Previous Page Next Page 
తప్పు పేజి 13

 

    ఉమేష్ శ్రీకాంత్ చిన్న తనం నుంచీ ఒకే మంచం మీద పడుకునే వారు. ఆ అలవాటు యిప్పుడు కూడా మార్చు కోలేదు. రాత్రి తెల్లవార్లూ తమ్ముడు నిద్ర పోలేదని అన్నకి తెలిసిపోయింది. తెల్లవారక ఆరుగంట లు కాకమునుపే తండ్రి మేలుకొలుపు పాడడం జరిగేది. పిల్లల్ని అరు దాటాక చటర్జీ యెప్పుడూ పడుకోనివ్వడు. అటువంటిది ఇవాళే అతను ఆ గది చాయలకి రాకపోగానే శ్రీకాంత్ ఆశ్చర్య చకితుడయ్యాడు. బ్రష్ తీసుకుని బాత్ రూమ్ వైపు వెళ్ళి మొహం కడుక్కుని వంట యింట్లో కి వచ్చాడు. గోవింద కాఫీ అందించి కొడుకు కి దగ్గరగా వచ్చి అతని భుజం మీద చేయి వేసింది. శ్రీకాంత్ తల తిప్పి క్షణికం నిర్ఘాంత పోయాడు. పన్నెండేళ్ల ప్రాయం లో వుండగా తల్లి అన్నదమ్ముల్ని దగ్గరికి తీసుకుంది. ఆ తరువాత వేళకి యింటికి రావడం, అప్పుడు తమకి కావలసిన సదుపాయాలూ చూడడం మిత భాషిణి కావడం వల్ల అంటీముట్టనట్లు మాట్లాడం చేస్తుండేది. శ్రీకాంత్ అప్పుడప్పుడు లీలగా అనుకునేవాడు కూడా. ' అందరి అమ్మలకు మాదిరిగా మా అమ్మ యెందుకు మనసు విప్పి మాట్లాడదు.' అని.
    గోవింద మొహం లోకి చూస్తుంటే ఆవిడ యిన్నేళ్ళ కాలంలో మానసికంగా అనుభవించిన నరకయాతన స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అనుభవం లేని శ్రీకాంత్ కి ఆవూహ తట్టలేదు. తల్లి దగ్గరగా జరిగి తనకంటే ఎత్తుకి పెరిగిపోయిన కొడుకు శిరస్సు ని కొద్దిగా ముందుకి రెండు చేతులతో నూ వొంచి నుదుట ముద్దు పెట్టుకుంది. శ్రీకాంత్ కి యిది సుప్రభాతం లా వుంది. తల్లి వక్ష స్థలం లోకి దూరిపోయాడు చిన్న పిల్లావాడి వలె. కొద్దిగా ఆగి తలెత్తి చూస్తె గోవింద కనుకోలుకుల్లో నీటి ముత్యాల మాదిరిగా మెరుస్తూ తొణికిసలాడుతున్నాయి.
    'అమ్మా, ఎందుకమ్మా ఏం జరిగింది?' అని అడిగాడు శ్రీకాంత్ తల్లి భుజాల మీద చేతులుంచి గాబరాగా.
    గోవింద శుష్క హాసం చేసింది. 'నన్నెవరు యేమంటార్రా శ్రీకాంత్. చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడివి కదూ. అప్పటి శ్రీ కి యిప్పటి ఈ బంగారానికి తేడా చూసుకుంటుంటే ఆనందంగా అనిపించింది. కన్నీరు కాదు నాయనా ఆనందాశ్రువులు.'
    ఉమేష్ అంతకు ఐదు నిమిషాలకి పూర్వం వచ్చి వంట యింటి గుమ్మంలో ఒక కాలు గుమ్మానికి అటూ మరో కాలు గదిలోకి వేసి ద్వార బంధాల్ని రెండు చేతులతోనూ వూతగా అందుకుని నిలుచుని తల్లీని, అన్నని చూస్తున్నాడు. తల తిప్పి గోవింద సన్నగా నవ్వుతూ రెండు చేతులూ చాపి ' రా ఉమా,' అన్నది. ఆవిడ ఉమేష్ ని చిన్నతనం నుంచీ ఉమా అనే పిలిచేది. మూడేళ్ళు వచ్చేవరకూ గౌన్లు తొడిగింది. యే కాలంలో పువ్వులు ఆ కాలంలో మాలలు కట్టి జడవేసి ఉమేష్ తలలో పెట్టేది. ఆడపిల్లలా చూసుకుని మురిసి పోయేది. తల్లి తనని అంత దగ్గరగా పిలిచి చాలా కాలం అయిపొయింది. అదీగాక అతను రాత్రి నుంచీ వుపశమనం కోసం తల్లడిల్లి పోతున్నాడు. ఆవిడ పిలవడం ఆలశ్యంగా వెళ్ళి ఆవిడ గుండెల్లో కి దూరి పోయాడు. అనుకోకుండా అతని చెంపల మీద అశ్రుబిందువులు రాలి పడ సాగినాయి.
    గోవింద కొడుకు మొహాన్ని చేతులతో పైకి యెత్తి చాలా నెమ్మదిగా ఆగది గోడలకి సైతం వినిపించనంత సన్నటి స్వరంతో 'చూడు నాన్నా వుమా! ఆడపిల్లలా యేడ్చి లాభం లేదు. కార్య సాధకులు దీక్షతో అనుకున్న పనిని సాధిస్తారు గానీ వాజమ్మ ల మాదిరి మాటి మాటికీ ఏడుస్తారా? నువ్వు సుభాషితాలు చదవలేదా. మన నాయకుడు ఏమన్నారో తెలీదు. కన్నీళ్లు కళ్లల్లో కాపురం వున్నంత కాలం యేపనీ చేయలేవు అని. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి దగా పడడం అంటూ లేదు. ఛ! తప్పు కదూ. నాకు తెలుసు నీ బాధ." అన్నది.
    ఉమేష్ మొహం లో ఆశ్చర్యానికి అంతు లేదు. అయితే అమ్మ సహాయం తనకి వుంటుందన్న మాట.
    గోవింద దీనంగా కొడుకు లిద్ద్దర్నీ చూసింది. యిద్దర్నీ చెరో వైపుకూ చేర్చుకుని భుజాల మీద చేతులు వేసింది. 'అందరి అమ్మల వంటిదాన్ని కాను నేను. పిల్లల్ని చేరదీయనూ లేను దూరంగా వుంచాను లేను. ఈ అమ్మ శిధిలం అయి పోయిన శీల లాంటిది. ప్రాణం పోసిన శీలా మనిషిలా ఏదీ చేయలేదు. కక్కనూ లేదు. విషయాలని మింగనూ లేదు,' గోవింద గొంతు మరి మాటలు పెగలక పూడుకు పోయింది.
    కాఫీలు అందుకుని నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు యిద్దరూ. చటర్జీ యింకా లేవలేదు యివాళ. అతని వొంట్లో అస్వస్థత కారణంగా. గోవింద పని ముగించుకుని అతని పక్కనే కూచుని సపర్యలు చేస్తోంది. మూసిన కన్ను తెరవలేనంత  వుధృతంగా వచ్చింది అతనికి జ్వరం . నిద్రలో వులిక్కి పడటం, కలవరించడం యించుమించు అతనితో సహా గోవింద కూడా రాత్రంతా జాగరణ చేసింది. తూరుపు తెల్లవారుతుంటే అతనికి నిద్ర పట్టింది. డాక్టరు వచ్చి యింజక్షన్ యిచ్చి వెళ్లాక కాఫీ తాగి అతను మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు.
    అతని కాళ్ళ దగ్గర కూర్చుని గోవింద భగవంతుడి ని నిశ్శబ్దంగా ప్రార్ధించసాగింది.
    సాయంత్రం అయిన తరువాత చటర్జీ కళ్ళు తెరిచాడు. అతను గోవిందని దగ్గరగా రమ్మని చెప్పి లాయరు కి ఫోను చేయమన్నాడు. గోవింద ఏడుస్తుంటే అతనికీ అ క్షణం లో కన్నీళ్లు చోటు చేసుకున్నాయి. గోవింద తల మీద చేయి వేసి నేనేం చచ్చిపోను గోవిందా. నిన్ను వదిలి వేడతానా పిచ్చి దానివి నువ్వు. దేవుడు వచ్చి నన్ను పిలుస్తుంటే ఆ మాత్రం చెప్పలేనూ . యిప్పుడు గోవింద తో బిజీగా వున్నాను దేవా, గోవిందని తీసుకు వెళ్ళాక నేను వస్తాను అని.... నువ్వలా దిగులు పడుతుంటే నాకు ధైర్యం యెక్కడి నుంచి వస్తుంది చెప్పు. అయినా యిప్పుడు కొంపలంటుకు పోయే ప్రమాదం యేవీ రాలేదు కదోయ్. యిల్లు దీపం వున్నప్పుడే చక్క బెట్టుకోవాలని అంటారు. అందుకు జస్ట్ పిల్లలు గానీ, నేను గానీ నీకు అన్యాయం చేయకూడదని తప్ప నేనేదో అయిపోతానని కాదు గోవింద వీలు రాస్తున్నది.' అన్నాడు .
    పిల్లలిద్దరూ కాలేజీ ల నుంచి యింకా రాలేదు. గోవింద రాతకోతల సమయం లో అక్కడ లేదు. అతనికి సన్నిహితుడైన చక్రవర్తి మాత్రం వున్నాడు ఆ సమయంలో. చక్రవర్తి భ్రుకుటి ముడి వేస్తూ ఆశ్చర్యంగా చూస్తుంటే 'ఈ రహస్యం దాచుకోవాలి మనసులోనే' అన్నాడు. అతను వెళ్ళిపోయాడు.
    చటర్జీ ఆవేళ అంతా నిస్త్రాణగా వున్నాడు. సాయంత్రం మరో యింజక్షన్ తీసుకున్నాక కొద్దిగా మనసు తేలిక పడింది శరీరంతో బాటు.

                                          7
    శివపూర్ యింజనీరింగ్ కాలేజీ లో ఫైనల్ యియర్ లో వున్నాడు శ్రీకాంత్. గురుదాస్ కాలేజీ లో ఫైనల్ లియర్ బి,యస్.సి చదువుతున్నాడు వుమేష్. ఆ వుదయం అన్నగారిని అతను చాలాసేపు ప్రార్ధించాడు. 'కాలేజీ కి కృష్ణ మోహిని ఎలాగూ వస్తుంది. తను క్రితం రోజు రాని కారణం కూడా అడుగుతుంది. కొంచెం సేపు బోటనీ కల్ గార్డెన్ లో కాలక్షేపం చేసి యింటికి వెడదాం.' అని.
    శ్రీకాంత్ తమ్ముడి కోరికని మన్నించాడు. అతనికి ఉమేష్ ని చూస్తుంటే హృదయం జాలితో నిండిపోతోంది. సాయంత్రం కాలేజీ వదిలి పెట్టగానే కృష్ణ మోహిని తో కలిసి గార్డెన్ కి వెళ్ళారు.
    "మీ యిద్దరూ మాట్లాడుకుంటూ వుండండి. నేను యిప్పుడే వస్తాను.' అన్నాడు శ్రీకాంత్ చీలిపోబోతూ.
    కృష్ణ మోహిని అభ్యంతరం పెట్టింది. 'అలా వీల్లేదు . ముగ్గురం కలిసే వెడదాం. నువ్వేదో చాన్సు యివ్వాలనుకుంటున్నట్లున్నావు. మేమేమీ పెళ్ళి చేసుకోకుండా లౌ ఆడుకునే వాళ్ళం అనుకున్నావా బావా' అని నవ్వేసి ఉమేష్ వైపు తిరిగి 'అన్నట్లు నిన్న రాలేదేం వుమేష్ .' అని అడిగింది.
    శ్రీకాంత్ కూడా యిద్దరి తో పాటు పచ్చిక మీద కూర్చున్నాడు. కృష్ణ మోహిని ప్రశ్నకి సమాధానం యివ్వకుండా తలదించేసుకున్నాడు వుమేష్.
    కకృష్ణ మోహిని కిలకిలా నవ్వింది. 'యిదీ వరస. యేదైనా అడుగుతే చాలు వెర్రి మొహం వేస్తాడు ఇడ్లీ లా నీ తమ్ముడు. యిలా వుంటే యెలాగో కనుక్కోవెం బావా.'
    శ్రీకాంత్ కూడా నవ్వి ' అయితే యిడ్లీ వెర్రి మొహం వేస్తుందా,' అని అడిగాడు.
    కృష్ణ మోహిని కళ్ళు రెండూ పైకెత్తి 'చల్లారి పోయిన యిడ్లీ సంగతి నేను అనేది. ఉమేష్ చూడు. వాళ్ళ నాన్న వొప్పుకోనంత మాత్రం లో సిరా బుడ్డిలా మొహం వెళ్ళాడేయాలేమిటి? పెళ్ళి చేసుకోదలుచుకుంటే మైనార్టీ తీరింది. కోర్టు వుంది. చాలదేమిటి? మనసే వుండాలి గానీ మార్గాలు లక్ష.' అన్నది.

                 
    శ్రీకాంత్ ఒక్కసారి గతుక్కుమని సర్దుకున్నాడు. 'వాళ్ళ నాన్న యేమిటి?' కృష్ణ మోహిని మాట తూలింది అంతే. అతను అర్ధం కానివాడిలా ఆ పిల్ల వైపు చూస్తూ 'నాన్నగారేమిటి? పెళ్లికి ఒప్పుకోక పోవడం యేమిటి? మాకసలు ఏదీ తెలీదే,' అన్నాడు.
    'వావ్! అన్నీ అబద్దాలే. తెలియక పోతేనేనేమిటి నిన్న ఉమేష్ మా యింటికి రాలేదు.'
    'నిజం కృష్ణా మాకసలు యిప్పుడు నువ్వు అనేవరకూ యే విషయం కూడా తెలీదు. ఒట్టు. నిన్న ప్రొద్దుటే నేను సుభాష్ సరోవర్ కి వెళ్లాను. తమ్ముడు టెన్నిస్ ఆడేందుకు వెళ్లాడు.'
    'యెన్ని చేపలు పట్టావేమిటి?'
    'సింగి నాదం లా వుంది. చేపలు పడితే నీకు యిస్తానని వెర్రి భ్రమ పెట్టుకోకు మా ఫ్రెండ్ కి యిచ్చాను. రామాయణం లో పిడకల వేటలా యిదేమిటి? నేనడిగేదేమిటి నువ్వు చెబుతున్న దేమిటి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS