"నాకు సింపుల్ గా వుండటం యిష్టం?" అన్నది నా భావాలను గ్రహించి.
"కాలంతకురాలే?" అనుకున్నాను.
"అదేమిటి కలెక్టరు భార్య మరీ యింత చౌకబారు వేషంలో వుండటం. అబ్బే మీ హోదాకు బొత్తిగా అతకటం లేదు. పైగా ఈ థర్డ్ క్లాసు ప్రయాణం"
ఆమె ముఖం నల్లబడింది.
"ఫస్టుక్లాసు టికెట్ దొరకలేదు. మావారు వెంటనే బయలుదేరమని టెలిగ్రాం యిస్తే బయలుదేరాను. మాకు విజయవాడలో పెద్ద బంగళా వుంది." అన్నది మాట మారుస్తూ.
"మాకూ వున్నాయ్ రెండు" అనేశాను అతి తేలిగ్గా.
"ఎక్కడ?..." కోపంతో బుసలు కొడుతూ అడిగింది.
"అక్కడే మీ బంగళా ప్రక్కనే. మీ బంగళాకు ఇరు ప్రక్కలా వున్న ఆ రెండు పెద్ద పెద్ద బంగళాలు ఎవరివనుకున్నావ్? మావే" అన్నాను తన్నుకొస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ.
"నేను చెప్పిందంతా అబద్ధం అనుకుంటున్నావా?..." అంది జీరపోయిన కంఠంతో.
"అబ్బే నిజమే అనుకున్నాను _ అందుకే నేనూ నిజమే చెప్పాను." అన్నాను నిరసనగా చూస్తూ.
"ఆమె గిర్రున ముఖం తిప్పుకున్నది. కిటికీ బయటకు తలపెట్టి, ప్రకృతి సౌందర్యాన్ని కారు చీకట్లో తిలకిస్తోంది.
ఈ భార్యలు ... తమ భర్తల గొప్పతనాన్నీ, హోదానూ యిలా రైళ్ళలో, బస్సుల్లో కన్పించిన వాళ్ళందరి ముందూ పనికట్టుకుని చాటుకుంటూ ఎందుకు తిరుగుతారో నాకు అర్థం కాదు. వీరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వాలంటూ వుండవా? లేక ఇంకా కలల్లోనే బతుకుతూ, వాస్తవ జీవితంలో వాటికి సమన్వయం కుదరక తలకిందులవుతూ అందరి ముందూ అబద్ధాలు చెప్పుకుంటూ అంతరాత్మను జోకొట్టుకుంటారా? అందుకే ఈ రకం వాళ్ళంతా నాకు పొట్లపాదులూ, కాకర తీగల్లా కన్పిస్తారు. అందుబాటులో వున్న ఏ ముళ్ళ కంచెకో అల్లుకొని, తర్వాత మారాకు తొడిగేందుకైనా వీలు చిక్కక లోలోపల కునారిల్లుతూ వుంటారు.
"అబ్బా!" అంటూ ఒక్కసారిగా ఆవిడ తల లోపలకు తీసుకుంది. కన్ను నులుపుకోసాగింది. కంటిలో రైలు బొగ్గు పడి వుంటుంది. చెప్పొద్దూ నాకు నిజంగానే ఆవిడమీద జాలి వేసింది.
"అయ్యో బొగ్గు పడినట్టుంది." అనుకోకుండానే అనేశాను.
ఆవిడ సమాధానం చెప్పలేదు. కన్ను నలుపుకుంటూ కూర్చుంది.
"అలా నలపకండి!" అంటూ నేను లేచి ఆమె దగ్గరకెళ్ళి కన్ను ఊదాను.
కొంతసేపటికి బాధ తగ్గినట్టు ఆమె కన్ను తెరిచింది. కన్ను ఎర్రగా వుంది. ఆ నల్లటి ముఖంలో ఒక ఎర్రకన్నూ, ఒక తెల్లకన్ను. ఫన్నీగా కన్పించింది. ఆమె కొంచెం రిలీఫ్ గా వెనక్కు వాలి ఆవలించింది.
పాపం చాలా బాధ పెట్టానేమో! కొంచెం మలాం పట్టీవేద్దాం అనుకున్నాను.
"మీ పేరు తెలుసుకోవచ్చునా!" మర్యాద వుట్టిపడే కంఠంతో అడిగాను.
ఆవిడ చివ్వున తలెత్తి చూసింది. ఓ క్షణం ఆశ్చర్యంగా నా ముఖంలోకి చూసింది.
"మిసెస్ కైలాసంగారు" అన్నది. ఆ ప్రశ్న కోసమే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దానిలాగ.
"అరె! మిసెస్ కైలాసంగారు గారు మీరేనా? సారీ మీ పేరు తెలియక ఏదేదో వాగేశాను. మీ గురించి చాలా విన్నాను.
ఆమె కళ్ళు... కాదు తెల్లగా వున్న కన్ను మాత్రం తళుక్కుమన్నది.
"గారు గారు? ఏమిటి?" పకపకా నవ్వింది.
"మీ పేరు మిసెస్ కైలాసంగారు అని చెప్పారు గదండీ? మీ అంతటి వ్యక్తిని కేవలం పేరుతో ఎలా పిలువగలను చెప్పండి! అందుకే మర్యాదగా మరో గారు చేర్చాను." అన్నాను వినయం నటిస్తూ.
