Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 14


                           వివాహము

    రాజమహేంద్రవరములో సమస్త వైభవములతో శ్రీ శారదా నారాయణరావుల వివాహమహోత్సవము జరిగినది.
    అప్పురిలో జమిందారుగారి మందిరములన్నియు గన్నుల వైకుంఠముగ నలంకరించినారు. రోడ్లు, తోటలు పందిళ్లు వేయించినారు. జమిందారుగారి మేడలకు నాతిదూరాన రెండు మహాభవనములు మగపెండ్లివారికి విడిది లేర్పరచిరి. విడిదికడ నుండి జమిందారు గారి మందిరముల వరకు నొక పందిరి. విడిదిల కడను, జమీందారు గారి మేడలకడను, చాందినీలు, గులాబీలు, అగరునూనెల గాజుదీపాల బుడ్లు, తీగెల పండ్ల గెలలు, మెరుపులా పాదరసపు బుడ్లు, బుట్టలు, పూలతోరణములు, కొబ్బరికాయల గెలలతో పందిళ్ళలంకరించినారు.
    జమిందారు గారి విశాల భవనములో విశాల సభా స్థలమున వివాహ వేదిక నమర్చినారు. చిత్రాలంకార శోభితమై యా వేదిక దివ్యమై వెలుగొందుచున్నది. వివాహ సభామందిర మంతయు జుట్టములచే, సభ్యులచే గ్రిక్కిరిసి పోయినది. న్యాయవాదులు, జిల్లా కలెక్టరు, జమిందారులు, జిల్లా జడ్జీ, పోలీసు సూపరింటెండెంట్, ఇంక ననేకులు ఉద్యోగులు, పుర ప్రముఖులు సభ నలంకరించినారు. ఆంధ్రాది దేశముల నుండి పేరెన్నికగన్న వారెల్లరు ఆనాడు సభా భవనమున గ్రిక్కిరిసినారు. అందరకు పరుపులు, దిండ్లు నమర్చినారు. పెండ్లి వారందఱు నొకయెడ నధివసించినారు.
    పొన్నుస్వామి సన్నాయి మేళము వచ్చినది. మంగళ వాయిద్యములు భోరుమనినవి. 'అయంముహూర్తస్సు ముహోర్తోస్తు' అనుచు పురోహితులు మంత్రములు చదివిరి.
    సభా మధ్యమున ఐదువేల తులముల వెండిగంధపు గిన్నెయు, బంగారు పన్నీరు బుడ్డియు, బంగారు అత్తరువులదానును నొక దంతపు బీఠికపై సమర్పబడెను. సభలో నచ్చటచ్చట బీఠములపై సువాసన ధూపముల నెగజిమ్ము బరిణ లమర్చినారు.
    పండితోత్తములు సముద్ర గంభీర స్వనముల వేదఘోష సలుపుచున్నారు.
    ఆడువారికి వివాహవేదికకు సమీపమున తెరల మధ్యనొక స్థల మమరించినారు.
    సర్వాలంకార శోభితయై, పాలసముద్రమున జన్మించిన లక్ష్మీబాల వలె నున్న పెండ్లి కుమార్తె శారదను గంపలో గొనివచ్చినప్పుడు, పట్టు పీతాంబరముల ధరించి, వెడదయురమున హారములు శోభింప నారాయణరావు నాంది శ్రాద్ధమునకు లోనికి బోవునప్పుడు, జమిందారుగారు భార్యాసమేతులై సాలంకృత కన్యాదానము చేసి ధన్యులగునప్పుడు, నూతన వస్త్రాలంకార శోభితులై వధూవరు లొండొరుల ప్రక్క నధివసించినప్పుడు, మంగళ వాద్యములు బోరున విప్రాశీర్వాదములు దిశలు నిండ నారాయణరావు శారదకు మంగళసూత్రధారణ కావించునప్పుడు, వధూవరులు తలంబ్రాలు పోసికొనునప్పుడు జానకమ్మగారును దక్కుంగల చుట్టము లెల్లరు నపరిమిత సంతోషమున నోలలాడిరి.
    వివాహ సమయమున జమిందారుగారు భూరిసంభావన లిచ్చినారు. రాజమహేంద్రవరములోని వితంతూద్వాహ మండలివారికి వేయిన్నూటపదారులిచ్చిరి. జమిందారు గారి బంధువులు స్నేహితులు వధువునకు విలువగల బహుమతులు గొనివచ్చినారు. కొందరు వెండి చెంబులు, కొందఱు కాఫీ గిన్నెల దొంతరలు, గంధపు బుడ్లు, వెండి సబ్బు పెట్టెలు, బంగారు నగలు మొదలగు రకరకముల పారితోషికము లొసంగిరి.
    పెండ్లి కుమార్తె చుట్టములందరు నవనాగరికులు. ఆంధ్రదేశములోని సంపన్న గృహస్థులు, ఎల్లప్పుడూ పట్టుచొక్కాలు ధరింతురు. జుట్టు నున్నగా దువ్వుకొందురు. కంటి అద్దముల జోళ్ళు వారికి సార్వకాలిక భూషణములే. ఆడువారికే కంటియద్ధములున్నవట. వారెప్పుడు నూరేగింపులకు రారు. సభల నలంకరింపరు. వారందరకు సేవకులు, సేవకురాండ్రు పెక్కురుందురు. తమ బిడ్డలకు పాలిచ్చుకొని ముత్తయిదువులు వారిలో లేరు. కొందఱు బాలికలు కాళ్ళకు జరీ పువ్వుల మొఖమల్ జోళ్ళు సంతతము తొడిగికొని యుండుటచే పాదములకు బారాణిపూయుటకు వీలులేకపోయినదట.
    మగవారు మగపెండ్లివారితో బంక్తిభోజనమునకు రాలేదు. అచటి గాయకుల గానసభలు వారి హృదయము లాకర్షింపలేదు. స్వంత బ్రాహ్మణులు దారిచూపవారికి నేరుగా నేర్పరచియున్న భోజనశాల కరిగి భోజనము చేయుట, వార్తాపత్రికలు, 'నావెలు' గ్రంథములు చదువుకొనుట, సిగరెట్లు కాల్చుకొనుట వారి దినచర్యయైయుండెను.
    మగపెళ్ళివారు పల్లెటూరివారు. అచారాదికములు వారికి మెండు. ఊరేగింపునకు వారు సిద్ధము. వెలగల బనారసు చీరలు ధరించుట, దేహమెల్ల బంగారు నగలు ధరించుట, పాదముల బసుపు పారాణులు పూయించుకొనుట, పేరంటములకు దండ తండములుగా వచ్చుట, పెండ్లిపాటలు పాడించుట, పాడుకొనుట మున్నగు బెండ్లితంతులెల్ల మగపెండ్లివారి యాడంగులే గుత్తకు గైకొనిరి. వియ్యపురాలికి, నాడు బిడ్డలకు నయిదురోజులు మొగములు కడిగించుట మొదలగు తంతులన్నియు క్రమముగా జరుగవలెను గాన, ఇష్టము లేకపోయినను వరదకామేశ్వరీదేవి ప్రతి వేడుకకు రావలసివచ్చినది.
    మగపెళ్ళివారిలో మగవారు అన్ని సభలకు హాజరు. వారి సంగీత ప్రీతియు, దలలాడించుటయు, జేతులతో తాళము వేయుటయు వింతగా జెప్పుకొనిరి.
    జమీందారిఫాయాలో జేరిన ఆడపెండ్లివారికి మగపెండ్లివారి ఆడువారు కాళ్లకు నగలతో పసుపు బారాణులతో ముత్తయిదువులవలె కనిపించిరట. గజ్జలగుఱ్ఱముల వలె దోచినారట!
    'ఇంత పల్లెటూరివాళ్ళని మనం అనుకున్నామటమ్మా. వట్టి మోటు అడవి మనుష్యులవలె ఉన్నారు. ఈ సంబంధం ఎక్కడ తెచ్చారండీ అత్తయ్యగారూ!' అని వరదకామేశ్వరీదేవితో నొక దగ్గరిచుట్టము, సరోజని యనినది. 'అమ్మా, శారదను తీసుకువెళ్ళి పల్లెటూళ్ళ పేడదొడ్లలో పడవేశారేమమ్మా?' అని శకుంతలాదేవి చిన్నబోయిన మోముతో ననినది.
    'వదినా! మీ అమ్మాయికి మా అబ్బాయికన్న చాలా గొప్ప సంబంధం తెచ్చారనుకొన్నాము. చూడముచ్చట వేస్తోంది. మావైపు పనిచేసేవాళ్లు ఇంతకన్న చాలా నాజూకుగా ఉండిపోతారే' అని జగన్మోహనరావు జమిందారుగారి తల్లి శివకామసుందరీదేవిగారనిరి.    
    'అవునండీ పిన్నీ, వాళ్ళ బట్టలు వాళ్లే ఉదుక్కుంటారట. పిడకలు చేసుకుంటారట. నీళ్లు తెచ్చుకుంటారట. పొలాలు వెళ్ళి గడ్డీ గిడ్డీ కోసుకుని, మోపులు కట్టి తెచ్చుకుంటారట' అని జమిందారు గారి వేలువిడిచిన మేనకోడలు లలితకుమారిదేవి యనినది.
    'ఆ నగలేమిటి? ఆ బొట్లేమిటి? ఆ చీరలేమిటి? గాడిదలకు దిగబోసినట్లే! కోరి కోరి వెదికి వెదికి తెచ్చారే!' అని మరియొక శ్రీమతి ముక్కుపై వేలు వేచుకొనినది.
    అందఱు వెడవెడ నవ్వులు విరగబడి నవ్వుకొనినారు. వియ్యపురాలు జానకమ్మగారు గూడ వారి హేళనకు గురియైనది.
    'ఆవిడేనా వియ్యపురాలు! కూడా వచ్చిన పేరంటాలనుకున్నాను!' అని హైకోర్టు న్యాయవాది ఆనందరావుగారి భార్య ప్రమీలాదేవి యనినది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS