ఇది ఖచ్చితంగా బురద పామే! పాము కాలికి తగిలింది అనే భయం ఒక్కటే అతని స్పృహ పోవటానికి కారణం!" అని వివరించాడు వాల్మీకి. ఎందుకయినా మంచిది అనే నెపంతో హాస్పిటల్ కి తీసుకుపోవాలనేవారి సంఖ్య అధిక మయింది!
ఈ చర్చలు జరుగుతూ ఉండగానే యువకుడు కళ్ళు విప్పాడు.
లేచి నిల్చున్నాడు! ఒకసారి గాయం వంక చూచుకుని దాని మీద ఇంత బురద అంటించి ఇంటివైపుగా వెళ్ళిపోయాడు! నీటి పాము కరిస్తే బురద ఒక్కటే మందు!
అందరితోపాటు ఆమని కూడా అతని వంక ప్రశంసగా చూచింది.
"సమయానికి వారు గట్టుమీదికి చేర్చకపోతే పాముకాటు వల్ల కాదు. స్పృహలేని స్థితిలో నీటి గండాన అతను మరణించేవాడు. థాంక్స్! మీవల్ల అతను బ్రతికాడు!" అంది ఆమని.
"అతను మీకు బంధువా?" అని ప్రశ్నించాడు వాల్మీకి.
"కాదండీ! నేను రాణి సుమిత్రాదేవి చిన్న అమ్మాయిని!"
"పట్నంలో చదువుకుంటున్నానని విన్నాను. మీరేనా! మీ పేరు సుమ కదూ?"
"అవునండీ! నేనే! పేరు మాత్రం అది కాదు. ఆమని!" అంటూ నవ్వింది.
వారు మాటాడుకుంటూ గట్టు మీదికి చేరారు.
ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కొందరు చెయిన్ దొరకలేదని ఆమెకు సానుభూతి చెప్పాలని ప్రయత్నించారు.
"మనిషి ప్రాణం కన్నా బంగారం ఎక్కువయింది కాదు" అంది ఆమని!
అందరూ వెళ్ళిపోయాక వారు నడుస్తున్నారు.
"మీరు ఇలా వచ్చిన విషయం మీ అమ్మగారికి తెలుసా?"
"తెలియదండీ! మీరు చెప్తారా?"
"ఒకటి రెండుసార్లు నాన్నగారి వెంట వెళ్ళి చూచాను. ఆ తరువాత ఎన్నడూ వారిని చూడనయినా లేదు. వింటూ వుంటాను వారి గురించి."
"థాంక్స్! అమ్మగారికి తెలిస్తే కోప్పడతారు."
"మీ గొలుసు నేను తెచ్చియివ్వలేదు. అయినా మనం కలిసి మాటాడుకుంటున్నాం! ఈ విషయం చిత్రంగా వుంది కదూ?"
"చిత్రం ఏముంది? మీరు గొలుసు తీసుకురాగలిగితే అది మామూలు గొప్ప విషయం. కాని అందరూ పారిపోతూవుంటే మీరు ధైర్యంగా వెనుదిరిగి వెళ్ళి ఒక మనిషి ప్రాణం రక్షించి తీసుకు వచ్చారే!"
"అది చాలా గొప్ప విషయం! కేవలం గొలుసు తెచ్చి ఇచ్చినంత మాత్రానికే మీ మీద ఇంత గౌరవం కలగదు" అంది ఆమని.
అతడు ఆరాధనగా చూశాడు. తన మీద గౌరవం పెంచుకుంది కాబోలు!
"అంతగా ఎందుకు పెంచుకున్నారు నా మీద గౌరవం" అన్నాడు.
"సహజంగానే పెరిగింది. నేను కావాలని పెంచుకున్నది కాదు. మీ ప్రాణాలు రిస్క్ పడి ఇతరుల ప్రాణాలు రక్షించేవారు ఈ రోజుల్లో ఎవరుంటారు? రియల్లీ యూ ఆర్ గ్రేట్." అంది ఆమని.
"థ్యాంక్స్! ఇంక ఇంటికి వెళ్ళిపోతారా?"
"కాదు! ఇంకాస్సేపు మీతో మాటాడాలనిపిస్తోంది!"
"ఏం మాటాడాలని పిస్తోంది!"
"మీరు గెలుచుకున్న ఉజ్జీలు ఎక్కడున్నారు?"
"అదంతా సరదా కోసమే కదా! నిజం కాదుగా! ఎటో వెళ్ళిపోయారు" అప్పటికి వారు ఆలయం దగ్గర అంగళ్ళ మధ్యకు వచ్చారు.
గ్రామానికి మించిన సంఖ్యతో జనం వీధుల్లో పందిళ్ళ క్రిందకి చేరారు.
రాణి సుమిత్ర గ్రామమంతా పందిళ్ళు వేయించి చలివేంద్రాలు పెట్టించారు. చెరువు దగ్గర పందెంలో వారిని చూచినవారు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. కొందరు అసూయగా చూస్తున్నారు.
వారికి ఒకరి నొకరు పూర్తి వివరాలు తెలిశాయి.
అమ్మ ఎంక్వయిరీ చేస్తున్న చలపతిరావుగారి కొడుకు అతడే అని తెలిశాక మరింత ఆశ్చర్యపడిపోయింది ఆమని! అయితే ఆ విషయాన్ని బయట పెట్టలేదు.
అక్కకు కాబోయే భర్తగారు తనకి కాబోయే బావగారి స్వభావం ఎలాంటిదో, అలవాట్లు ఎలాంటివో తెలుసుకునేందుకు ఒక మంచి అవకాశం దొరికింది కదా అని సంతోషపడింది.
వారి ఆ అయిదు రోజులు జరుగబోయే కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. తిరిగి మళ్ళీ మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుసుకోవాలో కూడా నిర్ణయించుకున్నారు. అటువంటి సందర్భాలు ముఖ్యమయినవి రెండు మూడున్నాయి. ఉట్టికొట్టటం ఒకటి, వసంతోత్సవం రెండు.
ముఖ్యమయిన మూడవ పండుగ దొంగల దోపిడి!
ఈ మూడు సందర్భాలలో కలుస్తానని వాగ్ధానం చేసింది ఆమని.
"అయితే మీ అమ్మగారు చెయిన్ గురించి అడగరా?"
"నేను ఎక్కువగా నగలు ధరించను. నాకు వాటిమీద వ్యామోహం లేదు. ఒకవేళ భరించాల్సివస్తే చాలా సింపుల్ గా ఒకటో, రెండో వేసుకుంటానంతే! అందుకే అమ్మ నా నగల గురించి పట్టించుకోదు. ఈ చెయిన్ గురించి అమ్మకు తెలిసే అవకాశం లేదు" అంది ఆమని.
"దాన్ని చెరువులోంచి వెలికి తీసేందుకు ప్రయత్నిస్తాను" అన్నాడు వాల్మీకి.
"మళ్ళీ ఆ ఛాయలకు పోకండి! ప్రమాదాలు జరుగుతున్నాయి. జలం బలి కోరుతుందంటారు. దాని విలువ ఎంతో ఉండదు. ఎందుకు దాని కోసం మీరు శ్రమపడాలి?" అంది ఆమని.
"నేను ప్రత్యేకంగా వెళ్ళాల్సిన పనిలేదు. ప్రతిరోజూ నేను దానిలో ఈదులాడుతుంటాను. ఉదయం, సాయంత్రం వెడుతుంటాను."
"అదన్నమాట మీ విజయ రహస్యం."
"అదేమీ కాదు. పట్టుదలగా కృషి చేయాలి! విజయం గురించి మనసులో ఎలాంటి సందేహమూ వుండకూడదు."
"అప్పుడు మనమే గెలుస్తాం" అన్నాడు వాల్మీకి.
"మీ ఆత్మవిశ్వాసం మెచ్చుకోతగిందే కాని ఇంక నన్ను విడిచి పెట్టేయండి. వెళ్ళిపోయి అమ్మకు కన్పించాలి"
"విడిచిపెట్టేందుకు నేను మిమ్మల్ని కట్టేయలేదు."
"అమ్మకు చెప్పకుండా వచ్చేశాను! బహుశా పనిష్మెంట్ ఏదో ఒకటి వుంటుంది అనుకుంటా. బై! మళ్ళీ కలుద్దాం" అంటూ వీధి మలుపు తిరిగింది ఆమని.
తమ కుటుంబ సభ్యులు అంతా ఎవరి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారో అతనినే ముందుగా తాను కలుసుకోగలిగింది. అందుకు సంబర పడిపోయింది. పశువుల్ని కట్టివేసే ఒక పలుపుతాడు వీధిలో కన్పించింది.
దాన్ని రెండు చేతులతో పుచ్చుకుని చెంగు చెంగున స్కిప్పింగ్ ఎగురుతున్న దానిలా దుముకుతూ వెళ్ళింది ఆమని! ప్రవహించే సెలయేరులా ఉరుకులు పరుగులతో ప్రధాన ద్వారం దాటి లోనికి వెళ్ళింది.
"ఏంటమ్మాయిగారూ భలే జోరుగున్నారు!" అంటూ పలకరించింది వర్ధని.
"చెరువు గట్టుకు వెళ్ళాను."
"హవ్వ! అయితే ఉజ్జీల వేటలో పాల్గొన్నారేటండి?"
"అవును ఏం పాల్గొంటే తప్పా? బాగుంటుందని నువ్వేగా చెప్పావు?"
"ఓలమ్మో! అరవకండి తల్లో! అమ్మగారిన్నారంటే నా ప్రాణాలు నిలువునా చీరేసి గొంతులోతున ఉప్పు పాతరలో పాతేస్తారు.
నా మాటవిని మీ గదిలోకెల్లిపొండి!" అంది వర్ధని!
ఆమని నవ్వుకుంటూ లోనికి వెళ్ళింది.
తన గదిలోకి వెళ్ళిపోతూ అక్క గది తలుపులు తెరిచి వుండటం గమనించింది. నేరుగా అక్క దగ్గరకు వెళ్ళి కావలించుకుంది.
అలంకరించుకున్న ఆభరణాలన్నీ సర్ది జాగ్రత్త చేయటంలో నిమగ్నురాలయి వున్న గాయత్రి ఉలికిపడి చూచింది.
రవ్వల చెవి పోగులు జారి క్రిందపడ్డాయి! రవ్వంత విసుగు చూపింది.
"నువ్వెప్పుడూ ఇంతే! ఏదో ఒకటి చేస్తావు?"
"నేనిప్పుడేం చేశానేమిటి?"
"రవ్వల పోగులు క్రింద పడేశావు"
"పడిపోతే ఏమవుతుందట! చాల ఉన్నాయి కదా!"
"అదికాదు చెల్లీ! శుభమని వారసత్వపు నగలు మొదటిసారి పెట్టుకున్నాను. అవి క్రిందపడిపోతే అశుభం కదా? ఆడపిల్లలకు ఇలాంటి పరాచికాలు పనికిరావు. పరాకుపడితే తరువాత బాధపడాలి కదా?"
"ఓయమ్మ! హు! అమ్మగారు చెప్పటం, అక్కగారు వల్లించటం. ఎంత బాగున్నాయి మాంధాతల కాలంనాటి మనుగుడుపులు!
ఇది కంప్యూటర్ యుగం తల్లీ! కాలంతోపాటు మారాలనే విషయం కాస్త తెలుసుకోండి!" అంది ఆమని తొలగి ప్రక్కన కూర్చుంటూ!
"అది సరే కాని హోమం పూర్తి అయాక జనం సందడిగా లేచారు. ఆ సందడిలో కన్పించకుండా చెక్కేశావు. ఎక్కడికి వెళ్ళావేమిటి?" అంది గాయత్రి.
"ఒక ముఖ్యమయిన చోటుకు వెళ్ళాను"
"ఎక్కడుంది అంత ముఖ్యమయిన చోటు?"
"చెరువు గట్టుకు వెళ్ళాను. ఉజ్జీల పండుగ చూచాను"
"హవ్వ! అలా మనం వెళ్ళొచ్చా?"
"ఎందుకు వెళ్ళకూడదేమిటి? ఏమిటి మన గొప్ప?"
"జనంలో మరీ అంత చనువుగా కలిసిపోకూడదు."
"కలిసిపోతే ఏమవుతుందే అక్కా?"
"రానురాను మనల్ని చులకనగా చూస్తారు"
"అలాగని ఎవరు చెప్పారు నీతో!"
