స్త్రీలను గమనించలేని సదనాలకి (లేక గొందులకి) వెళ్ళిపోయి నిలబెట్టుకున్నాడు గౌరవం.
భార్యని షికారు తీసికెళ్ళాడు, చూపించాడు, తీసికెడుతున్నాడు భద్రంగా.
ఈ restlessness వల్ల విద్యాస్వేచ్చలకైన ఆరాటంవల్ల పూర్వపు స్త్రీలు నెమ్మదిగా కదలకుండా పొందగలిగిన ఆనందాన్ని, శాంతిని, నూతన స్త్రీలు వొదులుకుంటున్నారేమో? పిల్లల గంతులు, చిన్న మాటలు, దొడ్లోపాదులు, బంధువులు, తెల్లారకట్ట పాటలు పురుషులూ అంతే! టీచరుపని చేసుకోక యీ కథలు వ్రాయడమెందుకు? ఈ కొత్తనీచపు నాగరికతలోనించి, యీ బాధాకరమైన అశాంతిలో నించి, కొత్త విశాలత్వాన్ని, విజ్ఞానాన్ని ఆనందాన్ని పొందే type evolve అవుతుందా? ఈ పల్లెటూరిజడులు, యీ పట్టణపు నాగరికతా నీచత్వాలలోకి, వికృతాలలోకి మారారు. ఈమార్పు ఉన్నతపరిణామమా? తర్వాత storm ఎక్కడ? తిరిగీ అది జీవితంలో శాంతినీ, శాంతంగా సుందరంగా అనుభవించే శక్తినీ తెచ్చుకోడమేనేమో!
From calm to storm and through storm to a higher calm.
గ్రామఫోను "ప్రేమనికుంజమే ఆవొ" అని పాడుతోంది. హిందీపాటల్లో మొదలుపెట్టి ఆ వరసలలో ఆ మాటల్నే తెలుగులో వ్రాసిన ప్రస్తుతపు పాటల్లో ఎక్కడచూసినా యీ ప్రేమ అనే మాట అమితంగా వాడుతున్నారు. ప్రేమలోకం, ప్రేమమందిరం, ప్రేమమురళి, ప్రేమహృదయం, హృదయప్రేమ, ప్రేమప్రియుడు, యిట్లా ఇట్లాంటి గోల వ్రాత ప్ర్రారంభించిన పాపం నేనే చేశానేమో చాలా! కాని మాటలెట్లా వుపయోగించినా వాటివెనక ఏదో ఒక సంగతి నిశ్చింతగా చెప్పాలనేవేదన వుందినాకు. ఈ పాటల్లో యింకా కధలలోను గీతాలలోనూ, మాటలమీది ప్రేమ ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యం ప్రేమమాటలమీద.
అందువల్లనే యీ పల్లెటూరి స్త్రీల fashions వలె యీ ర్రాతలుకూడా దిగులుపుట్టిస్తాయి. రిబ్బన్లు, జుట్టుసూదులు, పౌడర్లు, లోలాకులు ఇవి యే మనుష్యులు ఉపయోగించగా చూస్తారో, వీళ్ళు బొమ్మల్లోనే చూస్తారో, చూడకుండానే మొగవాళ్ళచేత తెప్పించుకుంటారో - వాటివల్ల అందంకలుగుతోందా లేదా అనే ఆలోచన లేదు. అవి ఉపయోగించాముకదా అనే సంతుష్టితప్ప వేళ్ళు పాతుకున్నాయి వీళ్ళకి. ఈ పొలాలనించి కదల లేరు. కాని మనసులు వూరికే ఆరాటపడుతో వుంటాయి. వాళ్ళకే తెలీని దేనికోసమో! పాపం! కాని యీ అశాంతిలేకపోతే మరీ మోడులవుతారు. కాని యీ ఆవేదన హాస్యాస్పదమైన సర్వవసానాల వ్యక్తమవుతోంది. తృప్తిలోనించి కలిగే ఆతృప్తిలోనించి తృప్తి పర్యవసానం గావును జీవితానికి. ఆ హృదయాలలో యేమూలనున్న రసికత్వమో యే సౌందర్యతృష్నో, ప్రోత్సహించి యీ వికృతకార్యాల్ని చేయిస్తుంది. విద్యావంతులచేత కధలూ, పద్యాలూ వ్రాయిస్తుంది. రౌడీలచేత కూనిరాగాలు తీయిస్తుంది, తాగిస్తుంది, బూతులు మాట్లాడిస్తుంది.
"తృప్తి అమార్, ఆతృప్తి అమార్" అసే టాగూరు గీతం జ్ఞాపక మొస్తుంది.
"Love is just a trick of the heart to fool the mind" నిజమైన ప్రేమకూడా అంతేనన్నాడు మైకేల్ ఆర్లెస్. కానిరోజూ వినే యీ ప్రేమ! ప్రేమ! ప్రేమ! ప్రేమ అనే ఆమాటమీద యెంత ప్రేమ మనుషులికి! నిజంగా ప్రేమే ప్రత్యక్షమైతే గుర్తించగలరా? పురుషుడు ఆహ్వానించగానే మంచంవేపు చూస్తారు స్త్రీలు ఇంక ఇక్కడ వ్రాయకూడని పనులు చేసేవాళ్ళున్నారు చాలా మర్యాదస్తులు. ప్రేమనిగురించి మాట్లాడేవాళ్ళే! వీళ్ళందరికీ ప్రేమ అక్కడే ప్రారంభం. అక్కడే ఆ నిమిషానే అంతం. మొహాన్ని, అలవాటుని అతిక్రమించే ప్రేమనుగురించి వ్రాయపోతే అర్ధంకాక, అర్ధంచేసుకోవాలని ప్రయత్నించి, వ్యభిచారం, పశుత్వం, అని అరుస్తారు ... అంతా morbidity, perversity అని కుళ్ళు సంసారపుగదుల్లోంచి, వేశ్యల మాసిన దుప్పటి ముసుగులోంచి అరుస్తారు, ప్లీడర్లూ, డాక్టర్లూ, ముఖ్యం బొర్రలు పెంచుకున్న కురూపులూ, కవులూ.
గర్భాధానళతోనేగా వీరి ప్రేమచరిత్రలు ప్రారంభం.....అంటే 'రేప్'తో. ఒక్క యువకుడికీ యీ ఆచారాన్ని యెదిరించే ధైర్యంలేదు. ఈ నవీన స్వాతంత్ర్యం, దేశసేవ, సోషలిజమ్, నిప్పు లుకక్కే యువకులకి, ప్రేమజ్యోతులూ, ప్రేమాగ్నులూ, ప్రేమ మూర్చలూ, పొయ్యేయువకులకి, ప్రేమగీతాలు స్రవించే యువతులకి కూడా! ప్రతిదీ మానసం. అంతా మనోవాంఛ, మనోశూరత్వం, మనోకర్మ వీరత్వం. పయిగా వ్యాసాలూ, ఉపన్యాసాలూ, సంభాషణలోకాల్ని మింగేట్టుంటాయి. చేతికందనిదీ, ఏదో పూర్తిగా కార్యాలకి సాధ్యం కానిదీ, మాటలతో ఆఖరయ్యేదీ, ఏదో దూరపు మనో ప్రపంచం సంగతి యోచించడం, వోట్లకోసం తిరగడం అంతే జీవితం. గట్టిగా యింటో ఒక్క దురాచారానికి తిరగబడే బాలయోధుడు అరుదు. ఆ కమ్యూనిజమ్ వొస్తే అన్నీ చక్కబడతాయని ఒకరూ, హృదయం పరాయత్త మయిందని దిగులుతో యింకొకరూ, ముసలితల్లి అడ్డమున్నదని ఒకరూ. అందరికీ ప్రేమకావాలి, స్వేచ్చ కావాలి, యుద్దాలూ, విప్లవాలూ, యోచించేవారేగాని, తాము పుట్టిన స్తలంలో సంస్కారంగాని, తమ హృదయాల్లో స్వల్ప అభివృద్ధికాని ప్రయత్నిస్తున్నట్లు తోచదు. ఇంక ఏ ఉద్యమానికీ యింటివద్ద శక్తిలేక తమ లోపలీ స్వతంత్రాభిలాషనీ, మనో అశాంతినీ పట్టణాల్లోకివెళ్ళి అక్కడి కాఫీహోటళ్ళలో, గుంపుల్లో, రైళ్ళల్లో అక్కడవినే scandals లో Discussions లో తీర్చుకో చూస్తారు.
ఈ నీచదృష్టులన్నిటిలోంచి, బురదనీళ్ళపైన తేలుతున్న తెల్లని కలపవలె మనసులో తోస్తుంది నా చి ----- ఆకారం, దూరమైతే నేం జ్ఞాపకం తప్ప యింకేమీ మిగలకపోతేనేం? నా చి__కల్పించిన నిర్మలత్వం యీ ఆత్మనించి తొలిగిపోదు. ఎంత యోచించినా చి___శరీరానికివున్న గొప్పసౌష్టవంకన్న, మెరుపుకన్న అతిక్రమించిన సౌందర్యం ఏదో నా ఆత్మని కలత పెడుతుంది. అదంతా ఆమె heridity ఏనా లేక ఆమె సంపాయించుకుందా?
వుత్త అందంలో ఆకర్షణ స్వల్పం. తాకాలి చూడాలి అనిపిస్తుంది. అంతటితో తృప్తి కలుగుతుంది. Tooth paste బొమ్మ అందాన్ని Mono lisa నీ పోలిస్తే tooth paste బొమ్మే సలక్షణంగా వుంటుంది. కాని ఆత్మ, ఆత్మ పరిశుద్ధమూ, నిర్మలమూ అయివుండనక్కర్లేదు__ఆత్మ complex కానక్కర్లేదు. కొందరి ఆత్మల్లో రసికులైనవాళ్ళని పిలిచి, ఆపి, ఆలోచింపచేసి, ముందుకు రానిచ్చి, వెనక్కి భయపెట్టి, ఆశపెట్టి, ఆశ్చర్యపడచేసి, యీ mystery ఏదో తెలుసుకోవాలనే కుతూహలంతో చిక్కుపెట్టి, ఏమీ తెలియదనే నిరాశతో మగ్గించే గుణం వుంటుంది. టాగూర్ వర్ననలవలె, వుడ్ హౌస్ చక్కలగింతలవలె, మైకేల్ ఆర్లెన్ ఉపమానాలవలె, జపానం దేశపు రేడియో సంగీతంవలె, నరాల్ని అందంతో లాగి బాధిస్తాయి ఆ స్త్రీ సౌందర్యాలు. పురుష హృదయాల్ని ఏలిన గొప్ప స్త్రీలు గొప్ప సౌందర్యవంతులుకారు. పురుషహృదయం దేన్ని ప్రేమిస్తుందో దేన్నిచూసి మంటను వదలలేని కీటకంవలె అయి పోతుందో, ఆ గుణాన్ని ప్రదర్శించగలరు, ఏమీ ప్రయత్నం లేకుండా వూరికే వర్నిస్తారుగాని ఏ విధమైన అందమూలేని జుట్టు, ఏ వుపమానానికీ సరిపోనికళ్ళు, ఏ సన్నదనమూలేని నడుములూ, ఏ మెరుగూ లేని రంగు - ఏదో రహస్యమైన ఆకర్షణవల్ల ఏ నడకో, ఏ మాటమాధుర్యమో, ఏ కామవిస్ఫురణో రసికుల్ని దాసుల్ని చేసుకుంటాయి.
