Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 12


    అతనికి ఆమె అందాలను చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది.
    తన సర్వీస్ లో ఇంత సెక్సీ ఫిగర్ ని చూళ్ళేదు.
    ఈ ఫిగర్ని ఎలాగయినా వదలకూడదు. ఎలాగయినా ఏదొకరోజు లాగించెయ్యాలి.
    ఇద్దరూ డ్రింక్స్ తీసుకుంటూండగా ఒక ఇన్ స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ రూఫ్ గార్డెన్ లో కొచ్చారు.
    రాణి వాళ్ళను చూస్తూనే ఫ్రీజ్ అయిపోయింది.
    గుండె వేగంగా కొట్టుకుంది.
    ఇన్ స్పెక్టర్ తనవేపు చూడకముందే అతని కళ్ళజోడు తీసిపెట్టుకుంది.
    అతను ఆశ్చర్యంగా చూశాడు.
    "నాకెలా ఉంటుందీ కళ్ళజోడు?" అంది నవ్వుతూ.
    "అద్భుతంగా వుంది, మీ శరీరం బంగారం రంగు గనుక గోల్డ్ ఫ్రేమ్ బ్రహ్మాండంగా సూటవుతుంది."
    ఇన్ స్పెక్టర్ వాళ్ళ పక్కనుంచే వెళ్ళిపోయాడు గానీ అతని చూపంతా రాణీ మీదే వుంది. దూరంగా నిలబడి తనవంకే చూస్తూ కానిస్టేబుల్స్ తో ఏదో గుసగుసలాడటం ఆమె కనిపెడుతూనే వుంది.
    వాళ్ళకు తన మీద అనుమానం కలిగింది గానీ తనను సోదా చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. అందుక్కారణం పక్కనున్న గోపాల్రావ్ అతని డ్రస్తూ, అతని రూపం చూస్తే తెలిసిపోతోంది అతనో ఎగ్జిక్యూటివ్ అని. పోలీసులు కాసేపటి తర్వాత వెళ్ళిపోయారు. డిన్నర్ స్టార్టయింది.
    బాత్ రూమ్ వంకతో లేచి వెళ్ళి పిట్టగోడ మీద నుంచి కిందకు చూసింది. లాన్స్ లో కూర్చుని వున్నారు ఇద్దరు కానిస్టేబుల్స్. ఆమెకు అర్థమయింది.
    తనూ, గోపాల్రావు ఎవరి దారిన వాళ్ళు బయల్దేరగానే తనను ఫాలో చేసి సోదా చేస్తారు.
    ఆమెకి ఏం చేయడానికి తోచటం లేదు.
    ఎలా వాళ్ళను తప్పించుకోవటం?
    ఆమెకేమీ అర్థం కావటం లేదు.
    ఈ రాత్రికి అతనితో ఏ హోటల్లోనో గడిపితే?
    అతను వప్పుకుంటాడా?
    ఒప్పుకుంటాడేమో! తనమీద బాగా మోజు పడుతున్నాడు కదా!
    రాత్రి పదకొండయిపోయింది.
    మ్యూజిక్ ప్రోగ్రాం ఇంకా జరుగుతూనే వుంది. జనం ఎవ్వరూ కదలటంలేదు.
    గోపాల్రావ్ ఆమె చేయి నిమురుతూ స్వర్గలోకానికి ఓ పావుగజం కిందగా నిలబడి మాట్లాడుతున్నాడు.
    ప్రోగ్రామ్ మరో గంట తర్వాత ముగిసింది.
    "మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం మనం?" అడిగాడు గోపాల్రావ్.
    "మీ ఇష్టం"
    "మీ అడ్రసేమిటి?"
    "కనుక్కోవటం కష్టంలెండి. మీ అడ్రసిస్తే నేనే మీ ఇంటికి వస్తాను."
    గోపాల్రావ్ ఉలిక్కిపడ్డాడు. ఇంటి అడ్రసిస్తే కొంప మునిగిపోతుంది.
    "మా ఇల్లు కూడా కనుక్కోవటం చాలా కష్టమండీ!"
    "అయితే ఫోన్ నెంబరివ్వండి."
    అతను ఫోన్ నెంబర్ ఇచ్చాడు.
    "ఇది ఇంటి ఫోన్ నెంబరా?"
    "కాదండి_ ఆఫీస్ ది! నేను ఎక్కువగా ఇంటి దగ్గరుండనన్న మాట. అందుకని ఆఫీస్ ఫోనే బెటర్."
    టైమ్ పన్నెండయింది.
    మ్యూజిక్ ప్రోగ్రామ్ తో ఆఖరి ఐటమ్ కూడా అయిపోయింది.
    ఒకేసారి అందరూ లిఫ్ట్ దగ్గరకు నడిచారు.
    అప్పుడు గుర్తుకొచ్చింది గోపాల్రావ్ కి...
    ఆ రోజు సీత బర్త్ డే.
    బర్త్ డే డిన్నర్ పార్టీ తనే ఎరేంజ్ చేశాడు. రాణి మైకంలో పడి ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాడు.
    గుండెలదరిపోయినాయ్ అతనికి.
    తను సీతకు బర్త్ డే గిఫ్ట్ కొనాలని బయల్దేరి ఆ సంగతే మర్చిపోయాడు.
    ఈపాటికి పార్టీ అంతా ముగిసి వుంటుంది.
    తను రాకపోవటం సీతకు అమితమయిన కోపం కలిగి వుంటుంది. ఇప్పుడు యింకో ప్రమాదం కూడా వుంది.
    సీత ఫాదర్ కూడా తనింట్లోనే వున్నాడు. కల్నరల్ కనకారావుకి మరీ పిచ్చి కోపం. ఆ కోపంలో ఎప్పుడు గన్ పేల్చేస్తాడో ఎవడికీ తెలీదు.
    ఎప్పుడూ ఎవడొకడి మీద పోట్లాడటం, గన్ తో వాడి కాలో చెయ్యో కాల్చటం, కోర్టు చుట్టూ తిరగటం, తర్వాత వాడికి డబ్బిచ్చి కాంప్రమైజ్ చేసుకుని కేస్ నుంచి బయటపడటం సర్వసాధారణంగా జరుగుతూనే వుంటుంది.
    అందుకే తనకు అతనంటే చాలా భయం.
    వీలయినంతవరకూ ఎదురుపడకుండా మానేజ్ చేస్తుంటాడు.
    సీత కూడా ఆ తండ్రి కోపమే పుణికిపుచ్చుకుంది.
    ఇప్పుడు ఇంటికెళ్ళి సీతకేం కథ వినిపించాలి.
    అదివరకులాగా ఏదొక కథ చెప్తే లాభంలేదు. ఎందుకంటే ఇవాళ్టి కథ ఆమె తండ్రీ తల్లీ కూడా విని మార్కులేస్తారు.
    రాణి అతని చేయి పట్టుకుని లిఫ్ట్ లోకి లాగింది.
    "కమాన్! అలా చూస్తూ నిలబడితే ఇక్కడే వుండిపోతాం రాత్రంతా."
    లిఫ్ట్ పెద్ద శబ్దంతో జెర్క్స్ తో కొద్ది గజాలు దిగి సడెన్ గా ఆగిపోయింది. మరుక్షణంలో అంధకారం...
    గోపాల్రావ్ కి భయం వేసింది.
    లిఫ్ట్ ఫెయిలయిపోయినట్లే.
    లిఫ్ట్ లో వున్న ఫోన్ తీసుకుని రిసెప్షన్ కి డయల్ చేసి మాట్లాడాడు గోపాల్రావ్.
    "మెకానిక్ వస్తున్నాడు సార్! కొద్దిసేపు ఆగాలి."
    గోపాల్రావ్ రాణి నడుము చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకున్నాడు.
    రాణికి ఆనందంగా వుంది.
    రాత్రంతా ఈ లిఫ్ట్ లో గడిచిపోతే చాలు. ఉదయం తిన్నగా విమానంలో బాంబే వెళ్ళిపోవచ్చు...
    ఈ తర్వాత తన చరిత్రే మారిపోతుంది.
    ఆ వజ్రాలు రెండూ అమ్ముతూ ఓ ఇల్లు, కారు కొనుక్కుని కావలసినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకుని... తనకిష్టమైన 'లేడీస్ బ్యూటీకేర్' సెంటర్ ఓపెన్ చేస్తే... అంతే... ఇంక ఈ మోసాలూ, దొంగతనాలూ ఏమీ లేకుండా, పోలీసులతో గొడవలు లేకుండా జీవితం గడిచిపోతుంది.
    మెకానిక్ రావటం, టార్చ్ లైట్ తో చెక్ చేయటం... లిఫ్ట్ కి ఓ వైపు వున్న అద్దాల్లో నుంచి కనబడుతూనే వుంది.
    లోపల కొంచెం సఫోకేటింగ్ గా వున్నా కొంచెంగా గాలి వస్తూండడంతో ఫరవాలేదనిపించింది.
    మరో రెండు గంటలు గడిచినాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS