"ఆ రాజూ, ఆ హోటల్ ఓనరూ ఇద్దరూ ఒకే ఊళ్ళో ఒకే రోజున పుట్టారు. అంటే - 1844వ సంవత్సరం మార్చి 14వ తారీఖు నాడే ఆ ఇద్దరూ పుట్టారన్నమాట! ఇద్దరి పేరూ ఉంబెర్టోనే! ఇద్దరి పెళ్ళి 1868 ఏప్రియల్ 22వ తారీఖునే జరిగింది. ఇద్దరి భార్యల పేర్లూ మార్గరిటానే! ఇద్దరూ తమ కొడుకులకి విట్టోరియా అనే పేరే పెట్టారు! రాజు ఉంబెర్టో పట్టాభిషేకం జరిగిన రోజునే రెండో ఉంబెర్టో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాడు".
"ఆ తర్వాత జరిగింది నేను చెప్తాను" అన్నాడు అంకుష్ ఉత్సాహంగా.
"ఈ విశేషాలన్నీ విన్న రాజు ఉంబెర్టోకి మతిపోయినంత పని అయింది. మరి మనిద్దరికీ ఇన్ని పోలికలు వున్నప్పుడు గతంలో మనం ఎప్పుడూ కలుసుకుని వుండకపోవడం ఆశ్చర్యంగా లేదా?" అన్నాడు.
"ఎందుకు కలుసుకోలేదూ? మనిద్దరం కలిసి సైన్యంలో పనిచేశాం! ఇద్దరికీ యుద్ధంలో ప్రదర్శించిన శౌర్యానికి గానూ మెడల్సు వచ్చాయి. అప్పట్లో మీరు కలోనెల్. నేను సైనికుడిని" అని చెప్పాడు రెస్టారెంట్ ఓనరు.
ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ప్రమోషన్లు వచ్చాయి. ఇప్పటి రాజు అప్పట్లో కమాండరు. ఇప్పటి రెస్టారెంటు ఓనరు అప్పట్లో సార్జెంటు. అప్పుడు మళ్ళీ ఇద్దరికీ రెండోసారి, ఒకే సమయంలో మెడల్సు వచ్చాయి.
ఇదంతా వింటున్న ఉంబెర్టో రాజుకి తల తిరిగిపోయినట్లయింది. తన ఎయిడ్ డీ క్యాంపుని, పక్కకి పిలిచి చెప్పాడు. "నేను ఈ రెస్టారెంట్ ఓనర్ కి నా ఆస్థానంలో చాలా గొప్ప పదవి ఇవ్వదలచుకున్నాను. రేపు అతన్ని సభకి రమ్మను" అని.
మర్నాడు రాజు తన ఎయిడ్ డీ క్యాంపుని పిలిచి, "నా డబుల్ వచ్చాడా?" అని నవ్వుతూ అడిగాడు.
ఎయిడ్ డీ క్యాంపు చాలా విచారంగా చెప్పాడు. "ప్రభూ! ఇవాళ పొద్దున్న అతను ఒక షూటింగ్ యాక్సిడెంట్ లో మరణించాడు!" అని.
షాకయిపోయిన రాజు, "ఏమిటీ అతను తుపాకి కాల్పుల్లో మరణించాడా! అయ్యో పాపం! అతని అంత్యక్రియలు ఎన్ని గంటలకి, ఎక్కడ జరుగుతాయో కనుక్కో! నేను హాజరవుతాను" అన్నాడు.
రాజు మాటలు పూర్తి కాకుండానే ఆయన మీద ఎవరో మూడుసార్లు తుపాకి పేల్చారు! మొదటి బుల్లెట్ మిస్సయి కూడా, మిగతా రెండు బుల్లెట్లూ రాజు గుండెల్లో నుంచి దూసుకుపోయాయి. రాజు అక్కడికక్కడే మరణించాడు!" అన్నాడు పులిబోనులో నిర్భయంగా నిలబడి వున్న అంకుష్.
అతన్ని మింగేసేటట్లు చూసింది ప్రగతి.
చప్పట్లు కొట్టాడు సాహస్ "వెల్ డన్! మై బాయ్!" అన్నాడు.
ప్రగతి తీవ్రంగా చూస్తోంది.
చటుక్కున తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు ఒక ఆఫీసరు. స్మార్ట్ గా ప్రగతికి సెల్యూట్ చేసి, రెగ్యులేషన్ బూట్లు టకటకలాడించుకుంటూ దగ్గరికొచ్చాడు. సాహస్ వైపూ, అంకుష్ వైపూ అనుమానంగా చూసి, "ఎనీ ట్రబుల్? కమిషనర్...సర్?" అన్నాడు వినయంగా.
అతన్ని కేర్ చెయ్యకుండా, నిర్లక్ష్యంగా ప్రగతితో అన్నాడు సాహస్.
"అచ్చం నాలాగే వుండే ఇద్దరు డబుల్స్ ని సంపాదించావ్! వాళ్ళతో నువ్వేం చేస్తావో నాకు తెలీదు గానీ నన్నేమీ చేయలేవు. ఇరాకీ స్ట్రాంగ్ మాన్ సదాం హుసేన్ కి ఆరుగురు డబుల్స్ వున్నారని అంటారు. అంటే ఇకనుంచీ నేను కూడా అంతటి విఐపీని అన్నమాట!" అన్నాడు తేలిగ్గా.
ఇదంతా వింటున్న ఆ ఆఫీసర్ కి అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది.
"ప్రాబ్లెం! కమిషనర్...సర్!" అన్నాడు.
ఈసారి అది ప్రశ్నలాగా లేదు. స్టేట్ మెంట్ లాగా వుంది.
"యస్! సర్టెన్లీ ఏ ప్రాబ్లెం! బట్...నాట్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లెం! టైం ఫర్ యాక్షన్..." అని, మెరుపువేగంతో ఒంగింది ప్రగతి. సాహస్, తన బూట్లకి పైన సాక్సులో దాచివుంచుకున్న చిన్న రివాల్వర్ ని ఒడుపుగా అందుకుంది. పైకి లేస్తూ వుండగానే గురి చూసింది.
ట్రిగ్గర్ నొక్కింది!
వెంటనే -
సైలెన్సర్ ఉన్న ఆ రివాల్వర్ లోనుంచి "థప్" అని చిన్న శబ్దంతో బుల్లెట్ రిలీజయింది.
అది గుండెల్లో గుచ్చుకోగానే -
"అమ్..." అని చావుకేక పూర్తి చెయ్యకుండానే -
నేలకి ఒరిగిపోయాడు...
ఆ ఆఫీసరు!
సాహస్ కాదు.
ఆఫీసర్!
కిందపడి వున్న ఆఫీసర్ ని కాలితో నెట్టి చూసింది ప్రగతి.
అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
సాహస్ వైపు తిరిగింది ప్రగతి.
"షాకయిపోయావా?" అంది చిరునవ్వుతో. ఆమె కళ్ళలో ఇప్పుడు మంచితనం కనబడుతోంది.
ఆ మంచితనం ఆమె అందానికి ఇంకెంత అందం తెచ్చిందో చెప్పలేం!
ఏమీ లేదన్నట్లు నవ్వుతూ తల ఆడించాడు సాహస్.
