Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 13

"షాకయిపోలేదా?" అంది ప్రగతి ఆశ్చర్యంగా.
"ఎందుకు షాకయిపోవడం?" అన్నాడు సాహస్.
"నేను నిన్ను కాకుండా మా ఆఫీసర్ నే చంపెయ్యడం చిత్రంగా లేదూ!"
"నువ్వు మంచి అమ్మాయివని నాకు తెలుసు!"
"ఎలా?" అంది ప్రగతి కన్ ఫ్యూజన్ గా.
"ఎలాగంటే...నువ్వు మంచి అమ్మాయివి కావచ్చు... మంచి ఆఫీసర్ వి కావచ్చు... మంచి తెలివైన దానివి కావచ్చు... కానీ... నువ్వు మంచి నటివి కావు. అందువల్ల" అన్నాడు సాహస్.
"అంటే..."
"కళ్ళలో క్రౌర్యం ప్రదర్శించాలని చాలా తాపత్రయ పడుతున్నావు. గమనిస్తూనే వున్నాను. కానీ... ప్రియుడు ముందు ప్రియురాలికి పైట ఎలా నిలవదో... అలాగే, నీ కళ్ళలో క్రౌర్యం కూడా అలాగే నిలవలేక జారిపోతోంది. అందువల్ల!"
ప్రగతి చెంపలు ఎర్రబడ్డాయి.
"వాట్ డూ యూ మీన్!" అంది కోపం పలికించడానికి ప్రయత్నిస్తూ.
"నేనూ మొదట్లో కన్ ఫ్యూజ్ అయ్యాను... అందుకని... నువ్వు మహానటివి కాకపోవచ్చు కానీ... మంచి నటివి అనవచ్చునేమో... పాస్ మార్కులూ ప్లస్ గ్రేస్ మార్కులూ కలిపితే..." అన్నాడు సాహస్ నవ్వుతూ.
"చెప్పు! జరుగుతోంది ఏమిటి?"
"నా పేరు ప్రగతి అనీ, నేను ఐ.పి.ఎస్. ఆఫీసర్ ని అనీ నీకు అర్థమయ్యే వుంటుంది. మా నాన్నగారి పేరు గంభీర్. ఆయన ఐ.ఏ.ఎస్. ఆఫీసర్. మాది తరతరాలుగా దేశభక్తుల కుటుంబం. ప్రతి తరంలో కూడా మా కుటుంబం నుంచి కనీసం ఒక్క సభ్యుడైనా దేశం కోసం ప్రాణత్యాగం చేసినవాడే. ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి ప్రజలను బుజ్జగించడానికే తన సలహా సంఘానికి చీఫ్ గా మా నాన్నగారిని వేశాడు. తలుచుకుంటే నేనూ, మానాన్నగారూ ఇప్పుడే ఇక్కడే తిరగబడగలం. కానీ అందువల్ల ప్రయోజనం ఏముంటుందీ? క్షణంలో సగంలో మా ఇద్దరినీ కూడా నల్లుల్ని రాచినట్లు నేల రాసెయ్యగలడు సర్వాధికారి. అందుకే - వీ జస్ట్ వాంటెడ్ టు ప్లే అలాంగ్! మేమిద్దరం కూడా సర్వాధికారివైపు వున్నట్లే నటిస్తున్నాం. అంతే! ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి నిన్ను ట్రాప్ చెయ్యమని చెప్పాడు. చేశాను. ఇప్పుడు మళ్ళీ నిన్ను వదిలేస్తాను. నువ్వు బయట వుండి, సర్వాధికారి ఆట కట్టించే సంగతి చూడు. మేము ఇక్కడే వుండి వీడ్ని ఒక కంట కనిపెడుతూ వుంటాం!" అంది.
మెరుస్తున్న కళ్ళతో ప్రగతి వైపు చూశాడు సాహస్.
"థాంక్స్ ప్రగతీ!"
"ప్లీజ్ డోంట్ మెన్షన్! దటీజ్ మై డ్యూటీ!"
అది సరే! ఇప్పుడు మమ్మల్ని ఎలా వదిలేస్తావు..." అన్నాడు చిరునవ్వుతో.
"ఆ ప్లాను ఏదో నువ్వే చెబుతావనే ధైర్యంతో వున్నాను నేను" అంది ప్రగతి.
నవ్వాడు సాహస్.
అదే క్షణంలో
బోనులో వున్న పులి మెల్లిగా కదిలింది.
అప్పటిదాకా సెడేషన్ లో వున్న ఆ పులికి మగత తొలుగుతున్నట్లుగా వుంది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని, పెద్దగా గాడ్రించింది పులి.
"ఐడియా!" అన్నాడు సాహస్.
"ఏమిటి?" అంది ప్రగతి.

                                              *    *    *    *

రాజధానిలో అంతా కలకలం!
ప్రభుత్వం మారిందని ప్రజలందరికీ తెలిసిపోయింది!
జనంలో ఎగ్జయిట్ మెంట్! వీధుల్లో ఎక్కడ చూసినా ఆలివ్ కలర్ యూనిఫారాలు! సైనికులు... టాంకులు... మిలటరీ జీపులు... సైరన్లు... తుపాకులు... హెచ్చరికలు...
ఒక బస్టాపులో...సిమెంట్ బెంచి మీద ఒక వ్యక్తి కూర్చుని వున్నాడు.
చాలా వికృతమైన వ్యక్తి!
అయితే -
అతని వికృతాకారంలో కూడా ఒక 'ఆకర్షణ' లాంటిది వుంది.
ఎలాంటి ఆకర్షణా?
గుడికో, జాతరకో వెళ్తారు జనం. అక్కడ అనేకమంది బిచ్చగాళ్ళు వుంటారు. అయితే - వాళ్ళందరికీ ధర్మం చెయ్యరు జనం. వాళ్ళలో అతి వికృతంగా వున్నవాడికో, అతి చిత్రంగా ఆర్తనాదాలు చేస్తున్న వాడికో ధర్మం చేస్తారు. అంటే - వికృతాకారంలో కూడా ఆకర్షణ!
అలాంటి 'ఆకర్షణే' వుంది ఇతనిలో కూడా!
అతను చాలా పొట్టిగా వున్నాడు. భూమికి నాలుగున్నర అడుగుల ఎత్తున వామనావతారంలా వున్నాడు. మిడిగుడ్లు, కనుబొమ్మలు లేవు! తల మీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా రాగిచెంబులా నిగనిగలాడుతోంది. పూచిక పుల్లలా వున్న కాళ్ళూ, చేతులూ!
అన్నిటికంటే ముఖ్యం -
అతని తల షేపు!
తల రైలింజనులాగా పొడుగ్గా వుంది. నుదురు ముందుకు తోసుకు వచ్చినట్లుంది. తల వెనకభాగం వెనక్కి సాగినట్లు వుంది. నిక్కరు వేసుకుని వున్నాడు అతను. చాలా పొట్టిగా వుండడం వల్లనూ, నిక్కరు వేసుకుని వుండడం వల్లనూ దూరం నుంచి చూస్తే అతను ఒక చిన్నపిల్లాడని భ్రమపడే అవకాశం వుంది. కానీ దగ్గర నుంచి చూస్తే - అతని వయసు ఎంతో అంతుబట్టదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS