"అంతలా ఎలా..." రేణుక టీ పట్టుకురావడం చూసి ఆగిపోయింది మహిమ. టీ తాగి, కాస్త స్నాక్స్ తింటుండగా, "సీమా, పోనీ మన ఆఫీసులో ఏదన్నా చిన్న జాబ్..."
"ఏయ్...నీకేమైనా మతిపోయిందా? ఆమెను అసలు ఆఫీసులో అడుగు పెట్టనీయరు. అసలు తను ఇక్కడున్నట్టు వాళ్లకి తెలిస్తే ఏం చేస్తారో... ప్లీజ్ ఎవరి దగ్గరా ఈ ప్రసక్తి తేవద్దు..."
"అసలేం జరిగింది? సీమా... రియల్లీ... నాకు చాలా బాధగా ఉంది. చెప్పవా?"
సీమ బద్ధకంగా ఆవులిస్తూ "ఇంకోసారి చెబుతాలే. కాసేపు పడుకోనివ్వు..." అంది అటు తిరిగి. మహిమ నిరాశగా తనూ పక్కమీద వాలింది.
* * * *
మీనన్ మహిమ పోస్టు చూడడం పూర్తిచేసి ... "మొదటిదే బాగుంది. రెండోది నీవన్నట్టు నెగెటివ్ అప్రోచ్. వాళ్లు శుభంగా షోరూమ్ ప్రారంభిస్తున్నప్పుడు పాజిటివ్ అప్రోచ్ బాగుంటుంది. రిచ్ గా యాడ్ తీస్తారు. అయినా చీరాల గురించి ఇంతకంటే ఏం చెప్పగలం? ఇంకేదన్నా తట్టిందా?" ఆలోచిస్తూ అడిగాడు.
"లేదు సర్. ఎంత ఆలోచించినా, నాలుగైదు రాసినా, ఇదే బాగుంది అనిపించింది".
"ఓకే ! విశాల్ గారిని కూడా చూడనీ, ఆయన ఏం చెప్తాడో విన్నాక ఓకే చేద్దాం. ఇదిగో ఈ రెండు ఆర్డర్లు తీసుకెళ్ళి వర్క్ చేయి" మరో రెండు ఆర్డర్ల ఫైలు ఇచ్చాడు. మహిమ సీటులోకి వచ్చి కూర్చుంది. ఫైలు ఓపెన్ చేసి చూసింది. ఒకటి కొత్తగా మార్కెట్ లోకి రాబోయే సబ్బు, రెండోది కొత్త వంట నూనె. రెండింటికి కాప్షన్ కావాలి, ప్రకటనకి. ఇవి కూడా విజువల్సే కాని ప్రకటనకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏమిటో ఇన్ని రకాల సబ్బులు... మార్కెట్ లో ఎన్ని నిలదొక్కుకుంటాయో తెలియదు. జనం అలవాటుపడిన వస్తువుని అస్తమానం చాలామంది మార్చరు. కొందరు అదేపనిగా కొత్త ప్రోడక్ట్ రాగానే మార్చేస్తుంటారు. చాలామంది టూత్ పేస్ట్ ల్లాంటివి మారిస్తే నోట్లో పుళ్లు పడతాయని భయపడడం తను వింది. ఆలోచిస్తూ కంప్యూటర్ లో కొత్త ఐడియాల కోసం వెతుకుతుంటే విశాల్ దగ్గర్నుంచి రమ్మన్న ఫోను వచ్చింది.
"ప్లీజ్ బి సీటెడ్! పెళ్ళిసీను, పెళ్ళికొడుకు తన్మయత్వంతో చూడడం ఆ సమయంలో సహజంగా జరుగుతుందా?" కాస్త సందేహంగా అడిగాడు.
"అంటే ... మామూలుగా వరుడు చూసీచూడనట్టు అమ్మాయిని, చీరని చూసి చాలా బాగుందనుకుంటాడు. నిజజీవితంలో అరక్షణంలో అతని మెదడుకి ఆ సీను సంకేతం పంపించేస్తుంది. కానీ, తెరమీద ఆ సీను పడ్తుంది. ఇలా ఒక్కసారి ఫోకస్ చేసి, కెమెరా పక్కకి వెళ్ళిపోతే మెసేజ్ అందదు చూసేవారికి..."
విశాల్ విశాలనేత్రాలతో చకితుడైనట్టు చూస్తుండిపోయాడు. ఈ అమ్మాయి ఎంత లోతుగా ఒక సీను అబ్జర్వ్ చేసి, ప్రెజెంట్ చేసిందో అర్థమై మహిమవి మామూలు ఆలోచనలు కావు, తేసిపారేసే ఆలోచనలు అసలే కావనుకున్నాడు. అరక్షణంలో మహిమ పట్ల అతని అంచనాలు పెరిగిపోయాయి. అతనికి తెలియకుండానే ఆరాధనభావం, గౌరవం, ఆసక్తి లాంటి భావాలన్నీ అతన్ని చుట్టుముట్టాయి.
"సార్, ఈ యాడ్ ఎక్కువగా కెమెరా పనితనం మీద ఆధారపడుతుంది. షాపులోని ప్రతి కోణాన్ని రిచ్ గా చూపించాలి. చీరల అందాలకి, అమ్మాయిల అలంకారాలకి ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతారు తప్ప, ఈ సంభాషణల పట్ల అంత పట్టించుకోరని నా విశ్వాసం. విజువల్స్ ఉన్నప్పుడు కెమెరా మాట్లాడాలి కానీ, రైటర్ స్క్రిప్టు కాదు. అయినా ఈ సీను సగటు ప్రేక్షకుడికి సులువుగా అర్థం కావడానికి ఆ డైలాగులు చాలని నా భావన. మాటలకు విలువ తక్కువిచ్చి కెమెరాకి ఎక్కువ పని చెపితే సీను పండుతుంది. కెమెరా మూమెంట్స్, షాట్స్ అవన్నీ డైరెక్టర్, కెమెరామేన్ ల ప్రతిభ, పనితనం మీద ఆధారపడి ఉంటాయి" అనర్గళంగా చెప్పుకుపోతోంది మహిమ.
విశాల్ తేరుకుని, "ఎస్! మహిమా ... రియల్లీ యూ ఇంప్రెస్ డ్ మీ. నాకర్థమైంది మీ భావం. మీరు చెప్పింది కరెక్ట్! ఈ యాడ్ కి కెమెరా షాట్స్ హైలైట్ కావాలి".
"సర్, అవసరమైతే షూటింగ్ జరిగే చోటుకి వెళ్లి కెమెరా ప్లేస్ మెంట్స్ కి సహాయం చేయగలను. నేను నా ఊహల్లో ఎలా అనుకున్నానో డైరెక్టర్, కెమెరామేన్ లకి, కావాలంటే సలహా చెప్పగలను".
"ఓ! మీకు ఈ ఫీల్డ్ కూడా తెలుసా ..." ఆశ్చర్యంగా అడిగాడు.
"ఆ ... ముద్రాలో ఉన్నప్పుడు, పనేమీ లేకపోతే, నేను స్క్రిప్టు ఇచ్చిన షూటింగ్ చూస్తుండేదాన్ని. ఈ కెమెరా యాంగిల్ ఇలా ఉంటే బాగుండేది ... ఆ షాట్ అలా తీస్తే బాగుండేది... అనిపించేది. కానీ ట్రైనింగ్ పీరియడ్ లో నా అభిప్రాయాలు డైరెక్టర్ కి చెప్పడం మర్యాద కాదు. అపార్థం చేసుకుంటారు గదా. కాని అలాంటి షూటింగులన్నీ కుతూహలంగా చూడడం వల్ల నాకు కొంత అనుభవం వచ్చింది" మహిమ నమ్రతగా అంది.
"ఓ ! అయితే కొన్నాళ్లకి డైరెక్ట్ చేసేస్తానని ఆ ఫీల్డ్ లోకి వెళ్లిపోతారేమో..." నవ్వుతూ అన్నాడు విశాల్. "ఓకే! ఇది ఓకే చేద్దాం. షూటింగ్ ఆరంభమయ్యాక మీకు కావాలంటే డైరెక్టర్ తో చెప్పి పర్మిషన్ ఇప్పిస్తాను".
"థాంక్స్ సర్! ఇట్ విల్ బి ప్లెజర్ ఫర్ మి ..."
"సర్, ఫైనల్ చేశాక, షూటింగ్ కు ముందే డైరెక్టర్ తో ఒకసారి మాట్లాడితే మంచిది. వాళ్లు షాట్ డివిజన్ ప్లాన్ చేశాక మార్చమనడం బాగుండదు. ఏదన్నా చెప్పాలంటే ముందే చెప్పాలి..."
"ఓకే! డైరెక్టర్ నిర్ణయం జరిగాక, ఓసారి మీ ఇద్దరూ కలిసి స్క్రీన్ ప్లే చూసుకోండి. హ్యాపీ..." అన్నాడు విశాల్ నవ్వుతూ.
