Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు 2 పేజి 13


                         

    చల్లగా లోగిళ్ళ నుండజాలక వీరు
    నిర్మాతలుగ మారి రాజధానికి ఏగి
    సినిమా సినిమా యనుచు ధనమెల్ల వెదజల్లి
    ఇల్లు గుల్లగ జేసుకొనువారు కొందరు,
    రక్కసుల యొద్ద బహు రొక్కమ్ము ఋణముగా
    పొంది సినిమాదీసి నష్టాలపాలయ్యి
    ఒళ్ళు గుల్లగ జేసుకొనువారు కొందరూ
    మాన ప్రాణము లెల్ల డాన్ ల పాలయ్యెరా
    ఒద్దొద్దు ఈ క్రీడ విసుర మానవుడా.
    "అదేమిటి? నీ పేరు విశ్వేశ్వరయ్యకదు బావా! మరి ఈ విశ్వజిత్ రప్పా ఏమిటి?" అడిగాడు సర్వేశ్వరయ్య.
    "అదికాదు బామ్మర్దీ! నా సొంతపేరుతో అరడజను సినిమా కంపెనీలు పెట్టి, మూడు ఆఫీసులు మారి, ఏ సినిమా కూడా ఆరు రీళ్ళు కూడా తియ్యకుండా అర్ధాంతరంగా ఆపేశాక అర్థమయింది నా పేరు తెలుగు పేరులాగా చప్పగా వుంటే కుదర్దని. బెంగాలీ డైరెక్టరు సత్యజిత్ రాయిలాగా గంభీరంగా వుండాలి. ఆయన ఇంటిపేరు రాయి అవగాలేంది నేను రప్ప అవడంలో తప్పేమిటి? ఆహా! ఎంత గొప్ప దగ్గరితనం! రాయీ రప్ప. ఈసారైనా నే తీసే పిక్చరు పూర్తవకపోదా!" అన్నాడు విశ్వేశ్వరయ్య.
                                                           సినిమా ప్రకటన
    పురాణ్-భ్రమక, అనుమానంద్-కుశ్వంతి, ప్రామాణిక్-మింగా మెతుక్వి (ఫ్రమ్ బోంబే) కల్లోలిత్-విహ్వల, లజ్జేష్- అవిశ్రాంతిక, ప్రారబ్ద్- ప్రబోధిక, మీనాష్-ఎరవేసిత, మొదలగు నేటితరం హీరో హీరోయిన్ల జంటలన్నిటితోనూ 'ఆరంభం కాదిది అంతం' అను తెలుగు సినిమా తీయుటకు ఫైనాన్ షియర్స్ కావలెను.
    ఇప్పటి వరకూ కనీసం అరడజను సినిమాలు తీయని అనుభవము మాకు గలదు.
    డాన్ లకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వబడును. వారి బంధుమిత్రులకు ప్రత్యేక పాత్రలు కూడా సమకూర్చబడును.
                                                                         సంప్రదించవలసిన చిరునామా
                                                                                   విశ్వజిత్ రప్ప
                                                                            ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్
                                                                  సయోధ్యా ప్రొడక్షన్ ప్రైవేట్ అన్ లిమిటెడ్
                                                                                     హైదరాబాద్        
    "అది సరే బావా! మన ఆంధ్రా ఫైనాన్సోళ్ళుండగా డాన్ ఫైనాన్సు కావాలని కోరికేంటి? మనవాళ్ళు మళ్ళీ అడిగితే కాదంటారా! నీ ప్రిస్టేజి చూసి..."
    "మరదేమరి! మన పిక్చరుకు ఎవడో ఒక డాన్ ఫైనాన్స్ చేస్తున్నాడంటే సినిమా యూనిట్ మొత్తం ఒళ్ళు దగ్గరెట్టుకుని గజగజలాడుతూ పన్జేస్తారు. చివరికి మనకి బ్రేకులో భోజనాలెట్టే మెస్ వాడైనా సరే, సాంబారులో ఒక్క ములక్కాడ ముక్క తక్కువైందంటే ఏ బండరాయి చాటు నుంచి ఏ బుల్లెట్టు వచ్చి తగులుద్దో అని భయపడుతూ పన్జేస్తారు. ఎంతైనా డాన్ డానే బామ్మర్దీ! ఆ మర్యాదా ఆ మన్ననా మామూలుగా వడ్డీకి డబ్బులిచ్చేవాళ్ళ కెందుకుంటుందీ?"
    "సరేలే! నీఇష్టం. ఇంతకీ ఈ ప్రకటనకి డాన్ లు కాంటాక్టు చెయ్యకపోతే?" సర్వేశ్వరయ్య సందేహించాడు.
    నవ్వేశాడు విశ్వజిత్ రప్పా.
    "డాన్ లు ఇందుగలరందు లేరని సందేహము వలదు. డాన్ లు సర్వవ్యాప్తులు" అంటుండగానే రప్పా మెడమీద ఏదో చల్లగా తగిలింది.
    "హ్యాండ్సప్" అని గంభీరంగా వినిపించింది.
    అది పిస్తోలని గ్రహించటానికి రప్పాకి నిముషం కూడా పట్టలేదు. చిరునవ్వు నవ్వుతూ సర్వేశ్వరయ్యని చూశాడు.
    సర్వేశ్వరయ్యకి ఒక్క నిముషం ఏమీ అర్థం కాలేదు. బావ విశ్వేశ్వరయ్య వెనకాల ఒక ఆగంతకుడు కఠినమైన మొహంతో నవ్వుతూ నిల్చున్నాడు. అతని చెయ్యి బావగారి మెడమీద వుంది. ఆయన నవ్వుతున్నాడు.
    "బావా! ఏమిటీ? ఎవరతను? చేతులెత్తడమేమిటి?" అంటుండగానే-
    "పిచ్చి బామ్మర్దీ! మనం ఇచ్చిన ప్రకటనకి బాక్సు నెంబరు ద్వారానో, కొరియర్ ద్వారానో రెస్పాన్స్ వస్తుందని తలపోస్తున్నావా? ఒచ్చినవాడు డాన్ మ్యాన్. అంటే డాన్ తాలూకా మనుష్యుడు. వాళ్ళు మనల్ని ఇలాగే రప్పించుకుంటారు. పదపోదాం" అని వెనక్కి తిరిగి ఆ ఆగంతకునితో "నేను సినిమా బిజినెస్ లో ఎప్పుడో చేతులెత్తేశాను. నువ్వు కొత్తగా చెప్పనక్కర్లా" అని ఆ మనిషిని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. ఆ మనిషి బిత్తరపోయాడు. పిస్తోలు జేబులోపెట్టేసి అసింటా దూరంగా జరిగాడు.
    ఈ డాన్ లకీ వాళ్ల అనుచరులకీ పోరాటాల మీదే ఎక్కువ నమ్మకం గానీ, ఆప్యాయంగా కౌగలించుకునే వాళ్ళంటే బోలెడు భయంవాళ్ళకి. వాడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు, మాఫియా సినిమాలు, బోలెడు చూశాడు. సత్య, అర్థసత్య, పావుసత్య, కంపెనీ, గాయం ఇత్యాదులు. అందుకనే కౌగిలింతలంటే భయమేసింది వాడికి. అలాంటి సినిమాల్లో నమ్మకంగా పనిచేసే మనుషులని డాన్ లు పనైపోయాక ప్రేమగా హత్తుకుని కత్తితో పొడవటాలు చూశాక కౌగిలింతలంటే భయమేసింది వాడికి. అంతకంటే పదిమందితో ఎదురునిలిచి పోరాడి మట్టి కరిపించగలడు. ఆ మధ్య హోలీ పండక్కి పొరపాటున ఓ పట్టుచీరకొని, పెళ్ళానికిస్తే అమాంతంగా కౌగలించుకుంది. మూడు రోజులు జ్వరం వొచ్చింది.
    విశ్వజిత్ రప్పా అతని భుజం తట్టి ధైర్యం చెప్పాడు.
    "భయపడకు. నా ప్రకటనకి మీ బాస్ ఇంత తొందరగా రెస్పాండయాడని ఆనందం పట్టలేక కౌగలించుకున్నాను. ఏం పర్లేదు. పద మీ యజమాని దగ్గరకు పోదాం. ఇంతకీ మీ డాన్ గారి పేరేంటన్నావ్? బడా వకీలా ఛోటా సాజనా?" అన్నాడు చనువుగా.
    అప్పటికి ధైర్యం తెచ్చుకున్న ఆ అనుచరుడు 'నేనేమీ అన్లేదు' అని అటూ ఇటూ చూసి పదండి అని దారితీశాడు. బావా బామ్మర్ది అతన్ని అనుసరించారు.

                                         *  *  *

    బాగా రద్దీగా వున్న ఓ రోడ్డులోకొచ్చి, ఒక గేటు దగ్గర ఆగారు.
    "ఇదే డాన్ గారిల్లా" అడిగాడు బామ్మర్ది.
    ష్... అని బామ్మర్దికి సైగ చేసి సత్యజిత్ రప్పా డాన్ అనుచరుణ్ణి అడిగాడు 'ఇది నిజంగా డాన్ గారి ఇల్లేనా' అని.
    అప్పటికే ఆ కాస్త ప్రయాణంలో వీళ్ళకి కాస్తో కూస్తో దగ్గరయిన డాన్ అనుచరుడు గేటు పక్కన బోర్డు చూపించాడు.
    అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబ్బో సేలం అండ్ కో.
    (ప్రాక్టీసింగ్ కిల్లర్స్ అండ్ చార్టర్డ్ కిడ్ వాపర్స్)
    'కన్ సల్టింగ్ అవర్స్ 9PM to 6AM' అని రాసుంది.
    సర్వేశ్వరయ్య బావగారి మొహం వైపు చూశాడు.
    రప్పా మొహం వెలిగిపోతోంది.
    గేటు తెరిచి ముగ్గురూ లోపలికెళ్ళారు. లోపల చిన్న గార్డెను, మధ్యలో గోడలు అస్సలులేని ఓ పెద్ద మంటపం వున్నాయి.
    లోపల 'ఇల్లు' అనే పేరుగల కన్ స్ట్రక్షన్ ఏదీలేదు. ఆ మండపానికి నాలుగు స్థంభాలున్నై అంతే.
    మండపం మధ్య కెళ్ళాక "డాన్ గారేరీ" అని అడిగిన సర్వేశ్వరయ్యని వారించి, కిందికి వంగి ఒక వలుచదరపు పాలరాయిని తట్టాడు అనుచరుడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS