Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 12


    "ఇంత చిన్నతనంలోనే ఇంత సినిక్" అయినానే అంటే-----
    "ఇన్నేళ్ళొచ్చినా యింకా యింత 'romantic fool' గానే ఉన్నానే" అన్నాడు.
    ఎప్పుడు మాట్లాడినా, తర్కించినా, చివరికి ఆ basic judgement కి వొచ్చేవాళ్ళం.
    బీచ్ మీద చాలాసేపు కూచుని యింటివేపు దిబ్బ యెక్కుతున్నాను. చీకట్లో దూరంగా పొయ్యేస్టీమర్ కొసన ఎత్తిన వొంటిదీపం కొత్తనక్షత్రం ఆనాడు తూర్పున జన్మించిందనే భ్రాంతి నిచ్చింది. పక్కన మేడలో దయాపరులేవరో గ్రామఫోనులోంచి చక్కని హిందీపాట వినిపిస్తున్నారు. దాని తరవాత 'సునోసునో' పెడతారేమో అనే భయమేలేకపోతే యింకా ఉత్సాహంగా వుండిఉండును. తోవలో నాకన్న ముందు నడిచే ఒక కుటుంబంవారిని కలుసుకున్నాను. వాళ్ళు సముద్రందగ్గిరికి రావడంలో ఉద్దేశ్యమేమా అని ఆశ్చర్యం.
    నిన్న రాత్రి బ్రహ్మానందం పాడనున్నాడు వెన్నెట్లో సముద్రం బొడ్డున. "ఇట్లాంటప్పుడు పాటరాదు" అన్నాను. సౌందర్యం నన్ను దిగులుతో ముంచుతుంది. ముఖ్యంగా ముఖసౌందర్యం కన్న సృష్టి సౌందర్యం. అదేదో pathology అనుకుని నా కోసం నేను దిగులు పడ్డాను చాలారోజులు. తరవాత పశ్చిమవాంగ్మయంలో నాకు సోదరులు, నావలె దిగులు పడేవారిని కలుసుకున్న తరవాత ఆ దిగులొక మంచి లక్షణమేనేమో ననిపించింది.  బ్రహ్మానందం బోటి సాధారణ healthy youths సముద్రంవొడ్డున వెన్నెట్లో పాడతారు. పాడమని అడుగుతారు. చాలామంది అదృష్టవంతుల్లో healthy animal instinots rouse చేస్తుంది గావును సముద్రపుఅందం, కాని నాకు బాధ కలుగచేస్తుంది. చాలా తృప్తితో ప్రేమించే స్త్రీ హస్తాల్లోకూడా చెప్పలేని దిగులు కలుగుతుంది. "ఏమిటి? ఎందుకు? నేనెవరు? ఎంత నశ్వరం?" అని మూలుగుతుంది హృదయం.
    సృష్టి సౌందర్యం చూస్తే దిగులు.
    శరీర సౌందర్యం చూస్తే బాధ.
    చాలామంది సముద్రంవొడ్డుకి ఎందుకు వొస్తారంటే, మార్పు కోసం. ఆఫీసునించీ, వంటిళ్ళనించీ, నలుగురూ వొస్తే యెవరన్నా తెలిసినవారికి కలుసుకోవచ్చుననీ, చల్లగాలిలో విశ్రాంతిగా కబుర్లుచెప్పుకోవచ్చుననీ. బైబుల్ని యింగ్లీషుకోసం చదివేవాళ్ళలాగు అంతకన్నా చాలామందికి సముద్రతీరానికి రావడం (fashion) తమ గొప్ప చూపించుకోడం, కార్డూ, బట్టలూ, పువ్వులూ, కుక్కలూ, కొంతమంది తమ స్నేహితులతో "యేమండి------యీవాళ సాయింత్రం నుండి బీచ్ కి వెళ్ళామండి. చాలా బావుందిలెండి" అని చెప్పు కునేందుకు వొస్తారు.
    సాయింత్రం బీచ్ కి వెళ్ళేవారు, వెళ్ళని వారికన్న సాంఘిక సోపానాల్లో ఒక మెట్టు యెత్తు. బీచ్ లో తక్కినవారు అనుభవించే ఆనందం 'మిస్' అవుతున్నామనే ఆశతో వొస్తారు చాలామంది. ఈ 'మిస్' అవుతున్నామనే restlessness క్రమంగా యెక్కువవుతోంది ప్రజల్లో నిజమైన ఆనందంమీది వాంఛకాదు, ఆనందం 'మిస్' అవుతున్నామనే దిగులు ప్రోత్సహిస్తోంది చాలా కార్యాలని.
    "బొంబాయి చూశారా?.....కలకత్తా?....హిమాలయాలూ?" అని ప్రశ్నిస్తారు. చూడలేదంటే, చూడాలని లేదంటే ఆశ్చర్యం.
    మిస్, మిస్, మిస్;
    "సైగల్ని చూశారా? మేవెస్టునీ? బోజర్నీ? చూడనేలేదా! ఎందుకు చూడలేదూ?" చూసి నిజంగా వాళ్ళ అభినయంలోని గొప్పతనాన్ని అనుభవించారా? లేదు. చూశామనే సంతృప్తి. వెళ్ళడం, చూడడం, చూశామని మాట్లాడటం-ఇట్లా గడిచిపోతుంది జీవితం. ఇదంతా అభివృద్ధేనా? progress ఏనా?
    స్త్రీలలోకూడా ఉద్యోగాలూ, స్వేచ్చా, స్వతంత్రజీవనం, విద్య, ప్రేమ, రొమాన్సు అన్నీ 'మిస్' అవుతున్నామనే దిగులు యెక్కువవుతున్నాయి. వాటిమీద వాళ్ళకి ప్రేమలేదు. కాని అని కొందరికి సంతోషాన్నిస్తున్నాయనీ, ఆ గొప్పతనం తమకీ లేకపోయిందనీ, ఆవేదన. నా వ్రాతలుకూడా యీ దిగులుకి సాయపడ్డాయా? అభివృద్దికే తోడ్పడ్డాయా?
    ఈ బాధలులేక simple జీవితాన్ని గడిపే పూర్వ పద్దతుల వాళ్ళనీ పల్లెటూరివాళ్ళనీ, కూలిజనాన్నీచూసి, వాళ్ళలో ఏమన్నా ఇంతకన్న శాంతీ గొప్పతనమూ కనపడతాయేమోనని వెతికితే, వాళ్ళు వొట్టిజడులు. చాలామంది వాళ్ళలో ఏ "క్యూరియాసిటీ" adjustment లేని నిర్జీవులు. వాళ్ళే గొప్పా! ఆ జీవితమే సుఖమా! స్వల్పవాంఛ లతో తృప్తిపడి నిద్రగా గడిపే జీవితాలే నయమా? అట్లా ఐతే పశువులూ అంతకన్నా రాళ్ళు superior beings అన్నమాట.
    కాని యీ నాగరికుల అభివృద్ధిచూస్తే యీ రాళ్ళూ, పక్షులూ చాలా ఆనందమయము లనిపిస్తుంది. వింతనటన! ఎన్ని అబద్దాలు ఎంత అల్పత్వం! కుతకుతలాడే పట్టణపు మురుగు కాలవకీ, పొలాల్లోపారే పంటకాలవకీ వున్న భేదం కనపడుతుంది. ఒకటికంటే ఒకరు ఇళ్ళు, నగలు, పటాలు, వస్తువులు వీటి గొప్పతనం చూపుకోడమూ, ఏమీ ఆనందమివ్వని తళుకులకై శ్రమపడడమూ, ఏదో మిస్ ఐనట్టు పరుగులెత్తడం. దీనికన్న శుద్ధ జడత్వమే నయమేమో!
    "మోటారొస్తోంది భద్రం" అన్నాడు ఆ భర్త. భార్య నవ్వి "అబ్బో! యీ కాస్తకే భయం! ఏమీ ఫరవాలేదు. అంతమాత్రం తెలుసు" అంది. నూతన స్త్రీ! కట్టూ, వేషమూ సాధారణమైతేనేం? నూతన స్వతంత్ర వాయువుల్ని పీల్చిన స్త్రీ పురుషుడు ఇస్తాననే సహాయాన్ని అంగీకరించడం అవమానము, ఆత్మగౌరవానికి లోపమను కసే స్త్రీ. కాని అతనిలో అనాది పురుష అహంభావం గాయపడ్డది. ఎట్టా తన ప్రతిష్ట నిలుపుకోడం? ఆధిక్యత పునః ప్రతిష్టించుకోడం?
    "ఆ! అట్టాగే అంటావు. రోజూ వూళ్ళో నేను ఎన్నిసార్లు ఇట్టాంటి అపాయాల్ని తప్పించుకుంటాను? మోటార్లకీ, బళ్లకీ, సందున సైకిలు తొక్కితే తెలుస్తుంది" అని ఆ సందర్భంగా మాట్లాడి స్త్రీలనుగమనించలేని సదనాలకి (లేక గొందులకి) వెళ్ళిపోయి నిలబెట్టుకున్నాడు గౌరవం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS