"హరి హరీ" యటన్న "అల్లా" యటన్న "యె
హోవ" యన్న "దేవదేవ" యన్న
పిలుపు లెన్ని యైన పలుకు దేవు డొకండె
విశ్వయోగి మాట వెలుగుబాట.
సకల జీవులందు జగదీశు దర్శించు
నతడె క్రైస్తవుండు; అతడె సిక్కు;
అతడె హిందు; వతడె అసలైన ముస్లిము;
విశ్వయోగి మాట వెలుగుబాట.
చిట్టి మఱ్ఱిగింజ మట్టిలో బడి మహా
వృక్షరాజ మగుచు విస్తరించు
త్యాగధనుల జీవితాదర్శ మిట్లుండు
విశ్వయోగి మాట వెలుగుబాట.
"ఈత డస్మదీయు "డాతడు పరకీయు"
డంచు మది దలంచు నల్పబుద్ధి;
సాధు సత్తములకు జగమే కుటుంబంబు
విశ్వయోగి మాట వెలుగుబాట.
ఐదు వ్రేళ్లు ముడువ - అది గట్టి పిడికిలి
వ్రేళ్లు తెరచి చూడ వేరు వేరు;
వేరు పడుట కన్న చేరియుండుట మిన్న
విశ్వయోగి మాట వెలుగుబాట.
సత్పథాన జను సుజనునకు పక్షులు
జంతువులును గూడ సాయమగును;
దుష్పథ ప్రవృత్తు తోబుట్టువే వీడు
విశ్వయోగి మాట వెలుగుబాట.
బిచ్చగాని కొక్క పిడుచ డన్నము పెట్టి
సంతసింప జేయ జూలునేని
వేలు స్వర్గ నిధులు వెలుగొందు నీముందు
విశ్వయోగి మాట వెలుగుబాట.
హరుడు కరుణ దక్కి ఆగ్రహించిన వేళ
గురుడు బుజ్జగించి శరణ మొసగు;
గురుడు కోపగింప నరునకు దిక్కేది?
విశ్వయోగి మాట వెలుగుబాట.
చిక్క రెచట "శిష్య చిత్తాపహారు" లౌ
గురులు నూటి కొకరు ధరణిలోన;
వేలకొలది "శిష్య విత్తాపహారులే'
విశ్వయోగి మాట వెలుగుబాట.
లోన హస్తమూని పైన గట్టిన మోది
కుండ దిద్దితీర్చు కుమ్మరన్న;
గురువు శిష్యతతుల సరిదిద్దు విధ మిది
విశ్వయోగి మాట వెలుగుబాట.
పరమ గురుడు లేని బడియు, దేవుడు లేని
గుడియు, పాప లేని పడతి ఒడియు,
భక్తిలేని మ్రొక్కుబడియు, వృథా వృథా
విశ్వయోగి మాట వెలుగుబాట.
సూక్తి లేని మాట, రక్తి కట్టని పాట,
పూలు లేని తోట, రాలబాట,
రాజు లేని కోట, రమణీయములు కావు;
విశ్వయోగి మాట వెలుగుబాట.
కొండెకాని చెల్మి, కుదువ బెట్టిన కల్మి,
గుండె లేనివాని కండబల్మి,
మండ ననెడి కొల్మి దండుగచేటయా;
విశ్వయోగి మాట వెలుగుబాట.
నురుగు రాని సబ్బు, విరిగిపోయిన నిబ్బు,
లోభివాని పెట్టెలోని డబ్బు,
కురువ ననెడి మబ్బు, నిరుపయోగములయా!
విశ్వయోగి మాట వెలుగుబాట.
ఉప్పులేని పప్పు, ఊడిపోయిన చెప్పు,
రిత్తకొప్పు, రెల్లుచెత్త నిప్పు,
ఐనవారి కిడిన అప్పు, వ్యర్థమ్మురా!
విశ్వయోగి మాట వెలుగుబాట.
అహితజనుల రాక, ఆప్తమిత్రుల పోక,
కారుచున్న పాత పూరిపాక,
కష్టజీవి కేక కలత పుట్టించురా!
విశ్వయోగి మాట వెలుగుబాట.
మురుకులైన నీళ్లు, ఇరుకులైన మెదళ్లు,
కొరకలేని పళ్లు, మొరకు నోళ్ళు,
కరకుచూపు కళ్లు, పరిహరణీయముల్
విశ్వయోగి మాట వెలుగుబాట.
గుండెలేని సద్దు, కోర్కెల సరిహద్దు,
పాల బుగ్గ మీది తీపిముద్దు,
సంజ దోర పొద్దు, సంతోష మొసగురా!
విశ్వయోగి మాట వెలుగుబాట.
చంటిపాప నవ్వు, సగము విచ్చిన పువ్వు,
విదియ చంద్రవంక, కొదమ జింక,
హాలికు హలము, పంట పొలము, హర్షము నిచ్చు
విశ్వయోగి మాట వెలుగుబాట.
ఇష్టమైన వంట, ఇల్లు చేరిన పంట,
ఆలయమున మ్రోగునట్టి గంట,
గురువు వెంట నుంట, పరమ మోద మొసంగు
విశ్వయోగి మాట వెలుగుబాట.
సారహీనమైన సంసారవృక్షాన
పండె మధురమైన పండ్లు రెండు;
సాధు సంగమంబు సత్కావ్య పఠనంబు
విశ్వయోగి మాట వెలుగుబాట.
బుద్ధిమంతుడైన పుత్రు డొక్కడు మేలు
మందమతులు వందమంది కంటె;
చాలు చంద్రు డొకడు, వేలచుక్క లవేల?
విశ్వయోగి మాట వెలుగుబాట.
కాల ముత్తములకు గడచుచుండును సాధు
సంగములను సత్ప్రసంగములను;
ఖలుల కాలమేగు కలహాల వ్యసనాల
విశ్వయోగి మాట వెలుగుబాట.
కలము కులము బలము ఖలుల జీవితములో
మచ్చరంబు మదము రెచ్చగొట్టు;
సజ్జనులకు నివియె సౌభాగ్యమును గూర్చు
విశ్వయోగి మాట వెలుగుబాట.
