Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 13


    "నీకు దూరంగా వుండేది ఒక్క రోజేగా."


    "అది నాకు ఓ యుగంలా అనిపిస్తుంది" కృప జీవితంలో తొలిసారి ఓడిపోతూంది శశాంకని ఒప్పించడంలో.


    "పిచ్చి కృపా" ఆమె చెంపల్ని చేతుల్తో స్పృశిస్తూ నెమ్మదిగా ముందుకు లాక్కున్నాడు." నువ్వే అన్వేదానివి గుర్తులేదూ."


    "ఏమని?"


    "కొన్ని గంటల విరహం కొన్నేళ్ళ ఆకర్షణను పెంచుతుందని."


    "అలా అన్నది వట్టి అమ్మాయిగా. ఇప్పుడు మీ బిడ్డకు అమ్మను కాబోతున్నానుగా. డిఫినేషన్ మారిపోతుంది."


    "మంచి అమ్మాయి అంటే అలా డెఫినేషన్ మార్చని అమ్మాయి అని అర్థం"


    నవ్వుతూ అతణ్ణి చుట్టేసింది.


    శశాంక ఆమెను వారించాడు - తన బిడ్డకు తల్లి కాబోతున్న కృప అణుమాత్రమైనా అలసిపోకూడదన్న ఆలోచనతోనే.


    ఏ విషయంలోనైనా చాలా సునాయాసంగా ఒప్పించగలిగే కృప మరికాస్తా ప్రయత్నించివుంటే శశాంక అంగీకరించేవాడే. కాని ఏ శక్తో ప్రేరేపించినట్టు ఆమె నిశ్శబ్దంగా వుండిపోయింది.


    నిరపరాధులైన వ్యక్తులు చెల్లించాల్సిన మూల్యం గురించి ఆలోచించరు.


    సరిగ్గా అక్కడే శశాంక అపరాధిగా మారిపోయాడు.


        **    **    **


    శశాంక మనసు హఠాత్తుగా ఆందోళనతో నిండిపోయింది.


    ఇదమిద్దంగా తేల్చుకోలేని నిస్త్రాణ...


    మరో గంటలో షూటింగ్ స్పాట్ కి వెళ్ళాల్సిన శశాంక అర్ధంకాని వేదన మనసును నులిమేస్తుంటే నిస్సత్తువగా కణతలు నొక్కుకున్నాడు.


    ఉదయం ఫ్లయిట్ లో రాజమణితో ఢిల్లీ వచ్చిన శశాంక ఓ గంట క్రితం వరకూ ప్రశాంతంగానే వున్నాడు.


    రాజమణి మధ్యాహ్నం భోజనమయ్యాక థిపెన్స్ లోవున్న తన పాత స్నేహితుల్ని కలుసుకుని అటునుంచటే స్పాట్ కి వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.


    పార్టిసిపెంట్స్ అందరికీ అదే హోటల్లో వసతి ఏర్పాటు చేయబడింది.


    మరో పావుగంటలో బయలుదేరాలి.


    తయారుకావడానికి సమయం ఆసన్నమైందన్న ఆలోచనతో బాత్ రూంలోకి నడిచాడు.


    సింక్ ముందున్న అద్దంలోకి చూసుకున్న శశాంక క్షణంపాటు ఎంతగా నివ్వెరపోయాడూ అంటే అతడి రూపం అతనికే చిత్రంగా కనిపించింది.


    ముఖంలో పది లంఖణాలు చేసినంత నీరసం.


    వారాలతరపడి నిద్రలేనట్టు కళ్ళు ఎరుపుగా రక్తం ఓడినట్టున్నాయి.


    ఏమైంది... ఏం కాబోతూంది.


    ఎన్నడూ లేనిది ఈ రోజు ఇలా అవుతుందేంటి...


    హఠాత్తుగా కృప గుర్తుకొచ్చింది.


    అదే సరిగ్గా అలాంటి స్థితిలోనే అతడికి నిజంగా కృప అవసరమయ్యేది.


    వస్తానని మారాం చేసిన కృపని బలవంతంగా ఆపి తాను ఎంత తప్పు చేసిందీ అర్థమైపోయింది ఆ క్షణంలో.


    మూడు నిమిషాల వ్యవధిలో యాంత్రికంగా ముఖాన్ని కడుక్కుని, మరో అయిదు నిమిషాలలో అన్యమనస్కంగానే డ్రెస్ చేసుకున్నాడు.


    వేన్ బయలుదేరబోతున్నట్టు ఓ ఆర్గనైజర్ చెప్పి వెళ్ళాడు.


    ఇంకో రెండు నిమిషాలలో గది దాటేసేవాడే.


    సరిగ్గా అప్పుడే ఫోన్ రింగయింది ఒక మృత్యునాదంలా.


    శరీరం గగుర్పాటుగా జలదరించింది.


    "హల్లో"


    "మాటాడుతున్నది శశాంకేనా."


    "యస్...మీరెవరు?"


    "నేను హైదరాబాద్ నుంచి ధనుష్కోటిని... పేరు వినే వుంటావు" గర్వంగా పలికింది ధనుష్కోటి కంఠం.


    చురుక్కుమంది.


    శశాంకకి పరిచయమైన ప్రపంచంలో అంతదాకా ధనుష్కోటి పేరు వినిపించలేదు.


    "వ్యవధి లేదు. ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి" కోపాన్ని నిభాయించుకుంటూ అడిగాడు.


    "నువ్వు పెద్దగా రియాక్టవుతున్నట్టు లేదు" ధనుష్కోటి గొంతులో అహం ధ్వనించింది చాలా స్పష్టంగా. "నా ఏక్టివిటీస్ గురించి గానీం నేనేమిటని గాని తెలిసినవాళ్ళు ఇంత నిబ్బరంగా మాటాడరు...?"


    "మీ పరిచయంతో నాకు పనిలేదు మిస్టర్ ధనుష్కోటీ... ఫోన్ పెట్టేస్తున్నాను."


    "తొందరపడకు...నష్టపోతావు."


    "దేని విషయంలో" శశాంక కళ్ళు అరుణిమని పుంజుకున్నాయి. "వాట్ ద హెల్ ఆర్యూ స్పీకింగ్?"


    "ఇట్ విల్ బి హెల్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ అబౌట్ యువర్ వైఫ్."

 

    భార్య ప్రసక్తి రాగానే శశాంక చేయి బిగుసుకుంది.


    "నీ భార్యంటే నీకు చాలా యిష్టం కదూ."


    "...."


    "పైగా పాపం తండ్రివి కాబోతున్నావనుకుంటాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS