Previous Page Next Page 
మహిమ పేజి 13


    మహిమ నిజంగా చాలా ఆనందంగా "థాంక్యూ సర్! ఐయామ్ గ్రేట్ ఫుల్ టు యూ" అంటూ బయటికి వెళ్ళి సీటువైపు నడుస్తుంటే గాలిలో తేలిపోతున్నట్లనిపించింది.
    "ఏమిటి అంత హ్యాపీగా ఉన్నావు. సెలెక్ట్ చేశారా విశాల్ సార్..." అనుపమ నవ్వుతూ అంది. "అనుపమ, గిరీష్... కంగ్రాట్స్ మీ" అంది. అనుపమ చేయి పట్టుకుని జరిగిందంతా చెప్పగానే... "ఏయ్ రెండు రోజులకే బాస్ మనసు దోచేశావు. మేమిక్కడ ఏణ్ణర్థం నించి పనిచేస్తున్నాం" అలిగినట్టు అంది.
    "టాలెంటమ్మా! టాలెంట్ ఉంటే ఎవరూ పైకి లాగక్కరలేదు. మహిమ దూసుకు వెళ్ళిపోతుందంటే ... అది ఆమెలో ఉన్న క్రియేటివిటి ప్లస్ అంకితభావం. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఆమె కళ్లు ఇటు అటు చూడవు. మనం అంత సిన్సియర్ గా చేస్తున్నామా... ఉద్యోగాన్ని ఉద్యోగంలా చూస్తున్నాం" గిరీష్ నిజాయితీగా అన్నాడు.
    "అవునులే... అందరం ఒకలా ఎలా ఆలోచించగలం. అందరి గీతలు ఒకలా ఉండవు. అందరి రాతలు ఒకలా ఉండవు" అంటూ నుదిటి గీతలని చూపిస్తున్నట్టు యాక్ట్ చేసింది అనుపమ. అంతా నవ్వారు.
    "ఏయ్, మరీ అంత పొగడ్తలొద్దు. కాని ఒకటి చెప్పు. ఇప్పుడు ఈ స్క్రిప్టుకి ఎంత అమౌంట్ అవుతుందన్నది. ఎంత బిల్లింగ్ చెయ్యాలి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, నటీనటులను ఎవరు సెలక్ట్ చేస్తారు..."
    "అబ్బో అన్నింటికీ తలో డిపార్ట్ మెంటు. కస్టమర్ ఆర్డర్ వచ్చాక ముందు అది ప్రకటనా, విజువల్సా, షార్ట్ ఫిలిమో అని ఏ ఆర్డరులో చూసినా, ముందు క్రియేటివ్ డిపార్ట్ మెంటే ప్రకటన తయారుచేస్తుంది. తరువాత యాడ్ డివిజన్ కి, విజువల్స్ అయితే విజువల్ డివిజన్ కి పంపిస్తారు. ఉత్త ప్రకటన అంటే వార్తా పత్రికల కోసమైతే, ఆర్టిస్టుల చేత బొమ్మ వేయించి, ప్రకటన రాయిస్తారు. కొన్ని ప్రకటనలకి ఆర్టిస్ట్ లు ఫోటోలతో... అంటే సినీతారలు, క్రికెట్ తారలు, మోడల్స్ లాంటి వారితో కాప్షన్ చెప్పిస్తూ ఫోటోలతో ప్రకటనలుంటాయి. డబ్బిచ్చేవాడికి కావల్సిన విధంగా, వారి పేమెంట్ ని బట్టి, బడ్జెట్ ని బట్టి ప్రకటన కేటగిరీలుంటాయి. విజువల్స్ కి రేటెక్కువ ఉంటుంది. స్క్రిప్టు ప్రకారం ఆర్టిస్టులెంతమంది? లొకేషన్ అవుట్ డోరా, ఇన్ డోరా? ఎన్ని సీన్లు? సింగిల్ షాట్, మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ చాలా? పాట ఉండాలా? ఇవన్నీ చూసి ఆర్టిస్టులని, డైరెక్టర్ ని బుక్ చేసుకోవడం, షూటింగ్ కి కావల్సిన కెమెరాలు, లైట్లు, వాళ్లందరికీ మేమెంట్స్... ఈ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఒక్కొక్క యాడ్ ఒక్కో ప్రొడ్యూసర్ కి అప్పచెబుతారు. ప్రొడ్యూసర్ మొత్తం ఖర్చును ఎస్టిమేట్ చేసి, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కి పంపిస్తారు. అంటే ఒక యాడ్ రావాలంటే ముందు క్రియేటివ్ డిపార్ట్ మెంట్ కి పంపిస్తారు. వారు పరీక్ష చేసి, బిల్లు తయారుచేసి అది కస్టమర్ కి పంపి, బేరసారాలు జరిగాక పని మొదలుపెట్టాలి. పేమెంట్ కూడా ఒక్కొక్క కంపెనీ ఒక్కో విధంగా తీసుకుంటుంది. సాధారణంగా అందరూ ఆరంభానికి ముందు సగం, తరువాత ప్రోగ్రెస్ ని బట్టి పాతిక పర్సంట్, పూర్తయ్యి ఓకే చేశాక మిగతా ఫుల్ అమౌంట్ పే చేస్తారు. వాళ్లిచ్చిన టైం లిమిట్ లో పని పూర్తిచేసి ఇచ్చాక కొన్ని ప్రోడక్ట్స్ అడ్వర్టైజింగ్ బాధ్యతను యాడ్ ఏజెన్సీలకే, అంటే పత్రికలకి పంపడం, టీ.వి.లకి, సినిమా థియేటర్లకి, కాంట్రాక్టులో ఎలా ఉంటే అలా డిస్ ప్లే చేసే బాధ్యత కూడా వీరికే అప్పగిస్తారు. సాధారణంగా యాడ్ ఏజెన్సీలే ఈ ప్రకటనల సంగతి చూసుకుంటాయి".
    "సపోజ్ ... మనం తయారుచేసిన యాడ్ కస్టమర్ కి నచ్చకపోతే?" మహిమ సందేహం.
    'ఆ మర్చిపోయాను ... ప్రకటన స్క్రిప్టు తయారయ్యాక, అంగీకారం కోసం కస్టమర్ కి పంపుతారు. వారు సరేనంటే ప్రొడక్షన్ కి వెళుతుంది. మార్పులు సూచిస్తే మళ్లీ క్రియేటివ్ డిపార్ట్ మెంట్ మార్చాల్సి ఉంటుంది. ఒకసారి అగ్రిమెంటు పూర్తయ్యాక ఇంక మార్చడం ఉండదు. యాడ్ పని పూర్తయ్యాక మరోసారి కస్టమర్ కి పంపి అతను పూర్తిగా సంతృప్తి చెందాకే మొత్తం చెల్లించాల్సిన డబ్బు చెల్లిస్తారు. పేమెంట్ మొత్తం అయ్యేవరకు ప్రకటనలకి పంపరు".
    "ఒక ప్రకటన బయటికి రావడానికి ఇంత తతంగం, తెరవెనక, తెరముందు ఇంతమంది పనిచెయ్యాలన్నమాట..."
    "ఇది కేవలం ఆఫీస్ స్టాఫ్. ప్రొడక్షన్ వారంతా కాంట్రాక్ట్ వాళ్లే. నటీనటులు, కెమెరా స్టాఫ్, మ్యూజిక్, స్టేజీ ప్రాపర్టీస్... అన్నీ ఎప్పటికప్పుడు ఎవరు దొరికితే వారిని బుక్ చేస్తారు. వీళ్లు కాక ఇంటీరియర్ డెకొరేటర్స్, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్ ... చిన్న చిన్న యాడ్ లకి, అంటే వంటింట్లో, బాత్ రూముల్లో, ఓ డెంటిస్ట్ క్లినిక్, బెడ్ రూముల్లో షూట్ చేయడానికి అప్పటికప్పుడు సెట్స్ వేస్తుంటారు. మనం చిన్న చిన్న యాడ్ లలో చూసే డెంటిస్ట్ క్లినిక్కు, బాత్ రూమ్ క్లీనింగ్ మెటీరియల్ యాడ్స్, వంటింటి పొడులు, పచ్చళ్ళ ప్రకటనలు అన్నింటికి సెట్స్ వేసి షూట్ చేస్తారు. ఎందుకంటే అవుట్ డోర్, ఇళ్లల్లో షూటింగులకి ప్రయాసతో పాటు ఖర్చు ఎక్కువవుతుందని. ఫిఫ్త్ ఫ్లోర్ లో చూశావుగా... అంతా షూటింగులకి, సెట్స్ కి వాడతారు. ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా అందరికీ తెలియదు. ఎవరి డిపార్ట్ మెంట్ వారిదే. మొత్తం అంతా మేనేజ్ చేసేది ఛైర్మన్ అవినాష్ జైన్. ఆయన కొడుకులు వినోద్, విశాల్ డైరెక్టర్లు, అసిస్టెంట్స్, సెక్రటరీలు...ఓ రెండేళ్ల నుంచీ చూస్తున్నా, నాకు కూడా పూర్తిగా తెలియదు అన్నింటి గురించి".
    "వినోద్ అన్న ఆయన కనపడలేదే? విశాల్ గారిని చూశాను..."
    అనుపమ అదోలా నవ్వి ... "మనకు ఆయన కనపడడు, మనం ఆయనకి కనపడం. మనం ఆయనకి కనపడకపోవడం మంచిది..." అదోలా నవ్వి అ,ది. "అతనిది విజువల్స్ సెక్షన్ ప్రొడక్షన్, డైరెక్టర్ లు, నటీనటులు, ప్రొడ్యూసర్లు... ఫైనల్ ప్రోడక్ట్తయారై వెళ్ళాల్సింది అక్కడినుంచే. సాధారణంగా మన క్రియేటివ్ సెక్షన్ నుంచి స్క్రిప్టు పంపించాక మన పని అయిపోతుంది. అప్పుడప్పుడు కస్టమర్ కి నచ్చనివి మార్చి రాయాల్సి ఉంటుంది. వినోద్ గారితో మనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు".
    'ఓ ఐసీ ! తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయిక్కడ. ఇంట్రెస్టింగ్ ఫీల్డ్" అంది మహిమ. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.

                                       *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS