8
రెడ్డి రాజు ఇంటి కైతే రావటం మానివేశాడు గాని వారి స్నేహానికి మాత్రం ఏ లోపమూ రాలేదు. ఇద్దరూ కలిసి సినిమాలకీ, షికార్ల కి వెళ్ళటం మాములుగానే జరిగిపోతోంది. రాజు ఎప్పుడైనా "ఇంటికి వెళ్దాం రారా" అంటే రెడ్డి ఎప్పటి కప్పుడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించు కొంటున్నాడు. ఇంటి కొస్తే ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడైనా వనజ కంట పడుతుంది తమ ఇద్దరి స్నేహం వనజ మూలంగా చెడి పోవటం రెడ్డి కిష్టం లేదు. అందువల్ల నే వనజ విషయం రాజుతో ఎప్పుడూ ప్రస్తావించ లేదు.
మర్చి నెలతో రెడ్డికి హౌస్ సర్జన్సీ ఐపోయింది. రాజు దగ్గర సెలవు పుచ్చుకొని , విశాఖపట్నం తో తనకున్న సంబంధాలన్నీటినీ నిర్విదారంగా తెంపివేసుకొని ఉద్యోగంలో చేరడానికి వెళ్ళిపోయాడు.
స్నేహశీలుడైన రెడ్డి వెళ్ళిపోయాక రాజు ఒంటరి వాడయ్యాడు. నలుగురితోనూ స్నేహంగా ఉండే స్వభావం కాదు అతనిది. ఇప్పుడతని కాలమంతా కేవలం వనజతో నే గడిచి పోతోంది. వనజ రాని రోజున తనే పంతులమ్మగారింటికి వెళ్ళేవాడు. వనజను కలుసుకోటానికి వీలు చిక్కని రోజు, ఎంతో బరువుగా, బాధగా గడిచేది. వనజ అతన్ని ఒక రోజు ఊరిస్తూ , ఒక రోజు ఉద్రేక పరుస్తూ, ఒక రోజు ఉల్లాస పరుస్తూ తన చుట్టూ తిప్పుకొంటుంది. రాజు తాత్కాలిక మైన ఆ సుందరి ప్రలోభంలో పది చదువూ సభ్యతా అన్నీ మర్చిపోయి బాధ్యతా రహితంగా ప్రవర్తించసాగాడు. తన జీవితంలో మొట్టమొదటి సారిగా పరీక్షల్లో తప్పిపోయాడు. సెలవుల్లో ఇంటికి వెళ్ళడం మానుకున్నాడు. చదువు పాడై పోతుందనే నెపంతో ఒకప్పుడు తనకు అత్యంత ప్రేమ పాత్రురాలైన మేనకోడలు పద్మ సెలవుల్లో రమ్మని ఉత్తరం రాస్తే దానికి జవాబు కూడా ఇవ్వలేదు.
కొన్నాళ్ళ కి వాళ్ళిద్దరి మధ్యా ఉన్న సంబంధం పంతులామ్మ కి తెలిసిపోయింది. ఇప్పుడా ఇంట్లో రాజుకి వెనకటి మాదిరిగా గౌరవ మర్యాదలేవీ జరగటం లేదు. పంతులమ్మ అసలు పలకరించట మే మానివేసింది. రాజు వస్తే చీదరించు కొంటూ లోపలికి వెళ్ళిపోతుంది. కాని రాజు ఇవన్నీ గ్రహించేస్తితిలో లేదు. వనజ వ్యసనం లో పడి ఆత్మాభిమానాన్నే పోగొట్టు కొన్నాడు.
రాజు తల వంచుకొని షిప్ యార్డ్ కేసి నడుస్తున్నాడు. సముద్రం మీద నుంచి చల్లటి గాలి వీస్తోంది. యార్డు లో పని చేసే కార్మికులు కాబోలు టిఫిను కారియర్లు పట్టుకొని జట్లు జట్లుగా వస్తున్నారు.
"నమస్కారం డాక్టరు గారూ."
అన్యమనస్కుడైన రాజు తలెత్తి చూశాడు. నూనె మరకలతో జిడ్డు కారుతోన్న నిక్కరూ, చేతుల బనియనూ వేసుకొన్న ఆనందరావు ఎంతో వినయంగా నమస్కరించాడు. రాజు అతణ్ణి చప్పున గుర్తించ లేకపోయాడు. పంతులమ్మ గారింట్లో ఎప్పుడూ కనిపించినా తెరిలిన్ షర్టూ, మడత నలగని ఫాంటు తో ఉండేవాడు. ఏదో పెద్ద ఉద్యోగస్థుడనే అనుకొన్నాడు. కాని ఇప్పుడీ అవతారం లో చూసేసరికి రాజుకు ఆశ్చర్యం కలిగింది. "ఓ మీరా'?" అన్నాడు.
'ఔనండీ నేనే. ఈ షిప్ యార్డు లోనేగా పని చేస్తున్నాను." అన్నాడు. రాజు తెల్లని పళ్ళు బయట పెట్టి ఇకిలిస్తూ నల్లని పెదాల మధ్య తెల్లని పళ్ళు , అతను నవ్వితే చూసే వాళ్ళకు అదోలా ఉంటుంది.
"ఎందాకా వెళ్తున్నారు?" ప్రశ్నించాడు.
"చటర్జీ అని స్నేహితుడోకతను ఉన్నాడు. అతణ్ణి చూసి వద్దామని వెళ్తున్నాను."
"ఓహో చటర్జీ గారా, వారే మాకు ఆఫీసరు. రండి వారి ఇల్లు చూపిస్తాను."
చటర్జీ గారిల్లు రాజుకూ తెలుసు. కాని ఆనందరావు వాలకం చూస్తుంటే, తనతో ఏదో మాట్లాడ గోరుతున్నాడనిపించింది. మౌనంగా పడక సాగించాడు. కొంచెం దూరం వచ్చాక 'డాక్టరు గారూ, మీరు నాకొక సహాయం చెయ్యాలి." అన్నాడు.
"నేనా? చెప్పండి వీలుంటే చేస్తాను."
"మీకు తెలిసిన సంగతే లెండి. వనజ విషయం. ఆ అమ్మాయిని నాకిస్తామని అంటూన్న సంగతి మీకూ తెలిసిందే కదా. ఇన్ని రోజుల్నుంచి ఆశ చూపించి ఇప్పుడు మొండి చేయి చూపించారు. ఎంత అన్యాయమో చూడండి"
'అది వాళ్ళ ఇష్టం కదా?"
"తమరూ అట్లాగే అంటే ఎలా చెప్పండి? ఇన్ని రోజుల్నుంచీ ఆ కుటుంబాని కెంత సహాయం చేశానో మీకు తెలియదు. ఆ అమ్మాయి కోసం పుస్తకాలనీ, బట్టలనీ, కాలేజీ ఫీజనీ వందల్లో ఖర్చు పెట్టాను. అవసరం తీరిందిగా. ఇప్పుడు నేను చదువు రాని వాడ్నట. నేనంటే ఇష్టం లేనప్పుడు నా డబ్బెలా ఇష్టమైంది?"
"మిమ్మల్ని పెళ్ళి చేసుకొంటానని వనజ వాగ్దానం చేసిందా?"
ఆనందరావు బుర్ర గోక్కున్నాడు. కొంచెం సేపు తటపటాయించి " తన నోటి మీదుగా ఆ మాట చెప్పలేదనుకోండి. కాని పంతులమ్మ మాత్రం ఎన్నోసార్లు అన్నది--"
"పెళ్ళి చేసుకొనే వారి ఇష్టం గాని పంతులమ్మ దేముంది?" అన్నాడు రాజు.
"అందుకే మీ సహాయం అడిగాను. వనజకు మీరు చెప్తే తప్పక వింటుంది. మీ మీద చాల....గురి?" అన్నాడు ఆనందరావు వెకిలిగా నవ్వుతూ.
రాజుకు కోపమొచ్చింది. కాని నిగ్రహించుకుంటూ "అది వాళ్ళ స్వవిషయం. అందులో నేను జోక్యం కలిగించుకోను" అన్నాడు నిష్కర్షగా.
'ఆహా తమరు అలా అనకండి. నాకు సంగతంతా తెలిసిపోయింది. వనజ మీ మాట తప్పక వింటుంది" అంటూ బాగా దగ్గర కొచ్చి రహస్యంగా "అది మీ మీద ఏదో ఆశ పెట్టుకొన్నట్లుంది-- కాని నాకు తెలియదా బాబూ -- మీ లాంటి వారు దాని ముఖ మెందుకు చూస్తారు? వట్టి ఆశ గాని" అన్నాడు సారాయి వాసనా గుప్పున కొట్టింది. రాజు అసహ్యంతో ముక్కు మూసుకొన్నాడు. ఆ తాగుబోతు నోటి నుంచి ఇంకా ఏమేమి మాటలు వినవలసి వచ్చేదో గాని అంతలోనే సాక్షాత్తూ ఆ చటర్జీ గారే రాజును రక్షించారు. చటర్జీ గారి జీపు అల్లంత దూరాన చూసి ఆనందరావు ' వస్తాను బాబూ. నేను చెప్పిన విషయం కాస్త గుర్తుంచుకొండి నమస్కారం' అంటూ పిల్లిలా జారుకొన్నాడు.
ఇంటి కొచ్చాక వనజ కోసం నిరీక్షిస్తూ ఆనందరావు ని గురించి ఆలోచించ సాగాడు. అతను ఒట్టి అమాయకుడు . పాపం , వనజను మనస్పూర్తిగానే ప్రేమిస్తున్నాడు. ఇంతకూ ముందు సారాయి తాగేవాడు కాదు. వనజ నిరాకరించినందువల్లె అతను తాగుబోతుడయ్యాడా? అదే నిజమైతే అందుకు బాధ్యుడు తనే కావలసి ఉంటుంది.
వనజ వచ్చాక విషయమంతా చెప్పాడు. అంతావిని వనజ అసహ్యంతో "ఛీ, ఛీ సిగ్గు లేని మనుషులు" అన్నది.
"కాని నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా?"
"నేను మిమ్మల్ని ప్రేమించినంత ! ఔనా?" అంటూ రెండు చేతులతో అతని కంఠన్ని పెనవేసింది.
* * * *
'అప్పుడే వెళ్తానంటావేమిటి? వెళ్ళొచ్చులే" రాజు అనేవాడు.
"ఎప్పుడూ ఈ చదువె నైతే ఇక నేను పాసై నట్లే" అనేది వనజ.
"తప్పితే తప్పుతాం. అంత మాత్రంతో మన కొచ్చిన లోటేమిటి?"
"శ్రీమంతులు కాబట్టి మీకేమీ లోటు లేకపోవచ్చు. కాని నాకు లోటు కదూ."
రాజు గట్టిగా ఆమె నోరు మూస్తూ "నాకు లేనప్పుడు నీకు మాత్రం లోటేలా వస్తుంది" అనేవాడు.
ఇద్దరూ తప్పారు. తప్పినందుకు ఎవరికీ విచారం కలుగలేదు. పైగా అదొక తమాషా ఐనట్లు నవ్వుకొన్నారు. ఆ సెలవుల్లో కూడా రాజు ఇంటి కెళ్ళలేదు.
ఒకరోజు ఎ.వి.యస్. కాలేజీ దగ్గర వనజ ఎదురైంది. స్నేహితురాళ్ళ తో వెళ్తూ రాజును చూసి ఫ్రెండ్స్ ని వదిలి, పక్క కొచ్చి "నేను నాలుగైదు రోజులు మీ దగ్గరకు రాను. మీరేమీ అనుకోకండెం" అన్నది.
"ఊహు. అదేం కుదరదు. ఎందుకు రావేమిటి?" అన్నాడు రాజు.
"రానంటే రాను. అంతే"
"ఎందుకు రావో కారణం చెప్పాలి" రాజు అన్నాడు కృత్రిమ కోపాన్ని అభినయిస్తూ.
"ఛీ, ఛీ మీకు అన్నీ చెప్పాలి! ఆ మాత్రం అర్ధం చేసుకోలేరా! పోనీ ఈసారి వచ్చినప్పుడు చెప్తా లెండి. టాటా" అంటూ వనజ వెళ్లి స్నేహితురాళ్ళ ను కలుసుకొంది.
కాని హటాత్తుగా ఆ మధ్యాహ్నమే వచ్చిన వనజను చూసి ఆశ్చర్యపోయాడు రాజు. మాసిన చీరే, చిందరవందరగా రేగిపోయిన జుట్టూ, ఏడ్చి ఏడ్చి కళ్ళు రెండూ వాచిపోయి ఉన్నాయి. "యేమిటి వనజా , ఏమైంది?" ఆతృతగా అడిగాడు రాజు.
వనజ సమాధనమేమీ చెప్పకుండా తలుపు కనుకుని కుములుతూ ఏడ్వసాగింది. అదృష్టవ శాత్తూ అప్పలస్వామి బయట కెళ్ళాడు. రాజు ఆమె గెడ్డం పుచ్చుకొని "ఏం జరిగింది చెప్పవా?" అన్నాడు అనునయంగా.
కొంచెం సేపటికి పైట చెంగు నోటిలో కుక్కుకుని ఏడుపు అపుకొంటూ "నేనింక ఆ ఇంట్లో ఉండలేను" అన్నది.
రాజుకు అర్ధమైంది. బహుశా పెళ్ళి విషయంలో ఏదో గొడవ జరిగి ఉంటుంది. ఆనందరావు తమ సంబంధం తెలిసి కూడా పెళ్ళి చేసుకోటానికి వెనుకాడటం లేదు. అటువంటి వాడు ఏదైనా చేయగలడు" అసలేం జరిగిందో కొంచెం వివరంగా చెప్పు" అన్నాడు.
"మన సంగతంతా అక్కయ్య కు తెలిసి పోయింది."
అది అతను ఆశించని దుర్ఘటన. తమ విషయం ఎవరికి తెలిసిందన్నా అంతగా బాధపడదు. కాని పంతులమ్మకు తెలిసిందనే సరికి అతని గుండెల్లో రాయి పడింది. తన సంస్కారం తోనూ సరళ ప్రవర్తన తోనూ తప్పు చేసిన వాళ్ళను తలవొంచుకొనేట్టు చేయ గలిగింది ఆమె ఒక్కతే?
"ఎలా తెలిసింది వనజా!"
'ఆనందరావు చెప్పాడు."
"ఏమన్నది?' తడారిపోయిన గొంతుతో అడిగాడు రాజు.
"ఏమనాలో అన్నీ అన్నది. నన్ను ఆనందరావు కిచ్చి -- బలవంతంగా నైనా సరే -- పెళ్ళి చేసెయ్యాలని ఆలోచిస్తుంది . అక్కడ ఉంటె ఎలాగో నా గొంతు కోసేస్తారు. అక్కయ్య స్కూలు కెళ్ళి పోగానే ఇలా వచ్చేశాను."
"కాని.... అదెలా కుదుర్తుంది నీకు ఇష్టం లెందే?"
"నా ఇష్టా ఇష్టాలేవరి క్కావాలి? నన్ను ప్రేమించే వాళ్ళేవరైనా ఉంటేగా? నేను ఒంటరి దాన్ని, దిక్కు లేని దాన్ని?" అన్నది వనజ ఆవేశంతో.
"అదేమిటి వనజా. నేనున్నాను కదా. చెప్పు ఏం చెయ్యమంటావో అన్నాడు రాజు.
"నిజంగా చేస్తారా? చెప్పమంటారా?"
"నామీద సందేహమా?"
"నన్ను ఎక్కడి కైనా తీసు కేళ్ళండి?"
రాజు నిర్ఘాంత పోయాడు. పిడుగులాంటి ఆమె అభ్యర్ధనకు వెంటనే సమాధాన మివ్వలేక పోయాడు. అతని మౌనాన్ని అపార్ధం చేసుకున్న వనజ "పోనీండి మీకు అంత బరువైతే నా దోవ నేను చూసుకొంటాను. చావుకు చాలా మార్గాలున్నాయి" అన్నది హీనస్వరంతో.
రాజు వెంటనే తలెత్తి "నన్నూ అపార్ధం చేసుకొంటున్నావా. వనజా నేను అంత పిరికి వాణ్ణి ఏమీ కాదు. అలాగే వెళ్దాం. కాని ఒక్క రోజు -- ఈ ఒక్క రోజు ఓపిక పట్టు నా మీద ఆ మాత్రం విశ్వాస ముందిగా?' అన్నాడు రాజు.
"క్షమించండి దుఃఖం లో ఏదో అన్నాను. మీరు చెప్పినట్లే చేస్తాను" అన్నది వనజ దుఖాన్ని దిగమింగటానికి ప్రయత్నిస్తూ.
