ధర్మబుద్ధి యున్న దాతను విడనాడి
లోభివాని నడుగ లాభమేమి?
లడ్డు వదలిపెట్టి గడ్డి మేసిన రీతి
విశ్వయోగి మాట వెలుగుబాట.
మానవతయె నిరుపమాన సౌభాగ్యంబు
మానవతయె లోకమాన్యశక్తి
మానవతయె మోక్షమార్గ సోపానంబు
విశ్వయోగి మాట వెలుగుబాట.
సాటి మానవునకు సాయమ్ము చేయక
కోటి నాణెములను కూడబెట్టి
కాటి కేగువేళ కన్నీరు గార్తురు
విశ్వయోగి మాట వెలుగుబాట.
తల్లి తండ్రి భార్య తనయులు జ్ఞాతులు
వీర లెవరు నరుని వెంట రారు;
నరుని వెంట వచ్చునది ధర్మ మొక్కటే
విశ్వయోగి మాట వెలుగుబాట.
"విశ్వ" పదము నుంచె "విష్ణుసహస్రమ్ము"
మొట్టమొదట వ్యాసముని వరుండు
"శివసహస్రి" చిట్టచివర నుంచె "జగత్తు";
విశ్వయోగి మాట వెలుగుబాట.
"విశ్వమనిన విష్ణువే" "జగత్తన్న
శివుడె" యనుచు చాటి చెప్పినాడు
వ్యాసమౌని "ఆనుశాసనికం" బందు;
విశ్వయోగి మాట వెలుగుబాట.
"అమ్మ" అనిన బూజు "మమ్మీ" యనుటె మోజు
"డాడి" స్వీటు "నాన్న" తగని మోటు
తరిగె మానసమ్ము పెరిగె మస్తిష్కమ్ము
విశ్వయోగి మాట వెలుగుబాట.
వేదములు పఠించు; వీక్షించు బైబిలు;
అరయుమా ఖురాను; అన్నికూడ
నొక్కి నొక్కి దేవుడొక్కడే యని పల్కు
విశ్వయోగి మాట వెలుగుబాట.
పలువిధాలు నగలు బంగారమొక్కటే
పూలు రకరకాలు పూజయొకటె
పథము లెన్నియైన భగవంతుడొక్కడే
విశ్వయోగి మాట వెలుగుబాట.
దివిజగంగ పొంగి ప్రవహించు చందాన
పరమపదము వెల్లి విరిసినట్లు
దేవు కరుణ భువికి దిగివచ్చు దివినుండి
విశ్వయోగి మాట వెలుగుబాట.
నరుడు తన్నుతాను సరిదిద్దుకొన్నచో
జగతి కెల్ల మేలు సలిపినట్లె;
వ్యక్తి చక్కబడిన వర్ధిల్లు జగమెల్ల
విశ్వయోగి మాట వెలుగుబాట.
చెలిమి కలిమినిచ్చు; చెలిమి సౌఖ్యము నిచ్చు;
చెలిమి మానవునకు బలిమి నిచ్చు;
చెలిమి లేని బ్రతుకు చెల్లని నాణెమ్ము;
విశ్వయోగి మాట వెలుగుబాట.
ప్రేమ మతము మాది; బిడ్డ లిద్దరు; పెద్ద
బిడ్డ శాంతి; చిన్నబిడ్డ కరుణ;
అందమైన విశ్వమందిరమ్ము గృహమ్ము;
విశ్వయోగి మాట వెలుగుబాట.
విశ్వమందిరమున వికసించు పుష్పాలు
కురియ వలయు ప్రేమ పరిమళములు;
పుడమితల్లి పొంగి పులకించి పోవలె
విశ్వయోగి మాట వెలుగుబాట.
విశ్వమందిరమున వెలుగొందు జ్యోతులు
కాంతు లీనవలె దిగంతరముల;
ప్రగతి పథములోన జగతి కాలిడవలె
విశ్వయోగి మాట వెలుగుబాట.
విశ్వమందిరమున వెదజల్లు భావాలు
గుండె గుండెలోన నిండవలయు;
పండవలయు మేలి బంగారుపంటలు
విశ్వయోగి మాట వెలుగుబాట.
జయము సత్యమునకు! జయము ధర్మమునకు!
శాంతి ప్రేమలకును జయము జయము!
జయము సాయినాథ ప్రియభక్తులకు నెల్ల!
విశ్వయోగి మాట వెలుగుబాట.
జయము వేదశాస్త్ర సార విత్తములకు!
జయము జయము సాధుసత్తములకు!
జయము జయము జయము సద్గురూత్తములకు!
విశ్వయోగి మాట వెలుగుబాట.
సర్వమానవులకు సౌఖ్య మబ్బును గాక
ఆధి వ్యాధి దూరమగును గాక!
కష్ట మెవ్వరికిని కలుగకుండును గాక!
విశ్వయోగి మాట వెలుగుబాట.
* * * *
