"లేదు"
"అహ్హహ్హహ్హ" నవ్వాడు. "ఇంకా రాలేదా? వెరీ బాడ్! ఇంతవరకూ రాలేదంటే_ఆ! అవునవును! గోపాల్రావ్ యిక్కడే వున్నాడు. మర్చేపోయాను"
"అక్కడా?!" ఆశ్చర్యంగా అన్నాడు కల్నల్.
"అవును"
"అంటే?"
"మా ఇంట్లోనే ఫ్రెండ్సంతా కలిసి పార్టీ చేసుకున్నాం. అతనికి ఓ పెగ్గు ఎక్కువయినట్లుంది. ఇక్కడే పడుకున్నాడు"
"అక్కడే పడుకున్నాడా?"
"అవును"
"ఇప్పుడు మీ ఇంట్లో వున్నాడా?"
"ఎస్! సెంట్ పర్సెంట్"
"ఆర్యూ షూర్?"
"హలో కర్నల్! దిసీజ్ నాట్ ఆర్మీ లైఫ్! ఓ.కె. దిసీజ్ సివిలియన్ వే ఆఫ్ లివింగ్! కావాలంటే ఇంకో పెగ్గుకొట్టి పడుకోండి. తెల్లారేసరికి మీ అల్లుడు మీ ఇంట్లో వుంటాడు."
ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది.
"ఏమన్నాడు డాడీ?" ఆత్రుతగా అడిగింది సీత.
"వీడి ఫ్రెండ్సంతా కూడా మహా మాయగాళ్ళలాగున్నారమ్మా. ఎవడ్నడిగినా అతను మా ఇంట్లోనే వున్నాడు, పొద్దున్నే ఇంటికొచ్చేస్తాడు అంటున్నారు. అసలు నిజంగా ఎవడింట్లోనయినా వున్నాడా లేదా అనేది తెలీటం లేదు"
ఈసారి సీత గోపాల్రావ్ తాలూకూ మరో క్లోజ్ ఫ్రెండ్ మూర్తికి ఫోన్ చేసింది.
"హలో! నేను గోపాల్రావ్ మిసెస్ ని మాట్లాడుతున్నానండి."
"నమస్తే సిస్టర్!"
"నమస్కారమండి"
"ఏమిటి సిస్టర్ ఇంత అర్థరాత్రి ఫోన్ చేశారు?"
"అదే_ ఆయన ఇంతవరకూ ఇంటికి రాలేదు. ఒకవేళ ఎక్కడ వున్నారో మీకేమైనా తెలుస్తుందేమోనని..."
"భలేదానివే సిస్టర్! అతను మా ఇంటికి తప్ప ఇంకెక్కడి కెళ్తాడు. ఇడుగో నా పక్క బెడ్ మీద పడుకుని గాఢ నిద్రలో వున్నాడు."
"నిజంగానా?"
"ఎస్ సిస్టర్! నిజం చెప్పాలంటే ఇవాళ నా పుట్టినరోజు సిస్టర్! అందుకని ఇద్దరం కలిసి మందుకొట్టాం. మనాడికి కొంచెం డోస్ ఎక్కువయి యిక్కడే సెటిలయిపోయాడు."
"ఓకే. థాంక్యూ" అంటూ డిస్కనెక్ట్ చేసింది.
"ఏమంటున్నాడమ్మా?"
"వీళ్ళందరిదీ ఓ పెద్ద రాకెట్ డాడీ! అతను కూడా గోపాల్రావ్ వాళ్ళింట్లోనే వున్నాడంటున్నాడు"
"నన్నడిగితే గన్ తీసుకెళ్ళి వీళ్ళందర్నీ కాల్చిపారేయాలి"
"ఇప్పుడేం చేద్దాం డాడీ?" దీనంగా అడిగింది.
"పోలీస్ కి కంప్లయింట్ యిద్దామా?"
రత్నప్రభ కలవరపడింది.
"ఇంకేమైనా వుందా? ఊరంతా అల్లరయిపోతుంది. మన పరువు గంగలో కలిసిపోతుంది"
"అఫ్ కోర్స్! ఆ మాట నిజమే! పోలీసుల్ని నమ్మటానికి వీల్లేదు. న్యూస్ పేపర్ కి చెప్పేస్తారు."
అంతా సైలెంటయిపోయారు.
గడియారం నాలుగు గంటలు కొట్టింది.
"ఓకే బేబీ! నాకు నిద్రొస్తోంది. నువ్వు కూడా పడుకో. మాణింగ్ లేచాక చూద్దాం. అప్పటికి వచ్చేస్తాడేమో_ లేదంటే అప్పుడు ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం_ ఓకే"
"ఓకే డాడీ"
"గుడ్ నైట్"
"గుడ్ నైట్"
"కర్నల్ తూలుకుంటూ తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద వాలిపోయాడు.
* * * *
"ఆ బ్యాగ్ లో ఏముంటుంది?" అడిగింది రాణి చిరునవ్వుతో.
"ఏముంటాయి? ముఖ్యమైన ఆఫీస్ కాగితాలు, ఓ చిన్న డైరీ, పాకెట్ కంప్యూటర్ బ్యాంక్ కార్డ్_ అంతే!"
"బ్యాగ్... చాలా బావుంది"
"ఓ_ ఈజిట్ సో! మీక్కావాలా?"
"నో! జస్ట్ ఐ లైక్ డ్ ఇట్! ఏదీ" అంటూ బ్యాగ్ అందుకుని ఓపెన్ చేసిందామె.
"ఓ! లోపల చాలా అరలున్నాయి" అంటూ తన బ్యాగ్ లో నుంచి పెన్ తీసి పట్టుకుంది.
"ఆ పెన్ చాలా బావుంది" అన్నాడతను.
"ఫ్యాన్సీ పెన్_ టేబుల్ మీద పెన్ స్టాండ్ లో వుంచితే భలే అందంగా వుంటుంది. డెకరేషన్ కోసమే కొన్నాను. మీక్కావాలా? తీసుకోండి" అంటూ బ్యాగ్ లో వుంచింది.
"నో... నో... నేనింకోటి కొనుక్కుంటాను_ అది మీ దగ్గరే వుండనీయండి"
"ఓకే" అంటూ పెన్ తీసినట్లు తీసి అతను చూడకుండా మళ్ళీ బ్యాగ్ లోకి తోసి బ్యాగ్ అతనికిచ్చేసింది.
హఠాత్తుగా లిఫ్ట్ లో లైట్లు వెలిగాయి.
"ఇంకొక అర్థగంట ఓపిక పట్టండి సార్! బోల్ట్ ఒకటి విరిగిపోయింది. ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తుంది" అన్నాడు మెకానిక్.
సరిగ్గా నాలుగున్నరకి లిఫ్ట్ రిపేరయి కిందకు దిగింది.
"మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మిస్ రాణీ" అన్నాడు గోపాల్రావ్.
"నో ప్లీజ్! మా వాళ్ళు అనుమానపడతారు_ఆటోలో వెళ్ళిపోతాను" అంటూ సిద్ధంగా వున్న ఆటోని పిల్చిందామె.
ఆటో వెనుకే పోలీస్ వ్యాన్ కూడా బయల్దేరింది.
ఆమె తన ఇంటి దగ్గర ఆటో దిగుతూండగా వ్యాన్ వచ్చి ఆగింది.
"రాణీ! ముందు ఉన్నపళంగా ఓసారి స్టేషన్ కొచ్చి వెళితే బాగుంటుంది" అంది లేడి కానిస్టేబుల్ వ్యాన్ దిగుతూ.
"ఎందుకు?"
"బ్యాంక్ లో వజ్రాలు పోయిన దగ్గర్నుంచీ నువ్వు చాలా బిజీగా తిరుగుతున్నావు_ అందుకని"
"ఓ.కె! నాకేం భయం? మీరెక్కడికి రమ్మంటే అక్కడికొస్తాను"
వ్యాన్ రాణీతోపాటు పోలీస్ స్టేషన్ చేరుకుంది.
రాంబాబు ఆత్రుతగా, ఆనందంగా వచ్చాడామె దగ్గరకు.
"నన్ను తప్పించుకుపోయేవాళ్ళు ఇంకా పుట్టలేదు" అన్నాడు నవ్వుతూ.
"ఇంక పుట్టరు కూడా" తనూ నవ్వుతూ అంది.
"విక్కీ ఇంట్లో నీకు వజ్రాలు దొరికాయ్ కదూ?"
"దొరికితే ఈపాటికి బాంబేలో వుండేదానిని_ ఇంకా యిక్కడే ఎందుకు తిరుగుతుంటాను?"
"మరెందుకు పారిపోయావు విక్కీ ఇంట్లోంచి?"
