గోపాల్రావ్ కి భయం పెరిగిపోయింది.
ఇప్పటికయినా ఇంటికి చేరుకుంటే బావుండేది. రెండు దాటాక ఇల్లు చేరటమంటే కొరివితో తల గోక్కోవటమే.
సీతకేం చెప్పాలి?
ఎటూ తోచటం లేదతనికి.
ఆఫీస్ లో వున్నానంటే నమ్మరు.
అనుకోకుండా ఫ్రెండ్ కి హార్ట్ ఎటాక్ రావటం వల్ల హాస్పిటల్ కి తీసుకెళ్ళాననీ, అక్కడే రాత్రంతా వున్నాననీ చెప్తే?
నమ్ముతుందా?
సీతయితే నమ్ముతుంది కొంతవరకూ...
కానీ ఆ కల్నల్ గాడు ఛస్తే నమ్మడు.
"ఏ హాస్పిటల్లో చేర్చావు?" అనడుగుతాడు.
అప్పుడు తను ఏదొక హాస్పిటల్ పేరు చెప్పాల్సి వస్తుంది.
వెంటనే ఆ హాస్పిటల్ కి ఫోన్ చేస్తాడు.
ఫలానా పేషంట్ ఉన్నాడా? ఎప్పుడు చేరాడు? రాత్రంతా ఆ పేషంట్ తో ఎవరున్నారు? వాడి పేరేంటి? అంటూ న్యూసెన్స్ చేస్తాడు_ కనుక అలాంటి సాకు చెప్పకూడదు.
కనుక అలాంటి రీజనేం కుదరదు.
రాణికి అద్దాల్లో నుంచి లాన్స్ లో కూర్చున్న కానిస్టేబుల్స్ ఇంకా కనబడుతూనే వున్నారు.
ఏ పరిస్థితిలోనూ తను వజ్రాలు దాచిన ఆ పెన్ తన దగ్గర వుంచుకోవటం చాలా రిస్క్. తన భవిష్యత్తంతా దానిమీదే ఆధారపడి వుంది.
ఈ ఒక్కసారికీ ఎలాగయినా తప్పించుకోగలిగితే ఇంక జన్మలో పోలీసులకు భయపడనఖ్ఖర్లేదు.
హఠాత్తుగా ఓ ఐడియా వచ్చిందామెకి.
అవును... ఆ పెన్ ఎలాగోలా గోపాల్రావ్ దగ్గర ఒక రోజుంచగలిగితే తనమీద ఎవరికీ అనుమానం రాదు.
కానీ గోపాల్రావ్ కి అనుమానం రాకుండా పెన్ అతని దగ్గరుంచటం ఎలా?
అతనికి తెలీకుండా అతని బ్యాగ్ లో పడేస్తే?
అది తన దగ్గరుండటం చూశాడు గనుక మర్నాడు తనకి తెచ్చి ఇచ్చేస్తాడు.
దాంతో ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోతుంది.
అది ఫ్యాన్సీ పెన్ గనుక ఎవరికీ దాని బరువు గురించి అనుమానం రాదు.
అతని బ్యాగ్ వైపు చూసిందామె.
* * * *
కర్నల్ కనకారావ్ గడియారం వంక చూశాడు.
మూడు గంటలు కొట్టిందది.
కనకారావ్ ముందున్న విస్కీ గ్లాస్ ఖాళీ అయింది.
"నువ్వేం వర్రీ అవకు సీతా! ఈ అల్లుడుగాడెక్కడున్నాడో ఇప్పుడే తేల్చేస్తా" అంటూ ఫోన్ దగ్గరున్న టెలిఫోన్ బుక్ తీశాడు.
ఆ బుక్ లో గోపాల్రావ్ ఆఫీసు ఫోన్ నెంబర్లు, అతని బంధువుల నెంబర్లు, అతని ఫ్రెండ్స్ నెంబర్లు, సీత ఫ్రెండ్స్ నెంబర్లూ అన్నీ రాసి వున్నాయ్.
"వీడెవడు బేబీ! లక్ష్మణ్ రావ్ అట పేరు_ ఎవడు వీడు?"
"ఆయన క్లోజ్ ఫ్రెండ్ డాడీ."
"అయితే గోపాల్రావ్ ఎక్కడుందీ వీడికి ఖచ్చితంగా తెలుస్తుంది" అంటూ అతని నెంబరుకి రింగ్ చేశాడు.
అయిదు నిమిషాలు మోగాక మత్తుగా, బండగా, బొంగురుగా 'హలో' అందో గొంతు.
"హలో! అయామ్ కర్నల్ కనకారావ్ హియర్! లక్ష్మణరావేనా మాట్లాడేది?"
"అవును!"
"సారీ టు డిస్టర్బ్ యూ_ కానీ అవసరం. గోపాల్రావ్ మా అల్లుడు. అతను ఇంతవరకూ ఇంటికి రాలేదు బై ఛాన్స్ మీ ఇంట్లో వున్నాడా? ఎందుకంటే ఇదివరకు ఇలాగే ఆలస్యంగా ఇంటికొచ్చినప్పుడు మీ ఇంట్లో పేకాడుతూ కూర్చున్నానని మా అమ్మాయితో చెప్పాడట."
అవతలి వ్యక్తి నిద్రమత్తంతా వదిలిపోయింది.
"ఓ! గోపాల్రావా? గోపాల్రావ్ ఇంకా ఇంటికి రాలేదా?"
"రాలేదనే చెప్తున్నాను" కోపంగా అన్నాడు కనకారావ్.
"అహ్హహ్హహ్హ! భలేవారే_ ఎలా వస్తాడు? రాడు."
"వాడ్డూయూ మీన్ బై 'రాడు'?"
"ఐ మీన్_ గోపాల్రావ్ మీ ఇంటికి రాలేడు."
"రాలేడా?"
"అవును! రాలేడు_ ఇంపాజిబుల్."
"ఎందుకు?"
"ఎందుకంటే మా ఇంట్లో పార్టీ అయింది. ఫ్రెండ్సందరం మందుకొట్టి పడిపోయాం. అర్దరాత్రి తాగి కారు డ్రైవ్ చేయటం ప్రమాదం కదా? అందుకని నేనే ఇంటికెళ్ళొద్దన్నాను."
"వెళ్ళొద్దనటానికి నువ్వెవరు?"
"అతని ఫ్రెండ్ ని! క్లోజ్ ఫ్రెండ్..."
"డోంటాక్ రాట్! ఇల్లూ, ఇంట్లో పెళ్లాం వుండగా ఫ్రెండ్స్ ఇంట్లో పడుకోవటమేమిటి? ఈజ్ దేర్ ఎనీ సెన్స్?"
"అఫ్ కోర్స్ దేరీజ్ సెన్స్_ తాగి అర్థరాత్రి ఇంటికి డ్రైవ్ చేసుకెళితే లారీకి దాష్ యిచ్చి టపా కట్టేస్తాడు. మా క్లోజ్ ఫ్రెండ్ టపా కట్టటం మాకిష్టం లేదు. అందుకని ఇక్కడే పడుకోమన్నాను. ఓ.కె. గుడ్ నైట్! డోంట్ డిస్టర్బ్" ఫోన్ పెట్టేశాడతను.
కల్నల్ కోపంతో మండిపడ్డాడు గానీ చేసేదేమీ లేకపోయింది.
"ఏమన్నాడు డాడీ?"
"గోపాల్రావ్ వాళ్ళింట్లోనే తాగి పడిపోయాడని అంటున్నాడు గానీ నాకెందుకో వాడి మాటలమీద నమ్మకం కుదరటం లేదు."
"ఎందుకని?"
"ఎందుకంటే గోపాల్రావ్ ఇంటికి రాలేదని చెప్తే, ఇంకా రాలేదా అని అడిగాడు ముందు. అంటే వాళ్ళింట్లో లేనట్లే అని అర్థం కదా?"
"అవును. కానీ అలా ఎందుకబద్ధం ఆడాడంటావ్?"
"తెలీదు. ఏదో సీక్రెట్ వుందందులో. అదేమిటో ఇప్పుడే తెలిసిపోతుందిగా. ఈ రంగనాథ్ అనే అతనెవరు?"
"అతను కూడా ఆయన క్లోజ్ ఫ్రెండే డాడీ."
కనకారావ్ ఆ నెంబర్ కి రింగ్ చేశాడు.
అతను కూడా అయిదు నిమిషాలు ఫోన్ మోగాక మాట్లాడాడు.
"రళ్గళార్ హియర్" అన్నాడు ముద్దగా.
"మిస్టర్ రంగనాథ్! అయామ్ కల్నల్ కనకారావ్! మా సన్_ఇన్_లా గోపాల్రావ్ ఇంకా ఇంతవరకూ ఇంటికి రాలేదు. బై ఛాన్స్ మీ ఇంట్లో వున్నాడా?"
"ఎవరది? కె. గోపాల్రావా? సి. గోపాల్రావా?"
"కె. గోపాల్రావ్."
"ఇంతవరకూ ఇంటికి రాలేదా?"
