Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 13


    జనని జన్మభూమి స్వర్గమ్ము కంటెను
    గొప్పవనుచు బుధులు చెప్పినారు;
    మాతృదేశ సేవ మానవత్వపు త్రోవ
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    పూలు రువ్వువాడు పువ్వుల విలుకాడు;
    రాలు రువ్వువాడు రాక్షసుండు;
    సరస భాషణమున జగమెల్ల వశమౌను
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    చెడె నొకండు యాజ్ఞసేని పయ్యెద లాగి;
    సీత జోలి కేగి చెడె నొకండు;
    స్త్రీల పరిభవింప చేటు వాటిల్లురా!
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    గడ్డి మేసి యావు కమ్మని పాలిచ్చు;
    పాము విషము గ్రక్కు పాలు ద్రావి;
    మంచి చెడ్డ లిట్లె మనుజులందును గూడ
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    దుర్మదాంధుడైన ధూర్తవర్తను విద్య
    పనికిరాదు తనకు మనకు గూడ
    పన్నగంబు పడగనున్న రత్నము మాడ్కి
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    రాలె జుట్టు, నడుము వ్రాలె, దంతము లూడె,
    కంటి చూపు తగ్గె, గాని వాని
    ఆశ మొగ్గ తొడిగి ఆశాంతములు బ్రాకె
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    ఆశ కీవు దాసుడైతివా - దాసుడ
    వగుదు జగతి కెల్ల; ఆశ నీకు
    దాసి యైన - జగతి "దాసోహ" మను నీకు
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    తిరిగి తిరిగి పెక్కు తీర్థాలు, పాదమ్ము
    లరిగి పోయె; శక్తి తరిగి పోయె;
    పదము లరిగె గాని ప్రారబ్ధ మరుగదు
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    గద్దె నెక్కి నపుడె కనులు నెత్తికి నెక్కె;
    కొద్ది నాళ్ల లోనె గద్దె దిగెను;
    గద్దె దిగెను గాని కన్నులు దిగలేదు
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    శీలవృద్ధి లేని చిలిపి విద్య లవేల?
    ధర్మబుద్ధి లేని దానమేల?
    చిత్తశుద్ధి లేని శివపూజ లవియేల?
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    సొంత ఇంటిగొడవ సుంత పట్టదు గాని
    పరుల తగవు తీర్ప పరుగులెత్తు;
    మాట రాని వాడు పాట పాడినయట్లు
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    కన్నవారి నష్టకష్టాల పాల్చేసి
    రామభజన చేయ నేమి ఫలము?
    వెన్న పారవైచి గిన్నె నాకిన యట్లు
    విశ్వయోగి మాట వెలుగుబాట.  

    ఆలి నదరగొట్టి అనుగుబిడ్డల తిట్టి
    చెత్త కాగితములు చేత బట్టి
    సభల కేగువాడు చచ్చుపెద్దమ్మరా!
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    కరము నందు మాల తిరుగుచుండునుగాని
    దిక్కులందు మనసు తిరుగుచుండు;
    కలుషచిత్తు జపము గాలిలో దీపంబు
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    భూరుహములు బొగ్గుపులుసు గాలిని పీల్చి
    మంచి గాలి నొసగు మానవులకు;
    నరుడు తరుల నరకు పరమ కృతఘ్నుడై
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    కాకి క్రింద పడిన "కావు కావు" మటంచు
    వంద కాకు లచట వచ్చి వ్రాలు;
    నరుడు క్రింద పడిన పొరుగువాడే రాడు
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    పెను గజమ్ము సూది బెజ్జమ్ములో దూర
    నగును గాని - ధన మదాంధుడైన
    జనుడు దూరలేడు స్వర్గలోకము నందు;
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    నవ్యదీప్తి తోడ నవ్వు తామరపువ్వు
    సూర్యకిరణ మింత సోకినంత;
    సుకవి సూక్తి విన్న వికసించు జనశక్తి
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    కాకి పిల్ల నల్పు; కోకిలమ్మది నల్పు;
    అంతు పట్టదయ్యె నంతరంబు;
    గొంతు విప్పినంత గుట్టు వెల్లడి యయ్యె
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    బ్రహ్మ ఋషులచేత పల్లకీ మోయించి
    నహుషు డురగ మగుచు మహికి జారె;
    శిష్టజనుల జెనక కష్టాలు ప్రాప్తించు
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    మూర్ఖమతుల చెలిమి ముప్పది యారౌను (౩౬)
    ఎడమొగాలు మరియు పెడమొగాలు;
    సరసమతుల మైత్రి అరువది మూడురా! (౬౩)
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    సరసు లెదురుపడిన తెరువులు మూడౌను
    విరసు లెదురుపడిన తెరు వొకండె
    రెండు తెరువు లగు నొకండు దుండగుడైన
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    ఆదరింతు వేని బీదసాదల నీవు
    ఆదరించు నిన్ను అఖిల గురుడు;
    చీదరింతు వేని చీదరించును నిన్ను;
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    ప్రేమతోడ తల్లి బిడ్డకు పాలిచ్చు;
    చేలు పండు, లతలు పూలు పూయు;
    ప్రేమ లేని నరుడు భూమికే బరువురా!
    విశ్వయోగి మాట వెలుగుబాట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS