"ఓ రెండు వేలు పంపిస్తూ నా గురించి రాశాను. అదే నేను చేసిన పొరపాటు. డబ్బు అందిన మర్నాడే నాన్నగారు బయలుదేరి వచ్చేశారు. అడముండలు నా ప్రాణం తీయడానికి పుట్టారు, చావనేనా చావరు అంటూ రోజూ శాపనార్ధాలు పెట్టె ఆయనకి నా మీద ప్రేమ పొంగి పొరలింది. ఇన్నాళ్ళూ నా యోగక్షేమాలు రాయనందుకు తిట్టారు, నన్ను కౌగలించుకు కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మ నా మీద బెంగ పెట్టేసుకుందన్నారు. నన్ను చూడాలని అందరూ పలవరిస్తున్నారట. ఇంట్లో ఎవరికీ నిద్రాహారాలు లేవట -- ఆ మాటలు వింటూ నేనూ ఏడ్చాను.
"అమ్మని వెంటనే రమ్మని టెలిగ్రాం ఇచ్చారు నాన్న గారు. అమ్మ, అమ్మతో పాటు చెల్లెలు, తమ్ముడు అందరూ తప్పదు గదా! అన్నయ్యకి పాపం యీ చెల్లెలి మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి చూడడానికి వచ్చి, మరి ఈ చెల్లెలిని వదలలేక వుండిపోయాడు ఇక్కడే. అలాగే ఉద్యోగం లేని బావలు, డబ్బు చాలని బావలు, తిండికి కటకటలాడే పిన తండ్రులు, మేనత్తలు నేనెప్పుడూ చూడని వాళ్ళకి సయితం నేను డబ్బు ఆర్జిస్తున్న సంగతి తెలిసి అభిమానంగా నన్ను చూడాలని వచ్చారు. ఈ సత్రంలో మనం తిన్నంత మాత్రాన లక్షలార్జిస్తున్న తారకి ఏం నష్టం వుండదులే అన్నట్టు పాపం వాళ్ళంతా యిక్కడే వుండిపోయారు. నన్ను వదలలేక."
"అదేమిటి , నీవెలా ఊరుకున్నావు ? నీ తల్లితండ్రులంటే అర్ధం వుంది గాని అక్కలు, అన్నలు, మిగిలిన వాళ్ళు ఇందరినీ భారిస్తున్నావా?"
"భరించక ఏం చెయ్యమంటావు? ముందులో .....నేను బీదరికం , కష్టాలు అనుభవించిన దాన్ని కనక వాళ్ళ కష్టాలకి జాలిపడ్డాను. ఇంత అర్జిస్తున్నాను, నేను ఒక్కతినీ ఈ డబ్బు ఏం చేసుకుంటాను లేని నా వాళ్ళని అదుకుంటే నా సంపద ఏం తరగదు అని అనుకున్నాను. తరువాత ఇంతమందిని ఆదుకుంటున్నా నన్న తృప్తి కొన్నాళ్ళు పడ్డాను. వాళ్ళందరి చేత మంచి దాన్నన్పించుకోవడం, నేనేదో చాలా గొప్పపని చేస్తున్నానని గర్వం, స్వార్ధం నన్ను వశపరుచుకున్నాయి. కాని నా జాలిని సానుభూతిని నా సహాయాన్ని యిలా దుర్వినియోగం చేసి తిన్న ఇంటికే వాసాలు లెక్కపెట్టే వాళ్ళుగా మారుతారని నా డబ్బు తింటున్న విశ్వాసం, కృతజ్ఞత లేని కృతఘ్నులుగా తయారవుతారని ఎలా అనుకుంటాను." ఆవేశంగా అంది తార.
'అమ్మ, నాన్నగారు వస్తూనే యింటి అజమాయిషీ తీసుకున్నారు. నాకు టైము లేదు చూసుకునే చాకచక్యం లేదు గనుక అంతా అమ్మ, నాన్నల మీద వదిలేశాను. అన్నయ్య వస్తూనే "అమ్మలూ, యింత పిచ్చిదానివి ఎలా బ్రతుకుతావు నీకేమి తెలియదు" అంటూ నా బిజినెస్ వ్యవహారాలు చేతిలోకి తీసుకున్నాడు. నిజంగానే నే చదువురానిదాన్ని, వ్యవహార దక్షత తెలియనిదాన్ని, డబ్బిచ్చి ఎవడో సెక్రటరీని పెట్టుకునే కంటే నా అన్నయ్య, నా ఆప్తుడు నా వ్యవహారాలు చూడడం అదృష్టం అనుకున్నాను. ఆనాటి నుంచి అన్నయ్యే నా కేర్ టేకర్, నా సెక్రటరీ వగైరాలు.
"ప్రొడ్యూసర్లతో లావాదేవీలు, ఇన్ కంటాక్స్ లు, ఆఖరికి ప్రొడ్యూసర్ల కధలు వినడం దగ్గిరినించి అన్నీ అన్నయ్యే చేసేవాడు. ఎక్కడ సంతకం పెట్టమంటే ఆ అగ్రిమెంటు మీద సంతకం పెట్టడం, అన్నయ్య కాల్ షీట్లు యిచ్చినవాళ్ళ షూటింగులకి ఎక్కడికి తీసి కెళితే అక్కడికి వెళ్ళి నా పాత్ర నటించడం వరకే నా వంతు. మొదటిలో బాదరబందీ ఏం లేకుండా హాయిగా బాగానే వుందనిపించింది. ఆఖరాఖరికి అన్నయ్య చేతిలో నేనెలా కీలు బొమ్మనయిందీ తెలిసి రాలేదు. అన్నయ్యకి రోజురోజుకి నా సంపాదన మీద వ్యామోహం పెరిగిపోయింది. వచ్చిన ప్రతి పిక్చరు వప్పుకునేవాడు. కొన్ని కధలు నాకు మరీ బొత్తిగా నచ్చక అదేమంటే "నీకు తెలీదమ్మా. దీపం ఉండగానే యిల్లు చక్కపెట్టుకోవాలి. కధ బాగుందో లేదో నీకెందుకు నీకు కావాల్సిన డబ్బు వాళ్ళు యిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. కధ బాగులేకపోతే నష్ట పోయేది వాళ్లేగా. వాళ్ళకి ఆమాత్రం తెలియదూ" అనేవాడు. ఏమనాలో తెలియక వూరుకునేదాన్ని. ఓసారి ఓ సిని పత్రికలో ఫలానా తార రేటు చాలా పెంచింది అన్న వార్తా చదివేవరకు అసలు నా రేటెంతో , అన్నయ్య యిప్పుడు వసూలు చేస్తున్న దెంతో అన్న కుతూహలంతో అన్నయ్య నడిగాను. "నీవుత్త పిచ్చిదానివే అమ్మడూ, డిమాండ్ వుండగానే నాలుగు డబ్బులు రాబట్టుకోవాలి . ఎవడి కోసం యిస్తారు? నీవంటే ఏమిటి అనుకున్నావు. అసలు నీకెందుకు ఈ గొడవలన్నీ, ఆ తంటాలన్నీ పడడానికి నేనున్నాగా" అంటూ మరి నేనేం అనే సందీయలేదు.
"అన్నయ్య డబ్బు ఆశతో వచ్చిన ప్రతి పిక్చరు వప్పేసుకుంటుంటే రోజుకి మూడు కాల్ షీట్లు పనిచేస్తూ విశ్రాంతి అన్నది లేక నలిగిపోయేదాన్ని. అన్నేసి పిక్చర్లు వప్పుకోవద్దని అన్నయ్యకి చెప్పాలంటే భయం వేసేది. ఇంకా నేను పాత సుందరి లాగే ఇంటిలో అన్నయ్యంటే గడగడలాడేదాన్ని. ఈ ఇంటిలో సంపాదిస్తున్నది నేనని, ఈ ఆర్జిస్తున్న లక్షలన్నీ నావని , ఇంటిలో వాళ్ళంతా నా దయా ధర్మం మీద బ్రతకాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళకి నేను భయపడవల్సిన దాన్ని కానని కూడా తెలుసుకోలేనంత అదోరకం అమాయకంగా వుండేదాన్ని మొదట్లో. నేను అలసి పోయి ఇంటికి వచ్చి ఏ ప్రక్క మీదో వ్రాలిపోయేదాన్ని. ఇంటిలో వాళ్ళంతా చుట్టూ చేరేవారు మొదట్లో. ఒకళ్ళు మంచినీళ్ళిచ్చి, మరొకరు చెమట వత్తి, మరొకరు కాఫీ తెచ్చి నా మీద అభిమానం కురిపించేవాళ్ళు ---- "ఏమిటండీ మీరు మరీ బొత్తిగా సుందరి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా అన్నేసి సినిమాలు వప్పేసుకుంటే ఎలా అండీ!" అంటూ అన్నయ్యని వదిన సన్నసన్నగా మందలించేది.
"వరేయ్ ---నీకు బుద్ది లేదురా, అన్ని సినిమాలయితే దాని ఆరోగ్యం ఏమవుతుందనుకున్నావు. దాని ఆరోగ్యం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా నీకు అంటూ నాన్న అన్నయ్యని మందలించేవారు.
