Previous Page Next Page 
కావేరి పేజి 12

    ఇంతలో బెల్ అవటంతో కొద్దిక్షణాల వ్యవధిలో పిల్లలందరూ వారివారి సీట్లలో కూర్చున్నారు వచ్చి.

    డ్రాయింగ్ మాష్టారు అనేది పాఠం చెప్పనవసరంలేదు. బ్లాక్ బోర్డు మీద బొమ్మవేసి ఎలా వెయ్యాలో మరో బొమ్మగీసి చూపించి వేసి చూపించమని చెప్పటమే! అలాగేచేసి తనచేతిలోవున్న నాటిక పుస్తకం చదువుకోసాగారు.   

    కావేరి తను సినీతార కాబోతున్న అనుభూతినుంచి తేరుకోక ఆ ఊహాలోకంలో విహరించసాగింది. బ్లాక్ బోర్డుమీద బొమ్మ తన డ్రాయింగ్ బుక్ లో వేసుకోవాలన్నదే లేకపోయింది తనదంటూ వున్న ఊహా లోకంలోకి వెళ్ళిపోయింది.

    అదిచూసిన సుబ్బులు నవ్వుకోసాగింది. దీనికి నిలువెల్లా సినిమాతార పిచ్చిపట్టింది. కూడూ నిద్రామాని కూడా పగలూ రేత్రి కూడా ఇలాగే ఆలోచించుతూ వుంటుంది కాబోలు! యిలాంటివాళ్ళు ఆ సినీ ప్రపంచంలో ఎన్నివేలమంది వున్నారో?....దీనికి సినీతార అయ్యే యోగంవుంటే ఈ మారుమూల పల్లెటూరిలో ఎందుకు పుడుతుంది? గొప్ప కళాకారుడి యింత పుట్టేది! అన్ని కళలూ నేర్చుకునేటట్లుగా పెద్ద పట్నంలో పుట్టేది. దీనికి పిచ్చిగానీ! ....అని ఎంతో తేలికగా అనుకుంది. కావేరీని చూసి నవ్వుకునేది.

    ఆ సాయంత్రం హైస్కూలునుంచి వస్తూ కూడా దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు. సుబ్బులు తనకు పలుకరించకుండా వుంటే చాలుననుకుంటోంది కావేరి! తన ఊహాగానాలకి విజ్ఞం కలిగించుతుందేమోనన్న భయం కలిగి మౌనంగా తలవంచుకుని సుబ్బులుకి ఎడంగా నడుస్తున్నది.

    "అటూ చూడు కావేరీ!" నడుస్తున్న సుబ్బులు ఆగి కావేరి దగ్గిరకు వచ్చిన తరువాత చెయ్యిజాపి వేలితో చూపించింది.

    అటూ చూసిన కావేరికి సైకిల్ కి స్టాండువేసి వున్నది! ఎవరూ కనిపించలేదు!...ఏం విచిత్రం చూసిందని తనకి చెప్పటం?

    "ఏముందే అక్కడ? వట్టి సైకిలే కదా?" విసుక్కున్నది.

    "నీకు కనిపించింది ఆ సైకిల్ ఒక్కటేనా? చెట్టు మొదలులో ముడుచుకుని పడుకున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టావా?"

    "ఉహుఁ...ముడుచుకుని పడుకున్నాడు కదే? ఎలా గుర్తుపట్టేది? నీకేమయినా తెలిసిందా చెప్పు"

    "నేను చెప్పనుగానీ! నువ్వు కొంచెం దూరంగా వుండి ఈ మట్టిగెడ్డతో కొట్టు! అతనే లేస్తాడు!" అని మట్టిగెడ్డ తీసి యిచ్చింది.

    "అమ్మో! నాకు భయం! ఏమయినా అనుకోగలరు!"

    "ఇంత పిరికిదానివి! రేపు మద్రాసువెళ్ళి సినిమాహీరోయిన్ వి ఎలా కాగలవు? పెద్ద పెద్ద హీరోలతో ఎలా యాక్ట్ చేయగలవు? యిప్పటి నుంచే ధైర్యం తెచ్చుకోవాలి! ధైర్యంగా వుండాలి! వుండాలీ అంటే ఇలాంటివన్నీ చెయ్యాలి! తప్పదు! ఉఁ...రాయితో కొట్టు!"

    సుబ్బులు అంతగా చెప్పుతుంటే చేయకపోతే "నువ్వేం హీరోయిన్ వి" అని హేళన చేస్తుందని భయపడి కొద్ది దూరంలో నిలబడిరాయితో వీపుకి తగిలేలా కొట్టి గట్టిగా కళ్ళుమూసుకున్నది.

    మట్టిరాయి అయినా దెబ్బబాగానే తగలటంతో చెట్లు నీడలో పడుకుని వున్న వినాయకరావు త్రుళ్ళిపడి లేచి నిలబడి చుట్టూ చూసేసరికి కళ్ళు మూసుకున్న కావేరి, నవ్వుతూ నిలబడివున్న సుబ్బులు కనిపించారు.

    "ఏయ్ కావేరీ! ఏమిటిలా కొట్టావు?..." అనడిగాడు.

    తన బావ కంఠం వినిపించగానే కళ్ళమీద వున్న చేతులు తీసేసి ఒక్క పరుగులో దగ్గిరకు వచ్చి అంది.

    "నువ్వనుకోలేదు బావా!"

    "నీ కోసమే యిక్కడ కాసుకుని కూర్చున్నాను. మరలా నీకు కడుపులో నెప్పి వస్తుంది! తిరిగి యింటికి వచ్చేస్తావు. నడవలేవని సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళవచ్చునని!...అన్నట్టు నీకు బస్తీ నుంచి ఏం తెచ్చానో చెప్పగలవా?"

    "సినిమా పత్రికలు!"

    "అబ్బబ్బా! నీకెప్పుడూ సినిమాగోలే! యింకొకటి లేదు!" విసుక్కున్నాడు వినాయకం సైకిల్ కి వేలాడ గట్టిన మూటని తీస్తూ! బావకి కోపం వచ్చింది! అనుకుని చిన్న బుచ్చుకుంది కావేరి!

    "పోనీ నువ్వు తెచ్చిన వేమిటో చూపించుబావా!" అంది నెమ్మదిగా. చెప్పులు తీసి కావేరీ పాదాలదగ్గిరవుంచి కాలు పట్టుకుని తనే తొడిగాడు. బాలన్సు కుదరక కెవ్వుమంటూ సుబ్బులుని పట్టుకున్నది. ఆ తరువతః సరిగ్గా నిలబడి యింకొక చెప్పుకూడా వేసుకుని తన రెండు పాదాలను అటుయిటు చూసుకుంటూ.

    "ఎంత బాగున్నాయో! అమ్మో! మెత్తగా కూడా వున్నాయి...పాదాలకి మట్టి అవదు! రాళ్ళు ముళ్ళూ గుచ్చుకోవు!" అని సంబరపడి పోయి అటుయిటు నడిచి చూసింది. తప్పట్లు కొట్టింది. వినాయకరావు కావేరీ కాలు పట్టుకుని చెప్పు  తొడుగుతుంటే సుబ్బులుకి జెలసీలాంటిది మనసులో ప్రవేశించింది. అసూయతో పెదాలు కొరుక్కున్నది. బస్తీ నుంచి చెప్పులు తెచ్చి దారిలో కాసుకుని కూర్చుని చెప్పులు తొడిగాడంటే వీళ్ళిద్దరి ప్రేమా అంతా తక్కువది కాదు! చాలా గట్టిదే! కాని తను వినాయకరావుని చేసుకోవాలను కోవటం వట్టి భ్రమ క్రిందదే లెక్క! ఎంతయినా వాళ్ళిద్దరూ మేనత్తా, మేనమామల బిడ్డలు! కావేరీని కాదని తనను ఎలా చేసుకుంటాడు? తనతండ్రి కిరాయికి బండి తోలుకుని వున్న ఎకరం పొలంలోని వంటతో గుట్టుగా సంసారం లాక్కువస్తున్నాడు."బండి వీరయ్య" అన్ని తేలికయిన ముద్ర పడిపోయింది. ఎర్రని ఏగానీ కట్నంగా యివ్వలేని తమ పేదరికం, ఆస్థి గల వినాయకాన్ని చేపట్టగలిగే అదృష్టం తనకి లేదు! తను ఊరికే ఆశలు పెంచుకోవటం వరకే గాని! తనతల్లి సీతమ్మ వున్నదంటే నలుగురి ఇళ్ళకి వెళ్ళటం, వారికి పనుల్లో సహాయపడటం తప్ప ఏ సమయానికి ఎలా లౌకికం ప్రదర్శించాలో తెలియని పాతకాలపు మనిషి. యింకా తనతండ్రే ఎంతో మెరుగు! నలుగురితోనూ మాట్లాడుతాడు ఎవరిదగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసు! బాడుగ డబ్బులులోనే మిగిల్చి తన పెళ్లికని దాచి వుంచాడు. కావేరికి ఎలాగూ సినిమా తార నవ్వాలన్న పిచ్చి వున్నది. ఆ పిచ్చిని యింకాస్త ఎక్కువ చేస్తే తన దారికి అడ్డు రాకుండా వుంటుందేమో యిప్పటినుంచే ప్లానువేసి తన తల్లితండ్రులను ఈ రంగంలోకి దింపితే పర్యవసానం ఎలా వుంటుందో? ప్రయత్నించటంలో తప్పుకాదుగా? అనుకుంది.

    సైకిల్ కి చెరొకవైపునా నిలబడి పట్టుకుని ముందుకి నడుస్తున్న కావేరీని వినాయకరావుని కోపంగా చూసింది. యిప్పటివరకూ యిద్దరం కలిసి వచ్చాం! యిప్పుడు తనని వదలి బావతో కలిసి వెళ్ళుతుందా? అలా ఎంతదూరం? ఎంతకాలం కలిసి నడవగలరో నేనూ చూస్తాను! అనుకుంటూ, తన ఉనికిని మరిచిపోయి వెళుతున్న వారిని వేగంగా నడిచి దాటుకుని ముందుకి వెళ్ళిపోయి విసవిస నడవసాగింది సుబ్బులు!

    అది చూసిన కావేరీకి అప్పుడు గుర్తుకు వచ్చింది....అసలే సుబ్బులుకి కోపం ఎక్కువ! కబుర్లలో పడిపోయి బావతో కలిసి వచ్చేస్తోంది తను. యింక రేపటినుంచి తనతో మాట్లాడదు!....తనను గురించి లేనిపోని అబద్దాలన్నీ కల్పించి చెప్పుతుంది. అది నిజమేనని నమ్మి తనను హైస్కూలు చదువు మానిపించుతుంది! ఈ సుబ్బులుని ప్రసన్నం చేసుకోకపోతే లాభంలేదు. అసలుకే ముప్పు వస్తుంది! అనుకున్న కావేరి గబగబా ముందుకు పరుగులాంటి నడకతో సుబ్బులుని చేరి భుజం పట్టుకుని ఆపి బ్రతిమాలే ధోరణిలో అంది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS