"వేమా! నీవు సోమదేవునితో విషయాన్ని విశదీకరించు. అతడు కార్యోత్సాహి. ఏ కోపతాపాలూ అతడిని కర్తవ్యాన్నుండి విముఖుడిని చేయలేవు కనుక తప్పక బయలుదేరుతాడు" అని అనునయంగానే చెప్పింది. వేమాంబకి అభిప్రాయమెట్లా ఉన్నదోననే భయం ఆమెకూ లేకపోలేదు. అయినా తప్పనిసరి. "అమ్మా! ఆ కార్యభారాన్ని గురుదేవులు నామీదనే ఉంచారు. వారు సమయజ్ఞులు. వారి మాట నాకు ఎల్లవేళలా నాకు శిరోధార్యమే! కనుక నేను నాన్నగారికి మాటిచ్చివేశాను అన్నది వేమ, రాణి ప్రియుడిని నిర్దాక్షిణ్యంగా యుద్ధరంగానికి పంపాలి. ఇది రాచకుటుంబాలకు క్రొత్త విషయమేమీ కాదు. కాని వేమాంబ ఇంకా లోకం తెలియని పసిది కదా అని ఆమె బాధ.
"అయితే తల్లీ! నీదే సోమదేవుని ప్రేరేపించి యుద్ధరంగానికి పంపే ఏర్పాటు జరిగిందన్నమాట. కొండవీటి రాజుల రాజకీయ చతురత__" అని ఏదో అనబోయిందామె, నేను మాట్లాడనీయలేదు.
"అమ్మా! నాన్నగారిని అనవలసినది లేదు. విధి ఎవరికైనా దాటరానిది కదా!"
"ఔనమ్మా! ఈ రాజకుటుంబాలలోని స్త్రీలు శారీరకంగ ఎంత సుకుమారులో మానసికంగా అంత పాషాణ సదృశులు కావాలి. ఇది రాజరికపు స్త్రీలకు శాపం తల్లీ అంటూ కన్నీరొత్తుకుంది. వేమాంబ ఇహ అరక్షణం కూడా అక్కడ నిలువలేదు.
4
అంతటితో ఆ దృశ్యం ఆగిపోయింది. తరువాత నేను ఎంతసేపు అలా పడి వున్నానో తెలియదు. నిజంగా నిద్రపోయానో, యోగనిద్ర (హిప్నాటిజంలో వచ్చే నిద్ర) లో ఉన్నానో కూడా తెలియదు. ఎంత చురుక్కున తగిలాక చూచాను.
చుట్టూ ఎత్తయిన చెట్లు. బాగా ప్రొద్దెక్కింది. నేనొక ఎత్తయిన రాతి పలకమీద పడివున్నాను. నేనొక గుహ అంతర్భాగంలోకి వెళ్ళిన గుర్తు. మరి ఇక్కడున్నానేమిటి? అన్నట్టు పెద్దియజ్జ్వ ఏమయ్యారు. నేను చూచింది కలా? నిజమా? ఏదైనా భ్రాంతి కాదు కదా? అని అనుమానం కలిగింది. అది యదార్థం కాకపోతే నేను చూచిన కథంతా ఏమిటి? ఏమో ఆలోచించటం అవసరం.
ఇంతకూ బాధా సంతప్తమైన హృదయంతో వేమాంబ ఏమి చేసింది. సోమదేవుణ్ని మోటుపల్లి యుద్దానికి పంపిందా? లేదా? మొత్తం కథంతా చూడలేకపోయానే అని బాధ కలిగింది. అటూ ఇటూ కదలటానికి ప్రయత్నించాడు. ఒళ్ళంతా నొప్పిగా బాధగా వుంది. మెల్లగా లేచి కూర్చున్నాను. పూర్తిగా ఈ లోకంలోకి వచ్చాను.
అన్నట్లు నా మిత్రులంతా ఏమయ్యారు. కొండమీద బంగ్లాలో వాళ్ళని వదిలేసి వచ్చాను. నాకోసం ఎంత ఆదుర్దా పడుతున్నారో? బైట వరండాలో పచార్లు చేస్తూ అలాగే వచ్చాను. నాకింత ధైర్యం ఎక్కడిది చెప్మా అని నేనే విస్తుపోయాను.
నాకోసం వాళ్ళంతా వెదుకుతున్నారేమో? ఎంత ఆదుర్దా పడుతున్నారో ననిపించగానే గుండె దడదడలాడింది. ఏ జంతువులో నన్ను పీక్కుతిన్నాయని భయపడుతున్నారేమో! ఒకవేళ అలా జరిగివుంటే మటుకు ఈ కీకారణ్యంలోనే నేనేమి చేయగలిగి వుండేవాడిని. నాకు మించిన సాహసం చేశాను ఆలోచిస్తూ చిన్నగా నడుస్తున్నాను. దారీ డొంకా ఏమీ తెలియటం లేదు. అసలా ప్రాంతాల్లో అడపాదడపా నైనా మానవులు వచ్చిన సూచనలేమీ లేవు. ఫసంగికంప ఒళ్ళంతా గీరుకుపోతోంది. ఫసంగికంపంటే దాని ముళ్ళు సన్నగా ఒంకీలు తిరిగి వుంటాయి. ఎండిపోయిన కంప. పది పన్నెండు సంవత్సరాలు వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ పడివున్నా చివికిపోదు.
దానిమీద కొండ కట్టెలు కొట్టుకునే కుర్రాళ్ళు కవిత్వం కూడా కట్టేవాళ్ళు. వాళ్ళు పాడే పాటల్లో పాటల్లోని కొన్ని మాటలు నాకిప్పటికి గుర్తే!
ఒంకి కర్ర పట్టుకొని ముసలి మామా!
ఒదలడోడి తగులుకుంటే ముసలి మామా! అని పాడేవాళ్ళు. ఆ కంపతో ఒళ్ళంతా చీరుకుపోయింది. ముదర పండిన రేగుపళ్ళ వాసన ఘుమా యిస్తోంది. వంగపండు రంగులో ఉండే దోరమగ్గిన జామపళ్ళు నోరూరిస్తున్నాయి.
ఆలోచిస్తూ ఇంచుమించు బంగ్లా దిశగానే నడుస్తున్నాను. చాలాసేపు నడిచాను. దూరంగా కొండవీటి రెడ్డి రాజుల రాణివాసపు బురుజుల శిథిలాలు కనిపించాయి. వాటికి తూర్పు దిశనే బంగ్లా వుండాలి. అంటే ఇంచుమించు నేను బంగ్లా దగ్గరలోకే వచ్చానన్నమాట!
నన్ను చూడగానే కవిమిత్రుడు దాదాపు ఏడ్చినంత పని చేశాడు. "నిన్ను వెతికి వెతికి వేసారినాము. కడకు ఆశలు వీడి కుమిలి పోతున్నాము" అంటూ కవిత్వంలో ఏడవటం ప్రారంభించాడు.
మూర్తి కవి మిత్రుడి నోరునొక్కి "ఆపవోయ్ నీ యేడుపు. ఏడ్చినాక కవిత్వం చెప్పు, కవిత్వం చెప్పయినా ఏడువు" అంటూ ఓ సవరణ సూచించాడు.
ఈ తంతు జరుగుతున్నది. ఫారెస్ట్ బంగ్లా వరండాలో వరండాకి అల్లంత దూరంలో ఓ ముస్లిం మహిళ కూర్చుని వుంది. ఆమె ఖురానులో పాదాలు కాబోలు గొణుగుతోంది. మధ్య మధ్య మాకేసి విచిత్రంగా చూస్తోంది. వయోభారం వల్ల కనురెప్పలు వాలుతున్నాయి. అ ప్రాంతాల్లో ముస్లింలు అధికంగానే ఉన్నారు. ఊళ్ళకు ఊళ్ళే వున్నారు. వాళ్ళంతా ఫిరోజ్ ఆంధ్రదేశంలో చేసిన ఆగడాలకు చిహ్నంగా మిగిలినవాళ్ళు. రాయల రాజ్య పతనం జరిగాక కొండవీడు ముసల్మానుల తాకిడికి గురైంది. విలువైన శిల్పాలూ, చెక్కడాలూ శిథిలాలుగా మారిపోయాయి. దాదాపు నాలుగు అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల పొడవూ వుండి నందీశ్వరుని చక్కదనాల శిల్పం. ఒకటి నేను బాగా ఎరుగుదును. ఆనాటి శిల్పచాతుర్యానికి అదొక చక్కని ఉదాహరణ. జీవకళ ఉట్టిపడే మొహం, మెడలో హారాలూ, మూపురము ముద్దు లోలుకుతూ వుండేవి.
