Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 13


                                            చిన్నవాడు

    ఆ రాత్రియంతయు నారాయణరావునకు నిద్రపట్టలేదు. సూర్యారావుపేటలో భీమరాజు గారి మేడమీద ఆరుబైట వేసిన మంచముమీద వెల్లకిల బరుండి నారాయణరావు అశ్వినీ దేవతలు, బ్రహ్మహృదయము, అనూరాధ, తుల, వృశ్చికము, ధృవుడు మొదలగు తారామండలమునంతయు జొచ్చి చూచు చూపులతో గమనించుచుండెను. నక్షత్రవిరాజితమగు నయ్యాకాశకాండపటములో దన చిన్ననాటి కోర్కెలన్నియు నాతనికి మూర్తములై గోచరించినవి. చిరుత కోర్కెలతో దేశాలు గ్రుమ్మర దానును గోరువాడు. పాశ్చాత్యదేశము లతని మనోలోచనాలకు దన చుట్టముల గ్రామముల రీతి దోచెడివి. సీమ దేశములో రాణి గారు, రాజుగారుందురనియు, నచట నన్నియు బంగారపు మేడలనియు నతడూహించుకొనువాడు. రాజమహేంద్రవరమునకు దూరమై గోచరించు పాపికొండల వెనుక సీమదేశమని వాదించువాడు తోటి బాలురతో వీధులలో డబ్బులు, బేడకాసులు, పావలాలు, రూపాయలు చిమ్మియుండునని భావించెడివాడు.
    సీమ దేశములోని భాగములే జర్మనీ, ఫ్రాంసు, ఇటలీ మొదలగు దేశములని యెంచెడివాడు. ఆ చిన్ననాటి ఊహా ప్రపంచమంతయు దాను విన్న కథలలో నల్లిబిల్లిగా నల్లుకొనిపోయి యుండునది. రాములవారి పుష్పక విమానము మీద తానధివసించి ఏ కాలమును దేశాటనము చేయుటయే కోరువాడు. ఆనాటి కలలలో రాజకుమారిక రాక్షసులు, రాజులు, రాజ్యాలు కనబడ్డవి. తాను రెక్కలున్న గుఱ్ఱముపై స్వారి చేయుచునో, 'జయ పరమేశ్వరా' యని తాదలంచుకొన్న చోటికి వాయువేగ మనోవేగములతోను దన్నుగొనిపోవు మంత్రపు బాంకోళ్లపై నెగిరిపోవుచునో తన తండ్రిగారి కథలలో రాజకుమారుని వలె గత్తిపుచ్చుకొని రాక్షసుల నుక్కడగించుచునో యుండువాడు. రాజకుమారికలను వివాహమాడువాడు. ఎనిమిది సంవత్సరముల ప్రాయమునాడు, నారాయణరావు కలలో 'దేశము' 'స్వరాజ్యము' వినబడ్డది. తెల్లవారు మన దేశములోని ధనము కొల్లగొనుచున్నారను భావములు చొచ్చిరా నారంభించినవి. బెంగాలులోని యువకులు చేయుచున్న వానికంటే భయంకరమైన బాంబులు తయారుచేసి భరత ఖండము తప్ప, మిగిలిన దేశములను భస్మీపటల మొనరింపవలెనన్న తీవ్రేచ్చలతో నాతని హృదయ మావేశపూరితమైపోయినది. ఒకనాడతడు ముఖముమీద 'వందేమాతరం' అని వ్రాసికొని, తోడి బాలురకు కూడ వ్రాసి, పాఠశాలకు వెళ్ళినాడట! ఆనాడతని తరగతి ఉపాధ్యాయుడు, వీరినందరిని బల్లమీద నిలుచుండబెట్టి యా వ్రాత కడిగివేసికొన యాజ్ఞాపించెను. నారాయణరావు తన్నురిదీయవలెనేగాని మొగముమీద వ్రాత జెరపనన్నాడు. నారాయణుని తెలివి తేటలు, వినయ విధేయతలు, రూపసంపదయు నుపాధ్యాయులంద యనురాగమును జూరగొన్నను, ఆనాడు నారాయణరావిచ్చు జవాబులచే నుపాధ్యాయులకు వెఱ్ఱియెత్తిపోయినది 'మొదట నోరుముయ్యి! తర్వాత మొఖంమీద రాత చెరిపెయ్యి, లేకపోతే నీ వీపు చితకకొడతా!' అన్నాడు ఉపాధ్యాయుడు.
    "మీరూ తెల్లవాళ్ళ స్నేహితులే! మాకు స్వరాజ్యం కావాలి, అందుకని నేను చెరపను. వీళ్ళెవ్వరూ చెరపరు' అని జేవురించిన మొగముతో బాలకుడగు నారాయణరావు సింహదమనుని వలె గర్జించినాడు.
    ఆ ఉపాధ్యాయుడు తెల్లబోయినాడు. పేము బెత్తము దీసి రెండు దెబ్బలు వీపుమీద చురుక్కున జఱచినాడు. నారాయణరావు చెంగున బల్లపై నుండి యురుకుటయు, నుపాధ్యాయుని చేత నుండి బెత్తము లాగుకొని, ముక్కలు ముక్కలుగా విరిచి పారవేయుటయు, గనుమూసి తెరచునంతలో జరిగినది. బాలకులందరిలో పొడగరియై, చక్కని దేహ సౌష్టవముగల నారాయణరావు మోమున నప్పుడు వెలుగు నపూర్వ తేజము గాంచి ఉపాధ్యాయుల వారు భయకంపిత హృదయులై, మోము వెల్లనైపోవ, మ్రాన్పడిపోయినారు. బాలకులు భయాశ్చర్యములతో, ఏమి జరుగునోయని తేరిపార జూచుచుండిరి.
    నారాయణరావు 'రండఱ్ఱా! వందేమాతరం' అని కేక వేసి వీధిలోనికి దారితీయ, బాలకు లతని వెనుక 'వందేమాతర' మని కేకలు వేయుచు వీధిని బడిరి.
    ఆ రాత్రి, సుబ్బారాయుడు గారు పుత్రుని బిలిచి యంతయు దెలిసికొని కోపగించిరి. ఉపాధ్యాయుడు నారాయణరావును సమీపించి 'నాయనా నేను పిల్లలుగలవాణ్ణి. నీకిట్టిపనులు సేయుట కెవరు బోధించారో నాకు తెలియదు. నా ఉద్యోగమూడబీకి వేస్తారు. తిండికి గుడ్డకు దూరమై ముష్టి చెంబు చేతికి వస్తుం'దని నీళ్ళు తిరుగు కళ్ళు తుడుచుకొనుచు వక్కాణించినాడు. నారాయణరావుకును గనుల నీరు తిరిగినది. అప్పటినుంచి పాఠశాలలో నాతడెప్పుడట్టిపనులొనరింప లేదు. నారాయణరావు మొదటి ఫారము చదువుచుండగా నెరోపీయ మహాసంగ్రామము ప్రచండోష్ణ వాయువువలె విశ్వమెల్ల వీవదొడంగెను. నారాయణరావు లేత హృదయమున నాంగ్లేయుల పైనపుడు జాలిపొడమినది. 'ఈనాడు వారికి రాజ్యవినాశము సంభవించి విపత్తు వచ్చినది. పాపము తెల్లవారి బాలకులెందరో తండ్రులు లేని బాలకులైపోదురు. కాన, వారికి మనమంతా సహాయం చేయాలి' అని వాదించాడు తోటి బాలురతో. సరేయన్నారు వారు. చందాలు వసూలు చేసి, తను తల్లిగారినడిగి పదిరూపాయలు చందావేసి, మొత్తము పడునేను రూకలు పెద్ద కలెక్టరుగారు కొత్తపేట మకాము వేసినప్పుడు నిర్భయముగా వారిని దర్శించి 'యుద్ధమునకు మా బాలకుల చందా' యని సమర్పించినాడు. ఆ యాంగ్లోద్యోగి ఆశ్చర్యపూరిత హృదయుడై ఈ నూలుపోగు వేయి మడుంగులు శక్తిగల త్రాడగుననియు, ప్రభుత్వము వారి తరఫున నా చిన్న బాలకునకు ననేక నమస్కారము లర్పించుచున్నాననియు, నాంగ్ల సామ్రాజ్యమున కానాడు సంభవించిన యాపత్తునకు భారతదేశము చూపు రాజభక్తి, యనన్యసామాన్య మనియు, నట్టిభక్తికి నీ బాలకుడే నిదర్శనమనియు నిండుసభలో నుపన్యసించుచు, తనకడనున్న లాంబ్ కవి శేఖరుని 'ఎలియా' వ్యాసముల గ్రంథము నారాయణరావునకు బహూకరించెను.
    నారాయణరా వీయాలోచనలు తన్నలమికొన, హాయిగా నిదురగూర్కు లక్ష్మీపతిని గమనించి, యేల ఇట్లీ తనికి సుఖనిద్ర పట్టెనని యాశ్చర్యము జెందినాడు. ఒకరికి గష్టమగు విషయ మింకొకరిని రవ్వంతైనా చలింపజేయదు. ఒక్కరిని సంతోష సముద్రమున నోలలాడించు విషయమే వేరొకరిని దుఃఖ జలధిని ముంచును. ఏ స్మ్దర్భములోనైన హృదయ మావంతయు జెదరనీయని తాను, రామచంద్రరాయని ప్రయాణముచే నిట్లు కలత జెందుచుండ, లక్ష్మీపతి, తన మరదలి భర్త యిట్లు దేశములు తెగించిపోవుట కించుకైన జలింపక, గాటముగా నిదురించుచుండుట గాంచి, సృష్టిలో నొక్కొక్కరి ప్రకృతి యొక్కొక్క రీతి నుండును కదాయని నారాయణరావనుకొనెను. లక్ష్మీపతిని లేపుదామని యతనికి గోర్కె జనించినది. కాని వెంటనే మరల్చుకొనినాడు. వివిధములగు రంగులతో, విచిత్రములగు కలయికలతో మేళవింపై నిగూఢార్దపూరితమగు మానవజీవిత మంతయు జక్కని చిత్రలేఖనమేయని యతడనుకొన్నాడు.
    కావుననే, ప్రకృతిని ప్రాతిపదికగా, నాధారభూతముగ నొనర్చుకొని కళాసృష్టి చేయవలసి వచ్చినది. ప్రకృతి ననుసరించుటయు నొక కళాసాంప్రదాయమగుట సంభవించినదని, యతడూహించుకొన్నాడు. సర్వదా మన కనులయెదుట నుండి, మనకు జిరపరిచితములగు వస్తువులే ఛాయాచిత్రమగుట తోడనే ఆనందము సమకూర్చుచున్నవని యతడనుకొనెను.
    ప్రక్కయంతయు జల్లబడిపోయి హాయిగా జల్లగాలి వీచుచున్నను, నారాయణరావు తనకు నిదురపట్టుట లేదని వితర్కించుకొనినాడు. నిదురబోవునపుడు మనఃప్రవృత్తులడగిపోవునా? ఆతురత వలననో, యే గాఢాలోచనా తీవ్రత వలననో మెదడు పనిచేయుటచే నిదురబట్టదు కాబోలు! తన బావమరిది ఖండాంతరములకు పోయి యశస్సు గడించివచ్చును. ఇందు విషాదకారణ మేమున్నది? సూర్యకాంతమన్న దనకు నెక్కుడు ప్రేమ. ఆ బాలకు గష్టము కలుగు నేకార్యమైన దనకు విషాదము కలిగించును. కావుననే నేడు తానట్లు గజిబిజిపడిపోవుటకు గారణమైనది.
    అహో! యీ నిర్మలాకాశమున మిరుమిట్లు గొలుపు నీ వేలకొలది తారలు నిశ్శబ్దగీతికలు పాడుకొనుచున్నవి. ఈ నిశ్చలత ధ్వనిపూరితమయ్యు నిశ్చలత యెట్లయ్యెను? ఈ నిశ్శబ్ద రాగాన, నీ కీచురాళ్ళు నిద్రలోని ఉచ్చ్వాస నిశ్వాస స్వనములు. దొడ్డిలోని యావుల కదలికలు, నక్షత్రమండలము నుండి రాలిపడు నుల్కలు, దారిని బోవు బడిగంట, ఉదయించు చంద్రకిరణము, నెటనుండియో వినవచ్చు బాలకుని యేడ్పు_నీవియన్నియు, నేతలు సమన్వయింప బడినవో! ఒక్క రాగములోని స్వరకల్పనమైనవి.
    నారాయణరావు హృదయమున నీయఖండసృష్టిపై ప్రేమ పొంగిపొరలి పోయినది. అతడు భూమ్యాకాశముల నిండినట్లయినది. నీల గగనము, నిశ్చల తారకలు నతనిలో లీనమైపోయినవి. తనకు బ్రాణవల్లభగా నిశ్చయింపబడిన శారదాదేవీ స్వరూపమై ప్రకృతి తన్ను కౌగిలించుకొన్నది.
    శారదాదేవి నిరుపమాన సౌందర్యవతి. తానెంత పుణ్య మొనర్చెనో యా బాలికను భార్యగా బడయుటకు, ఆమెతో  దా నోలలాడనున్న స్వర్గ సౌఖ్యము లతనికి గోచరించినవి.
    తన్ను చిరునవ్వుతో, దారానయనములతో, చంద్రకాంతి పుష్పముల బోలు బుగ్గల సుడులతో జేరవచ్చు శారదలో లక్ష్మీపతిని, సూర్యకాంతమును, రామచంద్రుని విడివిడిగా జూచినాడు. వారలలో దనతల్లి గోచరించినది. అందఱు నొక్క సంశ్లేషంబున చంద్రబింబమై గగనవీధి పథముల నెటకో తేలియాడుచు బోవుచున్నారు. తా నేరి యంకముపైననో శిరము వాల్చి, శీతలమై, హంసతూలికాసమమై, మెత్తనగు నా తొడలో కరిగిపోయినాడు. ఆ తొడయే చంద్రబింబమైనది.
    రెండు గంటలు లోని హాలులోని గడియారము 'టంగు, టంగు'మని పాడినది. నారాయణరావు నిదురలో మైమఱచినాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS