"అయ్యో , పిల్ల తోటకూర కాడలాగా వాడిపోతుంది మీ డబ్బాశతో దాన్ని చంపేస్తారేమిటర్రా" అంటూ అమ్మ ఆదుర్దాపడేది.
'అన్నయ్య తప్పు చేసిన వాడిలా తలదించుకుని "నేనేం చెయ్యను -- మా తారకి టైము లేదు మొర్రో అన్నా వాళ్ళు వినిపించుకోరు. పిక్చరు వప్పుకుంటే చాలంటారు ముందు, తరువాత కాల్ షీట్లు ఇచ్చేవరకు వెంట తిరుగుతారు. నేనేం చేయను. నాకు మన సుందూ కంటే డబ్బు ముఖ్యమా ఏమిటి" అంటాడు అన్నయ్య. అంతా నా చుట్టూ చేరి ఇలా మాట్లాడుతుంటే నా మీద వాళ్ళకున్న అభిమానానికి వాళ్ళందరికీ నా పట్ల వున్న శ్రద్దా సక్తులకి మురిసిపోయేదాన్ని. లోలోపల నా వాళ్ళందరికీ నామీద వున్న ప్రేమకి గర్వించే దాన్ని. కానీ వాళ్ళందరూ చూపించే శ్రద్దా సక్తులు నామీద గాదని, నేను సంపాదించే డబ్బు మీద అన్న సంగతి చాలా రోజులకి గాని తెలుసుకోలేకపోయాను. ఇంటిలో మొదట్లో అమ్మ ఇది తిను అది తిను ఆ పాలు తాగు పళ్ళు తిను అంటుంటే ఆమె ప్రేమకి పొంగిపోయేదాన్ని తప్ప అది ఎంత మేత పెడితే ఆవు అంత బాగా పాలిస్తుందన్న ఆరాటం అని నా ఆరోగ్యం మీద వాళ్ళందరి భవిష్యత్తు సుఖ శాంతులు ఆధారపడి వున్నాయన్నది తర్వాత అర్ధమైంది."
"నీవాళ్ళందరు మారిపోయారని నిన్ను మోసం చేస్తున్నారన్నది ఎలా తెలుసుకున్నావు?" కుతూహలంగా వింటున్న సారధి మధ్యలో అడిగాడు.
ఎలా ఏమిటి ? ఎంత అమాయకులైనా కొన్నాళ్ళ కన్నా గ్రహించాలేరా? ఒకటి రెండేళ్ళు అమాయకంగా వున్న నేను నలుగురి మధ్య తిరుగుతూ , నాలుగు చదువుతూ కాస్త లోకజ్ఞానం అలవరచుకున్నాను. ఈ ఇంటిలో అందరూ ఎవరికి వారు నన్ను మంచి చేసుకోడానికి నా మీద ప్రేమ నటిస్తూ తమ ఒక్కరే నాకు నిజమైన శ్రేయోభిలాషులం అన్నట్లు మాట్లాడుతూ మిగతా అందరూ ఇంటిలో చేరి నన్నెలా అమాయకురాలిని చేసి దోచుకుంటున్నారో, ఆటలాడిస్తున్నారో చేపుతుండేవారు. మొదట్లో ఎవరేది చెపితే అది నమ్మేస్తుండేదాన్ని. కాని ఆఖరికి అందరిమాటలు వింటే అంతా తోడు దొంగలేనని, నామీద నిజమైన అభిమానం ఎవరికి లేదని, నేను పచ్చగా ఉండగానే ఎవరి గొడవలు వాళ్ళు నా డబ్బుతో చక్కదిడ్డుకుంటూన్నారని బోధపడింది. వాళ్ళలో వాళ్ళకి పడకపోయినా నన్ను వంచించడంలో అంతా ఒకటేనని తెలుసుకున్నాను.
"ఆఖరికి అమ్మ నాన్న కూడా అందరితో పాటు కలిసి పోయి నన్ను వాళ్ళ కూతురినన్న మాట మరిచి నన్ను డబ్బు సంపాదించే యంత్రంగా, ఆ డబ్బు వాళ్ళంతా ఖర్చు పెట్టుకోడం వాళ్ళ హక్కు అన్నట్టు ప్రవర్తించేవారు. కనీసం అమ్మకయినా, నా పట్ల శ్రద్దాసక్తులు లేవని, నాకేం కావాలో కూడా చూసే అభిమానం లేకపోయింది. మొదట్లో కాస్త శ్రద్ధ కనపరిచే అందరూ రానురాను సంపాదించకేం చేస్తుంది అన్న ధోరణిలో నన్ను గురించి పట్టించుకొడం మానేశారు. నేనెలా తిరిగినా, ఎవరితో తిరిగినా, తిన్నా, మానినా ఎవరికీ పట్టదు. ఇంటిలో నేను పెద్దదాన్ని వుండగా చెల్లెలు పెళ్లి ఏర్పాట్లు చేయడం ఆరంభించారు. అందుకు నేనేం అనుకోకుండా ఎంత గడుసుగా తప్పించుకున్నారో తెలుసా! అమ్మ ఏం తెలీనట్లు "అదేమిటండీ సుందూ పెళ్ళి కాకుండా వల్లి పెళ్ళి ఎలా చేస్తాం" అంది. నాన్న చాలా గొప్పగా "వసే నీ వుత్త వెర్రి మొహమే. నీ సుందరి యిప్పుడు పాత సుందరి అనుకుంటున్నావేమిటి ,అదిప్పుడు పెద్దతారే! అది కావాలంటే లక్ష మంది పెళ్ళి కొడుకులు వస్తారు. నీవు కుదుర్చే చచ్చు సంబంధాలు దాని కేందుకే. దానికి నచ్చినవాడిని అది చేసుకుంటుంది. మధ్య నీ పెత్తనం, నా పెత్తనం దాని కక్కరలేదు." అన్నాడు గడుసుగా. ఎంతయినా ఆడదాన్ని, నాకు పెళ్ళి చెయ్యండి అని నోరు విప్పి చెప్పలేను గదా. అలాంటి స్థితిలో వాళ్ళని ఏం అనగలను? ఆ విషయమే గాదు ఏదన్నా సరే యిలాగే గడుసుగా వాళ్ళలో వాళ్ళు అనుకున్నట్టు అంటూ నా మీద ప్రేమ కురిపిస్తూ మాట్లాడతారు అందరూ. బజార్లకి వెళ్ళి ఎవరికి కావాల్సిన చీరలు వాళ్ళు కొనుక్కుంటారు. నాకు బజారుకి వెళ్ళే తీరికా వుండేది కాదు. వీలు వుండేది కాదు. నాకు తేలేదెం అంటే "అయ్యో పెద్ద తారవినీకు మేం తెస్తే నచ్చుతాయా" అంటూ తప్పించుకునేవరూ. అన్ని విషయాలలో ఇంతే! ఇంటిలో శుభ్రంగా చీరలు కట్టుకు సింగారించుకోడం, రేడియోలు వింటూ, పేకాటలు ఆడుకుంటూ సరదాగా కాలక్షేపం చెయ్యడం వాళ్ళపని. వాళ్ళందరి కోసం రాత్రిబగళ్ళు చెమటోడ్చి సంపాదించడం నా పని. ఒకోసారి నాకు ఉక్రోషం , కోపం వచ్చేది, కాని
ఎవరి మీద చూపాలో తెలిసేది కాదు . పైకి అంతా ఎంతో ప్రేమగా నటిస్తూ మాట్లాడే వారిని గట్టిగా ఎమనలేకపోయేదాన్ని.
"పోనీ యిదంతా సరే -- వీళ్ళందరూ నాలాగే బీదరికం అనుభవించినవారు , చీరలు, నగలు మోజు పడుతున్నారు ఇన్నాళ్ళకి నా వాళ్ళందరూ నా వల్ల సుఖంగా బ్రతుకుతున్నారు అని గర్వపడేదాన్ని. ఇంతమందిని ఆడుకుంటున్నా నన్న సంతృప్తి పడేదాన్ని. కాని నా డబ్బు తింటున్న ఇందరిలో ఏ ఒక్కరికీ ఆ కృతజ్ఞత లేదే. విశ్వాసం లేదే అన్నది నా బాధ.!
"అంతలా నమ్మిన అన్నయ్య నా డబ్బంతా మాయం చేస్తున్నాడన్ననిజం కూడా ఎంత కాలమో గ్రహించ లేకపోయాను. సారదీ -- యింత పెద్ద తారనీ, యింత డిమాండ్ వున్న నటిని - నా బ్యాంక్ బాలన్స్ ఎంతో తెలుసా!....?"
సారధి కుతూహలంగా చెప్పమన్నట్లు చూశాడు. "పన్నెండు వేలు " అంది తార. సారధి ఆశ్చర్యంగా "పన్నెండు వేలు , ఇంతేనా! లక్ష రూపాయల రేటు నటివి, నాలుగైదేళ్ళుగా నీవు లేని పిక్చరు లేదు. ఇంతేనా నీ దగ్గిరున్న డబ్బు ...." అడిగాడు.
"అదేగా నా బాధ. అన్నయ్య ఏం చేస్తున్నాడో మొదట్లో తెలిసేది కాదు. ఆ తర్వాత ఇంటిలో అందరూ ఒకరి మీద ఒకరు చెప్పే నేరాలని బట్టి అన్నయ్య సగానికి సగం డబ్బు సంగ్రహిస్తున్నాడని, ఇంటిలో ఇంకెవరూ నోరెత్తకుండా అందరికి తలో కాస్త పారేస్తున్నాడని అర్ధం అయింది. అసలు ప్రొడ్యూసర్ల దగ్గిర అగ్రిమెంటు లో పుచ్చుకునే దానిలో సగం రాయించి మిగతాది బ్లాకులో తీసుకుంటూన్నాడన్నది, ఆ తీసుకుంటున్నదంతా తను దాస్తున్నాడని ఇంటిలో వాళ్ళు చెప్పేవరకు నాకు అర్ధం కాలేదు. అర్ధమయ్యాక ఒకరోజు అన్నయ్యని అడగాలనుకుని కాస్త బెడురుగానే పిక్చరుకి ఎంత పుచ్చుకుంటున్నావనీ , మిగుళ్ళు, తగుళ్ళు ఎంతుంటుంది చెప్పు అని అడిగాను. దానికి అన్నయ్య తనకేదో పెద్ద అవమానం జరిగిపోయినట్టు మొహం యెర్ర పరచుకొని -- "ఎందుకలా అడుగుతున్నావు , నీ డబ్బు నేనేమైన తినేస్తున్నాననుకున్నావా, అసలు ఎకౌంట్లు అడగాల్సిన అవసరం ఏం వచ్చింది, నీకసలు లెక్కలు చూడాలన్న అనుమానం ఎందుకు వచ్చింది." అంటూ కోపంగా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నేను బిక్క చచ్చిపోయాను. ఇంటిలో అంతా చుట్టూ చేరి ఏమిటేమిటని అడిగారు! "నాకు తెలుసు ఒకరోజు నీవిలా అడుగుతావని , అన్నయ్యని నీ క్షేమం కోసం నే చేసేదంతా మరిచి వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని నన్నదుగుతావని నాకు తెలుసు- రాత్రింబవళ్ళు గుమస్తా లా నీ లెక్కలు రాసి, నీ వెంట స్టూడియోలమ్మట -- తిరిగి వీళ్ళని వాళ్ళని పట్టుకుని నీకు రావాల్సిన వన్నీ వసూలు చేసి గాడిద చాకిరి చేస్తే ఆఖరికి ఈరోజు నన్ను లెక్కలు చూపమనే దాక వస్తావని తెలుసు -- అందుకే ముందే జాగ్రత్త చేసాను. ఇదిగో చూసుకో లెక్కలు ప్రతీ దమ్మిడీ రాశాను." అని విసవిస వెళ్ళి ఇంతింత లావు పుస్తకాలు తెచ్చి పడేశాడు. నాన్న, అమ్మ అంతా అన్నయ్య పక్షం చేరి, "ఏమిటమ్మ వాడు నీకన్నయ్య. నీ మంచికోసమే వాడంత కష్టపడుతున్నాడు. వాడ్ని అనుమానిస్తావా." అంటూ మెత్తమెత్తగా మందలించడం మొదలు పెట్టారు. అంతా తలో మాట అన్నారు. ఇంత గొడవ జరుగుతుందని ఎదురు చూడని నేను అంతా నా తప్పే అన్నట్టు మాట్లాడుతుంటే బెదిరిపోయాను.
