'ఇంతకూ మా శారద అదృష్టం యిలా అయింది' అని వరదకామేశ్వరీదేవి కన్నుల నీరునింపుకొంది.
ఆ ప్రక్కనే సోఫాపై నధివసించి యీ సంభాషణ లాలకించు శారద హృదయములు పరిపరివిధముల బోయినది.
ఆమె తోటిబాలిక యోకర్తామెకడనే వసించి యున్నది. ఆ బాలిక కేలనో నారాయణరావు చక్కనివాడని తోచినది. ఆ బాలకు మొన్నమొన్ననే వివాహమైనది. ఆమె వరుడు గూడ శ్రీమంతుడు. విద్యావంతుడే! అయినను తేజస్సుతో నిండిన నారాయణరావు మొగము, అతని రూపసంపద ఆ బాలికకు జూడముచ్చటయైనది. ఆ బాలిక శారద పినతండ్రి కుమార్తె. ఆమె పేరు నిరుపమా దేవి. ఆ బాలిక జనకుడు చెన్నపట్టణములో న్యాయవాదిగా నున్నాడు. శారదకు, నా బాలికకు మిక్కిలి స్నేహము. 'శారద! నీ భర్త ఇంగ్లీషు భాషలో చాలా గొప్పవాడే!'
'ఎలా తెలిసిందే నీకు?' క్రొత్తక్రొత్త ప్రపంచములో గన్నులు విప్పు నీ బాలికకు సిగ్గులుండరాదని వారి మతము. సిగ్గుపడువారిని గాంచి పల్లెటూరి వారని వారిలో వారే నవ్వుకొందురు.
సంబంధము తండ్రి తెచ్చినాడు. బాబయ్యగారు తెచ్చిన సంబంధము నందు లోపములుండగూడదు. పెళ్ళివారందరూ పల్లెటూరివారే. పల్లెటూరివారగుటయే లోపమైనచో బాబయ్యగారి కది గొప్ప సంబంధమని యెట్లు తోచినది? బాబయ్య గారికి తనపై చాలా ప్రేమ. ఎందుకిట్టి సంబంధము తెచ్చినారు? లోన సిగ్గుపడుచు... పెండ్లి... చాలా అందంగా ఉండెననియా అనుకొనినది. అంతలో ఆమె త్రపాహృదయయై ఆ ఆలోచన మానుకొన్నది. ఆమె మోము చిరునవ్వున ప్రఫుల్లమైనది.
'ఏమిటే శారదా! చిరునవ్వు నవ్వుతున్నావు' అని నిరుపమాదేవి యన్నది.
'ఏమీ లేదే?'
'వూరకనే నవ్వుకుంటారటే!'
'ఏదో ఆలోచన తట్టి నవ్వు వచ్చింది.'
'ఏమిటా ఆలోచన! మీ ఆయన మీదేనా?'
'నువ్వు నన్ను వేళాకోళం చేస్తావేమిటే? వరసా తెలవదు వావీ తెలవదు!'
'నువ్వు వరస కాకపోవచ్చును. కాని బావగారు కాదా ఏమిటి?'
నిరుపమకు బావగారా! నిరుపమ తనకన్న కొంచెము పెద్దదిగా! నిరుపమ యా యాలోచన గ్రహించి 'బావగారని ఎందుకన్నానంటావు? మనం ఇద్దరం కొంచెం యెచ్చుతగ్గు ఒకేయీడు. అందుకని బావగారన్నా. తప్పులేదే!'
నిరుపమ నారాయణరావును సంతతము మేలమాడునది. నిరుపమ ఆడపిల్లల పాఠశాలలో అయిదవ ఫారము చదువుకొనుచున్నది. నారాయణరావా బాల హృదయము చూరగొనినాడాయన నిమిషమైనను నతనిని వదలక ఇంగ్లీషులో సమస్త విషయముల గురించి మాట్లాడునది.
శారద యిది యంతయు జూచి యించుక యక్కజమందినది. నిరుపమ శారదను జూచి_
'మీ ఆయన చాలా తెలివైనవాడే. ఏ సంగతైనా నేనడిగేటప్పటికి, అతివిపులంగా తెలిసేటట్లుగా మంచి కథలా చెప్తాడే. ఎన్ని సంగతులు! ఎంత బాగా తెలుసును! మా మాష్టరుగారు పుస్తకము చదువుకొని వచ్చి మాకందరకూ చెపితే నిద్రవస్తుంది. నాకు ఇంటిదగ్గర చెప్పే మా మాష్టరు గారు చెప్పిన దానివలన పాఠం అర్థంకాకపోవడమూ ఉన్నది. కాని మీ ఆయన అద్భుతంగా పాఠం చెప్పగలడు. ఆయన దగ్గిర పాఠాలన్నీ చెప్పించుకుంటూంటే చాలా బాగా ఉందును' అని పంచమస్వనంతో పలికింది.
'చెన్నపట్నంలోనే ఉంటావు! అక్కడ అన్నీ చెప్పించుకోవచ్చును.'
'అదిగో అప్పుడే ఉడుకుపోతుతనం! ఎక్కడ వీలవుతుంది? మా నాన్నగారితో చెప్తాను. మీ ఆయనకు చాలా బాగా సంగీతం వచ్చునట. పెండ్లికూతురు చూపులకు వచ్చినప్పుడు ఫిడేలుమీద అద్భుతంగా వాయిస్తూ పాడినారట కదూ! అమ్మదొంగా! చెప్పావు కాదు. బొమ్మలు వేయడం కూడా బాగా వచ్చునట!'
'ఏమో నాకేమి తెలుసునే నిరుపం! నువ్వు అవికూడా నేర్చుకోవచ్చునులే!'
ఆ దినమెల్ల శారద తాను వినిన మాటలు, నిరుపమాదేవి పొగడ్త మాటలు దలచుకొనుచునే యున్నది. ఆయన పల్లెటూరి అనాగరికులలో నొక వ్యక్తియా కాదా యని యామె తర్కించుకొనినది. అతని యుత్కృష్ట వ్యక్తిత్వమును ఆమెకు గోచరించినది. అంతకన్న నాబాల యాలోచింపలేదు. ఆలోచించుట కామె హృదయమునకు బరిపక్వస్థితి రాలేదు. నిరుపమ నగరవాసిని. అట్టి బాల కన్ని సంగతులు తెలియును. తనవారెల్లనట్టులనిరేమి? నిరుపమ యీరీతి బలికినదేమి? ఆ రోజున ఆయన వాయించిన ఫిడేలు వాద్యము ఎంత అద్భుతమైనది!
పెండ్లి రెండవరోజు మధ్యాహ్నము జగన్మోహనరావు జమిందారు పెండ్లికుమార్తె శారద కడకు వచ్చి, ప్రక్కనే సోఫాపై అధివసించినాడు. శారద ఎంత అందగత్తె! సినిమా నటియగు సులోచన వలె యున్నది. శారదకీ యందమెక్కడనుండి వచ్చినది? ఆమె తన కౌగిలిలో లతవలె నిమిడి పోవును. తన కిచ్చెదరనుకొన్న యీ బాలిక నేడింకొకని భార్యయైనదా? ఎవడీ నారాయణరావు? ఈ సంబంధమెట్లు తీసికొనివచ్చినారు? పందికిని బాలలక్ష్మికిని పాణిగ్రహణమట!
'శారదా! ఏమిటా గర్వము! మాట్లాడుట మానివేసినావు? మంచి పోతరించిన గిత్తలా వున్న మొగుణ్ణి తెచ్చుకున్నానని గర్వమా ఏమిటి? ఎక్కడ నుంచి తెచ్చారు నీకీ మొగుణ్ణి? కాకి ముక్కుకి దొండపండు కట్టినట్లు నిన్ను తీసుకెళ్ళి వట్టి బండాడికి కట్టపెట్టారు. మామగారికి ఎట్లా నచ్చిందీ సంబంధం? అత్తకు నచ్చలేదుటగా? ఈ నీ బంగారు విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ రాక్షసుడి వొళ్ళో పారవేసినారేమిటి?'
శారద యతని పలుకులకు ప్రతిమాట చెప్పినది కాదు. ఆమె గుండెం మాత్రము దడదడ కొట్టుకొనినది.
'మాట్లాడవేం? ఆ! నీ మొగంచూస్తే నీకు వీడంటే అసహ్యమనే తోస్తుంది. కాదు మరీ! కాస్త డబ్బు కాస్త చదువు వుంటే పెద్ద కుటుంబం వాడవుతాడా? నాజూకు వాడవుతాడా? ఈ పందిని చూసుకొని నువ్వు కులక బోతావాయేం! అట్లా ఒక్క నాటికి నీ మనస్సు పోతుందా!'
శారద కొక్కసారి కన్నుల నీరు తిరిగినది. అచ్చట నుండి లేచి, విసవిస నడిచి, మేడమీదికి పోయినది.
