Previous Page Next Page 
ప్రతీకారం పేజి 13


    "ఓ అదా! అదీ! అదే? అందమైన ఆడపిల్ల అకస్మాత్తుగా పలకరిస్తే__" అంటూ ఆమె కళ్ళలోకి గుచ్చి చూశాడు. చురకత్తుల్లా తళతళలాడుతూ కోసుకుపోయే రవి చూపులతో ఆమె చూపుల్ని కలపలేక కళ్ళు పక్కకు తిప్పుకుంది ఆ యువతి.
    "అంటే అందంగా లేని ఆడపిల్లలు పలకరిస్తే ఉలిక్కిపడరన్నమాట?" అన్నది అతని ముఖంలోకి చూడకుండానే.
    "ఏమిటండోయ్! పెద్ద లాయరులా ప్రశ్నలు వేస్తున్నారు?" కొంచెం చనువుగా అన్నాడు రవి.
    ఆ యువతి చివ్వున తలెత్తింది. "పెద్ద లాయర్ను ఇంకా కాలేదు కాని లాయర్నే!" అన్నది.
    "ఓ అలా! చెప్పండి అందరిచేత అబద్దాలాడించే వృత్తి అన్నమాట మీది?" టీజింగ్ గా అన్నాడు రవి.
    "అవును! చెయ్యని హత్యానేరం మీ నెత్తిమీద పడితే, ఎన్ని అబద్దాలాడయినా మిమ్మల్ని రక్షిస్తా. నిరపరాధిగా నిరూపిస్తాను" కంఠంలో గర్వం, ముఖంలో గాంభీర్యం ఉట్టి తడుతూ అన్నది ఆ యువతి.
    "ఒకవేళ నేను నిజంగానే హత్య చేస్తాననుకోండి!"
    "హత్యా! మీరా! అబ్బే మీకు చేతకాదు" నది ఆ యువతీ ఎగతాళిగా.
    "ఎందుకు చేతకాదు?"
    "ఆడపిల్ల పలకరిస్తే గాల్లోకి మూడు అడుగులు కూర్చున్న పళంగా లేచి మళ్ళీ అదే పోజులో కిందపడే మీకు హత్య చెయ్యడం చేతకాదు" ఖచ్చితంగా అన్నది ఆ యువతీ నవ్వును పెదవుల మధ్య బంధిస్తూ.
    ఈ సారి రవికి నిజంగా ఉక్రోషం వచ్చింది. ముఖం ఎర్రబడింది.
    "హత్య చెయ్యడం కూడా గొప్ప చేతకాని పనేనా? బతికించడం కష్టం. కాని చంపడం చాలా తేలిక."
    "అంటే మీరు హత్య చేస్తానంటారు...అంతేనా?"
    "మాట వరసకు...చేశాననే అనుకోండి. అప్పుడు మిమ్మల్ని డిఫెన్స్ లాయర్ గా నా తరపున వాదించమని అడగటానికి మీ దగ్గిరకే వస్తాను. మరి నా కేసు మీరు తీసుకుంటారా?"
    "ఎందుకు తీసుకోను? అది నా వృత్తి. వచ్చిన కేసు వదులుకుంటానా?"
    నా తరఫున వాదించి నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తారు అవునా?"
    "అవును!"
    "అంటే! నా తరఫున వాదించి కేసు గెలిపించడం మీ బాధ్యత. అందుకని మీరు కొన్ని అబద్ధాలు ఆడి నాచేత మరికొన్ని అబద్ధాలు ఆడిస్తారు అదేగా మీ వృత్తి?"
    "కాలాంతుకుడిలా వున్నాడు" అనుకుంది ఆ యువతీ.
    మాట్లాడరేం?" రెట్టించాడు రవి.
    "అయ్యా! మీకు 'లా' గురించి ఏమీ తెలియదు. తెలియని విషయాల గురించి మాట్లాడటం అంత తెలివైన పని కాదు."
    "ఆఁ అడగనే లేదు. మీ పేరు?" రవి ఏదో అనబోతుంటే అడ్డొచ్చి అడిగింది ఆ యువతి.
    "నా పేరు రవి. మా నాన్న పేరు జగన్నాథం! పుట్టింది గుంటూర్లో. నివసిస్తున్నది హైదరాబాద్ లో. మాతృభాష తెలుగు. ఎం.ఏ. ఫస్టుక్లాసులో పాసయ్యాను. అన్నీ నిజమే చెబుతున్నాను. దేవుని ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను" బోనులో నిలబడి ముద్దాయి చెప్పినట్టు రవి గబగబా చెప్పాడు.
    "బలేవారండీ! చాలా చమత్కారంగా మాట్లాడతారు!" అంటూ కిలకిలా నవ్వింది ఆ యువతి.
    "మీరు నవ్వుతుంటే నాకొకటి జ్ఞాపకం వస్తోంది."
    "ఏమిటో అది?"
    "గలగల పారే సెలయేరు!"
    ఆ యువతి ఓ క్షణం రవి కళ్ళలోకి చూసి, తల దించుకుంది.
    "మీ లాయరుగారి పేరు తెల్సుకోవచ్చా?" అన్నాడు రవి ఆ యువతీ ముఖంలోకి కళ్ళార్పకుండా చూస్తూ.
    "ఇందిర!" అన్నది తలవంచుకునే. ఆమె చెంపల్లోకి రక్తం చిమ్మింది.
    "అదీ అలా సిగ్గుపడాలి. ఆడపిల్లకు సిగ్గే అందం! అందమైన ఆడవాళ్ళు సిగ్గుపడితే ఋష్యశృంగుడైనా__" ఆగిపోయాడు రవి ఆ యువతి చివ్వున తలెత్తి చురుగ్గా చూడటంతో.
    రవి గతుక్కుమన్నాడు. ఏమిటీ తను ఇలా మాట్లాడుతున్నాడు? ఒక అపరిచిత వ్యక్తితో సభ్యతగల మగవాడు ఎవడూ తనలా మాట్లాడడు. తనకేమయింది? ఎందుకు అనుకోకుండా తను ఆమెకు అంత దగ్గిరగా జరిగిపోయాడు?
    "క్షమించండి!" అన్నాడు రవి.
    "అబ్బే! ఇందులో క్షమించడానికేముందిలెండి!" అనేసింది ఇందిర.
    అవును అతని తప్పేముంది? తను ఎందుకు సిగ్గుపడింది? తను ఎలాంటి జంకూ లేకుండా, సూటిగా ముఖంలోకి చూస్తూ మగవాళ్ళతో మాట్లాడగలదు. కాని ఈ యువకుడి ముందు తనెందుకు ముడుచుకుపోతుంది? ఎన్నడూ కలగని ఈ కొత్త అనుభూతి ఏమిటి? తన హృదయాన్ని తాకుతున్న ఆ మధురస్పర్శ ఎవరిది? ప్రతి మగవాడి ముందూ మెలికలు తిరిగిపోయే ఆడపిల్లలను చూసినప్పుడు తనకు ఏవగింపు కలిగేది. సిగ్గులో ఆకర్షణ వుంటుందా? సిగ్గు మానసిక బలహీనతకు బాహ్యరూపం అని తన అభిప్రాయం. ఈనాడు అది నిజమే ననిపిస్తోంది. అంటే__అంటే__తనలో ఏదో బలహీనత ప్రవేశించిందా? ఎప్పుడూ ఎవరిముందూ సిగ్గుపడని తను ఎందుకు ఈ రవి ముందు అలా సిగ్గుపడుతూంది? అతని కళ్ళలోకి ఎందుకు చూడలేక పోతూంది? అతను ఎంత చొరవ తీసుకుంటున్నా తనకెందుకు కోపం రావడం లేదు? అతను తనను తట్టి పిలుస్తున్నాడు. తను పలక్కుండా వుండలేని స్థితిలో పడింది. ఆ పిలుపు కోసమే ఇంతకాలం తను వేచివున్నట్టనిపిస్తూంది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS