Previous Page Next Page 
చీకట్లో నల్లపులి  పేజి 12


    నెమ్మదిగా తలుపు తోసి లోపలికి వెళ్ళాడు. ముందు గదిలోని సోఫాలో రాజేశ్వరి, రమణీ కూర్చుని ఉన్నారు. రాజారామ్ ని చూడగానే రాజేశ్వరి లేచి నిలబడింది.

    "అరె...నిలబడి పోయావేం? కూర్చో" అంటూ వాళ్ళని సమీపించాడు రాజారామ్.

    "మీకోసం మె యింటికి చాలాసార్లు ఫోన్ చేశాను. మీరు లేరన్నారు. సరే ఈ పాటికి వచ్చి ఉంటారని మీ ఇంటికి వచ్చాను." అంది రాజేశ్వరి.

    ఆమె కళ్ళలోకి ప్రశ్నార్ధకంగా చూస్తుండిపోయాడు. అంతలో రమణి లేచి అతని చెయ్యి పట్టుకుంది.
 
    "డేడీ....టైమయింది..." అంది.

    "టైమా? దేనికి?"

    "సినిమాకి వెళ్దాం అన్నావుగా? ఏంటి డేడీ నువ్వంతా మర్చిపోయావా??"

    అప్పుడు గుర్తొచ్చింది అతనికి.

    "అవును సుమా... కాని...సారీ బేబీ ప్రోగ్రాం కేన్సిల్!"

    రమణి మొహం చిన్నబోయింది. ఆ చిన్నారి మొహంలోని నిరాశల ఛాయలు చూసి రాజారామ్ మనసు అదోలా అయింది. చప్పున ఎత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.

    "అనుకోకుండా ఓ కొత్త పని వచ్చి పడిందమ్మా రేపు వెళ్దాంలే!"

    "నీ ఇష్టం డెడీ!"

    మరోసారి ముద్దాడి కిందకి దింపాడు.

    "ఇప్పుడు చెప్పు...ఏమిటి విశేషాలు?" అన్నాడు రాజారామ్ రాజేశ్వరిని చూస్తూ.

    "చైర్మన్ గారితో ఇవాళ సాయంత్రం నేను మీ విషయం మాట్లాడాను"

    "నా గురించా?"

    "అవును మీ రాజీనామా వార్త గురించి ఎవరెవరు ఏమేం అనుకుంటున్నారో ఆయనికి పూస గుచ్చినట్లు చెప్పాను. మీరు రాజీనామా చేసినట్టు నేను చైర్మన్ గారికి చెప్పేవరకూ ఆయనకా విషయమేమీ తెలీదట!" అంది రాజేశ్వరి జడ ముందుకు వేసుకుంటూ.

    "కావచ్చు ఎందుకంటే - నేనిందాక విరించి గారితో మాట్లాడాను. నా రాజీనామా కాగితం అతను చింపేశాట్ట, ఇవాళ డిన్నర్ కి రమ్మని ఇన్ వైట్ చేశాడు. చైర్మన్ గారు కూడా అక్కడ ఉంటారట. మాటాడుకుందాం రమ్మన్నారు."

    "డిన్నర్ కి 'అయిడియా' నేనిచ్చిందే" అంటూ ముసి ముసిగా నవ్వింది రాజేశ్వరి.

    "నువ్వు నాకోసం అనవసరంగా చాలా శ్రమపడ్తున్నావు. ఎనీ వే థాంక్స్!" అన్నాడు.

    కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి.

    "అన్నట్టు మరొకందుకు కూడా థాంక్స్ చెప్పాలి..."అన్నాడు రాజారామ్.

    "దేనికో"

    "మా రమణి అంతలా హాయిగా నవ్వగా చూసి చాలా కాలమయింది. కబుర్లు చెప్పి నవ్వించినందుకు! కదూ రమణీ?"

    రమణి ముద్దుగా నవ్వింది.

    "రమణి చాలా మంచి పిల్ల. అస్సలు అల్లరి చెయ్యదు తెలివితేటలు అమోఘం!" అంటూ రమణిని దగ్గరికి తీసుకుంది రాజేశ్వరి.

    ఇద్దర్నీ మార్చి మార్చి చూసాడు రాజారామ్. రాజేస్వరిలో తన తల్లిని వెతుకుతోందా రమణి అన్పించింది. గుండెను పాత జ్ఞాపకాలు గునపాల్తో తవ్వాయి.

    "ఏమండీ...మీరేం అనుకోకపోతే నేనొకటి చేద్దామనుకుంటున్నాను." అంది రాజేశ్వరి.

    "ఏమిటో"

    "మరేం లేదు. నేనూ, మీ అమ్మాయి కలిసి రేపు షాపింగ్ కి వెళ్తాం. చక్కని డ్రెస్ మెటీరియల్ కొని మీ అమ్మాయిని బంగారు బొమ్మలా ముస్తాబు చేస్తాను."

    తండ్రి ఏమంటాడోనని అతని మొహంలోకి ఆశగా చూసింది రమణి.

    "ఓ ఎస్. మీ ఇష్టం!"

    "థాంక్యూ."

    "కాని మా అమ్మాయి చిన్నపిల్ల. దానికి మరీ ఎక్కువ ఫాషన్లు నేర్పవద్దు."

    "ఏంటి సార్, మీకు ఆడవాళ్ళ మనస్తత్వం అసలేం తెలీదు."

    "నిజమే__ఒప్పేసు కుంటున్నాను. అన్నట్టు ఆడవాళ్ళంటే__అందులో మా అమ్మాయి కూడా ఉందా?-

    "ఉంది"

    "సరే. మీకే నా వోటు. మీ ఇష్టం!"

    "అయితే మరి నే వెళ్ళొస్తాను."

    "మంచిది!"

    రాజేశ్వరి టీపాయ్ మీదున్న తన హేండ్ బేగ్ అందుకుంది. రమణిని చూసి "వెళ్ళొస్తా పాపా, మనిద్దరం రేపు షాపింగ్ వెళ్తున్నాం. ఓకే. బీ-రెడీ!"

    రమణి అవధుల్లేని ఆనందంతో నవ్వింది.

    "వెళ్తానండీ." అంది రాజారామ్ ను చూస్తూ.

    "ఓకే. గుడ్ నైట్"

    కొన్ని క్షణాలు గడిచాయి. రాజేశ్వరి కనుమరుగయింది.

    ఉస్సురంటూ నిట్టూర్చాడు రాజారామ్. బెడ్ రూం లోకి వెళ్ళి బట్టలు మార్చుకోసాగాడు. అంతలో ఒక ప్రశ్న.

    "డేడీ__ఆవిడ ఎవరు డేడీ?"

    "ఏం?"

    "ఆవిడ చాలా మంచావిడ డేడీ __ ఆవిణ్ణి నువ్వు పెళ్ళి చేస్కో డేడీ_"

    ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. అంతలోనే తేరుకున్నాడు.

    ఏడేళ్ళ కూతురికి తండ్రి ఆ పరిస్థితుల్లో ఏం జవాబు చెప్పాలో అతనికి చప్పున తట్టలేదు. తదేకంగా ఆ అమ్మాయి వేపు చూశాడు.

    "మాట్లాడవేం డేడీ__నువ్వు పెళ్ళి చేస్కో డేడీ__నాకు మంచి అమ్మ కావాలి ప్లీజ్__డేడీ!"

    రాజారామ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గుండె చప్పుళ్ళు క్రమం తప్పాయి. దృష్టి చంచలం అయింది. మనస్సు లక్షలమైళ్ళ దూరం పరుగులు తీసింది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS