Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 12

    ఇంత దారుణంగా గారపట్టిన పళ్ళు ఉన్న అమ్మాయితో స్నేహం చేయాలా వద్దా?... స్నేహం చేసినా ఆ అమ్మాయిని ప్రేమించాలా వద్దా? ప్రేమించినా పెళ్ళి చేస్కోవాలా వద్దా?...

    చిట్టబ్బాయ్ కి ఏం చెయ్యాలో పాలుపోక కొన్ని క్షణాలు కన్ ఫ్యూజ్ అయిపోయాడు.

    "అసలు పెళ్ళిదాకా రానీముందు. అప్పుడు చూస్కోవచ్చు!... ఏ డెంటిస్టు దగ్గరికైనా తీస్కెళ్తే ఆ మాత్రం క్లీన్ చేసి పళ్ళు తళతళలాడేలా పాలిష్ పెట్టకపోతాడా?" అనుకున్నాడు మళ్ళీ.

    "ఏంటి ఆలోచిస్తున్నారు?" అంది ఆ అమ్మాయి కులుకుతూ..."మీరు టైము చాలా వేస్టు చేస్తున్నారు..." అందిగారపళ్ళు కనబడేలా నవ్వుతూ.

    చిట్టబ్బాయి తికమక పడిపోయాడు.

    'అమ్మో... ఈ అమ్మాయి చాల ఫాస్టుగా ఉందే' అని మనసులో అనుకుని పైకి "అవునవును... టైము వేస్టు అయిపోతుంది... పదండి మీ ఇంటికి పోదాం" అన్నాడు.

    అతని మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంది. 'ఇలా ఫాస్టుగా ఉన్న అమ్మాయితో ప్రేమ తర్వగా పండుతుంది. పళ్ళదేముంది ఎప్పుడైనా పాలిష్ పెట్టించొచ్చు...' అనుకున్నాడు  

`    "నేను కావాలా?" అంటూ అడిగింది ఆ అమ్మాయి హఠాత్తుగా, చిట్టబ్బాయి ఉబ్బితబ్బిబ్బు అయిపోతూ 'అవును' అన్నాడు.

    చిట్టబ్బాయ్ అలా అనగానే ఆ అమ్మాయి ఏకవచనంలోకి దిగిపోయింది.

    "మా ఇంటిదగ్గర కుదర్దుగానీ నువ్వే ఎక్కడైనా రూమ్ బుక్ చెయ్యి" అంది...

    "ఆ?...."

    ఆమె ఏమంటుందో అర్థంకాక  నోరు తెరిచాడు.

    "అవునుగానీ ఇందాక ఆ పాసింజర్ని ఎందుకట్టా తరిమేశావ్?" గారపళ్ళు బయటపెట్టి నవ్వుతూ అడిగింది.

    "పాసింజరా?... అదేంటి?" ఆమె వంక భయంగా చూస్తూ అడిగాడు చిట్టబ్బాయి.

    "అదే... ఇందాక వాడిని తన్ని తరిమేశావ్ గా? వాడికి నేను కావల్సి వచ్చి వెంటబడ్డాడు. వాడిని బుకింగ్ చేసుకుందామని అనుకునేంతలో నువ్వు వాడిని తన్ని తరిమేశావ్... అనవసరంగా ఒక పాసింజర్ని తరిమేశావ్. పోనీ నీ కంత అర్జంటైతే ముందు నీ గదికే వచ్చి తరువాత వాడి దగ్గరికి వెళ్ళేదాన్నిగా?..."

    చిట్టబ్బాయి తెల్లమొహం వేసి ఆమె వంక చూశాడు. అతనికి కేసు పూర్తిగా అర్థం అయిపోతుంది.

    "ఏంటలా చూస్తావ్? గంటకి కావాలా పూర్ర్తి రాత్రికి కావాలా?..." మీది మీదికి వస్తూ అడిగింది.

    "బాబోయ్..." అని ఒక్కసారిగా అరిచి పరుగు లంకించుకున్నాడు చిట్టబ్బాయి.

    ఒక ఫర్లాంగు దూరంలో నిల్చుని ఉన్న కన్నారావు చిట్టబ్బాయి తనవైపుకే కంగారుగా పరుగెత్తుకు రావడం చూసి అసలేం జరిగిందో అర్థంకాక తికమక పడిపోయాడు.

    దగ్గరికి వచ్చి ఆయసపడ్తూ నిలబడ్డ చిట్టబ్బాయిని "ఏం జరిగింది?" అంటూ అడిగాడు.

    చిట్టబ్బాయి వాళ్ళ ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ గురించి చెప్పాడు.

    కన్నారావు అది విని నెత్తి పట్టుకున్నాడు.

    "కాస్త ముందుకు పోదాం పద. మనం ఇక్కడే ఉంటే మనల్ని బుకింగ్ చేస్కోడానికి అది వచ్చినా వస్తుంది..." కంగారుగా అన్నాడు చిట్టబ్బాయి.

    ఇద్దరూ ఒక ఫర్లాంగు దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ కాపు వేసారు.

    ఒక పది నిమిషాలు ఎదురు చూసిన తరువాత ఒక అందమైన అమ్మాయి ఆ వైపుగా వచ్చింది.

    "ఒరేయ్... ఈ అమ్మాయి చాలా అందంగా ఉందిరా. మనం ఎలాగైనా ఈసారి విజయం సాధించాలి!" ఉత్సాహంగా అన్నాడు చిట్టబ్బాయి.

    "ఓ... ఈసారి మాత్రం సక్సెస్ ఖాయం... మరి నేను వెళ్ళనా?" అన్నాడు కన్నారావు.

    "ఇంకా అడగాలా?.... త్వరగావెళ్ళు" కంగారు పెట్టేసాడు చిట్టబ్బాయి.

    కన్నారావు గబగబా అడుగులు వేస్కుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈలవేసాడు.

    ఆ అమ్మాయి తల తిప్పి కన్నారావు వంక చూసింది.

    "హాయ్ డార్లింగ్ ..." అన్నాడు నవ్వుతూ.

    అంతలో అక్కడికి బుల్లెట్ లో దూసుకుని వచ్చాడు చిట్టబ్బాయి.

    "ఏంటండి.... ఈ రోమియో మిమ్మల్ని అల్లరి పెడ్తున్నాడా?" అని ఆ అమ్మాయిని అడిగి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా కన్నారావు వైపు తిరిగి "ఏరా బద్మాష్.... వంటరిగా అమ్మాయి కనిపించింది కదా అని పిచ్చివేషాలు వేస్తావా?... నేను కళ్ళు మూస్కుని మూడు లెక్కబెట్టేసరికి నువ్వు మాయమైపోవాలి! లేకపోతే నీ ఎముకలు సున్నం చేస్తా" అన్నాడు జబ్బలు చరుస్తూ చిట్టబ్బాయి.

    "పో బే.... నువ్వు నన్నేం చేస్తావ్? నేనే కళ్ళు మూస్కుని మూడు లెక్కబెడతా. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి నువ్వున్నావో నీ కాళ్ళు విరగ్గొడతా".

    అలా అని కన్నారావు కళ్ళు మూస్కుని మెల్లగా లెక్కబెట్టసాగాడు.

    "ఒకటీ ... రెండూ...."

    కన్నారావు మూడు అనక

ముందే గాల్లోకి నాలుగడుగులు ఎత్తుకు లేచి ధబేలున నేలమీద పడ్డాడు.

    కన్నారావుకి దిమ్మ తిరిగిపోయింది.

    "ఏంట్రా... మరీ అలా ఎత్తి విసిరేశావ్?... నెమ్మదిగా కొడ్తానని అగ్రిమెంటయ్యావా లేదా?..." అంటూ అరిచాడు రోడ్డుమీద కూర్చునే.

    చిట్టబ్బాయి ఆ అమ్మాయి వంక భయం భయంగా చూస్తూ కన్నారావుకి సమాధానం ఇచ్చాడు. "ఇప్పుడు నిన్ను ఎత్తి విసిరేసింది నేను కాదురా కన్నా ఈ అమ్మాయే! ఈమెకి జూడోవచ్చు."

    "ఓ! అయితే మీరిద్దరూ తోడు దొంగలన్నమాట!... నాకు జూడోనేకాదు కరాటే కూడా వచ్చు! మీలాంటి వాళ్ళకోసమే నేర్చుకున్నా..." అంది ఆ అమ్మాయి ఒక్కొక్క అడుగు ముందుకి వేస్తూ. 

    చిట్టబ్బాయి, కన్నారావులు ఆమెవంక కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తూ శిలా ప్రతిమల్లా ఉండిపోయాడు.

                 *              *           *

    కన్నారావు చిట్టబ్బాయిని చూసి ఘొల్లుమని నవ్వాడు. అంతలోనే బాధతో "అబ్బా" అంటూ మూలిగాడు.

    "ఏంటా పిచ్చి నవ్వు? నీకెందుకలా నవ్వొస్తుందీ?" చురచుర చూస్తూ అడిగాడు చిట్టబ్బాయి.

    "నీ ముక్కుని చూస్తుంటే నవ్వొస్తుంది. నల్లగా ఎలా కమిలిపోయిందో!!" అన్నాడు నవ్వాపుకుంటూ.

    చిట్టబ్బాయి మంచంమీద చటుక్కున లేచి కూర్చున్నాడు.

    "నీ కన్నుని చూసినా నాకు అలానే నవ్వొస్తుంది. మరి నేను నవ్వుతున్ననా? నీ కన్ను చుట్టూ నల్లగా ఎలా కమిలిపోయిందో ఓసారి అద్దంలో చూసుకో తెలుస్తుంది."

    కన్నారావు అరిచేత్తో కన్నుని ముట్టుకుని బాధగా మూలిగాడు.

    "ప్రేమలో స్పెషలిస్టు ప్రేమానందం ఉన్నాడంటూ తీస్కెళ్ళావుగా అనుభవించు! సలహాలిస్తాడట బోడి సలహాలు!!" పళ్ళు గారబోయి "అబ్బా మూతిమీద గట్టిగా గుద్దినట్టుంది పళ్ళు సలుపు పెడ్తున్నాయి" అన్నాడు చిట్టబ్బాయి నోటికి అరిచేయిని అనిస్తూ.

    "సలహాలు బాగానే ఉన్నాయిగానీ మన అదృష్టమే బాగోలేదు... పోయి పోయి జూడో, కరాటే వచ్చిన అమ్మాయి పాలపడ్డాం. దానికి పాపం ప్రేమానందం మాత్రం ఏం చేస్తాడు? మళ్ళీ అతని దగ్గరికి వెళ్దాం. వేరే మంచి సలహా ఏవైనా చెప్పమని అడుగుదాం" అన్నాడు కన్నారావు.

    "బాబూ, నీ ప్రేమానందానికి  ఆయనిచ్చే సలహాలకీ ఓ దణ్ణం. ఇంక ఆయన సలహాలు నాకేం అక్కర్లేదు. మనమే ఏదో ప్లాన్ ఆలోచించి ఆచరణలో పెట్టి విజయం సాధించాలి!!.."

    "కానీ యాభై ఏళ్ళు దాటినవాడిని చేస్కోడానికి ఏ అమ్మాయి ముందుకు వస్తుంది?" సందేహంగా అడిగాడు కన్నారావు.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS