Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 13

 

                                         9
    పూరీ పాసెంజరు చీకట్ల ను చీల్చుకుంటూ ప్రయాణం చేస్తోంది. ఆ ఫస్ట్ క్లాస్ పెట్టెలో వాళ్ళిద్దరే ప్రయాణికులు. రైలు వాల్తేరు స్టేషను వదలగానే వనజ హోల్డాలు పరచుకొని నిరుద్వేగంగా నిద్రపోసాగింది. ఆమె మనసిప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. కాని రాజు మనస్సు మాత్రం సంక్షోభంతో నిండిపోయింది. ఉన్న ఊరూ, ఐన వాళ్ళిద్దర్నీ వదిలేసి తన వెంట వచ్చేస్తుంది. ఆ పరిస్థితుల్లో అమెకేలా నిద్ర పట్టిందో రాజుకు అర్ధం కాలేదు. సుపరిచితమైన స్టేషన్లు ఒక్కొక్కటే వెనుకపడి పోతున్నాయి. విశాఖపట్నం దూరమైన కొద్ది అతని హృదయం బరువెక్క సాగింది. వనజ నిద్రపోవటం కూడా ఒక అదృష్టమే. లేకపోతె మనసులోని వ్యాకులాన్ని ముఖంలో కనపడకుండా దాచుకొనే శక్తి అతనికి లేదు. రాజు కిటికీ లోంచి తల బయటకు పెట్టి సిగరెట్టు మీద సిగరెట్టూ కాలుస్తూ అలా చీకట్లో కి చూస్తూ కూర్చుండి పోయాడు. ఆ విధంగా ఎంతసేపు కూర్చున్నాడో గాని రైలు మరొక స్టేషను లో ఆగేసరికి ప్రయాణికులు కోలాహలం విని అతను ఈ లోకంలో పడ్డాడు. ఏదో గాని పెద్ద స్టేషనే! వనజ కళ్ళు నులుముకుంటూ లేచి సిగ్గుపడుతూ "రాజు వేపు నిద్రపోయా కదూ?' అన్నది.
    ఎవరో ఆఫీసరు లా ఉన్నాడు. పెద్ద కుటుంబ బోలెడంత సామానుతో ఆ పెట్టెలోకి వచ్చాడు. భార్యా, ఐదారుగురు పిల్లలూ, ఒ ముసలావిడ ఆడవాళ్ళూ పిల్లలూ ఖాళీగా ఉన్న బెర్తులు ఆక్రమించి కన్నడం లో కీసర బాసరగా మాట్లడుకో సాగారు. ఆఫీసరు గారు రైలాగిన దగ్గర్నుంచీ సూటు కేసులూ, ట్రంకు లూ పరుపులూ పైకేక్కించటం లో మునిగిపోయాడు. సామానంతా పైకేక్కించి చెమట తుడుచుకుంటూ అలా కూలబడ్డాడో లేదో, భార్యామణి మొదలెట్టింది. మరచెంబు ఖాళీ బంది-- అలా కూర్చుంటారేమిటి?- పిల్లలు మధ్యలో ఏడుస్తారేమో. కాసిన బిస్కెట్లన్నా పట్టుకు రండి. అయ్యో పెద్ద సూటు కేసు కనిపించటం లేదు. సామాన్లతో వచ్చిందో రాలేదో  చూశారా?-- మీరు అసలే మతిమరుపు మనుషులు - ఇదీ వరస. రైలు కదిలేవరకూ పాపం ఆ శాంతి స్వరుపుడు అటూ ఇటూ పరుగులేత్తూతూనే ఉన్నాడు. భార్య అజ్ఞల్నీ శిరసా వహిస్తూ రైలు కదిలాక ఆ మహా సాద్వి కొంచెం శాంతించి, భర్తను ఊపిరి పీల్చుకోటానికి అనుమతించింది. ఆయనగారు వెంటనే సంచి లోంచి ఉద్ఘందమొకటి బయటకు తీసి, పరిసరాలను మర్చిపోయి చదువులో మునిగిపోయాడు. ముసలావిడ వనజను పలుకరించి మాటల్లోకి దింపింది.
    "ఎందాకా వెళ్తున్నారమ్మా?"
    "హైదరాబాద్."
    "ఆ అబ్బాయి నీకేమౌతాడు?"
    వనజ సిగ్గుపడి సమాధానమేమీ ఇవ్వలేదు.
    "మీ ఆయనా?"
    వనజ తలూపింది. నిశ్శబ్దమైన వనజ సమాధానం ముసలమ్మ కెందుకో తృప్తి కలిగించలేదు. కళ్ళు వనజ మెడలో తాళిబొట్టు కోసం వెతక సాగాయి. అది కనుపించక పోయేసరికి , ఏమనుకుందో ఏమో "మీరు క్రిస్టియనులా?' అని అడిగింది.
    వనజ దాని కూడా అయిష్టంగానే తల ఊపింది. తమాషాగా సాగుతూన్న వారి సంభాషణ రాజు చెవుల బడుతూనే ఉంది.
    "పెద్ద తనం కదూ. కళ్ళు సరిగా కనిపించటం లేదు. అబ్బాయిని చూసి బ్రహ్మలేమోనను కొన్నాను."
    గ్రంధ పఠనం లో మునిగి ఉన్న ఆఫీసరు గారు కూడా ఒక వంక ఈ సంభాషణ అంతా వింటున్నాడెమో. తలెత్తి కోపంగా ముసలావిడ వంక చూస్తూ కన్నడం లో ఆమెను మందలించి, రాజు నుద్దేశించి "క్షమించండి, మా తల్లి పూర్వకాలపు మనిషి. మీరు అన్యదా బావించ వద్దు" అన్నారు. ముసలావిడ పాపం, ముఖం చిన్న బుచ్చుకొని నిద్రపోనని మారం చేస్తున్న మనుమడితో ఆడుకోసాగింది. ఆఫీసరు గారి భార్య మొగుడు చేతి కింద నున్న దిండు లాక్కుని 'అవతలకు జరగండి" అంటూ ఆయనగార్ని ఓ మూలకు నెట్టి , హాయిగా కాళ్ళు చాపుకొని గురక పెడ్తూ నిద్రపోయింది. ఆఫీసరు గారు కాస్త విశ్రాంతి గా ఊపిరి పీల్చుకొని గ్రంధ పఠనంలో నిమగ్నుడయ్యాడు.
    వనజ రాజు చెవులో మెల్లగా అంది "రేపు రైలు దిగగానే మర్చిపోకుండా ఒక తాళి బొట్టు తెచ్చ్జి నా మెడకు కట్టండెం."
    ఆ పరిహసోక్తితో రాజు హృదయమెంతో తేలికై పోయింది. వనజలో నున్న అనిర్వచనీయమైన ఆకర్షణేదో అతనికిప్పుడు అర్ధమైనట్లు తోచింది. తనెంత కష్టాల్లో ఉన్నా ఇతరులను హాయిగా నవ్వించగలదు. తన చుట్టూ మధుర మైన అమృతపు జల్లు కురిపించగలదు. ఆమె సాన్నిధ్యంలో కష్టాలకూ, విచారాలకూ తావు లేదు. అదే ఆమెలో నున్న ప్రత్యేకత! నిజానికి ఈనాడామె చూపించిన సాహసం తక్కువదేమీ కాదు. తన సర్వస్వమూ వదులుకొని పరాశ్రితయై వచ్చేస్తోంది. ఐనా భవిష్యత్తును గూర్చిన సంశయచ్చాయ లేని ఆమె ముఖంలో లేశ మాత్రంగా కూడా కనిపించటం లేదు. రాజు ప్రసన్న చిత్తుడై మార్ధవమైన దృక్కులతో . జీవితంలో ఎన్నడూ చూడని ఎవరో కొత్త వ్యక్తీ ని చూసినట్లు చూడసాగాడు వనజ వేపు.

                 
    అప్పల్రాజు పైకి కనిపించేంత అమాయకుడేమీ కాదు. మొదటి నుంచీ తన యజమాని వ్యవహారమంతా గమనిస్తూనే ఉన్నాడు. ఏదో కుర్రతనం , ఉడుకు రక్తం అనే అనుకొన్నాడు గాని  పరిస్థితి అంత విషమిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఎప్పుడైతే రాజు బ్యాంకులో ఉన్న డబ్బంతా తెప్పించి, బట్టలన్నీ సర్దుకొని తనకేమీ చెప్పకుండా ప్రయాణమయ్యాడో అప్పుడే గ్రహించాడు అనర్ధమేదో జరిగబోతోందని. నాలుగైదు రోజులు గడిచినా యజమాని తిరిగి రాకపోయేటప్పటికి అతని కనుమానం బలపడింది.  తలవని తలంపుగా ఆరోజు ప్రకాశం బజార్లో కనపడ్డాడు. అతన్నడిగి వనజ కూడా ఇంట్లో లేదని రుజువు చేసుకున్నాడు. వెంటనే ఇంటికి తాళం బిగించి చిన్న సంచిలో రెండు బట్టలు వేసుకొని బయలుదేరాడు.
    నానా యాతన పడి చీకట్లో ఆ ఊరు చేరుకునే సరికి రాజు తండ్రి గారైనా సత్యన్నారాయణ గారు ఊర్లో లేరు. అప్పల్రాజు అనుకొన్నట్లుగానే రాజు ఇంటికి రాలేదని తెలిసింది.... రంగమ్మ అంతా విని "నీకేమన్నా మతి పోయిందా ఏమిట్రా? అబ్బాయి ఏ స్నేహితులతో వెళ్ళాడో ఏమో? సెలవు లేగా నాలుగైదు రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. ఏ పిచ్చ వాగుడు ఎక్కడా వాగకు." అన్నది. రాజు మీద ఆమె కంత నమ్మకం. కాని అప్పలరాజు మనసు తృప్తి చెందలేదు. "పెదబాబు గారు ఎక్కడి కెళ్ళారమ్మా?' అని అడిగాడు.
    "అమ్మాయిని చూట్టానికి వెళ్ళారు."
    తెల్లారక ముందే సంచి పట్టుకొని మళ్ళీ బయలుదేరాడు. రంగమ్మకు కూడా చెప్పకుండానే. అక్కడ పెదబాబుగార్ని చూడగానే కొండంత ధైర్య మొచ్చింది. ఏడుస్తూ జరిగిందంతా చెప్పివేశాడు. సత్యన్నారాయణ గారు అంతా విని "ఇందంతా నిజమేనట్రా?" అన్నారు.
    "ఎంతమాట బాబూ. మీకు అబద్దం చెప్పటానికి నాకెన్ని గుండెలు కావాలి? మీరు ఒక్కసారి ఆ విశాఖపట్నం వచ్చారంటే చిన్న బాబు గారు ఎక్కడి కెళ్ళింది తెలిసిపోతుంది. బయలుదేరండి బాబూ."
    అయన లోలోపల ఎంత తల్లడిల్లి పోయారో గాని బయటకు మాత్రం గంబీర్యం వహించారు. కొంచెం సేపటికి "వద్దురా అప్పల్రాజు నేను రాలేను. రాజు మా వంశ గౌరవాన్ని , ప్రతిష్ట నూ మంట కలిపి ఇంత పని చేశాడంటే నేనింకా ఏ ముఖం పెట్టుకొని నలుగుర్లో తిరగను? వాడితో నాకింకా ఏం సంబంధ ముందని వాడి కోసం వెతకను?" అన్నాడు ఆశ్రురుద్దమైన కంఠంతో.
    కమలమ్మ మాత్రం ధైర్యం గానే 'అసలు వాడు చెప్పేది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి గదా? మన రాజు అటువంటి పని చేశాడంటే నేను నమ్మను. మీరొక సారి అక్కడకు వెళ్ళి రావటం మంచిది నాన్నా" అన్నది.
    "లాభం లేదమ్మా. అప్పలరాజు చెప్పేది నిజమే. కల్పించి చెప్పవలసిన అవసరం వాడి కేమీ లేదు. నన్ను క్షమించమ్మ . నేను వెళ్ళలేను."
    అయన ఒక నిశ్చయాని కొచ్చిన తర్వాత దాన్ని మార్చటం అసంభవమని అందరికీ తెలుసు. అందువల్ల కమలమ్మ మరి మాట్లాడలేదు. ఇంట్లో అందరి ముఖాల్లోనూ దైన్యం కమ్ముకొన్నది. ఆరోజు ఎవరైనా భోజనం చేశారో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. బాగా చీకటి పడ్డాక పద్మ అప్పల్రాజు కోక్కడికి భోజనం వడ్డించి "అప్పలరాజు , నాతొ ఏమీ దాచకుండా అన్నీ చెప్పావ్ కదూ?' అన్నది.
    "ఎందుకు చెప్పనమ్మా" అన్నాడు.
    "రాజు బావ నిజంగా -- ఇదంతా చేశాడంటావా?"
    శోకం మూర్తిభావించిన ఆమె ముఖం చూసేసరికి వాడికి ఏడుపు ఆగలేదు. ముఖం చాటు చేసుకొని ఆడదానిలా కన్నీరు నింపుకొంటూ "అమ్మా నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు. చిన్నప్పటి నుంచీ మీ ఉప్పు పులుసు తింటూ బ్రతుకుతున్నాను. మీకు అబద్దమే మన్నా చెప్తే నా కళ్ళు రెండూ పోతాయి. మీ ముఖం చూస్తుంటే నా గుండె బద్దలై పోతుందమ్మా" అన్నాడు.
    పద్మ కళ్ళు తుడుచుకుంటూ "ఏమోరా, బావ ఇలా చేస్తాడంటే నమ్మకం కలగటం లేదు" అన్నది.
    "నిజమే నమ్మా? నమ్మాల్సిన సంగతి కాదు చినబాబు గారి మంచితనం నాకు మాత్రం తెలుయదా తల్లీ? కాని ఎందువల్లనో ఆ మాయలాడి వలలో పడి మోసపోయారు. వారి తప్పేమీ లేదమ్మా."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS