అయితే ఆమె నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది. పార్వతి ముఖం వైపు చూడగానే "ఓయ్ బాబోయ్! ఇదేమిటీ? ఏం జరిగిందీ?" అని అరిచింది.
గాయం నుంచి ఇప్పటికీ రక్తం కారుతూనే వుంది. దాదాపు గుడ్డ ముక్క అంతా బహుశా రక్తంతో తడిసిపోయింది. ఆమె ఏడుస్తూ "అమ్మ బాబోయ్, పత్తో నీ పెళ్ళే!"
పార్వతి స్థిమితంగా బిందె దించి క్రింద పెట్టింది. తల్లి వచ్చి ఏడుస్తూ "ఈ దెబ్బ తగిలింది" అన్నది పార్వతి సహజ భావంతో.
ఆ తరువాత అందరూ కలిసి ఆమెకు శుశ్రూష చేస్తూ వున్నారు. గాయం పెద్దది కాదని దేవదాసు చెప్పినది నిజమే. నాలుగైదు రోజుల్లో అది మానిపోయింది. ఇలా పది రోజులు గడిచిపోయాయి. తరువాత ఒక రోజు రాత్రిపూట హథీపోతా గ్రామంనుంచి జమీందారు భువన్ మోహన్ చౌదరీ వరుడుగా వివాహం చేసుకొనడానికి వచ్చాడు. వివాహ మహోత్సవం ఆడంబరం గానీ, ఆర్భాటం గానీ లేకుండా జరిగిపోయింది. భువన్ తెలివితక్కువ మనిషి కాడు. ఈ ప్రౌఢావస్థలో రెండో వివాహం చేసుకొనే సమయంలో కుర్రవాడుగా రావడం ఉచితం కాదని భావించాడు.
వరుడి వయస్సు నలభై మాత్రమే కాదు, కొంచెం పైనే వుంటుంది.గౌరవర్ణం. లావుగావున్నా దొండ శరీరం. నలుపు తెలుపుగా వున్న మీసాలు పులగంలాగా కనిపిస్తున్నాయి. తల బట్టతల అయిపోయింది. వరుణ్ని చూసి కొందరు నవ్వారు. కొందరు మౌనం వహించారు. భువన్ బాబు శాంతంగా గంభీరంగా వుండే ముఖంతో ఒక అపరాధిలాగా, వివాహ మండపంలోకి వచ్చి నిలబడ్డాడు. వివాహ మండపం దగ్గరలో కులదేవతను ప్రతిష్టించే చోట స్త్రీలు ఆయనతో పరిహాసమాడలేదు. కారణం, ఇటువంటి విజ్ఞుడయిన, గంభీరుడయిన మనిషితో సరసమాడే సాహసం ఎవరికీ కలగలేదు. శుభ దృష్టి సమయంలో పార్వతి క్రోధంతో పళ్ళు పటపట కొరుకుతూ చూస్తూ ఉంది. పెదవులమీద కొంచెం హాస్యరేఖ తొంగి చూసింది. భువనబాబు చిన్న పిల్లవాడి లాగా దృష్టిని క్రిందికి వాల్చుకున్నాడు. గ్రామీణ స్త్రీలు కిలకిలా నవ్వుతూ వున్నారు. చక్రవర్తి మహాశయుడు అటూ ఇటూ హడావుడి చేస్తూ వున్నాడు. ప్రవీణుడయిన అల్లుణ్ని పొంది ఆయన కొంచెం బిజీ అయిపోయాడు. జమీందారు నారాయణ ముఖోపాధ్యాయ ఈ రోజు కన్యాపక్షం తరపున నిల్చున్నాడు. కార్యనిర్వహణ అంతా ఆయనదే. ఆయన అనుభవజ్ఞుడయిన కార్యకర్త. ఏ రకమైన లోటూ జరగనివ్వలేదు. శుభ కార్యం చక్కగా నమస్తమయింది.
మరుసటి రోజు ప్రాతఃకాలం చౌదరి మహాశయుడు ఓ పెట్టెడు నగలు తీసి బయట పెట్టాడు. ఆ ఆభరణాలన్నీ పార్వతి శరీరం మీద ప్రకాశించాయి. తల్లి అదిచూసి కన్నీరు తుడుచుకొంది. దగ్గరగానే జమీందారిణీ నిలబడి వుంది. ఆమె స్నేహపూర్వకంగా 'ఈ రోజు కన్నీరు కార్చి అశుభం కలుగజేసుకోవద్దని' మందలించింది.
సాయంకాలం కొంచెం ముందుగా మనోరమ పార్వతిని ఒక గదిలోకి తీసికొని వెళ్ళి ఆశీర్వదించింది. "జరిగిందేమో జరిగిపోయింది. పూర్వం కన్న కన్న ఎంత సుఖంగా ఉంటావో ఇప్పుడు చూస్తావు" అన్నది.
పార్వతి కొంచెం నవ్వి 'ఆఁ ఉంటాను. యముడితో నిన్న కొంచెం పరిచయ మయిందిగా!' అన్నది.
"ఇదేం మాట?"
"సమయం వచ్చినప్పుడు అంతా చూస్తావు" మనోరమ మాటను మరోవైపుకు మలిపి, "నీకు ఇష్టమైతే ఒకసారి దేవదాసును తెచ్చి యీ బంగారం ప్రతిమను చూపించనా?" అన్నది.
పార్వతి రెచ్చిపోయింది__"తేగలవు అక్కా! ఒక్కసారి పిలుచుకొని తీసుకురాలేవా?" అన్నది.
మనోరమ కంఠస్వరం కంపించిపోయింది__"ఎందుకు పత్తో!"
పార్వతి చేతి ముసుగును తిప్పుతూ, తిప్పుతూ అన్యమనస్కురాలై ఒకసారి ఆయన పాదధూళిని తలమీద వేసుకొంటాను. ఈ రోజు వెళతాను గదా!" అన్నది.
మనోరమ, పార్వతిని కౌగలించుకొన్నది. తరువాత ఇరువురూ చాలా సేపటివరకూ రోదిస్తూ వున్నారు. సాయంకాలం అయింది. చీకటి పెరిగిపోయింది. నాయనమ్మ తలుపుతట్టి బయటినుంచే నన్ను "ఓ పత్తో! ఓ మనో, మీరు కొంచెం బయటికి రండి!" అన్నది.
అదే రాత్రి పార్వతి, భర్త ఇంటికి వెళ్ళిపోయింది.
9
మరి దేవదాసో? అతడు కలకత్తాలోని ఈడెన్ గార్డెన్ లో ఉన్న ఓ బెంచీమీద కూర్చొని రాత్రంతా గడిపేశాడు. అతడికి అమితమైన దుఃఖం కలిగిందనీ కాదు, లేక మార్మికమయిన వేదన కలిగిందనీ కాదు. అతడి హృదయంలో అదో అపరిచితమయిన ఉదాసీన భావం క్రమంగా ఘనీభవిస్తూ వుంది. నిద్రావస్థలో హఠాత్తుగా శరీరంలోని ఒక అవయవానికి పక్షవాతం వస్తే, మెలకువ వచ్చిన తరువాత ఆ అవయవం మీద ఎంత వెదికినా గూడా అది తన అదుపులో లేకపోవడంతో విస్తుబోయి స్తంభించిన మనస్సును ఎలాగయితే సారిచేసుకోవడం సాధ్యంకాదో, ఎంచేతనంటే అతడి జీవితమంతా తోడుగానూ, ఎప్పుడూ విశ్వసనీయంగానూ ఉండే అవయవం అతడి ఆహ్వానానికి ఏమీ ప్రత్యుత్తరమివ్వదో, నెమ్మదిగా తెలివి వచ్చి ఇప్పుడు ఆ అవయవం మీద తన అధికారం ఏమీ లేదనే జ్ఞానం క్రమంగా ఉత్పన్నమవుతుందో సరిగా అలాగే దేవదాసు కూడా,సమయానికీ, సంస్కృతికీ అకస్మాత్తుగా పక్షవాతం సంభవించడం వలన అవి అతడి నుంచి శాశ్వతంగా వేరయిపోయాయని క్రమంగా గ్రహిస్తూ వున్నాడు. ఇప్పుడు వాటి మీద అనుచితమయిన క్రోధాన్నీ, అభిమానాన్నీ ప్రదర్శించి ఏమీ చేయలేము. అధికమయిన అధికారం విషయం ఆలోచించడం కూడా గొప్ప పొరపాటే అవుతుంది. అప్పుడే సూర్యోదయం అవుతూ వుంది. దేవదాసు నిలబడి ఎక్కడికి వెళదామా అని ఆలోచించాడు. కలకత్తాలోని అదే మెస్ లో అక్కడ చున్నీలాల్ ఉన్నాడనే విషయం హఠాత్తుగా గుర్తుకొచ్చింది. దేవదాసు అటువైపు వెళ్తూ వున్నాడు. దారిలో రెండుసార్లు ఎదురుదెబ్బలు తిన్నాడు. ఎదురుదెబ్బ తగిలి వ్రేలు చితకడం వలన రక్తంతో తడిసిపోయింది. దెబ్బతగలడం వలన దారిలో ఓ వ్యక్తిమీద పడబోయాడు. అతడు దేవదాసును త్రాగిన మైకంలో ఉన్నాడని భావించి అవతలకు ఒక్క త్రోపు త్రోశాడు. అదే విధంగా భ్రాంతిలోపడి, దారి తప్పి తిరుగుతూ, తిరుగుతూ సాయంకాలానికి మెస్ గేటువద్దకు వచ్చి నిల్చున్నాడు. ఆ సమయంలో చున్నీలాల్ టిప్ టాప్ గా ముస్తాబై బయటికి వెళ్ళబోతూ "ఇదేమిటి దేవదాస్?" అన్నాడు.
దేవదాసు మౌనంగా చూస్తూ వున్నాడు. "ఎప్పుడు వచ్చారు?" ముఖం వాడిపోయి వుంది. స్నానం, భోజనం ఇంతవరకూ ఏమీ కాలేదా?" అన్నాడు. దేవదాసు దారిలోనే కూలబడిపోయాడు. చున్నీలాల్ చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు. తన ప్రక్కమీద కూర్చోబెట్టి, శాంత పరచి "ఏమిటి విషయం దేవదాసూ?" అని అడిగాడు.
"నిన్ననే ఇంటి దగ్గర నుంచి వచ్చాను."
"నిన్నటి రోజంతా యెక్కడున్నావు? రాత్రి యెక్కడ ఉన్నావు?"
"ఈడెన్ గార్డెన్ లో."
"పిచ్చివాడివా ఏమిటీ? ఏమయ్యిందీ?"
"విని ఏం చేస్తావు?"
"కాదు, చెప్పు ఇప్పుడు ముందు తిండి తిను. నీ సామాను ఎక్కడ వున్నది?"
"ఏమీ తీసుకొని రాలేదు."
"సరే పోనివ్వు, ఇప్పుడే వెళ్ళి భోజనం చేసెయ్."
అప్పుడు చున్నీలాల్ బలవంతం పెట్టి భోజనం చేయించాడు. ప్రక్కమీద పడుకోమని ఆదేశిస్తూ, తలుపు వేస్తూ "ఇప్పుడు కొంచెం నిద్రించడానికి ప్రయత్నించు. నేను మళ్ళీ రాత్రిపూట వచ్చి నిన్ను లేపుతాను" అని చెప్పి ఆయన అప్పటికి వెళ్ళిపోయాడు. రాత్రి పది గంటలకు ఆయన వచ్చి చూశాడు. దేవదాసు ఆయన ప్రక్కమీద గాఢనిద్రలో వున్నాడు. అతణ్ణి మేల్కొలపలేదు. అతడికి ఓ కంబళి కప్పి, తాను క్రింద చాపమీద నిద్రపోయాడు. రాత్రంతా దేవదాసుకు మెలకువ రాలేదు. తెల్లవారినా కూడా ఇంకా నిద్రపోతూనే వున్నాడు. పది గంటలకు లేచి కూర్చున్నాడు. "చున్నీలాల్! ఎప్పుడు వచ్చావూ?" అని అడిగాడు.
"ఇప్పుడే వచ్చాను."
"నీకేమీ ఇబ్బంది కలగలేదు కదా?"
"ఏమీలేదు!"
దేవదాసు కొంచెం సేపటివరకూ అతడి ముఖం వైపు చూసి "చున్నీబాబూ, నా దగ్గర డబ్బు ఏమీ లేదు. నీవు నాకు ఆశ్రయమిస్తావా?" అన్నాడు.
చున్నీలాల్ కొంచెం నవ్వాడు. దేవదాసు తండ్రి గొప్ప ధనవంతుడని ఆయనకు తెలుసు. అంచేత నవ్వుతూ "నేను ఆశ్రయమిస్తాను. మంచి సంగతే! నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడ వుండు. ఏమీ చింతించవద్దు" అన్నాడు.
"చున్నీబాబూ, నీ ఆదాయం ఎంత?"
"నా ఆదాయం మామూలుదే! ఇంటివద్ద కొద్దిగా జమీందారీ వుంది. దానిని అన్నగారికి ఒప్పగించి, నేను ఇక్కడ ఉంటున్నాను. ఆయన ప్రతి నేలా డెబ్బది రూపాయలు లెక్కన పంపిస్తూ వుంటాడు. అందులో ఖర్చూ, నా ఖర్చూ చక్కగా వెళ్ళబుచ్చుకోవచ్చు."
"నీవు ఇంటికి ఎందుకు వెళ్ళవూ?"
చున్నీలాల్ మొహం అటు మలిపి "అనేక విషయాలు ఉన్నాయి" అన్నాడు.
దేవదాసు మరేమీ అడగలేదు. తరువాత భోజనానికి పిలుపు వచ్చింది. ఇరువురూ స్నానాలూ, భోజనాలూ ముగించుకొని వాళ్ళ గదిలోకి వచ్చి కూర్చున్నారు. "దేవదాస్! నాన్నగారితో ఏమయినా పోట్లాట జరిగిందా?" అని అడిగాడు.
