Previous Page Next Page 
మంచివాడు పేజి 13

"బలేదానివే!" ఆప్యాయంగా చూస్తూ, ముద్దుగా అన్నది.
స్టేషన్ వచ్చింది. బండి ఆగింది. టీ కుర్రాణ్ని పిల్చి రెండు గ్లాసులు అందుకుంది. ఒకటి నాకు అందించబోయింది.
"వద్దండీ!" అన్నాను చెయ్యి చాపకుండానే.
"ఫర్వాలేదు. తీసుకో!"
"రాత్రిపూట టీ త్రాగితే నిద్రరాదు."
"మంచిదేగా? ఈ తొక్కిసలాటలో నిద్రవచ్చినా ఎక్కడ పడుకుంటాం? కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ హయిదరాబాద్ చేరుకోవచ్చు." అంది బలవంతంగా గ్లాసు నా చేతికిస్తూ.
ఇలాంటి వాళ్ళ ఆప్యాయతకూ కోపానికి అట్టే దూరం వుండదు. ఒకదాన్ని ఒకటి ఒరుసుకుంటూ ప్రక్క ప్రక్కనే వుంటాయి.
"వద్దండీ ప్లీజ్!" అన్నాను.
"అయితే నేనూ తాగను!" అన్నది చిన్నపిల్లలా బుంగమూతి పెడుతూ.
ఆ సరసం భరించలేక గ్లాసు అందుకున్నాను. రెండు గుటకలు వేసి గ్లాసు టీ కుర్రాడికి అందించాను. "కలెక్టరు గారి భార్య ఈ టీ తాగడం ఏమిటి?" అనాలనిపించింది.
"మనదేశ ప్రజలకు ఫుడ్ వేల్యూ తెలియదు."
నేను గతుక్కు మన్నాను.
"నేను ఈ విషయం మీద చాలా చాలా ఆలోచించాను. ఉపన్యాసాలు ఇచ్చాను. మనవాళ్ళు ఎందుకూ పనికిరానివాళ్ళు. ఒక్క పనీ సరిగా చెయ్యలేరు. మనదేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది? నాలాంటి వాళ్ళకు కంఠ శోష మాత్రమే మిగులుతుంది. ఇంగ్లీషువాడు వుండగా దేశం ఎట్లా వుండేది? ఈ నిరుద్యోగ సమస్యా, ఆకలి చావులూ ఆ రోజుల్లో ఎప్పుడైనా విన్నామా? ప్రతివాడూ వళ్ళొంచి పనిచేసేవాడు. నల్లవాడు చెబితే నల్లవాడు వింటాడా? తెల్లవాడి పద్ధతేవేరు. ఆ రోజుల్లో నల్లబజారు వుందా, నల్ల కరెన్సీ వుందా? ఆహా! నాకు తెలియక అడుగుతాను. ఆ విషయాలు ఎప్పుడైనా అనుకోవడం విన్నామా? ఆ రోజుల్లో కలెక్టర్లను సి.ఐ.బి. పట్టుకుందని విన్నామా? ఆఫీసరుగా పని చెయ్యాలంటే తెల్లవాడికిందే పనిచెయ్యాలి. ఆ రోజుల్లో నేను చదువుకొనే రోజుల్లో గెజిటెడ్ ఆఫీసరు సంతకం కావాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చేది? ఇవ్వాళ ప్రతి అడ్డమైన వాడూ ఒక గెజిటెడ్ ఆఫీసర్." అనర్గళంగా మాట్లాడుతోంది. నేను వింటూ, ఆమె కళ్ళలో కదలాడే కసిని చూస్తున్నాను.
"మిసెస్ కైలాసంగారూ! మీరు కూడా కొంతకాలం గెజిటెడ్ ఆఫీసరుగా పనిచేశారనుకుంటాను."
ఆమె ముఖం ఒక్కసారిగా "హండ్రెడ్ వాల్ట్సు బల్బులా వెలిగింది." చేశాను. మా డైరెక్టర్ నేను లేకుండా ఒక్క పనీ చేయలేకపోయేది. ఎక్కడికి వెళ్ళాలన్నా నేను కూడా వుండాల్సిందే. ఏపని చేయాలన్నా మిసెస్ కైలాసం__ ఎవరితో మాట్లాడాలన్నా... మిసెస్ కైలాసం ... మినిష్టర్ దగ్గరకు వెళ్ళాలంటే మిసెస్ కైలాసం _ నా పేరు మా డైరెక్టరు నోట్లో ప్రతి నిముషం నానుతూ వుండేదంటే నమ్ము."
"అవునట, ఆవిడ ఒత్తి అప్పలమ్మటగా? రాజకీయ పక్షుల రెక్కల నీడలో ఆ కుర్చీ దొరికిందటగా? కుర్చీ మీద రెండు కాళ్ళూ పెట్టుకొని, తనకిష్టమైన వాళ్ళను, ముఖ్యంగా మగవాళ్ళను చుట్టూ కూర్చోబెట్టుకొని, వళ్ళు బరుక్కుంటూ, అప్పలమ్మ కబుర్లు చెప్పేదటగా?" అన్నాను. ఉద్రేకంగా జానకిని ఆవిడ పెట్టిన బాధలు గుర్తుచేసుకుంటూ.
మిసెస్ కైలాసం ఓ క్షణం ఆశ్చర్యంగా నా ముఖంలోకి చూసింది.
"నీకెవరో గిట్టనివాళ్ళు చెప్పి వుంటారు. ఆమెకు నేనంటే మహా అభిమానం. ఆమె తర్వాత ఒక మగ ఆఫీసరు వచ్చాడు. నా శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోలేని మూర్ఖుడు. అయినా మగవాడి దగ్గర పని చెయ్యటం ఏమిటని రాజీనామా యిచ్చేశాను. పైగా యింత అవినీతి ప్రబలిపోయిన గవర్నమెంటులో నాలాంటి వాళ్ళు వుండలేరు. పైగా మా వారిది ఒకటే గొడవ రిజైన్ చేయమని! అందుకే చేశాను" అన్నది గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ.
"సారీ మిసెస్ కైలాసం. నేను మరోలా విన్నాను. మీకు రివర్షన్ వచ్చిందటగా? ఎన్.జి.ఓ. గా చస్తే పనిచేయనని రాజీనామా ఇచ్చారట. అయినా మీకు ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఏముందిలెండి? అంత పెద్ద కుటుంబంలో పుట్టి అసలు సర్వీసులో ఎందుకు చేరారో నాకు అర్థం కావడం లేదు." అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS