మంచిపనులు చేయ మర్యాద ప్రాప్తించు
చెడ్డపనులు చేయ చేటు వచ్చు;
మంచి చెడ్డ తెలిసి మనుగడ సాగించు!
విశ్వయోగి మాట వెలుగుబాట.
మనసులోన మంచి మాటలలో మంచి
ఆచరించు పనుల యందు మంచి
మంచి పెంచుకొన్న మనుజుడే మనుజుండు
విశ్వయోగి మాట వెలుగుబాట.
బుద్ధి గడ్డి కరచి "ఋష్షు" "సద్దాము"ల
పగలు రగిలి సెగలు పొగలు గ్రక్కె
పగిలి పుడమి గుండె భగభగ మండెరా!
విశ్వయోగి మాట వెలుగుబాట.
ఈ రణంబు పరమదారుణంబు! వినాశ
కారణంబు! రుధిరతోరణంబు!
పారణంబు స్వార్థ పర పిశాచాలకు!
విశ్వయోగి మాట వెలుగుబాట.
శివుని గుడిని బాగుచేయింప చందాలు
పోగు చేసినట్టి పోతురాజు
మేడపై మరొక్క మేడ ప్రారంభించె
విశ్వయోగి మాట వెలుగుబాట.
వేదపాఠశాల పెట్టి సంస్కృతభాష
నుద్ధరింతునను ప్రబుద్ధు డొకడు
అమెరికాకు పంపె అనుగు బిడ్డల ముందె
విశ్వయోగి మాట వెలుగుబాట.
మించియున్న భూమి పంచుడు ప్రజకంచు
బల్ల గ్రుద్ది పలుకు బాబుగారు
ముందె నందనులకు వందెకరాల్ పంచె
విశ్వయోగి మాట వెలుగుబాట.
స్త్రీజనాభ్యుదయమె దేశాభ్యుదయ మంచు
పత్రికలకు వ్రాయు భద్రిరాజు
కుళ్లు మాటలాడి కులకాంత నేడ్పించు
విశ్వయోగి మాట వెలుగుబాట.
మోమునిండ పంగనామాలు దిద్దిన
బూది తనువునిండ పులుముకొనిన
కరుణ లేని నరుడు గడ్డిబొమ్మేనయా!
విశ్వయోగి మాట వెలుగుబాట.
ఇల్లు గుల్లసేయు ఇల్లాలి నేడ్పించు
ఆర్తి పెంచు కీర్తి నపహరించు
మత్తు నెత్తి కెత్తు మధుపాన భూతంబు
విశ్వయోగి మాట వెలుగుబాట.
ఆడపిల్ల బ్రతుకు లగ్గిపా లొనరించు
తల్లి తండ్రి గుండె కుళ్లగించు
నరికి పోగులిడుడు వరకట్న రాక్షసిన్
విశ్వయోగి మాట వెలుగుబాట.
పౌరుషమ్ము గల్గు వీరు డొక్కడు మిన్న
మందమతులు వందమంది కన్న;
అర్జునుం డొకండె ఆవుల మరలించె
విశ్వయోగి మాట వెలుగుబాట.
హృదయమున్న వ్యక్తి హృదయమిచ్చెడి వ్యక్తి
హృదయ మెరిగి సంచరించు వ్యక్తి
మిత్రుడైన నరుని మేలెట్టిదో గదా!
విశ్వయోగి మాట వెలుగుబాట.
నిత్య సత్యవంతు నిష్కల్మష స్వాంతు
సౌమ్య రమ్యగాత్రు సచ్చరిత్రు
పుత్రు గన్నతల్లి పుణ్యం బదెంతయో!
విశ్వయోగి మాట వెలుగుబాట.
వినయ భూషణుండు విశ్వమంగళభావ
పోషణుండు మధుర భాషణుండు
ఛాత్రుడైన గురుని సంతోష మెట్టిదో!
విశ్వయోగి మాట వెలుగుబాట.
ఫాలమందు కాంతి పలుకులలో శాంతి
అంతరంగమున దయాస్రవంతి
మెరయు వాని "సిద్ధ పురుషు" డందురు బుధుల్
విశ్వయోగి మాట వెలుగుబాట.
ఎవరి త్యాగమహిమ ఎల్లలోకాలకు
మేలు సలుపు; ప్రజల మేలుకొలుపు'
అట్టివానినే "మహా మహు" డందురు
విశ్వయోగి మాట వెలుగుబాట.
ఎవని ప్రేమవలన హింస, అహింస స
న్నిధిని శిరసు వంచి నిలచిపోవు.
అతడె "మౌని" అతడె "యతి" అతడే "యోగి"
విశ్వయోగి మాట వెలుగుబాట.
అరచి భజన చేయ పరమభక్తుడు కాడు
గుండెలోన ప్రేమ నిండవలయు;
ప్రేమ లేని భజన పెరుమాళ్లు మెచ్చునా?
విశ్వయోగి మాట వెలుగుబాట.
మోటువాని తోడ మాటలాడుట కన్న
గౌరవమ్ము పెదవి కదపకున్న;
కాలినడక మేలు ఖరము నెక్కుట కన్న
విశ్వయోగి మాట వెలుగుబాట.
"వదరుబో" తొకండు వాదులాడ దొడంగె
"పొగరు బోతు" "త్రాగుబోతు" తోడ;
వారి తగవు చూడ వచ్చె "సోమరిపోతు"
విశ్వయోగి మాట వెలుగుబాట.
ఇచ్చకాల భక్తి తెచ్చికోలు విరక్తి
కుచ్చితుల కుయుక్తి కుటిలు శక్తి
ఇచ్చలేని భుక్తి మెచ్చుకో లేమయా!
విశ్వయోగి మాట వెలుగుబాట.
తనకు గాని పనులు తలకెత్తుకొనువాడు
కష్టనష్టములను గాంచగలడు;
గార్దభంబు మొరగి కఱ్ఱ దెబ్బలు తినె
విశ్వయోగి మాట వెలుగుబాట.
మేలి గుణము కలుగు మిత్రుని విడనాడి
హీన గుణుని చేర నేమి ఫలము?
గుడ్డ పారవైచి గోచి పెట్టినయట్లు
విశ్వయోగి మాట వెలుగుబాట.
