"దయ చేసి నన్ను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు ధీరజా- నా ఉద్యోగ ధర్మం నిర్వర్తంచక తప్పదు కదా... అవకాశం ఉన్నంత వరకే తృప్తి పడాలి" ఆమెను లాలనగా దగ్గరకు తీసుకుని కను కొలకులను తుడుస్తూ అన్నాడు అతను.
అతని అనునయానికి ఆమె మనసు మెత్తబడి మౌనం వహించింది.
ధీరజను ఆటో ఎక్కించి, యూనిఫారమ్ వేసుకుని ఆఫీసుకు బయలుదేరాడు ఏ.సి.పి. వీరేష్.
* * * *
ధీరజ లోడ్ చేసిన కెమెరాను వానిటీ బాగ్ లో వేసుకుని కైనెటిక్ హోండాను స్టార్ట్ చేసింది.
ఒకసారి చేతి వాచీవైపు చూసుకుంది.
పది గంటలు...
ఆనందరావు పాదయాత్ర పదిగంటలకు మొదలు అవుతుంది. అతని రాజకీయ ప్రచారాన్ని పూర్తిగా కవర్ చేయాలని ధీరజ ఆలోచన!
హోండా వేగంగా పరుగు పెడుతుంది.
ధీరజ వెళ్ళేసరికి తన ప్రచార కార్యాక్రామానికి శ్రీకారం చుట్టాడు ఆనందరావు.
అతని వెంట పార్టీ అభిమానులు ఉన్నారు.
ఎందుకు అయినా మంచిదని నలుగురు కానిస్టేబుల్స్ కూడా ఎస్కార్ట్ గా బయలుదేరారు.
ఇంటి ఇంటికి వెళ్ళి అధికారపార్టీ ఆగడాలు పాలకపక్షంవారి కుప్పిగంతులు గురించి చెప్పి ఓట్లు అర్దిస్తున్నాడు.
ఆనందరావు వాగ్దాటికి ఓటర్ల ఆకర్షితులు అవుతున్నారు.
జనం మధ్యలో కలసిపోయి ఉన్న ధీరజ... ప్రజలను, వారి మనోభావాలను సునిశితంగా గమనిస్తుంది. అవసరం అయినప్పుడు ఫోటోలను తీసుకుంటుంది.
అతను ప్రచారం చేస్తున్నది జయచంద్రకు కంచుకోటలాంటి ప్రదేశంలో...
అక్కడి ఓటర్లు మరి ఒకరికి ఓటు చేయరు_
అటువంటిచోట ఆనందరావు వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు.
"ఎంత దైర్యం... ఈ వార్డులోకి వచ్చి జయచంద్రగారినే విమర్శిస్తాడా?" అన్నారు ఎవరో_
పాదయాత్ర ముందుకు సాగుతుంది.
అక్కడదక్కడా ఆగి ఆనందరావు ఉపన్యాసం చెబుతున్నాడు
ఎండాకాలం కావడంవల్ల అప్పటికే ఎండవేడి ఎక్కువుగా వుంది
అతనిని అనుసరించి వస్తున్న పోలీసు కానిస్టేబుల్స్ కనిపించిన టీ స్టాల్ వైపు నడిచారు.
ఆనందరావు ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఆగాడు.
విశాలమయిన ఆవరణ వున్న పాత కాలంనాటి ఇల్లు అది_ రోడ్డుకు కొంచెం దూరంగా ఉంది ఆ ఇల్లు. ఇప్పుడో రేపో కూలిపోవడానికి సిద్దంగా వున్న శిధిలమయిన అ ఇంట్లో జయచంద్రను అభిమానించే వ్యక్తి కాపురముంటున్నాడు.
స్వాతంత్ర్యం కోసం ఉద్యమంలో పాల్గొని తన సర్వస్వాన్నీ దేశం కోసం త్యాగం చేసిన ఒక మహానుబావుడి ఇల్లు అది!
ఆయనకు వారసులు ఎవరూ లేకపోవడంవల్ల అది పాడుపడిపోయి ధర్మసత్రంలా ఉపయోగపడుతుంది.
ఆనందరావు ఒక్క ఓటర్ ను కూడా వదలదలుచుకోలేదు.
ప్రతి ఒక్కరినీ పలకరించి, తనని గెలిపించమని అభ్యర్థిస్తున్నాడు ఆయన.
ధీరజ అతన్ని గమనిస్తూనే వుంది.
ఆనందరావు ఆ ఇంటి తలుపు తట్టాడు.
అంతలో__
బయట ఏదో గందరగోళం__
ఒక వ్యక్తి తాగి అల్లరి చేస్తున్నాడు.
ప్రభుత్వాన్నీ, రాజకీయ నాయుకులనూ బండ బూతులు తిడుతున్నాడు. ఎవరూ ఓట్లు వేయవద్దనీ, అసలు ఈ ఎన్నికలు అన్నీ వట్టి బూటకం అనీ అరిచి కేకలు పెడుతున్నాడు ఆ తాగుబోతు.
అందరి దృష్టీ కొన్ని నిమషాలు అతనివైపు మళ్ళింది.
అతనని ఎవరూ మందలించకపోగా, అతని మాటలకు వినోదిస్తున్నారు.
పోలీసులు సయితం చోద్యం చూస్తున్నట్టు నిలబడుతున్నారు తప్ప పట్టించుకొనలేదు.
ఎవరూ పలకకపోవడంతో ఆనందరావు ఆ ఇంటి తలుపులను నెట్టుకుని లోనికి అడుగు పెట్టాడు.
మరుక్షణంలో లోపల దృశ్యం చూసిన ఆనందరావు గొంతు తడి ఆరిపోయింది.
తను ఎవర్నయితే ఓటు వేయమని అడగటానికి వచ్చాడో అతను శవమై కనిపిస్త్రున్నాడు.
అతని నుదుట పైనుంచి రక్తం బొట్లుబొట్లుగా కారి కింద పడుతుంది.
వెనక వైపున వున్న గోడదూకి వెళ్ళబోతూ కనిపించాడు ఒక వ్యక్తి.
అతను ఎవరో గుర్తుపట్టటానికి అవకాశం లేకుండా వీపుమాత్రమే కనిపిస్తుంది.
వెళ్ళేవాడు వెళుతూ వెళుతూ తన చేతిలోని రివాల్వర్ ను గాల్లోకి పేల్చి మరీ పారిపోయాడు.
ఆ చప్పుడుకు బయట వున్న జనం దృష్టి ఆనందరావు వైపుపడింది.
గడగడా వణికిపోతున్నాడతను....
రివాల్వర్ శబ్దానికి హడావిడిగా వచ్చిన జనం కంటికి ఎదురుగా శవం కనిపించింది.
"ఎవరు.... ఎవరు చంపారు?" అడిగారు ఎవరో...
"ఏమో తెలియదు! నా కళ్ళు ఎదురుగానే చంపి పారిపోతున్నాడు అడుగో" అంటూ ఆప్రయత్నంగానే వేలెత్తి పారిపోతున్న వ్యక్తి చూపించాడు ఆనందరావు.
అందరితోపాటు ధీరజ కూడా అతన్ని చూసింది.
ఏ మాత్రం ఆలస్యం చేయలేదామె...
హంతకుడు పారిపోవడం గమనించిన జర్నలిస్టు ధీరజ చకచక అన్ని యాంగిల్స్ లో ఫోటోలు తీసింది.
అగంతుకుడు ప్రహరీ గోడను దూకి రోడ్ కు అవతల ఆగి ఉన్న అంబాసిడర్ కారులోకి చేరుకుని నిమిషాల మీద అతను ఎస్కేప్ కాగలిగాడు.
కేకలు...
