"నేనూ అదే చెప్పాలనుకొంటున్నాను, తమ్ముడూ! మరి కొన్నాళ్ళపాటు దేవతను యిక్కడే ఉంచుకొంటాను శ్రీలక్ష్మిని ఏమనుకోవద్దని చెప్పు! నేనయితే పూర్తిగా బావగారి పరిచర్యలోపడిపోయానా? మన వాళ్ళు ఒక్కరయినా లేకపోతే ఇల్లు పూర్తిగా నౌకర్ల చేతిలో పెట్టినట్లవుతుంది."
"శ్రీలు అనుకొనడానికి ఏముంది? కాని నాన్నగారి దేవతను గుర్తు చేసుకొంటుంటారు. ఆయన అవసరాలు ప్రతిమ చూస్తుందిలే ఆయనకు పుస్తకాలవీ చదివి పెట్టడానికి దానికి చేతకాదాయే! నీ మరదలే, తీరిక చేసుకొని గీతా భాగవతాదులు చదివి చెవిని వేస్తుంది. దేవతకంటే శ్రీలే బాగా చదువుతుంది కదా? కాని అదేం చిత్రమో? మనమరాలి కంఠంలో గోవిందుని దర్శించినట్లుగా కోడలి స్వరంలో కనుకొనలేకపోతున్నారట. అప్పుడప్పుడూ అంటూంటారు- "నా దేవతమ్మ ఎప్పుడు వస్తుందో? అని."
కోడలివంక వాత్సల్యంగా చూస్తూ, "ఆయన ప్రాణాలన్నీ పెద్దమనుమరాలిమీదనే కదా?" అని నవ్వింది కృష్ణవేణి.
"బాబూ, బండి కట్టమని చెప్పనా?" గోవిందస్వామి అడిగాడు వచ్చి.
"ఆఁ" అన్నారు సూర్యదేవులు. లేచి లాల్చీ వేసుకొని కుర్చీ చేతిమీదున్న ఉత్తరీయం అందుకొన్నారు.
"వెళ్ళేదేనా ఇక, మామా!"
"మరి ఆలస్యమేముంది?"
తల త్రిప్పిన దేవదాసికి గది అవతలినుండి వెళ్ళిపోతున్న భార్గవరామ్ వీపు మాత్రం కనిపించింది. ఇస్త్రీ నుండి తీసి పింజపోసి కట్టిన జరీ అంచు ధోవతి, లాల్చీ ధరించాడు. ఆజానుబాహువూ, దృఢ శరీరుడూ, మేలిమి పసిమి వన్నె దేహచ్ఛాయ. ఎందుకో ఒక్క నిట్టూర్పు విడిచింది దేవదాసి.
మామగారికంటే ముందే వెళ్ళి బండిలో కూర్చున్నాడు భార్గవరామ్.
"వస్తాను, అక్కా!"
కృష్ణవేణి కొంచెం అభిమానంగా అడిగింది. "నువ్వు ప్రయాణం చేశావా, వాడిని?"
"అవును"
"ఇష్టంలేనివాణ్ణి పట్టుకొని ఎందుకు ఈ ప్రాకులాడ్డం?"
"అదే వద్దన్నది, అక్కయ్యా! ఆ పంతమే వద్దు" కొంచెం బాధగా అన్నారు. ఇంతకాలమూ భార్గవుడు మీ రెక్కల నీడన పెరిగినట్లే పాతికేళ్ళ పడుచువాడయినా ఇంకా పసితనం పోలేదు. అతడికేమీ తెలియదు. ఏ విషయమూ అనుభవంకాలేదతడికి. ఆ అవకాశం కల్పించి చేయిపట్టి కొంతదూరం నడిపించి వదిలిపెడితే అతడే నిరాటంకంగా సాగిపోగలడు. నువ్వు అభిమానం పెట్టును కూర్చుంటే అతడి ధోరణి బీరకాయ పీచులా ముదిరేది నిజం! మీరు నష్టపడేది నిజం!"
"ఊఁ" బరువుగా మూలిగింది కృష్ణవేణి.
అన్ని ఏర్పాట్లూ కావించి రాత్రి బండికే తిరిగి వచ్చేశారు సూర్యదేవులు ఒక్కరే. భార్గవరామ్ అక్కడే ఉండిపోయాడు.
ఇల్లు జాగ్రత్తగా కనిపెట్టి ఉండడానికి దేవదాసిని ఇక్కడే విడిచి వెళ్ళడానికి నిశ్చయమైంది. గోవిందస్వామి భార్యను పిలిచి, అప్పుడప్పుడూ వచ్చి అమ్మాయిని పలుకరించి వెళ్ళమని చెప్పింది కృష్ణవేణి.
"ఇల్లు జాగ్రత్త, తల్లీ!" ఉదయం సూర్యదేవులు తీసుకువచ్చిన టాక్సీలో ఎక్కుతూ మేనకోడలికి జాగ్రత్తలు చెప్పింది కృష్ణవేణి. రోగిష్టి భర్తను చికిత్సకు తీసుకు వెడుతున్న ఆమె హృదయంలో దుశ్శంకలూ, విపరీత భయాందోళనలూ ముసిరాయి. "భగవాన్, తిరిగి సుమంగళిగా యింటికి నేను వచ్చే వరమియ్యి. ఆయనకు ఆరోగ్యం ప్రసాదించు!" అనుకుంది.
భార్గవరామ్ గది దేవదాసికొక కోవెల అతడి ఛాయాచిత్రం ఆమెకొక దేవతామూర్తి. ఆ తాత్విక గ్రంథాలు ఆ గుడిలో వెలిగే అఖండజ్యోతి!
తీరిక చిక్కినప్పుడల్లా పైకి వెళ్ళి పుస్తకాలు చదువుతూ ఆ ఛాయా చిత్రానికి ప్రేమ ప్రసూనాలతో అర్చన జరుపుతూ అనిర్వచనీయమైన ఆనందరసానుభూతిలో మునిగిపోయేది. భార్గవరామ్ ఆగమనంతో ఆ ఆనందానికి ఆటంకం ఏర్పడింది. అతడిక్కడుండగా ఒక్కసారికూడా పైకి వెళ్ళలేదు దేవదాసి. అతడి ఎదుటపడాలంటే ఏమిటో అపరిమితమైన సిగ్గూ, సంకోచం! నిజానికి కంటపడలేదుకూడా. తను ఆరాధించిన మూర్తి రూపు ధరించి వస్తే అతని సన్నిధి చేరగల శక్తి తనకెందుకు లేదో ఆశ్చర్యంగా ఉందామెకు.
భార్గవరామ్ వెళ్ళిపోయాడు. ఆ కోవెలలో ప్రశాంతంగా కూర్చోగల అవకాశం తిరిగి లభ్యమైంది దేవదాసికి.
శ్రీనివాసరావుగారిని ఉస్మానియా హాస్పిటల్లో చేర్పించారు.
ఇంటి దగ్గర నుండి ఇద్దరు వంట బ్రాహ్మణులలో ఒకరిని వెంట తెచ్చుకొంది కృష్ణవేణి. ఇద్దరు నౌకర్లు కూడా వెంట వచ్చారు. ఆసుపత్రికి దగ్గర్లో ఇల్లు అద్దెకు దొరికింది.
