సీ. ప్రహ్లాద నారద బక దాల్బ్య శ్రీశుక
కశ్యప గౌతమ కణ్వ కుత్స
కపిల వేదవ్యాస కౌశిక మాండవ్య
బలి విభీషణ భృగు పరుశురామ
జాంబవ ద్రుక్మాంగ దాంబరీషార్జున
వామదేవ వసిష్ఠవైనతేయ
మాండవ్య విదుర మార్కండేయ గాంగేయ
శౌనక బృహధశ్వ సదృశులైన
గీ. నిన్ను వర్ణింపనేర్తురే నీరజాక్ష
నన్నుఁ గృపతోడఁ జూడు మానధనాధ!
శ్రీమనోనాధ! మాధవ! శ్రీయనంత
పద్మనాభ! దయానిధీ! పరమ పురుష !
సీ. మాధవ! మీకధామాధురిఁ గ్రోలు నా
నాల్క దుష్కధల ననంగ నియకు
వైకుంఠ నిలయ! మీవర్ణనల్ వినునాదు
వీనులఁ బెఱకధల్ వినఁగనియకు
కమలాక్ష! మీ పాదకమలంబు సూచు నా
కన్నులఁ బరసతికాంక్ష యిడకు
శౌరి! నిలయంబు చేరఁ గోరెడు నాదు
చిత్తంబునకుఁ బరచింత యిడకు
గీ. ఘోరదురితంబు లెటునన్నుఁ జేరనియకు
మాయుర భివృద్ది కృప సేయుమయ్య నాకు
శ్రీమనోనాధ! మాధవ! శ్రీయనంత
పద్మనాభ! దయానిధీ! పరమ పురుష !
సీ. విన్నపం బవధారు విశ్వేశ యీపది
సీనముల్ చెప్పితిఁ జిత్తగించు
మిది కడుభక్తితో నేప్రొద్దు నుతి సేయు
పఠన సేయు మహానుభావులకును
నాయురైశ్వర్యంబు లతిశుభప్రదములు
విష్ణు కీర్తనములు వినుట బుద్ది
కోరిన కోరికల్ కొనసాగఁగాఁ జేసి
ధనధాన్యపుత్త్రపౌత్రాభివృద్ది
గీ. సకలసంపద్విశేషముల్ సౌఖ్యములును
గలుగఁ జేసి దృఢాంగులుగా నొనర్చు
శ్రీమనోనాధ! మాధవ! శ్రీయనంత
పద్మనాభ! దయానిధీ! పరమ పురుష !
శ్రీరంగనాధ స్తుతి
సీ. మంచినీలవుఁ జాయ మించు దేహమువానిఁ
గాచుచల్లని చూడ్కిఁ జూచు వాని
ఉరగేంద్రశయనుఁడై యెప్పుచుండెడు వాని
మేలై నపచ్చలతాళి వాని
కులుకునెమ్మోమున మొలక నవ్వు ల వాని
డంబైన మణికిరీటంబు వాని
గుఱుతైన నవరత్న కుండలంబుల వాని
పొసగిన కస్తూరిబొట్టు వాని
గీ. ఆదిలక్ష్మికిఁ బ్రాణేశుఁ డైన వాని
మీనకేతన జనకుఁడై మెఱయు వాని
నుభయకావేరి మధ్యమం దున్నవాని
రంగధామునిఁ బొడగంటిఁ బొంగుచుండి.
సీ. శ్రీరమా హృత్సంగ చిరకౌతుకోత్తుంగ
హస్తాగ్రకలిత రధాంగ రంగ
కవిహృద్వనజభృంగ కలుష తమ పతంగ
కనదంఘ్రీ సంభూత గంగ రంగ
అక్షయోగ్రనిషంగ రాక్షసమదభంగ
అంగజకోటి సమంగ రంగ
విమలకీ రిత్తరంగ విహగ రాజతురంగ
మకుటసంఘటితొత్త మాంగ రంగ!
గీ. చిరతరామ్నాయ పర్వత శృంగరంగ
పరమకారుణ్య రసమయాపాంగ రంగ
రక్షితానూన భద్ర సారంగ రంగ
భూరి నిగమాంతరంగ! కస్తూరి రంగ!
ఉ. సింగపు మోమువాఁడు తులసీదళదామమువాఁడు కామినీ
రంగదురంబువాఁడు వలరాయునిఁ గాంచినవాఁడు భక్తి కు
ప్పొంగెడు వాఁడు దానవులపొంక మడం చెడువాఁడు నేఁడు శ్రీ
బంగరురంగశాయి మనపాలఁ గలండు విచార మేటికిన్.
"కలగంటి నంతట మేలుకొంటి"
సీ. పానుపు పెనుబాము పడగలు నిగిడించి
చల్లని గాడ్పులచవులు గ్రోల
కౌస్తుభరోచులు కల్లోలపరిధూత
విద్రుమలతలతో వియ్యమంద
కదలుచున్నప్పుడు కనువిచ్చి చనువిచ్చి
యిందిర తన వక్షమందు నొదుఁగ
నభిపద్మ ములోనినలువ యొక్కొక మాఱు
జలపక్షి రవముల కులికి పడఁగ
గీ. కన్ను మోడ్చినయపుడ పాల్కడలిలోన
నుల్లమున లోకములఁ జూచుచున్న వాని
వారిజోదరు నీరజచారునయను
మెలఁత! కలఁగంటి నంతట మేలుకొంటి. 38
సీ. నాలుగు మోముల బాలునితో ఁ దన
బొడ్డున బాలెంత పూవు దనర
అడుగుఁ గెందామరఁ బొడమిన తేనియ
ముల్లోకముల మీఁద వెల్లిగొలుప
ఉరమున నున్న యిందిర చేతి కమలంబు
మెలఁగు తుమ్మెదల కామెతలు గొలుపఁ
గారామున నొకమనోహరతరశంఖంబు
పొలివోనినిండు వెన్నెలలు గాయఁ
గీ. బాలమున్నీటి కరడు లుయ్యాలలూఁప
ముదురునాగువు పైఁ గనుమోడ్చి యున్న
వాని లోకంబు లేలేడు వరుసవాని
మేలఁత! కలగంటి నంతట మేలుకొంటి. 39
సీ. తనకుఫణావళి తలయంపిగాఁ జేసి
పాన్పైనవాఁ డొక్కపాఁపఱేఁడు
తననాభిఁబూచినతామరఁ జదువులు
చదివెడునొక ముదిచదువువాఁడు
తన వక్షమున మనోజయంబునఁ (?) గ్రాలెడు
పుణ్యంపుఁ జూడ్కల పువ్వుఁ బోణి
తన మ్రోలమత్స్యావతారాదిలీలలు
తగిలిపాడెడు నొక్కదండె తపసి
గీ. సకల వేదాంతములుఁ దానజాడవెదక
నుదధీ పెన్నీఁటి పైఁ దేలుచున్న వాని
మేఘసంకాశరుచిగల మేని వాని
మేలఁత! కలగంటి నంతట మేలుకొంటి. 40
