వెంకట్రామయ్య కూడా నవ్వి ఊరుకున్నాడు. అతనికదే ఆలోచన -- 'పోలికలు ఉండటమే కాకుండా , కోపం, విసుగు , పట్టుదల ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి. జ్యోతి కూడా కౌసల్య లాగే ప్రవర్తిస్తుందా?' అని.
వెంకట్రామయ్య గుండెల్లో కలుక్కుమంది. తన జీవితం లాగే ఆనందం భవిష్యత్తు కూడా మ్రోడు వారిపోయి , ఉత్సాహం, సంతోషం నశించి నిస్సారం అయిపోతుందా ఈ అమ్మాయిని చేసుకుంటే?
"అమ్మాయికి సంగీతం కూడా వచ్చును. సరే, చదువు సంగతి చెప్పాను కదా.... ఇకపోతే అమ్మాయికి నా ఆస్తి లో మూడో వంతు వస్తుంది. కాగితాలూ గట్రా ఇంత క్రితమే వ్రాసేశాను."
మాధవరావు మాటలు వింటున్న కొద్ది వెంకట్రామయ్య ఈ సంబంధం ఎంతమాత్రం తగినది కాదు అనే నిర్ణయానికి రాసాగాడు. అసలే అందమైన పిల్ల. దానికి తోడు చదువు, సంగీతం నేర్చుకుంది. బాగా డబ్బున్న కుటుంబం లో పుట్టింది. పైగా ఎంతో గారాబంగా పెరిగింది. ఇవన్నీ సామాన్య దృష్టికి అర్హతలుగా కనిపించవచ్చు కాని, తన అనుభవం అనే త్రాసులో తూస్తే ఇవన్నీ అనర్హులుగా తేలిపోతాయి. ఇటువంటి వ్యక్తిని చూసి అన్నదించవలసిందే కాని, భార్యగా స్వీకరించడం అంత మంచిది కాదు.
అందమూ, చదువు , డబ్బు ఈ మూడింటి లో ఏ ఒక్కటి ఉన్నా చాలు అహంకారం రావడానికి. అన్నీ ఉంటె వేరే చెప్పాలా? అందులో పురుషుడయితే కొంత గర్వాన్ని, అహాన్నీ తగ్గించుకొని , నిగ్రహించుకోగలడు. స్త్రీ కది సాధ్యం కాదు. కాపురానికి వచ్చింది మొదలు తన ప్రత్యేకత , తన పుట్టింటి వారి సంపద -- ఇవే కన్నులలో సదా మెదులు తుంటాయి. అలా ఉన్న స్త్రీ భర్తతో ఆనందమయమైన జీవితాన్ని ఎలా గడప గలదు? అంతఃపురం నుంచి పూరి పాకలోకి వచ్చిన మహారాణి మనస్తత్వం తోనే ఉంటుంది ఆమె ఎప్పుడూ.
అలా కాకుండా పూరి పాకలోంచి అంతః పురానికి వచ్చిన సామాన్య స్త్రీలాగ ఉంటె ఆమె పొందే ఆనందం, భర్తకు ఆమె చూపించే కృతజ్ఞతా, ఎంత మహోన్నతంగా ఉంటాయో! అటువంటి స్త్రీ తన సంసారాన్ని స్వర్గ ధామం చేస్తుంది. మగవానికి నిజమైన సుఖం అటువంటి భార్య వల్లనే.
'కురూపిని, చదువూ సంధ్య లూ లేని పిల్లనేనా చేస్తాను కాని, అన్ని లక్షణాలు ఉండి, వాటికి సరిపడే గర్వం కూడా ఉన్న పిల్లని చెయ్యను ఆనందానికి. అలా చేస్తే నాలాగే వాడి జీవితం కూడా నరకం అవుతుంది. నా అనుభవం వాడికేనా ఉపయోగపడాలి. జ్యోతిని చేసుకుంటే వాడేమీ సుఖ పడడు."
ఈ నిర్ణయానికి వచ్చాక ఇంక వెంకట్రామయ్య అక్కడ ఎంత సేపో కూర్చోలేదు. మామూలు మర్యాదలూ అవీ పూర్తీ అయాక "వస్తానండీ!" అంటూ లేచాడు.
"మీరేమాటా శలవిచ్చారు కాదు" అన్నాడు మాధవరావు కూడా లేస్తూ.
"త్వరలో కబురు చేస్తాగా?" అని ఇవతలికి వచ్చాడు వెంకట్రామయ్య.
"తప్పకుండా కబురు చెయ్యండి. ,మరి నాకు సెలవు. అవతల జీపు నిలబడి ఉంది. తుని మీటింగు వెళ్ళాలి.' అన్నాడు మాధవరావు.
"వెళ్ళి రండి " అన్నాడు వెంకట్రామయ్య.
"రామదాసూ , వారిని బస్సు స్టాండు దాకా సాగనంపు. పోనీ, జీపులో వస్తారేమిటి? అక్కడ దిగబెడతాను."
"అక్కర్లేదు. మీరు వెళ్ళండి. ఇప్పటిదాకా కూర్చుని కూర్చుని ఉన్నాము. కాళ్ళు తిమ్మిర్లు ఎక్కాయి. కొంచెం దూరం నడిస్తే కాని....' అంటున్న వెంకట్రామయ్య దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు మాధవరావు.
పిచ్చాపాటి చెప్పుకుంటూ రామదాసూ, వెంకట్రామయ్య బస్సు స్టాండు దగ్గరికి వెళ్ళేటప్పటికి కాకినాడ వెళ్ళే బస్సు ఇంకో గంటన్నర దాకా లేదని తెలిసింది.
'అందాకా అలా మా యింటికి వెళ్ళి కూచుందాం. రండి. మా ఇల్లు చూడలేదు మీరు" అన్నాడు రామదాసు.
అదొక పాత పెంకుటిల్లు. మట్టి అరుగులు. వాటి మీద జేగురు రంగులోకి మారిపోయిన పాత తాటాకు చాపలు. పిచికల కోసం చూరుకు వేళ్ళాడగట్టిన వరి కంకుల గుత్తి. గుమ్మంలో ఒత్తుగా పేడనీళ్ళు జల్లి అందంగా ముగ్గు పెట్టిన అనమాలు. అందంగా ప్రశాంతంగా ఉన్న ఆ ఇల్లు చూసేసరికి వెంకట్రామయ్య కు ఋషుల ఆశ్రమాలు జ్ఞాపకం వచ్చాయి.
"రండి -- లోపల కూర్చుందాం" అన్నాడు రామదాసు.
'అక్కర్లేదండి. ఇలా అరుగు మీద కూర్చుందాం. చాపలున్నాయిగా?"
"అబ్బే, ఎందుకు? లోపల కవాచీ బల్ల ఉంది."
"ఏం ఫరవాలేదు. ఇక్కడే బాగుంది. చల్లగా గాలి వేస్తూను."
"మంచి తీర్ధం తెప్పించమంటారా?"
"ఆ. కొద్దిగా."
"అమ్మా, అన్నపూర్ణా! కంచు మరచెంబు బాగా తొలిచి, చల్లటి మంచి నీళ్లు పట్రా అమ్మా" అని రామదాసు ఇంట్లోకి కేకవేశాడు.
కొంచెం సేపటికి ఓ పదహారేళ్ళ అమ్మాయి మరచెంబు తో నీళ్ళు తీసుకుని వచ్చి , కొత్త వాళ్ళుండటం చూసి ఓ అడుగు వెనక్కు వేసింది.
"ఫరవాలేదమ్మా ఇలారా" అన్నాడు రామదాసు. నెమ్మదిగా వచ్చి తండ్రికి దగ్గరగా మరచెంబు పెట్టింది.
వెంకట్రామయ్య చూశాడు. చామన చాయగా ఉన్న ఆఅమ్మాయి ముఖంతో ఎంతో వినయమూ, గంబీర్యమూ కనిపించాయి. పెద్ద అందమయినది కాకపోయినా, కనుముక్కు తీరు చక్కగా ఉంది. నుదుట ఉన్న బొట్టే వెయ్యి అలంకారాలయి , నగలు లేని లోటు తీరుస్తుంది.
నీళ్ళు ఇచ్చి వెళ్ళబోతున్న కూతురుతో "ఉండమ్మా. తర్వాత చెంబు తీసుకుని పొడువు గాని" అన్నాడు రామదాసు. అందుకని గడప వెనక తలుపు పక్కన తల వంచుకుని నిలబడింది అన్నపూర్ణ.
"మీ అమ్మాయా అండీ?' అడిగాడు మరచెంబు ఎత్తి నీళ్ళు తాగబోతూ వెంకట్రామయ్య.
"అవునండి."
నీళ్ళు తాగడం పూర్తీ చేసి "పెళ్ళి అయిందా అండి" అన్నాడు వెంకట్రామయ్య.
"లేదండి. అదే ప్రయత్నం చేస్తున్నాను. ఏ సంబంధం చూద్దామన్నా రెండు వేలకు తక్కువలో కనిపించటం లేదు. నేను అంత ఇచ్చుకోలేను. పెళ్ళి ఖర్చులతో సహా వెయ్యి రూపాయల్లో తేలిపోవాలి. అంతకు మించి నాకు స్తోమతు లేదు."
వెంకట్రామయ్య అన్నపూర్ణ కేసి చూసి "ఏం చదువు కున్నావమ్మా?" అన్నాడు.
పైట చెంగు వేలికి చుట్ట బెట్టుకుంటూ నేలకేసి చూస్తూ "అయిదవ తరగతి అండి." అంది.
వెంకట్రామయ్య రామదాసు కేసి తిరిగి "సంగీతం ,అది...."అన్నాడు.
"లేదండి. నెలకు పదిహేను రూపాయలిచ్చి సంగీతం చెప్పించలేక ఊరుకున్నాను. అయినా ఏదో కూనిరాగాలు తీస్తుంది. మాధవరావు గారి జ్యోతి సంగీతం చెప్పించు కొనే తప్పుడు తరుచు వెళ్ళి కూచుని వినేది. ఆ విన్న బాపతే ఏదో కొద్దిగా పాడుతుంది."
"జ్యోతికి సంగీతం కూడా వచ్చునా?"
"అయ్యో! ఫస్టు గా పాడుతుంది. ఈమధ్య ఏడాదయి మానేసింది కాని, భరత నాట్యం కూడా నేర్చుకుంది. ప్రత్యేకం డాన్సు నేర్పడానికి నెలకు ముప్పై రూపాయలూ, రెండు పూటలా భోజనం పెట్టి ఒక మస్టారిని తీసుకు వచ్చాడు మా మాధవరావు కూచి పూడి నుంచి."
"ఆహా!" అన్నాడు వెంకట్రామయ్య.
కాళీ మరచెంబు తీసుకుని అన్నపూర్ణ వెళ్ళి పోయింది.
"మీ ఎరికలో ఏదైనా సంబంధం ఉంటె చూద్దురూ , మా అన్నపూర్ణ కి."
"ఎలాంటి కావాలి?"
"అయ్యో! నే నిచ్చే కట్నానికి హిరణ్యాక్ష వరాలు కూడానా?"
"అది కాదండి. మీకు ఎటువంటి సంబంధం అయితే సరిపోతుంది అని."
"ఏదో పదిరాళ్ళు సంపాదించుకుని పెళ్ళాన్ని పిల్లల్ని పోషించుకునే కుర్రాడయితే చాలు"
'ఆస్తిపాస్తులు , చదువూ...."
"ఆ పట్టింపులెం లేవు."
"అయితే మా ఊళ్ళోనే ఓ సంబంధం ఉంది."
"అంతకంటేనా? చెప్పండి."
"మా కుటుంబం లోనే."
"మీ కుటుంబం లోనా? హాస్యం ఆడుతున్నారా? మీ తాహ తెక్కడ; మా తాహతెక్కడ?"
"హాస్యం కాదు, రామదాసు గారూ. నిజం చెబుతున్నాను. మీకు నచ్చితే .....మా ఆనందమే పెళ్ళికొడుకు."
"ఆ!"
"నాకు మాధవరావు గారి సంబంధం నచ్చలేదు. మీ అమ్మాయి మా ఆనందానికి తగిన వధువు అనిపించింది నాకు. మీకు అభ్యంతరం లేకపోతె ...."
"అంతగా అవమానించకండి నన్ను. మీకిది భావ్యం కాదు." కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా డగ్గుత్తికతో అన్నాడు రామదాసు.
తటాలున అతని చేతులు పట్టుకుని "ఇవి హాస్యానికీ, అవమానించడానికి అంటున్న ,మాటలు కావు. హృదయం లోపల నుంచి వస్తున్నవి. నమ్మండి" అన్నాడు వెంకట్రామయ్య.
"నాకేం అర్ధం కావటం లేదు. ఇది నిజమా?"
"ఆ....ముమ్మాటికీ నిజం. మీరు ఊ అనండి."
"అందం, చదువూ, డబ్బూ అన్నీ ఉన్న జ్యోతి నచ్చకపోవటం ఏమిటి. దాని కాలి గోరుకి కూడా పోలని మా అన్నపూర్ణ నచ్చడం ఏమిటి? నన్నెందుకు ప్రలోభ పెడతారు? " అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రామదాసు.
"అవన్నీ అనవసరం. నాకు మీ అమ్మాయి నచ్చింది. మీకు అంగీకారం అవునా?"
"అయ్యో, భగవంతుడా! నాకు అంగీకారం ఏమిటండి, నా మొహం? నా జన్మలో నేనిలాంటి సంబంధం తెగలనా?"
"మరేమిటి సందేహం?"
"ఇది నిజమా, కలా అని తత్తరపాటు. అంతే. పొతే తన కూతుర్ని కాదని మా అమ్మాయిని మీరు చేసుకుంటే, నా గురించి మా మాధవరావు ఏం అభిప్రాయపడతాడో!"
"ఒకవేళ మీ పిల్ల కాకపోయినా వాళ్ళ పిల్లని చేసుకోకపోవడం తధ్యం. ఇంక అప్పుడు తప్పేమిటి?"
రామదాసు కు ఈ మాట సబబుగానే తోచింది. ఆలస్యం ఎందుకని వెంకట్రామయ్య తొందర చెయ్యడం తో అప్పుడే తాంబూలాలు కూడా పుచ్చుకున్నాడు రామదాసు.
