Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు 2 పేజి 12


    "నా బాధ సిలిండరు కోసం కాదమ్మా! సివిల్ సప్లయిస్ లో ఆయన పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటూ ఆయనకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారు. ఇప్పుడు ఆయన..."
    "ఊఁ... ఆయన?" ఆతృతగా అడిగింది తల్లి. "ఆధార్ కార్డు లేకపోతే నాతో సంసారం చేయనన్నారే. పుట్టింట్లో కూడా ఆధార్ కార్డు లేకుండా సంవత్సరం గడిపావంటే నీ శీలాన్ని అనుమానించాల్సిందే అంటున్నారే" అని వెక్కి వెక్కి ఏడ్చింది కూతురు.

                                                                       *  *  *

    రాత్రి పన్నెండు గంటలు.
    పబ్బులో పూటుగా మందుకొట్టి, కారు డ్రైవు చేసుకుంటూ ఔటర్ రింగురోడ్డు మీద అడ్డదిడ్డంగా వెడుతున్నాడు ఓ దేవదాసు. అంతవరకూ స్పీడు ఎక్కువవుతోంది. పక్కనే కూర్చున్న గర్ల్ ఫ్రెండు తన బాయ్ ఫ్రెండు అడ్డదిడ్డ డ్రైవింగును చూసి చప్పట్లు కొడుతూ వెర్రిగా నవ్వుతోంది. మధ్య మధ్య బీరు గడగడా లాగిస్తోంది. 80-90-100-120 స్పీడుకు చేరింది కారు. ఎదురుగా ఓ సామాన్యుడు సైకిల్ మీద వస్తున్నాడు. కారు పాములా మెలికలు తిరుగుతూ ఇంకొక్క 2 నిమిషాల్లో అతన్ని ఢీకొట్టబోతోంది.
    అతను కారువేగాన్నీ పరిస్థితినీ అంచనా వేసాడు. వెంటనే నడిరోడ్డుమీదే సైకిల్ కు బ్రేక్ వేసి, తాపీగా జేబులో చెయ్యిపెట్టి, శ్రీ కృష్ణపరమాత్ముడిలా ఆధార్ కార్డు తీసి అరచేతిలో పట్టుకుని చూపిస్తూ చిద్విలాసంగా చిరునవ్వుతో నిల్చున్నాడు.
    అంతే. దేవదాసుకు పబ్బులో తాగిన పన్నెండు పెగ్గులూ ఒక్కసారి దిగిపోయాయి... 'ఆధార్' అని పెద్దగా కీచుగా అరిచాడు. కారు ఒక్కసారిగా పక్కకు తిరిగి, ఓ చెట్టుకి కొట్టుకుని ఆగిపోయింది.
    సైకిల్ సామాన్యుడు నింపాదిగా సైకిల్ తొక్కుకుంటూ ముందుకి వెళ్ళిపోయాడు. దేవదాసు, బీరుపాప కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.

                                           *  *  *

    సబలాదేవి టైమ్ చూసుకుంది. రాత్రి 9 అవుతోంది. ఇవాళ జీతం రావటంతో ఆఫీసు నుంచి వస్తూ ఉత్సాహంగా మాల్ లో షాపింగ్ చేసి బయటికొచ్చేసరికి చాలా లేట్ అయింది. ఒక్క బస్సు కూడా రావడం లేదు. చేతిలో క్యారీ బ్యాగులు మోస్తూ రోడ్డుమీద ఎక్కువసేపు నిల్చోవటం కష్టంగా ఉంది. అంతలో ఓ టాక్సీ వచ్చి ఆగింది.
    డ్రైవరు "రండమ్మా! ఎక్కడికెళ్లాలి? పిచ్చిబౌలీ వైపా? ఎక్కండి" అన్నాడు. లోపల ఇంకా ముగ్గురు మగాళ్లు కూర్చునివున్నారు. డ్రైవరు పక్కన ఒకరు, వెనకాల ఇద్దరు. "వీళ్ళెవరు?" అడిగింది సబలాదేవి. "వీళ్లు ప్యాసింజర్లు. ఇది షేర్ టాక్సీ" అన్నాడు డ్రైవరు. ఆమె సందేహంగా నిల్చునే ఉండటం చూసి ముగ్గురూ స్నేహపూర్వకంగా నవ్వారు. వెనకాల ఇద్దరూ కొంచెం జరిగి సర్దుకు కూర్చున్నారు. సబల అనుమానాలు పెట్టుకోకుండా సామాను లోపల పెట్టి ఎక్కి కూర్చుంది.
    కారు పోతోంది. ఉన్నట్టుండి డైవర్షన్ తీసుకుని ఓ సందులోకి తిరిగింది.
    "ఏయ్! ఏమిటి? ఎక్కడకు పోనిస్తున్నావ్!" అని అరిచింది డ్రైవర్ ని.
    నలుగురూ నవ్వారు.
    ఇంతకు ముందున్న వినయం, గౌరవం లేవిప్పుడు. కారు గతుకుల రోడ్డుమీద నుంచీ వెడుతోంది. అటూ ఇటూ పొలాలు, చీకటి. డ్రైవరు పెద్దగా నవ్వుతూ కారు పోనిస్తున్నాడు.
    సబల హ్యాండ్ బ్యాగ్ లో చెయ్యిపెట్టింది.
    "ఒరేయ్! పెప్పర్ స్ప్రే తీస్తుందేమోరా" అన్నాడొకడు.
    "తియ్యనీరా... పొద్దున రూమ్ లో ఆమ్లెట్ వేసుకుందామంటే పెప్పరూ లేదు సాల్టూ లేదు. ఇదిగో నీ దగ్గర సాల్ట్ స్ప్రే కూడా ఉంటే కొంచెం బయటకు తీసివ్వు" అని నవ్వాడు పక్కవాడు.
    పెనుగులాట జరుగుతోంది. "అరచినా వినే నాథుడు లేడిక్కడ. ప్రస్తుతం మేమే నీ నాథులం" అన్నారు వాళ్లు మీద పడుతూ.
    "ఆగండి" అని గట్టిగా అరిచింది సబల. ఆ అరుపుకి డ్రైవర్ బెదిరి సడెన్ బ్రేక్ వేసాడు.
    అరుస్తూనే "నన్ను రేప్ చేద్దామని ఎలా అనుకున్నారా ఫూల్స్? మీకే అర్హతుంది?" అంది.
    ఒకడు "మేం మగాళ్లం" అన్నాడు సన్నగా వణుకుతూ... ఆమె కంఠం వింటూంటే ఎందుకో భయం వేస్తోంది వాళ్లకి.
    సబల ఇంకా గట్టిగా అరిచింది. "ఏడిశారు. మీరు మగాళ్లయితే మీ ఆధార్ కార్డులు చూపించండి" అంది. అంతే. ఒక్క నిమిషం పూర్తి నిశ్శబ్దం.
    "నా దగ్గర ఆధార్ కార్డు లేదు" అన్నాడొకడు బలహీనంగా.
    "నా దగ్గరా లేదు" అన్నారు మిగతావాళ్లు.
    డ్రైవరు పక్కనున్నవాడు "అన్నా తొందరగా వెనక్కి తిప్పెయ్. అది లేకుండా ఇలాంటి పనులు చేస్తే పెద్ద శిక్షే పడుతుందనుకుంటా. నాకు ఆ అమ్మాయి మాటలు వింటుంటే భయమేస్తోంది" అన్నాడు సన్నగా ఏడుస్తూ. డ్రైవర్ ఇంకేమీ ఆలోచించకుండా కారు వెనక్కి తిప్పి, ఆగమేఘాల మీద మెయిన్ రోడ్డుకి వచ్చి ఆపాడు. అప్పుడే అక్కడ ఉన్న బస్టాపు దగ్గరికి వచ్చి ఆగింది ఒక బస్సు.
    ఆమె కారులోంచి దిగి నింపాదిగా నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కింది. కారులోంచి ఆమె సామాను మోసుకుంటూ వచ్చి బస్సులో ఆమె దగ్గరపెట్టి తిరిగి చూడకుండా హడావుడిగా వెళ్లిపోయారు వాళ్లు.
    సబల గర్వంగా చూస్తూ కండక్టరుకి డబ్బులిచ్చి టికెట్ తీసుకుంది.

                                        *  *  *

    ఇంటర్ పిల్లలకి ట్యూషన్లు చెపుతున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ తాతయ్యగారు-
    "పిల్లలూ! విన్నారుగా! కనుక మీరు కూడా ఇప్పుడే ఆధార్ కార్డుకి అప్లయ్ చేయండి. కనీసం మీరు పెద్దవాళ్లై పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కని సెటిలయ్యే టైముకి ఆధార్ కార్డు తప్పకుండా వస్తుంది. అప్పుడు జీవితమంతా సుఖసంతోషాలతో గడిపేయవచ్చు" అన్నారు లేచి లోపలికి వెళుతూ.
    పిల్లలు కూడా లేచి ఇళ్లకు వెళ్లబోతూ "తాతయ్యగారు! మరి మీకు ఆధార్ కార్డు వున్నదా?" అని అడిగారు.
    ఆయన నవ్వి, "లేదురా! ఎప్పుడో చాలా కాలమైంది అప్లయ్ చేసి. బహుశా అది లేదనే యముడు నావైపు కన్నెత్తి చూడటం లేదనుకుంటా" అని వెళ్లిపోయారు.

                                                              *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS