"మీరురుకోండి నాన్నా! నాకెందుకీ అనవసర ప్రయాస , దాని డబ్బు దాని లెక్కలు అవి అదే చూసుకుంటుంది. మనం తినేస్తున్నాం అన్న అనుమానం దాని కొచ్చింది." అంటూ బింకంగా మాట్లాడాడు.
"అదేమిటిరా. అదేదో మాములుగా అడిగిందానికి ఇంత గొడవ చేస్తావు. దానికి తెలియదా ఏమిటి నీ సంగతి, నీవేం పైవాడివా దాన్ని మోసం చెయ్యడానికి వూరికే అడిగింది కానీ, నీవు పెద్దవాడివి అన్నీ తెలిసిన వాడివి దాంతో ఏమిటిరా" అంటూ అన్నయ్యని బ్రతిమిలాడి, వాడు విసిరేసిన తాళాలు తీసి యిచ్చి సర్ది చెప్పేశారు. నేనేం అనడానికి వుంది యింక! ఆఖరికి నేను తెలుసుకోవాలన్న విషయం తెలుసుకొనే లేదు.
"నేను సినిమాకి లక్ష తీసుకుంటానని అందరూ అంటున్నారు. గత నాలుగేళ్ళుగా నేను కనీసం ఏడాదికి ఎనిమిది సినిమాలలో నటిస్తున్నాను. ఏడాదికి ఎనిమిది లక్షల చొప్పున నాలుగేళ్ళల్లో ఎంత సంపాదించి వుండాలో చూడు. సరే టాక్సులు, ఇంటిలో ఇంతమంది పడి తింటున్న ఖర్చులు అన్నీ పోనీ ఖర్చయినా కనీసం ఓ రెండు మూడు లక్షలన్నా వుండాలా కేష్. ఈ ఇల్లు నావంటిని వున్న నగలు మాత్రమే, నాకు మిగిలాయి ఇప్పటికి. మిగతా డబ్బంతా ఏమయిందో దేముడికేరిక. బావలు ఏదో బిజినెస్ అంటూ డబ్బు పట్టి కెళ్ళారట! అన్నయ్య నేనేమీ అనకుండానే ముందరి కాళ్ళకి బంధంలా ఇంటి ఖర్చులు నేను వినేట్టు ఏకరవు పెడుతుంటాడు. వచ్చిందానిలో సగం ఇన్ కంటాక్స్ కే పోతుందని వల్లిస్తాడు. యింట్లో ప్రతివాళ్ళు ఎంతెంత దుబారా చేస్తున్నారో చెప్తుంటాడు. అన్నీ చెప్తూ ఇంత సంపాదిస్తే మాత్రం ఏం , ఎంత చెట్టుకంత గాలి , స్టేటస్ మేన్ టైన్ చెయ్యాలి గదా అంటూ ఆఖరికి కే=బ్యాంకులో పన్నెండు వెలుందన్నాడు మొన్న మొన్న-"
"ఘోరం --- యింత మోసాన్ని ఎలా సహిస్తున్నావు. ఇంత అమాయకు లేక్కడన్నా వుంటారా సుందరీ, వీళ్ళందరికీ నీవు భయపడడమేమిటి , గట్టిగా దబాయించి ఎందుకు అడగవు. ఎదురు చెప్పిన వాళ్ళని యింటి లోంచి పొమ్మను."
"అదే నా బలహీనత. అందరూ నన్ను మోసం చేస్తున్నారని తెల్సినా ఎవరినీ గట్టిగా ఏమనలేను. పైకి మంచిగా, నాతొ ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వాళ్ళని ఎవరి నేరం ఏమిటో స్పష్టంగా తెలియని నేను ఎవరి మీద ఏ నింద వేయను."
"ప్చ్ , నీవు లాభం లేదు సుందరీ. వీళ్ళందరి రోగం కుదర్చాలంటే నీవు వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఆ వచ్చే భర్త గట్టివాడాయి పెత్తనం చేతిలోకి తీసుకుని వీళ్ళందరి పని కట్టించాలి..... అంతవరకూ నీవేం చెయ్య లేవనుకుంటాను."
"ప్చ్ ,అది జరుగుతుందా."
"ఎందుకు జరగదు.... నీవు కావాలంటే అది కష్టం కాదు."
"నీ కర్ధం కారు నా బాధ సారదీ...... చెప్పాగా , ఆ మనిషి నా డబ్బుని చూసి వచ్చే వాడయితే నా బాధలు మరింత ఎక్కువవుతాయి.....అతనూ వీళ్ళందరిలాగే నన్ను జలగలా పీడిస్తాడేమోనని భయం."
'అయితే ఇలా బాధపడుతూనే వుంటావా , వీళ్ళందరిని యిలా భరిస్తూనే వుంటావా....?"
"మరేం చెయ్యను.... నన్ను కోరే మనిషి వచ్చేవరకు ఇంతమందిని పోషిస్తున్నానన్న తృప్తిలో బ్రతుకుతూంటాను. యింట్లోంచి వీళ్ళందరినీ పంపించి వంటరిగా ఉండేకంటే యీ తృప్తే నయం అనిపిస్తూంటుంది ఒకసారి ..... ఎవరూ లేని నాకు యీ డబ్బుండి మాత్రం ఏం చేస్తుంది ఒకోసారి! డబ్బంతా తిననీ .....నాకు కావాల్సింది ఇంత అభిమానం, ఆదరణ ..... అవే నాకు దొరకనివి అయ్యాయే అన్నది నా బాధ!..... " విచలిత కంఠం తో అంతా చెప్పి గాడంగా నిట్టూర్చింది తార.
"తారా....... నీవు చాలా సుఖంగా వున్నావనుకున్నాను. కానీ నీలో ఇంత ఆవేదన దాగి వుందనుకోలేదు..... చేతులారా బాధని నెత్తి మీద రుద్దుకుంటున్న నీకు సానుభూతి చూపడం కంటే ఎవరేం చెయ్యగలరు...."
"ఎవరు చేసేదేముంది ..... ఏమిటో నా గమ్యమేమిటో నేనేం చెయ్యాలో నాకే తోచడం లేదు- సరే, ఎంత చెప్పినా నీవు చేయగలిగింది ఏం వుంది- పరిస్థితులని ఎదురీద గలిగే గుండె నిబ్బరం నాకు రానంత వరకూ ఇలా బాధపడుతూనే వుంటాను. సరే, వెళ్దాం పద. చాలా ఆలస్యం అయింది." తార లేచి నిల్చుని అంది.
* * *
"హేపీ, బర్త్ డే టూ యూ ......., హేపీ బర్తుడే టూ యూ తారా" ఏక కంఠంతో అందరూ తారని అభినందిస్తూ చప్పట్లు చరిచారు.
ఆరోజు తార పుట్టినరోజు! ఆమె గార్డెన్ లో సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ జరుగుతుంది. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, తోటి నటీనటులు, పాత సినిమా మనుషులు, పాత్రికేయులు..... అందరూ సినీ ప్రపంచానికి సంబంధించిన వారే! గార్డెను లో టేబుళ్ళు పరచి, కుర్చీలు వేశారు. నలుగయిదుగురు కలిసి కూర్చున్నవాళ్ళు, గుంపులుగా నిల్చుని కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు, తారని అభినందిస్తున్న వాళ్ళు, డ్రింకులు సప్లయి చేస్తూ ఇటూ, అటూ తిరిగే తెల్లబట్టల బెరర్లు ------ టేప్ రికార్డరు వినిపిస్తున్న సన్నాయి వాయిద్యం -- పట్టు చీరాల గలగలలు , సెంటు ఘుమఘుమలు ----- గ్లాసుల చప్పుళ్ళు -----నవ్వులు, మాటల వాతావరణం అంతా అట్టహాసంగా వుంది. గార్డెనులో చెట్లనిండా రంగు రంగుల బెలూన్లూ, రంగు రంగుల బలుబులు కట్టారు.
అందరి మధ్య వంటరిగా ఓ టేబిల్ ముందు కూర్చున్న సారధి చాలా వంటరిగా ఫీలవుతూ, క్రొత్తగా, బిడియంగా కూర్చున్నాడు కూల్ డ్రింక్ తాగుతూ . అందరూ సినిమా లోకానికి సంబంధించిన మనుష్యులు. తనొక్కడే అందరి మధ్య అతకనట్టు చాలా మామూలు...... చాలా తక్కువ మనిషిలా కూర్చోడం అదోలా అన్పించింది సారధికి.
