Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 13


    దాని గిట్టలు ఎంతో అందంగా వుండేవి. అటువంటి శిల్పాన్ని నాశనం చేయటానికి ముసల్మానులకు ఎలా మనసొప్పిందో, గిట్టలు చెక్కేశారు. కొమ్మలు విరిచారు. ఆలయంలోనూ ప్రతిష్టకు పనికిరాకుండా చేసి ఒక చేలో పారేశారు.     
    చిన్నతనంలో మా తాతగారింటికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ దానిని చూడకుండా వచ్చేవాడిని కాను. ఆ పొలం రైతు దానిమీద కూర్చుని ముఖం కడుక్కునేవాడు. తెలిసీ తెలియని వయసులో ఆ ముస్లిం రైతు మీద నాకు చాలా కోపం వచ్చేది.
    అదేమిటో విచిత్రం. ఆ శిల్పాన్ని చూచినప్పుడు ఒంటరిగా వున్న సమయంలో అది గుర్తుకొచ్చినప్పుడూ "లేపాక్షి బసవయ్య లేచిరావయ్యా!" అనే పాట గుర్తుకొచ్చేది, ఎప్పుడు గుర్తొచ్చినా అంతే! తరువాత అలోచించి అదేదో మానసిక శాస్త్రానికి సంబంధించిన అంశంతో ముడిపడి వున్నదని గ్రహించాను.
    వాళ్ళు అంతటితో వదిలారా? కత్తుల బావి, చీకటి కోనేరుగా పిలువబడే దేవాలయ శిథిలాలలోని కల్యాణ మండపాన్ని మసీదుగా మార్చారు. కాని ఎందువల్లనో శ్రీ కృష్ణదేవరాయల విజయధ్వజాన్ని మటుకు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుండిపోయింది. ఇటువంటి ఘట్టాలన్నీ అఘోరించిన ముస్లింల గ్రామాలు ఆ చుట్టుప్రక్కల రెండు మూడున్నాయి.
    నారింజ పండ్లకు సుప్రసిద్ధమైన పుట్టకోట ముస్లిం ముదుసలి వనితను చూడగానే ఇవన్నీ గుర్తుకొచ్చాయి. నా ఆలోచనలోనే వున్నాను.
    నా మౌనంవల్ల, సాలోచనామగ్నమైన నా చూపుల వల్లా నాకు ఒంట్లో సరిగ్గాలేదని మూర్తి భావించాడు. "ఆచార్లూ" రాత్రంతా ఏమైపోయావు. నీకోసం ఎంత ఆదుర్దా పడ్డామనుకున్నావు! చివరకు నీకేమీ జరగదనీ సురక్షితంగా తెల్లవారగానే తిరిగివస్తావనీ ఫాతిమాబీ చెప్పేవరకూ నిలవలేకపోయాము" అన్నాడు నిశితంగా నా ముఖంలో భావాలు గ్రహిస్తూ.
    "ఫాతిమా ఎవరు?" అన్నాడు విస్తుపోయి.
    అదిగో చెట్టు క్రింద అంటూ చూసాడు! "నాకేమీ జరగలేదులే. అదంతా తర్వాత చెప్తాను. ముందు బయలుదేరి వెళ్ళిపోవాలి. బయలుదేరి రండి" అన్నాను.
    ఎవరి సామానులు వారు సర్దుకునే ఆదుర్దాలో వున్నారు. నేను సమయం చూచుకుని ఆ ముస్లిం వనిత దగ్గరకు పరుగుతీశాను. నిండుగా పండిన తల ఆమెది. జీవకళ తగ్గిపోయిన గాజుకళ్ళు వొణుకుతున్న తల చూడగానే ఆమెమీద గౌరవభావమే కలిగింది.
    ఆమె నన్నే పరకాయించి చూస్తోంది. రాత్రి అర్దాంతరంగా వెళ్ళిపోయి, ఇప్పుడే తిరిగివచ్చిన వ్యక్తిని నేనే అని ఎలాగో ఆమె పసికట్టింది. దగ్గరగా వెళ్ళాను.
    "ఆవో బేటా, బైఠో" ఆహ్వానించింది అవ్వ.
    "అవ్వా మీదే వూరు" అన్నాను. ఎక్కడో ఒకచోట సంభాషణ ప్రారంభించాలి కనుక. అవ్వ నవ్వింది.
    "ఒక వూరంటూ ఏముంది బేటా! అల్లా దయవుంటే ఇప్పటికి ఈ వూరే! ఈ ప్రపంచం యావత్తూ ఒక సత్రం లాంటిదేగా! అందులో ఆయుర్ధాయమున్నంత కాలం బస చేయటానికి వచ్చిన ఒక ముసాఫిర్ ని నేను. నువ్వూ అంతే!" అన్నది వేదాంతం ఒలకపోస్తూ. ఆ ముగ్గుబుట్టలాంటి తలలో ఎంత లోతైన ఆలోచన. ఎండిన ఆకులా రాలిపడి వున్న చెట్టుక్రింద అవ్వ ఎంత గంభీరంగా ఆలోచిస్తోంది. జీవితంలో, సమాజంతో ఏదో ఒక గొప్పస్థాయిని అందుకున్నవారికే గొప్ప ఆలోచనలుంటాయను కోవటం పొరపాటనిపించింది. కళ్ళు తెరుచుకుంటున్నాయి.
    "అయితే అవ్వా! కొండమీది ఈ సత్రం దగ్గరకు నువ్వు ఎలా రాగలిగావు? ఈ వయసులో? నిండా ముప్పయ్ అయిదు సంవత్సరాలు లేని నాకే పైకి రావాలంటే కాళ్ళు లాగాయి. నువ్వెలా నడిచి రాగలిగావు అన్నాను కుతూహలంగా.
    "రాగలిగిన వయసులోనే వచ్చాను. నేను ఈ చెట్టు క్రిందికి చేరి యాభై సంవత్సరాలు దాటిపోయింది బేటా" అన్నది. నేను నిశ్చేష్టుడినయ్యాను. "అయితే అవ్వా యాభై సంవత్సరాలనుండి ఈ కీకారణ్యంలో ఎలా బ్రతుకుతున్నావు? ఎందుకిలా ఉన్నావో?" అని ప్రశ్నించాను ఆసక్తిగా. అవ్వ కళ్ళు మూసుకుని ఒక అరనిముషం ఆలోచనలో గడిపింది. ఆ కొద్ది సమయంలోనే తన గత జీవితం యావత్తూ నెమరువేసుకోగలిగింది కాబోలు.
    తన జీవితం యావత్తూ ఒక దృశ్య కావ్యం చూస్తున్న అనుభూతి కలిగేలా వర్ణించి చెప్పింది కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS