ముక్కూ, మొహం తెలియని నా మాట వింటాడని నమ్మక మేమిటి?"
"ఎడిశావు! నీకు నీ పైన నమ్మకం లేకుంటే మాకుంది. ముందు నీకు మా మామయ్య ను పరిచయం చేస్తాను. ఆ తర్వాత తతంగం ప్రారంభించు."
'ప్రయత్నిస్తాను. ఒక విషయం రా. ఆనందు నాపై కోపంగా ఉంటున్నాడు. కారణం తెలియడం లేదు. అసలు పలుకరించినా మాట్లాడటం లేదు. ఏం జరిగిందో అర్ధం కావడం లేదు."
"ఎడిశాడు వాడూ వాడి కోపమూనూ. నాలుగు తంతే సరి. రోగం కుదురుతుంది! వాడి కధ నే చూస్తాలే."
తలెత్తి ముందుకు చూసిన రాజ్ ఒక చెట్టు దాటున నిలబడి తమనే చూస్తూ చాటుకు తప్పుకున్న లతను చూశాడు.
"ఒరేయ్ , నువ్విక్కడే ఉండు. అయిదు నిమిషాల్లో వస్తాను" అని తిరిగి చూడకుండా ముందు కడుగులు వేశాడు.
తన దగ్గరికి వచ్చిన రాజ్ ను చూసి కంగారు పడింది లత.
"కంగారు పడవలసిన అవసరం లేదులే అమ్మా! నువ్వు అతనితో మాట్లాడాలనుకుంటూన్నావా?"
అవునన్నట్లు తల ఊపింది లత.
"ఆనాడు నే చెప్పిన విషయాలు జ్ఞాపక మున్నాయా?"
ఉన్నాయన్నట్లు తల ఆడించింది.
"సరే, నువ్వెళ్ళు . నేనిక్కడే ఉంటాను. అవసరమైతే నే వస్తాను."
లత గుండె చిక్క బట్టుకొని రాజ్ ను తిరిగి తిరిగి చూస్తూ గోపీ ఉన్న వైపుకు నడిచింది. ఆమె కాళ్ళు వణికి పోతున్నాయి. గుండె వేగంగా కొట్టు కొంటుంది.
తోట సౌందర్యాన్ని పరిశీలిస్తున్న గోపీ హటాత్తుగా లతను చూసి ఆశ్చర్య పోయాడు. ఒక్క క్షణం ఆమెను పరిశీలిస్తూ ఉండి పోయాడు.
"బాగున్నారా?' అని పలుకరించి బలవంతంగా చిరునవ్వు పెదవుల పైకి తెచ్చుకొని ఆమె జవాబు కు ఎదురు చూడకుండా ముందుకు పోబోయాడు.
లత చేయి అడ్డం పెట్టింది.
దారి కడ్డంగా నిలబడ్డ లతను చూసి "ఏమిటీ నిర్భంధం" అని వేను తిరిగాడు.
"నిర్భంధం కాదు. ఒక దీనురాలి ప్రార్ధన."
గోపీ మాట్లాడలేదు.
"మీరు ఈ పాడు మొహం చూడడాని కిష్టపడకాపోతే పోనీ క్షమించనని ఒక్క మాట చెప్పిండి."
గోపీ మౌనమే వహించాడు.
"నా ఆవేదన అర్ధం చేసుకోలేరా?"
'అంత అవసరం నాకు లేదు."
"కానీ నాకు మీ క్షమా భిక్ష అత్యవసరం. అంతవరకు కుమిలిపోతున్న ఈ మనసుకు శాంతి లేదు. చేసిన తప్పుకు క్షమాపణ పొందే అర్హత లేదా? తెలియక అజ్ఞానంతో, గర్వంతో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తమే లేదా?"
"ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు, లతా!"
'అలమటించి పోతున్న నా హృదయాన్ని ఒక దరికి చేర్చండి. పశ్చాత్తాపం తో బ్రద్దలై పోతున్న ఈ మనస్సుకు రక్షణ నివ్వండి. దానికి దరి, విశ్రాంతి , రక్షణ పాప పరిహారం ఇచ్చేది మీ హృదయమే."
"నమ్మమంటావా లతా!"
"మీరు నమ్మలేక పోవటం నా దురదృష్టం. చేసిన పాపానికి పరితపిస్తున్నాను. ప్రాయశ్చిత్తంగా మీ పాద సేవ చేసుకొంటాను. అంతకు మించి మిమ్మల్నేం కోరను. ఆ భాగ్యం ప్రసాదించండి."
ఆమె కళ్ళలో నీరు చూసి చలించి పోయాడు గోపీ. లత చేతులను తన చేతులలోకి తీసుకొని ఆమె కన్నీరు తుడిచి చిరునవ్వు నవ్వాడు.
హృదయ భారం తీరిపోగా అతని వక్షం పై తలవాల్చి కళ్ళు ముసికోంది లత.
తృప్తిగా నవ్వుకొన్నాడు రాజ్ అది చూసి.
'సారీ ఫర్ డిస్టర్బింగ్ , యూ ప్లీజ్" అన్న రాజ్ ను చూసి లత సిగ్గుతో ప్రక్కకు జరిగింది.
"ఒరేయ్ దుర్మార్గుడా! నాటక సూత్రధారివై అంతా చూసేసి ఏమీ తెలియనట్లు అమాయకుడి లా వచ్చావా?"
"నేనేం చేశాను?"
"నాకంతా లత చెప్పేసింది."
"ఏమిటీ. చెప్పెసిందా! ఏమమ్మా అలా చెప్పచ్చా?"
"నేనేం చెప్పలేదండీ."
"ఆ చెప్పలేదా! ఒరేయ్ గోపీ, నన్నే మోసగించావు కదరా!"]
"దొంగవు దొరికి పోయావుగా" అన్నాడు గోపీ నవ్వుతూ. లత కూడా నవ్వకుండా ఉండలేక పోయింది.
"నవ్వండి, నవ్వండి. ఇప్పుడు యిద్దరు ఒకటయ్యారుగా! అయినా మీ యిద్దరి మధ్యా నేనెందుకు? వస్తా" అని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.
"మరి నేకూడా వెళ్లిరానా, లతా!"
"మళ్ళీ తమ దర్శన మెప్పుడో?"
"ఈ గోపాలుడు ఏపనీ చెప్పి చెయ్యడు. ఒకే సారి చేసేస్తాడు. మళ్ళీ కలిసినప్పుడే చెప్తా" అని ఆమె బుగ్గ పైన ఓ చిటికే వేసి అక్కడి నుండి వచ్చేశాడు.
మానవుడికి తాను కోరిన కోరిక తీరితే మరి దేని అవసరం వుండదు. ఆకలి కాదు. అన్ని వస్తువులు అందంగా కనబడతాయి. ప్రతి దృశ్యం సుందరంగా కనబడుతుంది. ప్రతి వ్యక్తీ ఇష్టమైన వాడుగా, అత్యంత ప్రీతికరంగా అగు పడతాడు. అందులోనూ వయసు లోని ప్రేమ పండితే ఆ తొలినాటి ముచ్చట, ఆనందం ప్రపంచాన్నే జయించ గలవు. మనసులో విజయ పతాకం ఎగురుతుంటుంది.
లత కాలేజీ క్లాసులు ఎగ్గొట్టి ఇంటికి దారి తీసింది. చేతిలోని పుస్తకాలను విసిరేసింది. నిలువుటద్దం ముందు నిలబడి తనను చూసుకుని తానె సిగ్గు పడి పోయింది. చుట్టూ చూసింది. ఏదో చెయ్యాలని పించింది. కానీ ఏం చెయ్యాలో తోచక బల్ల పై నున్న పూలను తీసి క్రొత్త పూలను పెట్టింది. పూల కుండీ ఆమెను ఎగతాళి చేసింది.
రేడియో అన్ చేసి కూర్చుంది. కానీ వినాలనిపించలేదు. ఆఫ్ చేసి లేచింది. అప్పుడే "లతా" అంటూ లోపలికి వస్తున్న అక్కయ్య ను చూసి సంతోషంతో "అక్కయ్యా" అని ఆమె మెడను కావలించుకొంది.
ఆశ్చర్యపోయింది వాళ్ళక్కయ్య ఇందిర. కాలేజీ నుండి ఇంత త్వరగా తిరిగి వచ్చేసింది. పైగా ఇంత ఉత్సాహంగా ఉందేమిటా అనుకొంది .
'లతా! ఏమిటిది?"
"చెప్పనా! నాకు సిగ్గేస్తుంది పో" అని తిరిగిపోయి అక్కడ వున్న వాలు కుర్చీలో పడుకొని కళ్ళను చేతులతో కప్పేసింది.
నవ్వుకొంది ఇందిర.
"ఏమిటే పిచ్చిదానా! అంతగా సంబరపడి పోతున్నావు! కారణమడిగితే సిగ్గుపడుతున్నావు" అని ఆమె చేతులను విడదీసింది.
"ఈ దినం వారితో మాట్లాడాను.'
"ఎవరితో ?"
వివరంగా చెప్పింది లత.
"ఇది నిజమయితే నువ్వు అదృష్ట వంతురాలివె!"
"ఔనక్కయ్యా! ఈనాడు నేను ఈ ప్రపంచాన్నే జయించి నట్లని పిస్తుంది. ఎన్నడూ పొందని అనుభూతులను చూరగొంటున్నాను. ఈ పరితాప హృదయానికి అన్నీ లభించాయి. ఇంకేమీ వద్దనే అనిపిస్తోంది. ఈ ఆనందం ఎప్పటికీ నిలిచిపోతే బాగుంటుంది. నాలో వెయ్యి గులాబీలు ఒక్కసారిగా వికసించినట్లున్నాయి."
"గులాబీలకు ముళ్లుంటాయి సుమా!"
"అవి ముళ్లు కాదక్కయ్యా, మా ప్రేమ జ్యోతులు."
"అవి ఉత్త పూలే సుమా! వాడిపోయిన తర్వాత చాలా బాధపడవలసి ఉంటుంది. జాగ్రత్త."
"లేదక్కయ్యా! అవి నిత్య నూతన శోభాయమానంగా పరిమళాలను వెదజల్లు తుంటాయి."
"బాగుంది లతా! నువ్వు నీ జీవితానికి ఒక చక్కటి పూల బాటను నిర్మించు కొంటున్నానన్న ధైర్యం నీలో ఉంటె సంతోషం. కానీ ఒక్క విషయం జ్ఞాపక ముంచుకో. ఈ ప్రేమిక జీవితంలో మీ మనసులు ప్రవాహానికి కట్టబడిన మట్టి ఆనకట్టల లాంటివి. ఆ విధి వైపరిత్యమనే ప్రవాహం సాఫీగా సాగిపోతుంటే అంత అందమూ, ఆనందదాయకమూ మరొకటి ఉండదనిపిస్తుంది. కానీ దానిలో ఏమాత్రం కొంచెం ఉరవడి హెచ్చినా ఆనకట్ట తెగిపోతుంది. ఫలితంగా ప్రవాహం ఇచ్చ వచ్చిన రీతిగా మీ హృదయమనే ఆనకట్టలను చీల్చుకొని పలుదారులను బట్టి పోతుంది. అలాగే మీ హృదయాలలో ఏమాత్రం ఆవేశం , అనవసర అనుమానాలు గాని పాడసూపాయంటే ఎన్నో అనర్ధాలు వాటిల్లుతాయి. జీవితం కృశించి పోవటానికి ఆస్కారముంది. యుక్తా యుక్త విచక్షణ లను మరిచిపోయి క్షణికానందానికో , క్షణిక కోపానికో గురై గాయపడి, గాయం మానినా మచ్చ మానక ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ బాధపెట్టుతుంది. కాబట్టి జాగ్రత్త గా మసలుకో, లతా! నీకు అటువంటి ఒడిదుడుకులు రాకుండా, వచ్చినా చక్కదిద్దుకుపోగలిగే శక్తి నివ్వమని భగవంతుని సదా ప్రార్ధిస్తుంటాను."
ఇందిర మాటలలోని భావాన్ని అర్ధం చేసుకొంది లత. సూక్ష్మంగా చెప్పినా కొన్ని జీవితాల సత్యాన్ని చక్కగా చెప్పగలిగిందని గ్రహించింది.
